Sunday, December 30, 2012

పనికిమాలుతున్న ప్రభుత్వ బడులు-తొలి చదువులు -25


30-12-2012

అశాస్ర్తియం అయినది అని తెలిసినా, ఫలితాలు రావని తెలిసినా అంతో ఇంతో ఆలోచనాపరులు కూడా ఇంగ్లీషు మీడియం వారగా మొగ్గు చూపటానికి కూడా కారణాలు చూడాల్సి ఉంటుంది. తెలుగులో చదువు చెప్పే బడులు దాదాపు ప్రభుత్వానివి లేదా ‘ఎయిడెడ్’ రంగంలోనివి. అలాంటి బడుల్లో తెలుగులో చదివే పిల్లల సాధక బాధలు, వారి విద్యా ప్రమాణాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాల్సిన అవసరం ఉంది. దీనికి మనం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. స్వయంగా ప్రభుత్వం చేయించిన సర్వేలు, వారు అధికారికంగా మద్రవేసి వదిలిన లెక్కలను పరికించి చూస్తే సరిపోతుంది.

వౌలిక సదుపాయాలకు సంబంధించిన అంత వరకు ప్రభుత్వపు బడులు లేని గ్రామాలు వేల సంఖ్యలో ఉన్నాయి. బడి ఉన్నా సరి అయిన తరగతి గదులు ఉండవు, చాలా బడుల్లో ఒక గది లోనే రెండు మూడు తరగతుల పిల్లలను కూర్చోబెట్టి చదువు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నల్ల బల్లలు, చాకుపీసులు, డస్టర్లు ఉండవు. 19 శాతం బడుల్లో అయిదు తరగతులకు కలిపి ఒకే ఒక అయ్యవారు ఉన్నారు. మంచినీరు, మరుగుడ్లు, కరెంటు సౌకర్యాల సంగతి గురించి చెప్పాల్సిన పనే లేదు.

ఇక ప్రభుత్వం బడుల్లో ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిన వివరణ ఇది.
‘‘జాతీయ స్థాయిలో జరిగిన సర్వే ఫలితాలను బట్టి చూస్తే మన రాష్ట్రంలో ఐదో తరగతి పూర్తి అయిన పిల్లల్లో కనీసం చదవటం, రాయటం, కూడికలు, తీసి వేతలు, గుణింతాలు, భాగాహారం వంటి నాలుగు రకాల ప్రక్రియలు చేయగలిగిన వారి సంఖ్య కేవలం నూటికి 40 మంది మాత్రమే. అంటే మిగిలిన 60 మంది పిల్లల పరిస్థితి ఏమిటి? ఈ పిల్లలు ఎగువ తరగతుల్లో చేరితే నేర్చుకునేది ఏమిటి? వీరు అంతా చదువులో వెనుకపడితే ఎగువ చదువుల కోసం బడుల్లో కొనసాగుతారా? ఒక వేళ కొన సాగినా చదువు మొత్తంలో ఇమడగలరా? వీరిలో మనం ఆశించిన సామర్థ్యాలను చూడలేమా? దీనికి బాధ్యులు ఎవరు? 


ఈ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాల్సి ఉంది. జాతీయ స్థాయి సర్వే ఫలితాలలోని వాస్తవికత గురించి, మన పాఠశాల ల్లోని పిల్లల విద్యా నాణ్యతను పరిశీలించడానికి ఒక ఉపాధ్యాయ బృందం ఈ మధ్య కాలం లోనే కొన్ని పాఠశాలలకు వెళ్ళింది. పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల పిల్లలను, వారి పేర్లను, వారి తల్లిదండ్రుల పేర్లను, ఉపాధ్యాయుల పేర్లను, వారికి ఇష్టమైన వాటి పేర్లను రాయ మన్నారు. అలాగే తమకు ఇష్టమయిన దాని గురించి కొన్ని వాక్యాలు రాయమన్నారు. గణితంలో సంఖ్యల గురించి, చతుర్విధ ప్రక్రియల గురించి, ఏదైనా ఒక ప్రక్రియకు చెందిన రాత లెక్క ఇచ్చి, సాధించమని కోరారు. దీని ఫలితాలు, అనుభవాలు చాలా ఘోరంగా ఉన్నాయి.

50 శాతం విద్యార్థులు ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలను అర్థం చేసు కోలేక పోతున్నారు. 3వ తరగతిలో 75 శాతం విద్యార్థులు సరళ పదాలను కూడా చదవలేక పోతున్నారు. 90 శాతం విద్యార్థులు సరళ పదాలను సైతం రాయలేకపోతున్నారు. 4వ తరగతిలో 65 శాతం విద్యార్థులు సరళ పదాలను చదవలేకపోతున్నారు. 80 శాతం విద్యార్థులు సరళ పదాలను రాయలేక పోతున్నారు. 5వ తరగతిలో 53 శాతం విద్యార్థులకు సంఖ్యాభావనలపై అవగాహన లేదు. 25 శాతం విద్యార్థులకు కూడికల పట్ల అవగాహన లేదు. 85 శాతం మంది విద్యార్థులు రాత లెక్కలు చదివి అర్థం చేసుకొని చెయ్యలేక పోతున్నారు’’. ఇది చదివాక బాధ్యతగల తెలుగు వాడికి ఎవరికి అయినా నోట మాట వస్తుందా?

అర్థం కానిదీ, అబ్బురపరచే సంగతి ఏమిటి అంటే, ప్రభుత్వ బడుల్లో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ నూటికి నూరుపాళ్ళు బోధనలో శిక్షణ ఇవ్వటానికి తగిట (క్వాలిఫైడ్) పొందిన వారు. దిగువ తరగతులకు డి.ఎడ్, ఎగువ తరగతులకు బి.ఎడ్ చదివినవారు. వీరు స్థాయిని బట్టి బేసిక్ చదువుకు అదనంగా పిల్లలకు చదువు చెప్పటానికి కావలసిన నేర్పులను, మెళకువలను చదివినవారు. పిల్లల సైకాలజి, బోధనా పద్ధతులు, దానిలోని మెళకువలు ఒంట పట్టించుకున్నవారు. అందులో పరీక్షలు రాసి డిగ్రీలు పొందినవారు. అంతేనా అవికాక తిరిగి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించటానికి మళ్లీ పరీక్షలు రాసిన వారు. మరి ఇంతటి తగిట ఉన్న ప్రభుత్వ అయ్యవార్లు చెప్పే చదువు ఎందుకు ఇంత నాసీ రకంగా తయారు అయిందీ?

మరోప్రక్క ప్రయివేటు బడుల్లో చదువు చెప్పే టీచర్లు నూటికి 90 నుండి 95 మంది ఏ తగిట (క్వాలిఫికేషన్) లేనివారు. ప్రాథమిక విద్యకు సంబంధించి ప్రయివేటు బడుల్లో చదువు చెప్పేవారి చదువు తగిట పదో తరగతి. మహా అంటే ఇంటరు. కాస్త పెద్ద నగరాలలో అయితే డిగ్రి. అంతే. ఇంకా తమాషా ఏమిటి అంటే ప్రయివేటు ఇంగ్లీషు మీడియం బడుల్లో ప్రాథమిక స్థాయిలో చదువు చెప్పే టీచర్లకు ఇంగ్లీషుపట్ల అవగాహన లేదు. వీరిలో కనీసం పట్టుమని పది శాతం మంది ఇంగ్లీషు న్యూస్ పేపరులో ఒక వార్త చదివి అర్థం చేసుకోలేనివారు.

చేసేది వైద్యమే అయినా తగిట ఉన్న డాక్టరు చేసే వైద్యానికి, కాంపౌండరు చేసే వైద్యానికి స్పష్టంగా తేడా ఉంటుంది. ఇద్దరూ కట్టేది ఇళ్ళే అయినా ఇంజనీరు ప్లానుతో కట్టిన ఇంటికీ, తాపీమేస్ర్తి ఆలోచనతో కట్టిన ఇంటికి తేడా ఉంటుంది. డాక్టర్లు, ఇంజనీర్లు ఆయా రంగాలలో ప్రత్యేక శిక్షణ పొందీ, నైపుణ్యం సాధించి, ఆయా వృత్తుల్లో పని చేయటానికి తగిట సంపాదించిన వాళ్ళు. అందువల్ల వాళ్ళు చేసే పనుల్లో నాణ్యత అత్యంత ఎక్కువగా ఉంటుంది, ఉండాలి, ఉండి తీరాలి. కాని విద్యా బోధనకు వచ్చేసరికి దానికి విరుద్ధంగా ఉంటుంది. నూటికి నూరు పాళ్ళు తగిట పొందిన టీచర్లు ఉన్న ప్రభుత్వ, ఎయిడెడు బడుల్లో విద్యా ప్రమాణాలు అత్యంత దారుణంగా కొడిగట్టి ఉంటున్నాయి. ఏ తగిటా లేని వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు బోధించే ప్రైవేటు బడుల్లో మట్టుకు ప్రమాణాలు ఎక్కువ ఉన్నట్టు కనబడుతున్నాయి. మనం ఎలా అర్థం చేసు కోవాలి? ఎవరిని నిందించాలి??  

Sunday, December 23, 2012

ఇంగ్లీషు నేర్చుకొనే శాస్ర్తియ పద్ధతి.... తొలి చదువులు -24

22-12-2012

‘‘పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు, పట్టనేనే బిగియ పట్టవలె...’’ అంటాడు మంది కవి వేమన. ఎవరికి అయినా తల్లి భాష ఏ ప్రయత్నమూ లేకుండా అలవోకగా వచ్చేస్తుంది. దీన్ని పనిగట్టు కొని ఎవరూ నేర్పించాల్సిన పని లేదు. సొంత భాష తప్పించి ఇతర ఏ భాషను నేర్చు కోవాలన్నా దాన్ని అది పనిగా నేర్చు కొని తీరాలసిందే తప్ప వేరే దారి ఉండదు. తన భాష కాని భాషను నేర్చు కోవాలి అంటే అది రెండు పద్ధతుల ద్వారా మట్టుకే వీలవుతుంది. మొదటి పద్ధతి ఏ భాషను నేర్చు కోతలచుకున్నారో ఆ భాషను మాట్లాడే వారి మధ్య ఉండి నేర్చు కోవటం. మచ్చుకు తమిళనాడులో ఉండి తమిళం నేర్చు కోవటం. అది చాలా సుళువు పద్ధతి. రెండో పద్ధతి తను ఉన్నచోటులోనే నేర్చు కోవాల్సిన భాషను సాధన చేయటం. అంటే మనం మన ఊరి లోనే ఉండి ఇంగ్లీషునో, హిందీనో నేర్చు కోటానికి ప్రయత్నం చేయటం. ఇది సాపేక్షంగా కొంత కష్టం అయిన పని. దీనికి ఎక్కువ సాధన చెయ్యాలి. సమయం కూడా ఎక్కువ పడుతుంది. అయితే ఈ రెండు పద్ధతుల్లోనూ ‘తెలిసిన’ భాష ద్వారా రెండో భాషను నేర్చు కోవాలి. తమిళనాడులో ఉన్నా తమిళానికి తెలుగు లింకు తెలియ చెప్పకుండా ఎన్నాళ్లు ఉన్నా తమిళం రాదు. మహా అయితే హావ భావాలు ద్వారా పొందే కొన్ని మాటలు ఒంట పట్టవచ్చు. మచ్చుకు ‘సాపాటియా?’ అని ఒక తమిళుడు నోటితో అంటూ పనిలో పనిగా నోటి దగ్గరకు తెచ్చే ఒంటి భాషను (యాక్షన్) ఉపయోగిస్తారు. అప్పుడు ‘సాపాటియా’ అనే పలుకుకి ‘తిండి తిన్నావా?’ అని తెల్లమవుతుంది. ఇక్కడ యాక్షను కూడా ఒక లింకే. అంటే మనం తమిళం నేర్చు కోవాలి అంటే అటు తమిళమూ, ఇటు తెలుగూ రెండూ తెలిసిన వారు ఉండాలి. ఇంగ్లీషు నేర్చు కోవాలి అను కొనే వారు ఓవరు అయినా దాన్ని తమ సొంత భాష ద్వారా నేర్చు కొని తీరాలిసిందే.


చిన్నపిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేకుండా అవసరాన్ని బట్టి ఎవరు ఎన్ని భాషలు అయినా నేర్చు కోవచ్చు. అయితే నేర్చు కునే చురుకుదనం పిల్లల్లో చాలా ఎక్కువ. అందువల్ల పిల్లలు చాలా వేగంగా నేర్చుకుంటారు. కానీ సౌలభ్యం మాత్రం పెద్ద పిల్లలకే ఎక్కువ. ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఇతర భాష నేర్చు కోటానికి ముందు తమ సొంత భాష పూర్తిగా వచ్చి ఉంటుంది. దాని ద్వారా రెండో భాషను నేర్చు కుంటారు. కానీ చిన్న పిల్లల్లో వాళ్ళ సొంత భాషే ఇంకా పూర్తిగా ఎదిగి ఉండదు.

నేర్చు కొనే రెండో భాష ఏది అయినా, దాన్ని నేర్చు కోవటంలో ఒక వరుస, తీరూ ఉంటుంది. అంటే భాషను అంచెలంచెలుగా నేర్చు కోవాలి. అందులో మొదటిది నేర్చు కొనే భాషను ఇతరులు మాట్లాడేటప్పుడు దాన్ని కొంత కాలం పాటు బాగా వినాలి. తరువాత కొద్ది కొద్దిగా మాట్లాడటం మొదలు పెట్టాలి. ఆపయిన చదవటం, రాయటం నేర్చు కోవాలి.

ఏ భాష అయినా నేర్చుకోవటం మొదలుపెట్టినప్పటి నుండి దాని మీద పూర్తి పాండిత్యం రావటం అనేది మొత్తం నాలుగు అంచెలుగా జరుగుతుంది. అంటే పిల్లలు రెండో భాషను నేర్చుకోవటం మొదలుపెట్టినప్పటి నుండి పూర్తిగా దానిమీద పట్టురావడానికి ఒక దశ తరువాత మరొక దశను పూర్తిచేసుకుంటూ పోతే తప్ప నేర్చుకోవాల్సిన భాష పూర్తి కాదు.


1. పరిచయ దశ: ఈ దశ కనీసం ఒక ఏడాది పాటు ఉంటుంది. ఈ దశను వినే దశ అని కూడా అంటారు. భాష నేర్చు కునే పిల్లలు, నేర్చు కోవాల్సిన భాషలో మాటల్ని వినాలి. పదాలు పలికేటప్పుడు మాట్లాడే వారి ముఖ కవళికలు, ఒంటి కదలికలు ఎలా ఉంటున్నాయో గమనిస్తారు. అంతే కాకుండా విన్న పరాయి పదాలకు తన సొంత భాషలో అర్థాలు తెలుసు కోవాలి. ఈ దశలో పిల్లలు భాషను మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడమని ఒత్తిడి కూడా చేయ కూడదు. బిడ్డ భాషను నేర్చు కొంటున్నాడే కాని ఆ భాషను మాట్లాడే వాడు కాదని గుర్తుంచుకోవాలి. ఈ దశలో బిడ్డకు నేర్చు కోబోయే భాష మీద అవగాహన వస్తుందే తప్ప తిరిగి దాన్ని చెప్ప లేక పోవచ్చు. వాళ్ళకయి వాళ్ళు మాట్లాడితే అది వేరే సంగతి.

2. తేలిక పదాల దశ: ఈ దశలో నేర్చుకున్న పరాయి మాటలను పరిమితంగా పలకటము, సొంత భాషతో కలిపి మాట్లాడే దశ. బిడ్డలకు పదాలతో అవగాహన ఉంటుందే తప్ప పూర్తిగా భాష రాదని గుర్తుంచుకోవాలి. భాష లోని విడి పదాలను అర్థవంతంగా ఉపయోగిస్తారు. బదులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు తొలుత ''Yes, No, Come, Go  లాంటి ఒంటి పలుకులతో తరువాత పొట్టిగా  ఫరాయి పలుకులను వాడ గలిగే స్థితికి  (I need, I am going, you come) ఎదుగుతారు. ఈ దశ పూర్తి కావటానికి రెండేళ్లు పడుతుంది.



3. మాట్లాడే దశ: ఈ దశలో పిల్లలు నేర్చుకొన్న భాషను సాధారణ మాట భాషగా వాడగల స్థాయికి ఎదుగుతారు. మాట్లాడే భాషలో తప్పులు చాలా తక్కువగా ఉంటాయి. మాట్లాడటానికి జంకాల్సిన అవసరం ఉండదు. పర్యాయ పదాలు నేర్చు కొని ఉంటారు కాబట్టి పదాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. చిక్కు వాక్యాలు మాట్లాడటం ఈ దశ లోనే వస్తుంది. ఈ దశ పూర్తి కావటానికి బిడ్డకు శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయుల మీద, సంస్థ మీద, చుట్టూ ఉన్న భాషా పరిసరాలను బట్టి అంటే ఆంగ్లం మాట్లాడే సహచరులు, వారితో వ్యవహరించే తీరు, సమయం మీద ఆధార పడి రెండేళ్ళ నుండి అయిదు ఏళ్ళ వరకు పట్టవచ్చు.



4. సాహిత్య దశ: ఈ దశలో దాదాపు తన సొంత భాష మీద ఎంత పట్టు ఉంటుందో అంతే పట్టు ఇంగ్లీషు మీద కూడా వస్తుంది. గ్రామరు మీద ఆధిక్యత సంపాదిస్తారు. ఇంగ్లీషులో ధారాళంగా, వేగంగా, తడబాటు లేకుండా మాట్లాడగలరు, ఇంగ్లీషులో వాదోప వాదాలు చేయగలరు. ఇంగ్లీషులో అన్నీ సాహిత్య ప్రక్రియలు చేపట్ట గలరు. తన సొంత భాషలో ప్రావీణ్యం లేని వారు ఈ దశకు చేరు కోలేరు.


విద్యకు సంబంధించిన పిల్లలకు కొత్త భాషను నేర్పించటానికి రెండు పద్ధతులు ఉన్నాయి. బిడ్డ సొంత భాషను అలాగే కొనసాగిస్తూ నేర్చు కోవాల్సిన భాషను అదనంగా చేర్చటం ‘అదనపు’ నమూనా పద్ధతి. అంటే ఇప్పుడు తెలుగు మీడియంలో చదివే పిల్లలకు మూడో తరగతిలో ఇంగ్లీషు నేర్పటం మొదలు పెట్టినట్టు. అలా కాకుండా బిడ్డ సొంత భాషలో చదవటానికి ఏ కోశానా అవకాశం లేనప్పుడు తప్పని పరిస్థితుల్లో రెండో భాషను నేర్పించేది ‘ప్రత్యామ్నాయ’ నమూనా పద్ధతి. సాధారణంగా ఇలాంటి పద్ధతి మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్లినపుడు అక్కడ విధిలేక పాటించే పద్ధతి. రెండో భాషను బాగా నేర్చు కోవటానికి మంచి పద్ధతీ, శాస్ర్తియం అయినది అదనపు నమూనా పద్ధతి. మంచి ఇంగ్లీషు నేర్చు కోవాలంటే పద్ధతి ప్రకారం శాస్ర్తియంగా నేర్చు కోవాలి. ప్రపంచంలో ఎవరు ఇంగ్లీషు నేర్చు కున్నా అలాగే నేర్చుకుంటారు. ఇంగ్లీషు మీడియంలో చదివే మన తెలుగు పిల్లలు తప్ప

Saturday, December 15, 2012

విద్య వ్యాపారమా? సేవా??: తొలి చదువులు -23


15-12-2012


ముందు కాలంలో విద్య సేవలు అన్నీ పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉండేవి. ఇందులోకి క్రమేణా ప్రయివేటు విద్యా సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. అయితే వచ్చిన ఈ విద్యా సంస్థలు సామాజిక సేవా చూపుతో వచ్చినవే. ఇందులో క్రిస్టియను మిషనరీ విద్యా సంస్థలకి చెప్పుకో తగిన పాత్ర. ఇవి మత వ్యాప్తిని ప్రచారం చేస్తున్నాయని వాటికి పోటీగా హిందూ ధార్మిక సంస్థలు విద్యా సంస్థలను నెలకొల్పాయి. వీనికి తోడు స్థానికంగా సామాజిక సేవా చూపు ఉన్నవారు కూడా విద్యా సంస్థలను మొదలు పెట్టారు. అయితే ఇవి ఏవి కూడా వ్యాపార చూపుతో నడిచేవి కావు. కాబట్టి సమాజంలో ఏ సామాజిక వర్గపు పిల్లలకు అయినా విద్యా అవకాశాలు అటూ ఇటూగా ఒకే రకంగా అందుబాటులో ఉండేవి. గత పాతికేళ్ళ ముందు వరకూ దాదాపు ఈ పరిస్థితి ఉండేది.


కాలానుగుణంగా ప్రపంచంలో చోటు చేసుకొనే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్థిక విధానాలు, వీటిని నియంత్రించే రాజకీయ వ్యవస్థల నడక తీరులు (డైనమిక్సు) మారాయి. ఈ పరిస్థితుల్లో గతంలో నేరుగా రాజ్యాలను ఆక్రమించుకొనే సామ్రజ్య వాదం తన రూపుమార్చుకొని సాంస్కృతిక సామ్రాజ్య వాదం దుప్పటి కప్పుకుంది. దీని పర్యవసానమే నేటి గ్లోబలయిజేషను.

ఈ నేపథ్యంలో గతంలో సేవగా పరిగణించేవి అన్నీ నేడు వ్యాపారం అయి కూర్చున్నాయి. ఇందులో విద్యకు మినహాయింపు ఏమీ లేదు. అందులో భాగంగా విద్య, సేవా రంగం నుండి క్రమంగా వ్యాపార రంగంగా మారింది. తొలి నాళ్ళలో చిన్న చిన్న కాన్వెంటులుగా దుకాణాలు తెరిచిన వ్యాపార విద్యా సంస్థలు సాంస్కృతిక సామ్రజ్య వాదం ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా, ఏపుగా పెరిగి నేటి కార్పొరేటు బడుల రూపం మన ముందు ఉన్నాయి.


సాంస్కృతిక సామ్రాజ్యవాదం ప్రధాన అజెండా ఆయా సమాజాల భాషను, సంస్కృతిని చంపి, వాటి చోటులో మార్కెట్టు సంస్కృతిని, ఇంగ్లీషు భాషను నాటటం. విద్య ద్వారా మానసిక దాసోహాన్ని నింపటం. ఆ పని చేసి పెట్టటానికి వీలుగా మన ముందు ఉన్నవే కార్పొరేటు బడులూ, అందులో ఇంగ్లీషు మీడియం.


ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్పే బడులు దాదాపుగా ప్రయివేటు రంగంలో నడిచేవే. చాలా తక్కువగా సర్కారు బడులు ఉంటాయి. సర్కారు బడులు ఉన్నా వాటిలో పిల్లలు చెల్లించే బోధనా రుసుం మామూలుగా సర్కారు బడుల్లో ఉన్నట్టే ఉంటుంది. ప్రయివేటు బడుల్లో చదువు చెప్పినందుకు ప్రతి ఫలంగా ఫీజు వసూలు చేస్తారు. అంటే రుసుము చెల్లింపునకు సమానం అయిన సేవను అందించటం. ఇక్కడ విద్యార్థి (పరోక్షంగా తల్లిదండ్రులు) వినియోగదారుడు కాగా పాఠశాల యాజమాన్య సర్వీసు ప్రొవైడరు. తీసుకున్న డబ్బుకు సమానం అయిన సేవలు అందించక పోతే వినియోగదారుడు ఒప్పుకోడు. అటువంటిది ఏమయినా జరిగితే ఈ వినియోగదారుడు మరో బడిని వెతుక్కుంటాడు. కాబట్టి వసూలు చేసే ఫీజును బట్టి అదనపు సేవలు అందించాలి. అందులో భాగంగానే బోధనలో శ్రద్ధ, చదివించటంలో వ్యక్తిగత పర్యవేక్షణ ఉంటాయి. బోధించే సమయంలో ఉపకరణాలు వాడటం, పిల్లలచేత పదే పదే ప్రాక్టీసు చేయించటం వీరు అందించే అదనపు సేవలు అంటే పిల్లలు ఏదో ఒక రకంగా నేర్చుకునేంత వరకు మళ్లీ మళ్లీ అదే పని చేయించటం. బట్టీ పెట్టించటం, ఇంపోజిషను రాయించడం లాంటివి ఏడాదిపొడవునా చేయిస్తుంటారు. హోం వర్కుల పేర ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా పిల్లల చేత మళ్లీ అదే పని చేయిస్తూ ఉంటారు.


పిల్లలు పడే ఇలాంటి కఠోర శ్రమ వల్ల పుస్తకాలలో ఉన్న వాక్యాలు అలాగే మెడులోకి వెళ్లి, పరీక్షల సమయంలో తిరిగి పేపరు మీదకు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు కట్టిన ఫీజు మార్కుల రూపంలో ప్రోగ్రెసు కార్డు మీద కనపడుతుంది. అది తమ బిడ్డల ప్రతిభలా కనపడే సరికి మురిసి పోతారు. కానీ దాదాపు 80 శాతం అవి ఇవి నిజమయిన ప్రమాణాలు కావు. పరీక్షలకు తగ్గట్టు పిల్లల్ని రుబ్బించటం వల్ల తెలివితో సంబంధం లేకుండా వచ్చే మార్కులు అవి.


కార్పోరేటు బడులను చూడండి! తొమ్మిదో తరగతి పరీక్షలు కాకుండానే పదో తరగతి సిలబసు మొదలు పెట్టటము, వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహించటం వల్ల ఫిబ్రవరికి పూర్తి కావాల్సిన సిలబసు అక్టోబరుకే పూర్తి చేస్తారు, మళ్లీ ‘రివిజన్’ పేరుతో వేద మంత్రాలకు మల్లే ప్రశ్నలకు సమాధానాలను రుబ్బించటం మొదలు అవుతుంది. ఆ సమయమూ చాలక బడి అయిపోయాకకూడా ‘స్టడీ అవర్సు’ పేరులో రాత్రి ఏడు ఎనిమిది వరకూ పిల్లల్ని వదలరు. నిజానికి పుస్తకాలలో ఉన్న అంశాలను పిల్లల బుర్రల్లోకి ఎక్కించటానికి అంత సమయం అవసరమా? అశాస్ర్తియ పద్ధతులు పాటిస్తున్నారు కాబట్టే అంత సమయం పడుతుంది. నిజం మార్కులా ఉత్తుత్తి మార్కులా అనేదాంతో సంబంధం లేకుండా ఎలాంటి పద్ధతులు పాటించి అయినా ఎక్కువ మార్కులు రావటమే తెలివికి కొలబద్దగా పరిగణించటమే ఇప్పుడు కొనసాగుతున్న పద్ధతి. అందుకు వారి దగ్గర ఉన్న ఒకే ఒక, గత్యంతరం లేని దారి ‘బట్టి’ పద్ధతి.


చదువు అర్థం కాక పోయినా, బుర్ర ఎదగక పోయినా మార్కులు రాగల అనేక పద్ధతుల్లో ‘బట్టి’ది ముఖ్య పాత్ర. కాబట్టి మార్కుల కోసం బట్టీ పద్ధతి ఇంగ్లీషు బడుల్లో అలవాటు చేస్తారు. విద్యా వ్యవస్థలో బట్టీ పద్ధతి ఎంత సంస్థాగతం అయింది అంటే పాతిక ఏళ్ళలో మొత్తం పరీక్షా విధానమే బట్టికి అనుకూలం అయిన పరీక్షా విధానంగా  రూపు దిద్దుకొని ఇప్పుడు అమలు అవుతుంది. పరీక్షల్లో మార్కులు రాబట్టటం కోసం ఎలాంటి పద్ధతుల్లో బోధించాలో అలాంటి పద్ధతుల్లోనే బోధిస్తారు. అలానే పరీక్షలు రాయిస్తారు. అలా బిడ్డల్ని తెలివిగలవారిగా చూపెడతారు. ఈ రకంగా బిడ్డల బుల్రు ఎదగక పోయినా ఎదుగుతుందని నమ్మించే విధంగా బురిడీ కొట్టిస్తారు. ఎగువ క్లాసులకు వచ్చి బొక్క బోర్లాపడే దాకా ఆ సంగతిని తల్లిదండ్రులకు తెలియను గాక తెలియనివ్వరు. 

వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం! నిజం మార్కులు వేస్తే తల్లిదండ్రులు అరిగించుకోలేరు. బిడ్డ పరిమితిని గుర్తించటం మాని టీచర్లను బాధ్యులుగా చేసి బడి మారిస్తే ఆ వచ్చే ఫీజు పోతుంది కదా! కాబట్టి బిడ్డ చదువును అరచేతిలో వయికుంఠం చూపినట్టు ఎదుగుదల అట్ట (ప్రోగ్రసు కార్డు) లో మార్కులు ‘ఎగేసి’ చూపిస్తారు. అవగాహన లేని తల్లిదండ్రులకు బిడ్డల మార్కులే కొలబద్ద. అవి ఎలా వస్తున్నాయి అనే సంగతి మీద చూపు నిలుపరు.


ప్రయివేటు బడుల్లో ప్రత్యేకించి ఇంగ్లీషు బడుల్లో చదివే పిల్లల ప్రోగ్రసు రిపోర్టులు చూస్తే అసలు ఫెయిలు అయ్యేవారే ఉండరు. సరి కదా! ముందు చెప్పినట్టు మార్కులు బాగా ‘తెప్పించి’ ఉంటారు. కాబట్టి మీ పిల్లలు ‘నిజ్జం’ ప్రతిభ ఉన్నవారా లేక ‘చూపెట్టిన’ ప్రతిభ కలవారా అనేది చూసుకోక పోతే ఆ తరువాత ఒక్కసారిగా బొక్క బోర్లా పడక తప్పదు.


విద్యా విధానంలో శాస్ర్తియ పద్ధతి లోపించినప్పుడు అశాస్ర్తియ పద్ధతి రాజ్యం ఏలుతుంది. అంటే అడ్డ దారుల్లోకి విద్యా విధానం కొట్టుకు పోతుంది. మన చెడు రాత ఏమిటంటే ఆ అడ్డ దారుల్లో ఉన్న దాన్ని సరి చేసి గాడిలో పెట్టు కోవాల్సింది పోయి అదే సరి అయినది అని ఒకరిని చూసి ఒకరు అనుకరిస్తూ అందరూ మూకుమ్మడిగా ఆ వయిపే నడుస్తున్నాం.


ఎప్పుడో చదవబోయే వృత్తి విద్యల వయిపు చూపు సారించి, పసితనం నుంచే పిల్లల జీవితాలతో ఆట మొదలు పెడుతున్నాం. ఊరిస్తున్న ఆదాయ మార్గాలు అయిన ‘కార్పోరేటు ఉద్యోగాలు’, ‘విదేశీ అవకాశాలు’, ‘సాఫ్టువేరు ఉద్యోగాల’ కోసం పిల్లల్ని బలిపీఠం మీదకు ఎక్కించాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాం. అందుకు తగ్గట్టు ఫీజు తీసుకొని బలిపీఠం మీదకు ఎక్కించేవే ఇంగ్లీషు మీడియం బడులు.


బోధనా ప్రమాణాలలో ఏ మాత్రం తేడా చూపకుండా బిడ్డల సొంత భాషలో చదువు చెప్పిన పిల్లలకు, అదే విద్యను పరాయి భాషలో చదువు చెప్పిన పిల్లలతో పోలిస్తే పరాయి భాషలో చదివిన పిల్లలు ఖచ్చితంగా వెనుకబడి ఉంటారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రతీ పరిశోధనలోనూ నిగ్గుతేల్చిన సత్యం ఇది. ప్రాథమిక స్థాయిలో ప్రయివేటు బడుల్లో అదే ప్రమాణాలతో సొంత భాషలో చదువు చెబితే పిల్లల్లో దాగి ఉన్న మొత్తం సామర్థ్యాన్ని వెలికితీయవచ్చు. సొంత భాషలో చదివిన పిల్లలు చదువులో మెరుగ్గా రాణించటమే కాకుం డా మాటకారితనం (కమ్యూనికేటివ్ స్కిల్స్), భావ ప్రకటన తోపాటు వ్యక్తిత్వం కూడా వికసిస్తుంది. ఈ పునాది పయిన ఎన్ని భాషలు అయినా అవలీలగా నేర్చుకుంటారు.

Sunday, December 9, 2012

ఇంగ్లీషు మీడియం చిదంబర రహస్యం - తొలి చదువులు -22

8-12-2012
                                                 www.andhrabhoomi.net/content/early-studies-2

గతంలో లేని విధంగా నేడు జనం తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల నుండి ప్రయివేటు బడులు వైపు, తెలుగు మీడియం నుండి ఇంగ్లీషు మీడియం వైపు మొగ్గు చూపటానికి గల కారణాలను వెతకాల్సి ఉంటుంది. దీనికి జనం అనుకొనేది ఏమిటి అంటే ప్రభుత్వ బడుల్లో చదువు సరిగా చెప్పరు అనీ, తెలుగులో చదివిన వారికంటే ఇంగ్లీషు మీడియం చదివిన పిల్లల విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అని.

నిజానికి ఇది కేవలం పైపైన కనిపించే మెరుగు మాత్రమే. దాని లోతుల్లోకి తొంగి చూస్తే ఈ అనిపింపు ఉత్త డొల్లే. లేనివి ఉన్నట్టు అనిపించే మాయ మాత్రమే. ప్రయివేటు బడుల్లో ప్రమాణాలు పెరిగినట్టు అనిపించ టానికి కారణం వారు ఇంగ్లీషు మీడియంలో చదవటం కాదు. అందుకు బయటకు కనిపించని కారణాలు వేరే ఉన్నాయి. అవి ఏమిటో కాస్త లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే తప్ప ఇంగ్లీషు మీడియం దౌర్భాగ్యం నుండి మనం బయట పడలేము.

సాధారణంగా అందరూ అనుకొనేది ఏమిటి అంటే పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేది కేవలం పాఠశాలో, బోధనా భాషో అనుకుంటారు. అంతకంటే పొరపాటు మరొకటి లేదు. నిజానికి పిల్లల ప్రతిభ బయటకు రావటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి.


ఇందులో మొదటిది విద్యార్థిలో ఇమిడి ఉండే చేవ. అంటే పిల్లలకు పుట్టుకతో వచ్చే తెలివి సామర్థ్యం, వారిలో ఉండే కల్పానికత (క్రియేటివిటీ), చురుకుదనం లేదా ఉత్సాహం, నేర్చుకునే తత్వం మొదలయినవి. రెండో అంశం కుటుంబం. అంటే తల్లిదండ్రులు విద్యా స్థాయి, చదువు పట్ల వారు చూపే మార్గదర్శకత్వం, పిల్లలపట్ల తీసుకునే జాగర్తలు, చదువుకోసం వారు కల్పించే వసతులు. అంటే పిల్లలకు కల్పించే మవులిక సదుపాయాలు. ఈ రెండింటి మీద ఆధారపడి మూడోది అయిన పాఠశాల విద్య ఉంటుంది. అంటే బోధనా మాధ్యమం, బోధించే పద్ధతులు, బోధనా ప్రణాళిక, ఉపాధ్యాయుల బోధనా తీరులు మొదలయినవి.

ఒక పాఠశాలలో చదివే పిల్లలు అందరికీ బోధనా మాధ్యమం, బోధించే పద్ధతులూ, ప్రణాళిక, పాఠం చెప్పే ఉపాధ్యాయుడు, వారు పాఠం చెప్పే తీరూ ఒకే రకంగా ఉంటుంది. ఇవి విద్యార్థికీ విద్యార్థికీ మారవు. అయినప్పటికీ, పిల్లలు అందరూ ఒకే స్థాయిలో ప్రతిభను చూపలేకపోతున్నారు అంటే అర్థం మిగతా రెండు కారణాలలోనే తేడా ఉండి తీరాలి. అవే తొలి రెండు కారణాలు అయిన విద్యార్థి సొంత సామర్థ్యం, వారి తల్లిదండ్రుల కుటుంబ నేపథ్యం. పిల్లవాడి చేవ, వారి తల్లిదండ్రులు అందించే మవులిక తోడ్పాటు పిల్లలు రాణించటానికి కారణం అనేది బయటకు కనిపించదు. ఇవి తెర వెనుక వాటి పాత్రను పోషిస్తాయి. కేవలం పాఠశాల స్థాయివల్లే బిడ్డకు ప్రతిభ అబ్బదు. ప్రతిభను వెలికి తీయటంలో పాఠశాల కూడా తన పాత్రను సరిగా పోషించాలి. కార్పోరేటు బడిలో చదివినంత మాత్రాన పిల్లల్లో ప్రతిభ వెలికిరాదు. ప్రభుత్వ బడిలో చదివిన వారికి ప్రతిభ లేకుండా పోదు. ‘‘విద్యార్థి - కుటుంబం - బడి’’ ఈ మూడు పరస్పర కదలికల (డైనమిక్సు)వల్లే పిల్లల్లో ప్రతిభ తన్నుకొని వస్తుంది.

బాగా చదువుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించటం, హోం వర్కులు చేయించటం, అర్థం కాని వాటిని అర్థం అయ్యేటట్టు విశదీకరించటం లాంటివి చేస్తారు. పిల్లల ఆసక్తి, అభిరుచులను గమనించి వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం పిల్లల్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాక పిల్లల మానసిక ఎదుగుదలకు అవసరం అయిన చదువేతర విజ్ఞానాన్ని అందించటంలో చదువుకొన్న తల్లిదండ్రులు ముందు ఉంటున్నారు. ఈ కారణాలవల్ల వాళ్ళ పిల్లలు బోధనా భాషతో సంబంధం లేకుండా స్వతహాగా రాణించటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి.

ఆర్థికంగా బాగా ఉన్నా, తల్లిదండ్రులు విద్యావంతులు కానప్పుడు, వారిపిల్లలు చదవుల్లో అంతగా రాణించటం లేదు అన్న నిజాన్ని కూడా గమనించాలి. వారు ధనవంతులు అయినప్పటికీ చదువుకోని తల్లిదండ్రులు తమ బిడ్డల్ని చదువు విషయంలో దారిచూపించలేరు. అయినప్పటికి వారి స్థాయికి తగ్గట్టు పిల్లలకు ట్యూషన్లు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ట్యూషన్లలో చెప్పేది బడిలో చెప్పే చదువుకు కొన సాగింపుగానే ఉంటుంది తప్ప విద్యావంతులు అయిన తల్లి దండ్రులు తీసుకొనే శ్రద్ధకు సాటి రాదు. అందు వల్లే ధనిక వర్గానికి చెందిన పిల్లలు కూడా చదువు లోకి వచ్చేసరికి మూడో వంతు పిల్లల వర్గం లోకి చేరు తున్నారు.

చదువు రాని తల్లి దండ్రులు అంతో ఇంతో చదువుకున్న పేద, దిగువ మధ్య తరగతి తల్లి దండ్రులు తమ పిల్లల్ని బాగా చదివించు కోవాలి అని తాహతుకు మించి స్కూళ్ళు అనబడే కార్పోరేటు బడుల్లో చేర్పిస్తున్నారు. కాని విద్యా వంతుల మాదిరి తమ బిడ్డలను ‘గైడ్’ చేయలేక పోతున్నారు. ఎంతో కొంత చదువుకున్నవాళ్ళు ఒకటి రెండు తరగతుల్లో కొంత చెప్ప గలిగినా ఆ తరువాత ఇంగ్లీషులో వాళ్ళ స్థాయి చాలదు కాబట్టి బిడ్డలకు బడిలో చెప్పిందే చదువు. బిడ్డ చదువులో రాణించటం లేదని ట్యూషన్లు ఏర్పాటు చేసినా ముందు చెప్పినట్లు అది బడి విద్యకు కొనసాగింపే కాని విద్యావంతులు అయిన తల్లి దండ్రులు తీసుకొనే శ్రద్ధకు ప్రత్యామ్నాయం కాదు.

ఈ కారణాల వల్ల ఇంగ్లీషు మీడియంలో చదివే పేద, దిగువ మధ్య తరగతి వర్గాల పిల్లలు చదువు కోని తల్లి దండ్రులు ఉన్న పిల్లలకు పాఠశాలలో చెప్పేది అర్థం కాక, ఇంట్లో చెప్పే వాళ్ళు లేక పోవటంతో వీళ్ళకు చదువు మొక్కుబడి తంతుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లలు స్వతహాగా తెలివిగల పిల్లలు అయితే ఆ తెలివిని అంతా బట్టీ పెట్టటానికి ఉపయోగించి ఎలాగో ఒకలా నెట్టు కొస్తారు. కానీ ఇంగ్లీషు మట్టుకు సరిగా ఒంట పట్టదు. బట్టీ పట్టటానికి కూడా సామర్థ్యం లేని పిల్లలు బడి అంటే విముఖత ఏర్పడి పక్కదార్లు పడుతారు లేదా చదువుకు నాగా పెట్టేస్తారు.


దిగువ మధ్య తరగతి, లేదా పేద ప్రజానీకం నివసించే ప్రాంతాలలో ఉన్న ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో కేజీ క్లాసుల్లో చేరిన పిల్లల్లో ఎంతమంది పదో తరగతి వరకూ వస్తారో గమనిస్తే ఆ సంగతి అట్టే తెల్లం అవుతుంది. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో ఇప్పుడు జరుగుతున్న తంతు ఇదే. అయితే అవేమీ బయటకు కనపడవు. మనకు కన పడేదల్లా ఎంసెట్టు, ఐ.ఐ.టిలలో ర్యాంకులు తెచ్చిన పిల్లలే. వీరు వందలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరిని చూపించి మిగతా పిల్లలకు వాతలు పెడుతుంటారు. 

Monday, December 3, 2012

ఇంగ్లీషు అంత ‘వీజీ’ కాదు! : తొలి చదువులు -21


1-12-2012

ఏ బీ సీ డీ లతో మొదలు అయ్యే ఇంగ్లీషు నేర్చుకునే తొలి నాళ్లలో  చాలా  సుళువు అనిపిస్తుంది. లోతుల్లోకి వెళ్లే కొద్దీ దాని తడాఖా ఏమిటో తెలుస్తుంది. ఇంగ్లీషు బయటకు కనిపించే అంత సుళువు అయిన భాషేమీ కాదు. ఇంగ్లీషు భాషా వేత్తలకు సైతం తలనొప్పి మాత్రలను మింగించే అంత చిక్కు (కాంప్లెక్సు) నుడి. ఇంగ్లీషు భాషలో ఉద్దండ పండితులు కూడా ఈ భాషలో తప్పులు దొర్లకుండా రాయ లేరు. చదవ లేరు, మాట్లాడ లేరు. ఇంగ్లీషు సొంత భాషగా ఉన్న ఆంగ్లేయులకు సైతం చదవటానికీ రాయటానికి వచ్చేసరికి వాళ్లకూ ఇది నొప్పే. వాళ్లు కూడా ఉచ్ఛారణలూ, స్పెల్లింగులూ ఎప్పటికి అప్పుడు నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఆ భాష కట్టుబడి తీరే అంత. ఆంగ్ల అక్షర మాల (ఆల్ఫాబెట్)లో తక్కువ అక్షరాలుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇతర ప్రపంచ భాషలనుండి వచ్చి చేరే పదాలకు తగ్గట్టు రాతను, ఉచ్ఛారణ ఇవ్వలేక పోవడమే ఈ తిప్పలకు కారణం.

చిన్న పిల్లలకు ఇంగ్లీషు సులభంగా ఉన్నట్టు అనిపించడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి తెలుగుతో పోలిస్తే అక్షరాల సంఖ్య తక్కువ. అదీ కాక అక్షరాలు దాదాపుగా నిలువు, అడ్డ, వాలు గీతలతో ఉంటాయి. పిల్లలకు గీతలతో ఉండే ఆంగ్ల అక్షరాలు రాయడం చాలా సుళువు.

రెండో కారణం బోధనలో చూపే శ్రద్ధ, నేర్పించే తీరు. పిల్లల్ని బడిలో వేసిన మొదటి రోజు నుండే ‘ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్..’ అని కానీ, లేదా ‘ఏ పి పి ఎల్ ఈ-యాపిల్’ ‘ బి ఏ టి- బ్యాట్’ ‘సి ఏ టి- క్యాట్’ అంటూ ఆంగ్ల పదాలను స్పెల్లింగులతో సహా నేర్పిస్తుంటారు. ఆ విధంగా స్కూల్లో వేసిన నాటి నుంచి పదాలను స్పెల్లింగులతో సహా బట్టీ పట్టడం అలవాటు చేస్తారు. ఆదిలో చిన్న చిన్న పదాలు, తక్కువ పదాలు ఉంటాయి కాబట్టి సులువు అనిపించిన ఇంగ్లీషు రాను రాను గుదిబండగా మారడానికి కారణం ఏమిటో కాస్త లోతుల్లోకి వెళ్లి చూస్తే కానీ అర్ధం కాదు.


ఆంగ్లంలో మొత్తం అక్షరాలు 26. వీటిలో A E I O U అనేవి అచ్చులు మిగతా 21 హల్లులు. ఈ 21 హల్లులు వాటంతట అవి పలకలేవు. వీటికి అచ్చులు తోడు అయితేనే పలకగలవు. మచ్చుకు K అక్షరం ‘క్’ అనే మూల పలుకును ఇస్తుంది. దీని పక్కన A చేరినప్పుడు అది ‘క’ అనీ, O చేరినప్పుడు ‘కొ’ అనే ఇస్తుంది. అయితే K పక్కన O చేరిన ప్రతిసారి ‘కొ’ పలకాలనే ఖచ్చితమైన నిబంధన ఏమీ లేదు. మచ్చుకు COLLEGE అనే పదంలో COని ‘కా‘లేజ్‌గా పలకాలి. అదే COని COMAలో ‘కో’మగా పలకాలి. ఈ విధంగా CO అనే రెండు అక్షరాలు ఆయా సందర్భాలకు తగ్గట్టు ‘కొ’, ‘కో’, ‘క’, ‘కా’లుగా పలకాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా హల్లులకు అచ్చులు కలిపి చదవడంలో ఈ పితలాటకం తప్పదు. దేన్ని ఎప్పుడు ఎలా పలకాలి అనేది ఆ పదాన్ని నేర్చు కునేటప్పుడే తెలుసుకోవాలి. ఇందుకు నిరంతర సాధన కావాలి. ఇంగ్లీషులో దీనికి ‘ఫొ నిటిక్స్’ అనే పెద్ద  శాస్త్రమే  ఉంది.


నుడి నియమాల  ప్రకారం 21 హల్లులు 21 మూల శబ్దాలనే పలుకుతాయి. వీటికి అచ్చుల్ని కూడా కలిపితే మొత్తం 26 మూల శబ్దాలే పలకటానికి వీలు అవుతుంది. కానీ మనిషి చాలా శబ్దాలు చేయగలడు. వాటి అన్నింటికి అక్షర రూపం ఇవ్వాలంటే ఉన్న ఈ 26 మూల శబ్దాలు చాలవు. కాబట్టి అవసరాల రీత్యా ఒక అక్షరాన్ని ఒక శబ్దం కంటే ఎక్కువ శబ్దాల కోసం వాడుకోవాలి. సరిగ్గా ఇక్కడినుండే ఇంగ్లీషుతో పితలాటకం మొదలు అవుతుంది. దీనికి ఎన్ని నియమాలు పాటించినా పలుకు తీరులో, రాత తీరులో తికమక తప్పదు.


21 హల్లులకు కలిపితే 21 పలుకులు పుడతాయి. ఇలాగే, ఉన్న 21 హల్లులకు ఐదు అచ్చులు కలిస్తే 21 X 5 =105 పలుకులు ఏర్పడతాయి. ఇంగ్లీషులో రెండు అక్షరాల తర్వాత అచ్చు వచ్చే సాంప్రదాయం కూడా ఉంది. అంటే CAT..లో C తరువాత రావడం వల్ల ‘కా’ అయినట్టే CLASS అనే పదంలో CL తరువాత రావడంవల్ల ‘క్లా’గా పలుకుతారు. అంటే ఇవి మన ద్విత్త అక్షరాలూ, సంయుక్త అక్షరాలు లాంటివి. ఈ రకంగా 105 శబ్దాలకు మరో మారు 26 అక్షరాలు వచ్చి చేరాయి అనుకున్నా అచ్చులవల్ల 105 X 26 = 2730 పలుకులు రావటానికి అవకాశం ఉంది. ఇంకా నియమాలు లేకుండా ఏర్పడే పలుకులను కూడా పరిగణనలోకి తీసుకుంటే 3వేలు దాటక పోవచ్చు. కానీ ఇంగ్లీషులో ఉన్న ఈ 26 అక్షరాల తోనే ప్రపంచంలో మానవుడు చేయ గలిగిన అన్ని పలుకులకు అక్షర రూపం ఇవ్వాలి.


ఇంగ్లీషులో అక్షరాలు లేవని మనిషి శబ్దం చేయ కుండా ఉండలేడు. మనిషి చేయ గలిగిన అన్ని శబ్దాలకు 26 అక్షరాల తోనే రాయాలి, చదవాలి. అందు వల్ల వీటికి ఎన్ని నియమాలు, నిబంధనలు వర్తింప చేసుకున్నా అందరు ఒకే రకంగా చదివి, రాయ గలిగే విధంగా అక్షర రూపం ఇవ్వడం వీలు కాదు. అందుకే ఏ ఇద్దరు ఒక రకంగా చదవ లేరు, పలక లేరు. గతంలో కడప స్పెల్లింగ్ cuddapah గా ఉన్నప్పుడు ఇంగ్లీషు వార్తలు చదివే వాళ్లు ‘కుడప’, ‘కుడ్డప్’, ‘కడ్డప్’, ‘కుడపహ్’ అని రక రకాలుగా చదువుతుంటే మనకి తమాషాగా ఉండేది. ఇంగ్లీషు వాళ్లు గోదావరిని ‘గోడావరి’ అనీ, గుంతకల్లుని ‘గుంకల్’ అనీ, అనంతపురాన్ని ‘అనంపురం’ అని పలికేవాళ్లు. కారణం తెలిసిందే. ఇంగ్లీషులో ‘ద,డ’లకు D I, ‘త,ట’లకు T I వాడడం వల్ల స్థానికంగా ఆ పదంతో పరిచయం లేక పోతే ఎవరికి తోచినట్టు పలుకుతారు.



మొదట్లో సులభం అయిన ఇంగ్లీషు రాను రాను స్పెల్లింగులు, ఉచ్ఛా రణ, గ్రామరుతో పిల్లల కష్టాలు మొదలవుతాయి. తెలుగులో అయితే ఒక గుణింతం నేర్చుకోగానే మిగతా గుణింతాలు కొద్దిపాటి ప్రయత్నంతో వాటంతట అవే వస్తాయి. ఇంగ్లీషులో ఆ పప్పులు ఉడకవు. p-u-t ‘పుట్’ అయినప్పుడు b-u-t ‘బుట్’ కావాలనే రూలేం ఉండదు. దాన్ని ‘బట్’ అనాల్సిందే. ఈ విధంగా ప్రతి పదానికి స్పెల్లింగు, అర్ధం, వాక్య నిర్మాణం, గ్రామరు అన్నీ కలిసి ఓ పెద్ద సుడి గుండంలా తయారవుతుంది.


అక్షరాలు పూర్తిగా రానిదే చదవడమూ, రాయడమూ చేయలేరు. కాబట్టి పుస్తకాలలో ఉన్న దాన్ని చదవాలన్నా, చదివిన దాన్ని తిరిగి రాయాలన్నా అక్షరాలు నేర్చుకోవాలి. సొంత భాషలో చదివే పిల్లలు అయితే చదవడం, రాయడం నేర్చుకుంటే చాలు. మిగతా చదువు అంతా దాని ద్వారా జరిగి పోతుంది. అది పనిగా భాష నేర్చు కోవాల్సిన పని లేదు. ఇతర భాషలో చదవాలి అంటే, ఆ భాషను ముందుగా నేర్చు కోవాలి. పరాయి భాషలో చదవటమూ, రాయడం నేర్చు కోవడం పెద్ద పని ఏమీ కాదు. మచ్చుకు తమిళ అక్షర మాలను, గుణింతాలను పది రోజుల్లో నేర్చుకో ఒచ్చు. అప్పటి నుండి ఆ భాషలో చదవడము, రాయడం చేయ గలము. కానీ ఆ భాషలో మనం మాట్లాడ లేము. అవతలి వారు మాట్లాడితే మనకు అర్ధం కాదు. చదవడం, రాయడం వచ్చినంతనే పూర్తి భాష వచ్చినట్టు కాదు.ఈ సంగతి తెలియకే తల్లిదండ్రులు మా పిల్లలకు ఇంగ్లీషు సులభం అనే పయిపయి గమనింపును చెప్పేది.


ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లలకు ఎక్కువ భాగం ఆ భాషను చదవడము, రాయడమో వచ్చు. మొత్తం భాష మీద పట్టు రాక పోవడానికి కారణం పిల్లలకు సొంత భాషే ఎరగని వయసులో రాని భాషలో బోధించడం, తెలుగు ద్వారా నేర్పాల్సిన ఇంగ్లీషును, రాని ఇంగ్లీషు ద్వారానే నేర్పించడం వల్ల భాష పెరుగుదలకు గండి పడుతుంది. మొత్తం మీద అటు ఇంగ్లీషు సరిగా రాక, ఇటు సొంత భాషా సరిగా రాక పిల్లలు రెంటికి చెడుతున్నారు. 

Saturday, November 24, 2012

తెలుగు రాని వాడికి ఇంగ్లీషూ రాదు : తొలి చదువులు -20


      24-11-2012

‘‘మా  అబ్బాయి ఇంగ్లీషు మీడియం అండీ, తెలుగు రాదు’’, ‘‘మా వాడికి తెలుగు సరిగా రాదండీ, ఇంగ్లీషే బాగా చదువుతాడు’’, ‘‘మా  పిల్ల ఇంగ్లీషు చదివినంత ధారాళంగా తెలుగును చదవ లేదండి’’- ఇంగ్లీషు బడుల్లో పిల్లల్ని చదివించే ప్రతి తల్లి, తండ్రీ అనే మాటలు ఇవి. బయట కూడా ఇలాంటి మాటలు చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. వీరి మాటల్ని బట్టి ఇంగ్లీషులో చదవటం సులభం, కాగా తెలుగులో చదవటం కష్టం. అన్నీ అనుకూలంగా ఉండి, మాట్లాడటానికి ఇబ్బంది లేని సొంత భాషని చదవటం, రాయటం సరిగా రాక పోతే, దాదాపు అన్ని విషయాలలో ప్రతికూలంగా ఉండే ఇంగ్లీషు ఎలా సులభం అవుతుందీ? అన్నది అంతు పట్టని సంగతి.

ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లలలో భాషా పరిజ్ఞానాన్ని పరీక్షిస్తే దాదాపు ముప్పాతిక మందికి పైగా ఇంగ్లీషులో చదవటం, రాయటం తప్ప అందు లోని తేలిక విషయాలను కూడా అర్థం చేసు కోలేరు. మరో పక్క ఈ పిల్లలు తెలుగుకూ దూరం అవుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థం అయ్యేది ఏమిటంటే, తెలుగు మాట్లాడటమే వచ్చు చదవటం రాయటం సరిగా రాదు. అలాగే ఇంగ్లీషు చదవటము రాయటం వచ్చు. అర్థం చేసు కోవటము సరిగా రాదు. ఒకవేళ ఇంగ్లీషు బాగా వచ్చిన పిల్లలకు తెలుగు కూడా బాగా వచ్చి ఉంటుంది కాబట్టి వారిలో సమస్య లేదు.

చదువులో తెలుగు కష్టం, ఇంగ్లీషు సులభం అనేది బయటకు నిజంలా అనిపించినా, తరిచి చూస్తే అది అపోహే. ఇది కేవలం నిజంలా అనిపించే ఒక భ్రమ. ఈ భ్రమల నుండి బయట పడాలి అంటే కాస్త రెండు భాషల కట్టుబడి, వాటి గుణాల గురించి కాస్త లోతు ల్లోకి వెళ్లి చూడాలి. తెలుగు సరిగా రాక పోవటానికి మొదటి కారణం భాష నేర్చు కొనే తొలి నాళ్లలో ఉండే చిక్కు.
ఆధునిక తెలుగు అక్షరమాలలో ఉన్న పొడి అక్షరాలు మొత్తం 52. ఇందులో అచ్చులు 14. అల్లులు 36. వీటిలో గుణింతాలకు పనికి రాని ఙ, ఞలనూ తీసేస్తే మిగిలినవి 34. ఈ 34 అల్లులకు గుణింతాలు కట్ట ఒచ్చు. అంటే ‘క’ అక్షరం గుణింతం వల్ల క, కా, కి, కీ... లనుండి కౌ వరకు 14 పలుకులను ఇస్తుంది. ఈ లెక్కన ఉన్న 34 హల్లులు, ఒక్కొక్కటి 14 చొప్పున 34X14=476 పలుకులు పుడతాయి. అంటే గుణింతాలవల్ల 476 పలుకులకు నేరుగా అక్షరాలు తయారు అవుతాయి.

గుణింతాల తోనే కాకుండా ఒత్తులతో కూడా మనకు పలుకులు ఏర్పడతాయి. తెలుగులో హల్లులు అన్నింటికీ వాటి వాటి ఒత్తులు ఉన్నాయి. ఏ హల్లుకు ఆ ఒత్తే వచ్చే ద్విత్త అక్షరాలు వేరు ఒత్తులతో పలికే సంయుక్త అక్షరాలను మనం ఉపయోగిస్తాం. ఒక ఒత్తు గుణింతాలవల్ల ఏర్పడిన 476 పలుకులను మళ్ళీ మార్చగలదు. ఈ లెక్కన 476 శబ్దాలను 34 ఒత్తులతో కలిసి 476 X 34=16,184 పలుకులకు అక్షరాలు ఉన్నాయి. ఇవి కాక రెండో ఒత్తుతో కూడా పలుకులు వస్తాయి. ఈ విధంగా 16,184 అక్షరాలకు రెండో ఒత్తుతో ఏర్పడే అక్షరాలు లెక్కేస్తే 16,184 X 34 = 5,50,256 పలుకులకు అక్షరాలు తయారు అవుతాయి. అంతే కాదు, అయిదున్నర లక్షల పలుకులకు పక్కన సున్నా చేరటం వల్ల వాటి ఉచ్చారణలో తేడా వస్తుంది. అలా మరో అయిదున్నర లక్షల పలుకులను రాసేందుకు అవకాశం ఉంది. అంటే అటూ ఇటూగా 11 లక్షల పలుకులకు ఏ మాత్రం తొట్రు పడకుండా నేరుగా అక్షర రూపం ఇవ్వ గలిగిన చేవ ఇప్పటి తెలుగులో ఉంది. అయితే ఇవన్నీ వాడతామా లేదా అన్నది వేరే సంగతి.

ఇంత గందరగోళంగా, గజిబిజిగా, ముళ్ళ కంపలా ఉండే భాష ఇప్పటి తెలుగు. చాలా సరళంగా, సులువుగా విన సొంపుగా ఉండే తెలుగుకు సంస్కృతాన్ని తెచ్చి కలపటటం  వల్ల నేటి తెలుగు ముళ్ళ కంపలా తయారు అయింది. దీని ముద్దు పేరు ‘ఆంధ్ర’భష. అది ఎలాగో చూద్దాం.

అసలు తెలుగు లేదా తేట తెలుగులో ఉండే అచ్చులు 
అ  ఆ
ఇ  ఈ
ఉ  ఊ
ఎ  ఏ
ఒ  ఓ   -   మొత్తం 10 అచ్చులు     

ఋ ౠ, ఐ, ఔ, అః అక్షరాలు తెలుగు కాదు. ఇవి సంస్కృతం నుండి తెచ్చి తెలుగులో పోసినవి. అలాగే తెలుగులో అల్లులు క     గ    o 
చ    జ    o 
ట    డ    ణ
త    ద    న 
ప    బ    మ
య ర ల వ స ళ ఱ-మొత్తం 20. ఖ ఘ ఙ ఛ ఝ ణ థ ధ ఫ భ శ ష తెలుగు అల్లులు కావు ఇవి కూడా సంస్కృతం నుండి తెలుగులో పోసినవే.

తెలుగు తెలుగులాగే ఉండి ఉండే పిల్లలకు తెలుగు నేర్పటం అత్యంత సుళువు. అచ్చులు హల్లులు నేర్పాక ఒక్క గుణింతం నేర్పిస్తే మొత్తం గుణింతాలు వాటంతట అవే వచ్చి 20X10 = 200 పలుకులు ఒక్క వారంలో నేర్పించ ఒచ్చు. తెలుగులో ఉన్న మరో గొప్పదనం తెలుగు పదాలలో ఏ అల్లుకు అదే ఒత్తు వస్తుంది. చాలా అరుదుగా మాత్తరమే ఇతర ఒత్తులు వస్తాయి. ఈ రావటం కూడా సంస్కృత చెలిమి వల్లే. మచ్చుకు ‘వస్తాయి’ అనే పదమే తీసుకుంటే ‘వచ్చుతాయి’ అనే పుట్టక పదం గుది గూర్చిటం వల్ల ఏర్పడింది.

తెలుగు పిల్లలకు తెలుగులో చదువు సుళువు. కానీ ఇప్పుడు మనం తెలుగు పేరుతో చెప్పే చదువు అంతా ఆంధ్ర భాషలో ఉంటుంది. ఇప్పుడు మనం తెలుగు పేరుతో చదువుతున్న ఈ చిక్కు ఆంధ్రాన్ని నేర్పించాలి అంటే టీచర్లకు చాలా ఓపిక, సమయము కావాలి.

పాతిక ఏళ్ళకు మునుపు బడిలో తొలి మూడు ఏళ్ళలో కేవలము భాషను, అంకెలను, ఎక్కాలను మాత్తరమే నేర్పించే వారు కాబట్టి ఆ రెండు ఏళ్ళలో ఆంధ్రము అయినా బాగానే నేర్చు కోగలిగే వారు. ఇప్పుడు పిల్లలకు చదివే భాష, చదివే అంశాలు, చెప్పే తీరు అన్నీ మారి పోయాక చిక్కు ‘ఆంధ్రం’ నేర్పటం తొలుత కొంత కష్టంగానే తోస్తుంది. చదవటం రాయటం నేర్చుకునే అప్పుడే మాటకు తగిన అక్షరాలను ఎన్నుకోవటంలో, అంటే అచ్చులు, హల్లులు, గుణింతాలు, ఒత్తులతో ఏర్పడే ద్విత్త అక్షరాలు, సంయుక్త అక్షరాలు నేర్చు కోవటానికి చాలా రోజులు పడుతుంది. అయినప్పటికీ ఉన్న తెలుగునే నేర్పితే ఆ తరువాత అంతా చదువు సుళువే. తెలుగును ఒక సారి పూర్తిగా నేర్చుకొన్నాక ఇక చదవటానికి, రాయటానికి జీవితాంతం కుస్తీ పడాల్సిన అవసరం ఉండదు

.
తెలుగు సరిగా రాక పోవటానికి రెండో కారణం దాన్ని సరిగా నేర్పక పోవటం. యూకేజీ నుండే మూడు భాషలు, సైన్సు, సోషలు, లెక్కలు మొదలు పెట్టటమువల్ల పిల్లలకు తెలుగు తప్ప మిగతా సబ్జక్టులు అన్నీ ముఖ్యం అయినవిగా బడి నిర్వాహకులు భావించటంతో తెలుగు నేర్పే సమయంలో కోత పడుతుంది. ఆ నేర్పేది కూడా మొక్కు బడిగా మారటం వల్ల బిడ్డలకు తెలుగు సరిగా రావటం లేదు.

తల్లిదండ్రులు కూడా తెలుగు రాక పోయినా పట్టించుకోరు. పైగా ‘‘మా వాడికి తెలుగు సరిగా రాదు’’, ‘‘మా వాడికి ఇంగ్లీషే సులభం’’ అనటం చాలా మంది తల్లిదండ్రులకు ఫ్యాషనుగా మారింది. ఇది కూడా పాఠశాల యాజమాన్యాలకు కలిసి వచ్చే అంశం. ఏ అవకాశాలు లేని ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు కష్టం కాని తెలుగు ఇంగ్లీషు మీడియం పిల్లలకు గుది బండగా మారటం వెనుక ఇంత పెద్ద తతంగం ఉంది.

Sunday, November 18, 2012

మీ బిడ్డల్లో ఎమోషనల్ ఇంటిలిజేన్స్ గుర్తించండి - తొలి చదువులు-19

                                                                       17-11-2012

మహాకవి కాళిదాసు, ఆర్యభట్ట, చరకుడు, కౌటిల్యుడు, అన్నమాచార్యులు, రవివర్మ- ఇలాంటి పేర్లు విన్నప్పుడు వారు ఏయే రంగాలలో అద్భుత ప్రతిభా పాటవాలు ఉన్న వారో చరిత్రతో కాస్త పరిచయం ఉన్న అందరికి తెలుసు. ఇక సమకాలిక విషయానికి వస్తే ఇంద్రగంటి శేషేంద్ర శర్మ, ఇళయరాజ, ఎమ్.ఎఫ్. హుస్సేన్, సచిన్ టెండూల్కర్, కమలహాసన్.. వీరంతా ఆయా రంగాలలో అత్యంత ప్రాచుర్యం సంపాదించుకున్న వారు. వీరి జీవిత చరిత్రల్లోకి కాస్త లోతుగా తొంగి చూస్తే వారు ప్రాముఖ్యత పొందిన రంగాన్ని తప్పిస్తే మిగతా విషయాలలో మామూలు మనుషులు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వీళ్లు పెద్ద తెలివి గలవాళ్ళు  కాదు. అక్కడక్కడ కొన్ని మినహాయింపులు ఉంటే ఉండొచ్చు కానీ, అన్ని అంశాల మీద కొంత అవగాహనతో సివిల్సు, గ్రూపు పరీక్షలు రాసే వారి కంటే వీరి తెలివి తక్కువగా ఉండ వచ్చు. అయితే ఏమి? ఆయా రంగాలలో వారు పెద్ద ఎత్తుకు ఎగబాక గలిగారు. జీవితానికి ఒక గుర్తింపును పొంద గిలిగారు. ఒక రంగంలో ఉండే అనేక మందిలో కేవలం కొద్దిమంది మాత్రమే ఇలాంటి ప్రతిభను చూపటం ఎలా వీలు పడుతుంది అనేదాన్ని చూడాల్సి ఉంటుంది.

 ప్రకృతి అనేక వింతలు చేస్తుంది. అలాంటి వింతల్లో ఒకటి మానవుడి పుట్టుక. ఈ నేలమీద పుట్టే ప్రతి బిడ్డ మెదడు అందరికీ ఉన్నట్టే తెలివి చేవతో పుట్టటం మామూలే అయినా అందులో తనది అయిన ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అంటే కొన్ని ప్రత్యేక ప్రతిభలను ఇముడ్చుకొనే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ లక్షణం ఏ బిడ్డది ఆ బిడ్డకే సొంతం. ఇది బిడ్డ సాధార తెలివితో సంబంధం లేకుండా ఉండవచ్చు లేదా తెలివితో ముడిపడి ఉండవచ్చు. తెలివి తక్కువగా ఉండే బిడ్డల్లో సయితం అబ్బురపరచే ఏదో ఒక ప్రతిభ ఉండేందుకు అవకాశం ఉంది. దీనే్న ‘ఎమోషనల్ ఇంటిలిజెన్స్’ లేదా ఈ.క్యూ అంటారు. తెలుగులో ‘బతకనేర్చిన తెలివి’ అనే ఒక జాతీయం ఉంది. సరిగా అదే ఈ ఎమోషనల్ ఇంటిలిజన్సు. మెదడు చేవలో ఇదో ప్రత్యేక విడిత చేవ. పిల్లల మెదడు లో లోపల నిద్ర స్థితిలో ఉంటుంది. ఈ విడిత చేవ బయటకు రావటానికి అవకాశం ఏర్పడినప్పుడు పురి విప్పటం మొదలు అవుతుంది. సాన పెట్టే కొద్ది అబ్బుర పరచే ప్రతిభ బయటకు రావటానికి అవకాశం ఉంటుంది.

నిర్వచనం ప్రకారం ‘ఎమోషనల్ ఇంటిలిజెన్స్’ అంటే వ్యక్తిలో ‘‘ఉన్న విడిత చేవను గుర్తించటం, అనుభూతి చెందటం, వెలికి తీయటం, నేర్చుకోవటం, అర్థం చేసుకోవటం, గుర్తుంచుకోవటం, విరివి పరచటం, వివరించటం, ఆ మొత్తం చర్యలను అమలు పరచు కొనే చేవ’’ ఈ నిర్వచనాన్ని జనాల భాషలో చెప్పుకోవాలి అంటే పుట్టే ప్రతి బిడ్డ తనది అయిన ఒక ప్రత్యేక అంశంలో రాణించటానికి తగిన సామర్థ్యంతో పుడుతారు. 

మచ్చుకు ఓ ఇద్దరు కవులను పరిశీలిస్తే, ఒక కవి మెదడులో ‘కవిత్వ’ కళను ఇముడ్చుకోగలిగిన విడిత చేవ ఎక్కువగా ఉన్నప్పుడు, అతడు తన కవిత్వంలో అద్భుతాలు చూపగలడు. అది లేని మరో కవి సాధన చేయటం ద్వారా కవిత్వం రాయ గలిగినా మొదటి కవి రాసిన కవిత్వంలో ఉన్న పట్టు రెండో కవి రాసిన కవిత్వంలో ఉండదు. అలాగే నటనలో ఉద్వేగ సామర్థ్యం ఎక్కువగా ఉన్న సావిత్రికీ, ఆ సామర్థ్యం ఏ మాత్రం లేకుండా, కేవలం అందంగా ఉందన్న ఒకే ఒక కారణంతో సినిమా అవకాశం పొందిన మరో కథానాయకికి నటనలో తేడా ఉంటుంది. చిన్నబిడ్డలు తమలో ఉన్న ఆయా  ప్రత్యేక అంతర్గత సామర్థ్యాలు వెలికి తెచ్చుకోవాలి అంటే అందుకు పరిసరాల ప్రేరణ అవసరం. అంటే లోపల ఉన్న ఉద్వేగాన్ని పొడిచి పురి విప్పజేసే బయటి పరిస్థితులు కావాలి. అందుకే చదువు తోపాటు చదువేతర కార్యక్రమాలు విద్యలో భాగంగా ఉండటం తప్పనిసరి. 

గమనించాలే కానీ ప్రతి బిడ్డలో ఏదో ఒక సామర్థ్యం దాగి ఉంటుంది. ఇవ్వన్నీ బిడ్డ బిడ్డకూ వేరుగా ఉంటాయి. వారిలో ఆయా సున్నిత అంశాలను గుర్తించి పదును పెట్టటం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చు. మచ్చుకు ఒక బిడ్డ మెదడు సంగీతాన్ని ఇముడ్చుకో గలిగిన సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని గుర్తించి, ప్రోత్సహిస్తే అత్యంత మంచి సంగీత కళాకారుడిగా వెలుగుతాడు. అలాంటి సున్నితత్వం ఉన్న పిల్లవాడిని గుర్తించక పోతే, ప్రపంచం ఒక కళాకారుణ్ణి కోల్పోతుంది.

పిల్లల్లో దాగి ఉన్న అంతర్గత సామర్థ్యాన్ని వెలికి తీయక పోతే అది వృధాగా పోతుంది. వారిలో ఉన్న కల్పానిక శక్తి గురించి సరి అయిన దారిలో పెట్ట కుంటే ఒక్కోసారి అది పక్క దారి పట్టేందుకు అవకాశం ఉంటుంది. మచ్చుకు కల్పానిక శక్తి బాగా ఉన్న వ్యక్తి పోలీసు అధికారి అయితే అది సమాజానికి మేలు. అలా కాకుండా అదే వ్యక్తి పక్కదారి పట్టి నేరస్థుడుగా మారితే అది సమాజానికి నష్టం. అతను చేసే ప్రతి నేరం లోనూ సామర్థ్యం ఉంటుంది.. ఎక్కడో, ఎప్పుడో, ఏ బిడ్డల్లోనో, ఏదో ఒక అద్భుత ప్రతిభ విరబూస్తే ‘‘అబ్బో!’’ అనుకోవటం తప్ప మన పిల్లల్లో ఉన్న వనరులను మనం గుర్తించటం లేదు. పిల్లల్లో దాగి ఉన్న మాటు సామర్థ్యాన్ని పసితనంలో గుర్తించి విరబూసేటట్టు చేయక పోతే అది వ్యక్తికీ, సమాజానికీ నష్టం.

Saturday, November 10, 2012

తెలివి ఉన్నవారంతా ప్రతిభావంతులు కాలేరు -తొలి చదువులు-18


                                                                           10-11-12

తెలివి, ప్రతిభ, మేథాతనం అనేవి చాలా సందర్భాలలో ఒకే అర్థం కింద వాడుతూ ఉంటాం కానీ ఇవి అన్నీ ఒకటి కాదు. బిడ్డకు పుట్టుకతో తెలివి ‘సామర్థ్యం’ మట్టుకే వస్తుంది. దీన్ని మెరుగు పరచుకొని ఉపయోగం లోకి తీసుకు ఒస్తే అది ప్రతిభగా, మేథాతనంగా మారుతుంది. తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన ‘తెలివి సామర్థ్యం’ పూర్తిగా వినియోగం లోకి తెచ్చేది బిడ్డ పెరుగుతున్న పరిసరాలు.

బిడ్డకు మంచి సామర్థ్యం ఉన్నా అది ఉపయోగం లోకి రావటానికి కావలసిన ప్రేరణ, పరిసరాలు, వాతావరణం కావాలి. బిడ్డ తనలో ఉన్న చేవ దన్నుగా అందుబాటులో ఉన్న పరిసరాలను ఉపయోగించుకొని కష్ట పడితే, తెలివి ఉపయోగం లోకి వచ్చి ప్రతిభగా మారుతుంది. లేకుంటే ఆ చేవ అలాగే ముడి సరుకు లాగా ఉండి పోతుంది. ఇందులో ఉన్న అందం ఏమిటంటే ఎప్పుడు పరిసరాలు అనుకూలించినా తెలివి సామర్థ్యము ప్రతిభగా మారటానికి తయారుగా ఉంటుంది. అవకాశం ఇచ్చి చూస్తే ముడి సరుకుగా ఉన్నవారి చేవ ప్రతిభగా వికసించ ఒచ్చు. ఇందుకు మచ్చు ఏమిటంటే చిన్నతనంలో చదువుకు దూరం అయిన వారు ఆ తరువాత అనుకూల వాతావరణము ఏర్పడి చదువు మొదలుపెట్టినా ఉతికి ఆరేయటాన్ని మనం తరచూ గమనిస్తుంటాము.

తెలివి చేవ దున్నుగా ఉండే ప్రతిభ అనేక రూపాలలో ఉంటుంది. ప్రతిభను కొలవటానికి ఇదమిద్ధం అయిన కొలమానాలు ఏమీ లేకపోవచ్చు కానీ తెలివి చేవను కొలవ ఒచ్చు. ఆ కొలమానాన్ని ఐక్యూ (ఇంటిలిజెన్సు కోషంటు) అంటాం. ఐక్యూ అనేది మెదడు మేనుక పని చేయటంలో చూపే చేవ. దాన్ని ఉపయోగించి చదివితే పరీక్షల్లో వచ్చే మార్కులు సూచాయగా ప్రతిభను సూచిస్తాయి. అయితే మార్కులే తెలివికి కచ్చితమయిన కొలత కాదు. తెలివి ఎక్కువగా ఉండి సరి అయిన  శిక్షణ లేక పోయినా, ప్రతికూల పరిస్థితుల్లో పరీక్షలు రాసినా మార్కులు రావు. మార్కులు రాని వారందరిని తెలివి తక్కువ వారని అనలేము. అలాగే పుస్తకాన్ని బట్టీ పెట్టి మార్కులు పొందినా, అడ్డదారుల్లో మార్కులను సంపాదించినా బయటకు అది ప్రతిభగా కనపడ ఒచ్చు కానీ వారికి నిజంగా అంత తెలివి చేవ ఉంది అనలేము. ఒక డాక్టరుకు, కాంపౌండరుకు ఒకే తెలివి సామర్థ్యము ఉంటే డాక్టరు అయిన వ్యక్తికి పరిసరాలు, వసతులను అనుకూలంగా మార్చుకొని చదివినందువల్ల డాక్టరు అవుతాడు. అంటే తన తెలివికి పదును పెట్టి నిపుణుడుగా గుర్తింపు పొందుతాడు. అదే కాంపౌండరుకు డాక్టరుతో సమాన చేవ ఉన్నప్పటికీ ఏ కారణం వల్ల దాన్ని వాడక పోయినా సమాజంలో తక్కువ స్థాయిలో నిలిచి పోతాడు.

ఒక పక్క తెలివి బాగా ఎక్కువగా ఉన్న పిల్లలను, మరో పక్క ఎదుగుదలలో లోపం ఉన్న పిల్లలను మినహాయిస్తే ఒక తరగతిలో ఉన్న పిల్లల సామర్థ్యం కాస్త అటూ ఇటుగా ఒకే స్థాయిలో ఉంటుంది. తరగతిలో వాళ్ళకు ఇచ్చే శిక్షణ కూడా ఒకే స్థాయిలో ఉంటుంది. కానీ పరీక్షలు, మార్కుల దగ్గరకు వచ్చే సరికి పిల్లల్లో తేడా కనిపిస్తుంది. ఎందుకంటే తెలివి పుట్టుకతో వచ్చినప్పటికీ దానికి పదునుపెట్టే కారకాలు బిడ్డకు బిడ్డకు మారుతూ ఉంటాయి. కుటుంబ ఆర్థిక, సాంస్కృతిక స్థితులు, తల్లిదండ్రుల విద్యార్హతలు, పిల్లల పట్ల వాళ్లు చూపించే ఆసక్తి ఇవ్వన్నీ కూడా పిల్లల నైపుణ్యం పెరగటం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే బిడ్డ పరిసరాలకు గురయ్యే విధానాన్ని బట్టి, వారి నుండి పొందే ప్రేరణలను బట్టి ఈ తేడాలు ఏర్పడతాయి.

ఉన్న తెలివిని ప్రతిభగా మారటం రెండు రకాలుగా ఉంటుంది. ప్రతి విషయం మీద కొంత ‘విడిత’ (స్పెసిఫిక్) జ్ఞానాన్ని కలిగి ఉండటం. దీన్ని డ అందాం. రెండోది కొద్ది కొద్దిగా ఉండే ఇలాంటి విడిత జ్ఞానాలు అనేకం కలిసి ‘సాధారణ’(జనరల్) జ్ఞానంగా ఉండటం. దీన్ని G అనుకుందాం. ఈ లెక్కన విడిత జ్ఞానాల కూడిక G=S1+S2+S3+S4... మొత్తానినే  సాధారణ జ్ఞానం లేదా తెలివిగా వ్యవహరిస్తాం.

ఒక వ్యక్తి సమాజంలో మనుగడ సాగించాలి అంటే, ఆ సమాజంలో తను నెట్టుకు రావటానికి కావలసిన కనీస ‘సాధారణ జ్ఞానం’ పొందాలి. అంటే ఆ వ్యక్తి తన జీవనానికి కనీసంగా అయినా జ్ఞానాన్ని పొందాలి. అప్పుడే తన రోజు వారి వ్యవహారాలను సరిగ్గా చక్కపెట్టుకోగలడు. మచ్చుకు చదువు (S1), మానవ సంబంధాలు (S2), సమస్య పరిష్కార శక్తి (S3), కళలు (S4), సాహిత్యం (S5), ఉద్వేగాల అదుపు (S6), గణితం (S7)... ఇలా అనేక రకాల ప్రత్యేక జ్ఞానాన్ని లేదా నైపుణ్యాలను ఎంతో కొంత సంపాదించినప్పుడే, ఆ మొత్తం కలిపి సాధారణ తెలివి అవుతుంది. దీనితోపాటు బతుకు తెరువు కోసం ఏ ఒక రంగంలో మరింత విడిత జ్ఞానం పొంది ఉండాలి. ఇది సాధారణంగా పనికి సంబంధించిన నిపుణత అయి ఉంటుంది.

మన విద్యా విధానంలో ప్రధాన లోపం ఏమిటి అంటే, బిడ్డల్ని ప్రాథమిక తరగతుల నుండే మును ముందు చేయ బోయే వృత్తిని గురిగా పెట్టుకుని చదివించటం. జనంలో ఉన్న ఈ పోకడలను డబ్బు చేసు కోవటానికి పుట్టిన కార్పో‘రేటు’ బడుల్లోకి బిడ్డల్ని పంపుతున్నాం. ఇక్కడ పిల్లలకు అర్థం అవుతుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా పుస్తకాలలో ఉన్నదాన్ని ఏదో ఒక రూపంలో బుర్ర ల్లోకి దూర్చి తిరిగి దాన్ని మార్కుల రూపంలో బయటకు లాగటమే అక్కడ చేసే పని. అందుకు ఎన్ని అడ్డ దారులు ఉన్నాయో అన్నీ వారు తొక్కుతారు. మన చేత తొక్కిస్తారు. పిల్లలు ఏమయి పోతారో అన్న ధ్యాస వారికి ఉండదు. ఉన్న ఒకే ఒక ధ్యేయం ఫీజు కట్టే పిల్లల్ని వదులు కోకుండా ఏదో రూపంలో మార్కులు చూపించటమే. నిజానికి ఎక్కువ మంది అవగాహన లేని తల్లిదండ్రులకు కావల్సింది కూడా అదే!

ఇక్కడ గమనిచాల్సింది ఏమిటంటే పిల్లలు సాధారణ జ్ఞానం పెంపొందటంలో బడి ఒక చిన్న భాగమే కానీ మొత్తం అదే కాదు. పిల్లలు పొందే జ్ఞానంలో అత్యధిక భాగం సమాజంతో మమేకం కావటం ద్వారా పొందుతారు. అంటే తోటి పిల్లలతో ఆడు కోవటం, వ్యక్తులతో మసలటం, ఇతరుల్ని గమనించటం, వారిని అనుకరించటం వల్ల ఎక్కువ సంగతులు నేర్చుకుంటారు. మన చెడురాత కొద్ది ఇప్పటి పిల్లలకు అలాంటి అవకాశాలు కురచబడి పోతున్నాయి. అందుకు ప్రధాన కారణం చదువు కోసం కేటాయిం చిన సమయం విపరీతంగా పెరగటం. పిల్లలు చదువు కోసం కేటాయించాల్సిన సమయం ఎప్పుడయితే పెరిగిందో, తోటి పిల్లలతో ఆడు కోవటానికీ, ఇతరులతో మెలగ టానికి కేటాయించాల్సిన సమయంలో కోతపడుతుంది. దీనితో సమాజం నుండి నేర్చుకోవాల్సిన సామాజిక సూత్రాలను కనీసంగా కూడా నేర్చుకోలేరు. పిల్లలు బుర్రనంతా క్లాసు పుస్తకాలతో నింపే చదువులతో చదువేతర సామర్థ్యాలకు సానపెట్టే పని తగ్గుతుంది. దాంతో ఆ సామర్థ్యాలు పెంపు చెందక వృధాపోతాయి. అద్భుతాలు సృష్టించటానికి బిడ్డ మెదడులో ప్రకృతి గూర్చి ఉంచిన మేథో సామర్థ్యాలను గుర్తించకపోవటంవల్ల, గుర్తించినా చదువు పేరుతో వీటిని పట్టించుకోకపోవటంవల్ల ఆ సామర్థ్యాలు అలాగే కాలం కడుపులో కలిసిపోతాయి.

Saturday, November 3, 2012

మెదడు-మనసు-ఆలోచ: తొలి చదువులు-17


03-11-212

మెదడు పని చేసే తీరునే మనసు అంటాము. మెదడుకు మేనుక (ఫిజికల్) రూపం ఉంటుంది కానీ మనసుకు ఉండదు. మెదడు - మనసుల పనిని కంప్యూటరు తో పోల్చ ఒచ్చు. మనకు కంప్యూటరు మేనుక అయిన ‘హార్డు వేరు’ కనిపిస్తుందే తప్ప అందులో పని చేసే ‘సాప్టువేరు’ కనిపించదు. కంప్యూటర్ల మేనుక రూపాలు అన్నీ ఒకటిగానే ఉంటాయి. వాటిలాగే మెదడు మేనుక రూపాలు కూడా చూసేందుకు ఒకటి గానే ఉంటాయి. కంప్యూటరు పని చేసే వేగం, దాని నిలువ శక్తి ప్రతీ కంప్యూటరుకు తేడాగా ఉంటుంది. మెదడు సామర్థ్యము, దాని పని వేగం ప్రతీ మెదడుకు వేరుగా ఉంటాయి. ఇవి తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వస్తాయి.

కంప్యూటరులో కంప్యూటరులో వివిధ ప్రోగ్రాములను కలిపి సమన్వయంగా పని చేయించడానికి ఒక ‘సాప్టువేరు’ కావాలి. దీనినే ‘ఆపరేటింగ్ సిస్టం’ లేదా ‘ఒ.ఎస్’ అంటాము. అంటే విండోను, లినెన్సు, జావా, ఆండ్రాయిడు లాంటివి. కంప్యూటరు పని సామర్థ్యం ఈ ‘ఆపరేటింగ్ సిస్టం’ బలంమీదనే ఆధారపడి ఉంటుంది. ఆపరేటింగు సిస్టం బాగా ఉంటేనే అందులో మనకు అవసరం అయిన అదనపు ప్రోగ్రాముని నింపి వాడుకోగలము. కంప్యూటరు సమర్థవంతంగా పని చేయాలంటే నిర్మాణాత్మకంగా హార్డువేరు అంతా ఏ లోపం లేకుండా ఉండాలి. అప్పుడు దాన్లో నింపే ‘ఆపరేటేంగు సిస్టం’ ప్రకారం కంప్యూటరు పని చేస్తుంది. మనిషి మెదడును పని చేయించే ఆపరేటింగు సిస్టంను కాగ్నిషను అంటారని ఇంతకు ముందు చెప్పు కున్నాము. కంప్యూటర్లలో అయితే ఒ.ఎస్‌ని మనం తయారు చేసి ఎక్కిస్తాము. మనిషి మెదడులో అలా ఎక్కించ లేము. ఎవరి ఆపరేటింగు సిస్టం (కాగ్నిషను)ని వారే తయారు చేసు కోవాలి. అందుకు కావల్సిన దినుసులను సమాజం అందిస్తుంది. అది కూడా భాష ద్వారా అందిస్తుంది. పుట్టుకతో వచ్చే మెదడు సామర్థ్యాన్ని ఉపయోగించుకొని మనం ఏర్పాటు చేసుకొనే కాగ్నిషనుని బట్టి మన మానసిక కార్య కలాపాలు, వాటి చురుకుదనం ఆధార పడి ఉంటుంది.

కాగ్నిషను రూపు దిద్దుకోవటంలో ముందుగా బిడ్డ మెదడు సామర్థ్యానికి భాష జత కావాలి. దానిద్వారా కాగ్నిషను ఎదుగుతుంది. బిడ్డ పెరిగే పరిసరాలు, సామాజిక, ఆర్థిక భౌగోళిక పరిస్థితులు మలుపులు తిప్పుతాయి. అందుకే ఏ ఇద్దరికి ఒకే రకమయిన ఆలోచనా తీరు ఉండదు. చివరకు కవలలుగా పుట్టి ఒకే పరిసరాలలో, ఒకే పరిస్థితుల్లో పెంచిన పిల్లలకు కూడా వారి ఆలోచనా తీరులు వేరు వేరుగా ఉంటాయి. వ్యక్తి కాగ్నిషను అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దానంతట అదే మార్పు (అప్‌డేట్) చెందుతుంది. మనం కావాలని ప్రయత్నించి కూడా మార్పు చేసుకోవచ్చు.

మనిషిలో కాగ్నిటిపు వ్యవస్థ ఏ విధంగా ఏర్పడుతుంది? అనే అంశంమీద ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది లోతుగా పరిశోధనలు చేశారు. వారిలో స్విడ్జర్లాండుకు చెందిన శాస్తవ్రేత్త ‘జీన్’ పియూజె (1896-1980) పరిశోధన చాలా ముఖ్యం అయినది. ఆయన పిల్లల మీద చేసిన పరిశోధనలను ‘జెనిటిక్ ఎపిస్టెమాలజీ’ అనే పేరుతో ప్రపంచానికి తెలియజేశారు. అంటే జీవ పరిణామంలో వేల ఏళ్ళుగా పోగు పడుతూ వారసత్వంగా పొందిన ‘ఆలోచన’ గుణ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా కాగ్నిషనుని కట్టు కుంటారో చెప్పటం అన్న మాట.

బిడ్డలో ఆలోచనా ఎదుగుదల ఒక పద్ధతి ప్రకారం, అంచెలు అంచెలుగా దశల వారీగా జరుగుతుంది. పూర్తి స్థాయి ఆలోచనా వ్యవస్థ తయారు కావాలి అంటే దానికి ముందున్న ప్రతీ దశలోనూ సంపూర్ణత సాధించాలి. ఏ దశలో అయినా ఎదుగుదల కుంటుపడింది అంటే తరువాత దశ మొదలు కావడానికి సరైన పునాది ఉండదు. అందువల్ల మొత్తం ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది. అందులో కీలక దశలు మొదటి పదేళ్ళలో ఉంటుంది. అంటే ప్రాథమిక విద్య పూర్తయ్యే వయస్సు. ఈ పదేళ్ళలో ఏర్పడే కాగ్నిషనే మును ముందు మనిషి ఆలోచనా విధానానికి ప్రవర్తనకూ పునాదిగా ఉంటుంది.

తొలి దశ బిడ్డ పుట్టినప్పటినుంచి రెండేళ్ళ వరకు ఉంటుంది. ఈ దశలో చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ అవయవాలు బాగా పరిణతి పూర్తి అందుబాటులోకి వస్తాయి. మరోపక్క ఒంటి కండరాలు మెదడు అదుపులోకి వస్తాయి. అలాగే ఒంటికీ పంచేంద్రియాలకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది. దీన్ని ‘సెన్సరీ - మోటారు’ దశ అంటారు. బిడ్డ మునుముందు జరపబోయే కార్యకలాపాలకు శరీరం, నాడీ వ్యవస్థ తయారుఅయి ఉండటం అన్న మాట.

రెండో దశలో భాష ఏర్పడటానికి కావాల్సిన వేదిక జోరుగా తయారు అవుతూ ఉంటుంది. రోజూ చూస్తున్న వస్తువులకు, వ్యక్తులకు పేర్లు జోడిస్తూ ఉంటారు. చదువుకి సంబంధించిన అంతవరకు ఇది ఎల్కేజి నుండి రెండవ తరగతి వరకూ ఉండే దశ. ఈ దశలో భాషా పరమయిన పెంపు బాగా ఊపు అందుకుంటుంది. అంటే భాష ఏర్పడటంలో ఇది అత్యంత కీలక దశ అన్నమాట. ఈ దశలో కొత్త భాషను నేర్పించటానికి ప్రయత్నిస్తే అది బిడ్డలో గందరగోళానికి దారితీస్తుంది. అలాంటిది కొత్త భాషలో వేరుగా మొత్తం బోధనే మొదలు పెడితే ఎంత గందరగోళానికి దారితీస్తుందో? ఈ పసి పిల్లలకు ఎంత చిత్ర హింసగా ఉంటుందో పెద్ద వారు అయిన మనం వారి రూపం లోకి మారి అనుభవిస్తే కాని తెలియదు. మూడో దశ 7 నుండి 11 ఏళ్ళ వరకు కొన సాగుతుంది. ఇది పిల్లలు నిలకడ అయిన ఆలోచనలను అలవాటు చేసుకొనే దశ. ప్రతి విషయాన్ని వాస్తవ దృష్టితో చూటానికి అలవాటు పడే దశ. ఒక విషయాన్ని అనేక కోణాల నుండి పరిశీలించటం ఈ దశలోనే వస్తుంది. అంటే పిల్లలు ఇతరుల దృష్టితో కూడా ఆలోచించ గలరు. ఈ దశను ‘ఆపరేషనల్ థింకింగ్’ దశ అంటారు. ఆలోచనల్లో ఒక క్రమ పద్ధతి ఉంటుంది. దేనినీ గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించే తత్వం అలవాటు అవుతుంది.

తొలి దశను వదిలితే తక్కిన రెండు, మూడు దశలు ప్రాథమిక విద్యను నేర్పించే పరిధిలోనివి. అంతే కాకుండా జీవితానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలు పెంపొందే దశలు కూడా. మును ముందు బిడ్డ జరపబోయే ఆలోచనలు ఈ పునాదుల మీదే ఆధార పడి ఉంటాయి.

ఈ పునాదుల కట్టుబడిలో బిడ్డకు సమాజానికి మధ్య వారధిగా ఉండేదే భాష, భాషా వారధి ద్వారానే ఆలోచనా వ్యవస్థ పెంపు చెందుతుంది. భాష ఎల్కేజి మీడియపు బడిలో దొరికినట్టు ‘రెడీమేడు’గా దొరకదు. ఒక పదముతో మొదలు పెట్టి చేవ ఉన్న మేరకు అనంతంగా ఎవరికివారు సాగు చేసు కోవాలి. అంటే తొలుత నేర్చు కోవాలి. తరువాత వాడుకోవాలి.

Monday, October 29, 2012

సొంత భాషలోనే వ్యక్తి పునాది - తొలి చదువులు16

27-10-2012

మనసు - అంటే మెదడు పని చేసే విధానమే. చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు, సందర్భం, సంఘటనలకు మనసు స్పందిస్తుంది. అలా స్పందించటం దాని నయిజం. మనసు తత్వం ఎలాంటిది అయినా అది పని చేసే తీరు, తంతు అందరిలో ఒకే రకంగా ఉంటుంది. మనసు చేసే ముఖ్యమయిన పని తనువును పరిసరాలతో సమన్వయ పరచటం. మనసు తరపున ఈ పని చేసి పెట్టేది ‘ఆలోచన’. అంటే ఆలోచన అనేది మనసుకు చెందిన ముఖ్య కార్య నిర్వహణ అధికారి అన్న మాట. మనసుకు నమ్మిన బంటు అయిన కాగ్నిషను ఏ పనిని అయినా 
  1. ‘ప్రేరణ’ (Stimulation)
  2. ‘అనిపింపు’(Feeling ) 
  3. ‘పని’ (Conation)
అనే మూడు అంచె లలో చేస్తుంది. మచ్చుకు ‘‘ఒక వ్యక్తి పామును చూసి భయపడి దూరంగా పరిగెత్తాడు’’ అనుకుందాం. అక్కడ కాగ్నిషను పని చేసే విధానం ‘ప్రేరణ-అనిపింపు-పని’ అనే మూడు అంచెల్లో జరుగుతుంది. పాము అనేది పరిసరాలలో ఉన్న ఒక మేనుక (బౌతిక) రూపం. ఆ మేనుక ‘ప్రేరణ’గా పనిచేసి అది కరిస్తే చని పోతారని అంతకు ముందే మనసులో నాటుకు పోయి ఉన్న నమ్మకాన్ని కదిలించింది. దాంతో భయం అనే ‘అనిపింపు’ (ఫీలింగు) పుట్టి, ప్రమాదం నుండి కాపాడు కోవటానికి దూరంగా పరుగు తీయటము అనే ‘పని’ (కొనేషను) జరిగింది.

పామును చూసిన క్షణం నుండి ఇక్కడ జరిగిన తతంగాన్ని అంతా నడిపింది ఆ వ్యక్తి మనసులో ఉన్న ‘ఆలోచన’. మనసు పనిలో దాదాపు 90 పాళ్ళు ‘ఆలోచన’దే. దీనినే  శాస్త్ర పరి భాషలో ‘కాగ్నిషన్’ (cognition) అంటారు. ఇది మనసులో దండలో దారంలా ఉండి బయటకు కనపడదు. మనసు చేసే అన్ని మానసిక కార్య కలాపాలకు ఆలోచనే కేంద్ర బిందువు. ఒక రకంగా చెప్పాలి అంటే మనసుకు మరో రూపం ఆలోచన. ఒక సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా మసలటానికి కారణం వారి ఆలోచనా పునాదులే. వ్యక్తి ప్రవర్తన ఎవరికివారు కట్టుకున్న ఆలోచనా విధానానికి లోబడి ఉంటుంది. అంటే వారి కాగ్నిషన్ని బట్టి ఉంటుంది.

‘ఆలోచనా వ్యవస్థ’ (కాగ్నిటివు సిస్టం) మనిషికి పుట్టుకతో ఉండదు. దాన్ని కట్టుకొనే చేవ మట్టుకే పుట్టుకతో వస్తుంది. పుట్టాక ఏ బిడ్డకు ఆ బిడ్డ దాన్ని తయారు చేసుకోవాలి. పుట్టిన మరుక్షణం నుంచి వచ్చే అనుభవాలను ఉపయోగించు కొని ఆలోచనా వ్యవస్థను కట్టుకోవాలి. ఈ కట్టు బడికి ఇటుకల లాంటివి మాటలు. అంటే కాగ్నిషను రూపు దిద్దు కోవటం అనేది భాష పునాది మీద జరుగు తుంది. భాష ఎదిగే కొద్ది ఆలోచన పరిధి పెరుగు తుంది. వాటి నుండి నమ్మకాలు ఏర్పడతాయి.
నిజమా కాదా అన్న దానితో సంబంధం లేకుండా నమ్మకాలు ఏర్పడటము, మంచి చెడులతో సంబంధం లేకుండా అభిప్రాయాలు రూపొందించు కోవటం, నైతికమా అనైతికమా అనే దానితో సంబంధం లేకుండా విలువలు పాటించటము అనేవి ఆలోచనా వ్యవస్థ కట్టుబడి మీదే ఆధారపడి ఉంటుంది. బిడ్డలు పెరుగుతున్న సామాజిక పరిసరాలనుండి, మేనుక ప్రేరణల నుండి పొందే సమాచారంతో తమది అయిన ఒక కాగ్నిషన్ని కట్టు కుంటారు. కుటుంబ ఆచారాలు, సమాజపు కట్టుబాట్లు, మనం అందించే శిక్షణ మొదలయినవి అన్నీ పిల్లల కాగ్నిషను రూపు దిద్దు కోవటంలో పాలు పంచుకుంటాయి. కాగ్నిషను దన్నుగా పిల్లవాడి ప్రవర్తన ఉంటుంది. బిడ్డల్లో పుట్టుకతో లేని ఆలోచన వ్యవస్థ పురుడు పోసు కోవాలంటే దానికి ముందు బయిటి సమాచారాన్ని మెదడుకు చేర వేసే ఇంద్రియాలు అయిన చూపు, వినికిడి బాగా పని చేస్తూ ఉండి ఉండాలి. చూపు, వినికిడి లోపంతో పుట్టిన పిల్లలకు తీవ్రతను బట్టి వారి ‘కాగ్నిషను’లో కూడా లోటు ఉంటుంది.

మానవులు ఉపయోగించే భాష ఏది అయినా ఉపయోగించేటప్పుడు అది రెండు పనులు చేస్తుంది. ఒకటి ‘మాట భాష’ (కమ్యూనికేషన్)గా, రెండోది ‘ఆలోచనా భాష’ (కాగ్నిటివ్)గా. మాట భాష అంటే జీవితంలో రోజు వారీ అవసరాల కోసం మాట్లాడుకొనే భాష. మాట్లాడేటప్పుడు వాడే పదాలు, వాటి అర్థాలు, ఉచ్చారణ, ధ్వని స్థాయి, వ్యాకరణం మొదలైనవి అన్నీ ఇందులో భాగం. పిల్లల్లో మొట్ట మొదటిగా ఏర్పడేది ఈ భాషే.

ఆలోచనా భాష అంటే నమ్మకాలు ఏర్పరచు కోవటానికి, మంచీ చెడు ఆలోచించటానికి, విజ్ఞానాన్ని నేర్చు కోవటానికి, విద్యా బోధనకు, సాహిత్య ప్రక్రియలకు ఉపయోగ పడే భాష. ఇది పుట్టుకతో రాదు. ‘మాట భాష’ భాష పెంపు చెందే కొద్దీ, దానిలోని మాటలను, భావాలను తీసుకొని ఆలోచనా భాష కట్టుబడి జరుగుతూ ఉంటుంది. ఏ కట్టడానికి అయినా పునాదులు ముఖ్యం. బిడ్డ ఏ లోపం లేకుండా, పుట్టి, ఎదుగుదల సరిగా ఉన్నట్టు అయితే ఆలోచన వ్యవస్థకు రహదారి భాష. పిల్లల్లో ఇది భాష తోనే మొదలు అయి, భాష ద్వారా జరుగుతూ, భాష తోపాటే పెరుగుతూ 18 ఏళ్ళకు ముగుస్తుంది. ఆ లెక్కన లేత వయసులో భాష పునాదులు ఎంత గట్టిగా ఉంటే ఆ మేరకు ఆలోచన కట్టుబడి కూడా అంతే గట్టిగా ఉంటుంది. ఒకసారి ఆలోచన నిర్మాణాన్ని బలంగా కట్టాక వ్యక్తి అవసరాలకు అనుగుణంగా దాన్ని ఎప్పుడు అయినా మార్చుకోవచ్చు.

సమకాలిక ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లను, సమాజ పోకడల్ని గీటు రాయిగా తీసు కున్నప్పుడు బలమయిన కాగ్నిషను ఏర్పరచుకున్న వ్యక్తులు వారి వారి ఆలోచనా విధానంలో స్థిరంగా ఉంటారు. అలా కానప్పుడు చిన్న చిన్న వత్తుడులకు కూడా తట్టు కోలేరు. ఇలాంటి వారు ఒత్తిడికి గురి అయినప్పుడు డొల్లలాగా ఉన్న వారి ఆలోచనా వ్యవస్థ సుళువుగా చెదిరి పోతుంది. దానితో వ్యక్తి మానసిక రుగ్మతలకు లోను అవుతాడు.

లేత వయసులో సొంత భాష ఎదగకుండా చేయటం అంటే వారి ఆలోచనా భాషను ఎదగనీయకుండా ఆపటం అవుతుంది. పటిష్టంగా ఉండాల్సిన ఆలోచనా భాష బోలుగా ఉండటం వల్ల దానిమీద ఆధారపడి కట్టుకొనే కాగ్నిషను కూడా పునాదులు లేని మేడగానే ఉంటుంది. సొంత భాష అదిమి దాని చోటులోనే నేర్చుకొనే మాట భాష ఎప్పటికీ మాట భాషే. అది వ్యక్తి కట్టుబడిలో ఏ మాత్రం పాలు పంచు కోలేదు. అదే సొంత భాష బాగా ఎదిగాక నేర్చుకొనే ఏ ఇతర భాష అయినా ఆ వ్యక్తిత్వానికి అలంకారంగా మారగలదు

Saturday, October 20, 2012

మెదడు.. మానసిక ఎదుగుదల - తొలి చదువులు-15


                                                                         20-10-2012

ఈ ప్రకృతిలో మనిషి కూడా ఒక జంతువే. అయినప్పటికీ జంతువులకి మనిషికి మధ్య స్పష్ట మయిన తేడా ఉంది. అదే ‘తెలివి’. జీవ పరిణామంలో మానవ జాతికి ప్రకృతి ప్రసాదించిన వరం తెలివి. ఈ తెలివి వల్లే ఇతర జంతువుల కంటే మనిషి ఎగువ మెట్టులో ఉన్నాడు. మనిషి తప్ప దాదాపు అన్ని జంతువులూ ప్రకృతి నిర్దేశించిన నియమాల ప్రకారం నడుచు కుంటాయి. మనిషి మాత్రమే ప్రకృతిని, ప్రకృతి సూత్రాలను తన జీవనానికి తగ్గట్టు మలుచు కోగలడు. అందుకు కారణం ఈ తెలివే. మనిషిని జంతువుల నుండి వేరు చేసింది ఇదే.

జంతువులు అన్నింటి లోకీ సాపేక్షంగా పాలిచ్చే జంతువుల తెలివి ఎక్కువ. వీటిల్లో కూడా మనిషి తెలివి మరీ ఎక్కువ. తెలివి మానవుడిలో ఎదిగినంతగా ఇతర మరే జంతువు ల్లోనూ జరగ లేదు. ఇప్పటి మన తెలివి ఈ రోజుకి ఈ రోజే వచ్చింది కాదు. సుమారు 5 లక్షల ఏళ్ళ నాడు మొదలు అయి, కాలాను గుణంగా సంపాదించుకున్న మార్పులను ఇముడ్చుకుంటూ అవన్నీ పోగుపడి ప్రస్తుత స్థితికి ఎదిగాము. మానవుడిలో పోగు పడిన తెలివిని ఇముడ్చు కొనేందుకు వీలుగా మెదడు కట్టుబడి లోనూ, పరిమాణం లోనూ, పని లోనూ మార్పులు జరిగాయి, ఇంకా  జరుగుతున్నాయి.

మెదడు నాడీ కణాలతో కట్టి ఉంటుంది. ఈ నాడీ కణాలు అవి చేసే పనిని బట్టి రెండు రకాలుగా ఉంటాయి. పనిచేసే ‘అసలు’ నాడి కణాలు ఒక రకం కాగా రెండో రకం వాటికి ఊతను, పోషణను అందించే ‘గ్లియల్’ (బంక) నాడీ కణాలు. అసలు నాడీ కణాలను అతికించి ఉంచుతాయి కాబట్టి వాటికి అలా అంటారు. 
మొత్తం మెదడు నాడీ కణాలలో పని చేయని గ్లియలు కణాలు 90 పాళ్ళు కాగా పని చేసే నాడీ కణాలు కేవలం 10 పాళ్ళే. ఒక మనిషిలో ఉండే ఈ 10 పాళ్ళ నాడీ కణాలను విడి విడిగా తీసి 121 కోట్ల భారతీయులు అందరికీ సమానంగా పంచితే ఒక్కొక్కరి చేతిలో 82 కణాలు పెట్టవచ్చు. అంటే వాటి మొత్తం సుమారుగా పది వేల కోట్లు.

పుట్టే నాటికి బిడ్డ మెదడులో ఎన్ని నాడీ కణాలు ఉంటాయో ఆ తర్వాత కూడా అనే్న కణాలు ఉంటాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ కణాల సంఖ్య పెరగదు. మరయితే పుట్టినప్పుడు చిన్నదిగా ఉన్న మెదడు వయసు వచ్చే కొద్దీ పెద్దదిగా ఎలా పెరుగుతుంది?

వయసు పెరిగేకొద్ది మనిషి పొందే అనుభవాలు మెదడులో నమోదు అవుతూ వుంటాయి. వ్యక్తి పొందే ప్రతీ అనుభవము నాడీ కణాలలో మేనుకంగా (ఫీజికల్) జ్ఞాపకపు ప్రొటీనులుగా మారుతాయి. అవి తరువాత మన జ్ఞాపకాలకు ‘బ్లూ ప్రింటు’లా పని చేస్తాయి. అనుభవం ఎంతగా పెరుగుతుంటే వాటి తాలూకు ప్రొటీనులు తయారీ కూడా అంతే మేరకు పెరుగుతాయి. నాడీ కణాలలో పేరుకు పోయే ప్రొటీనుల నిలువలు ఎక్కువ అయ్యే కొద్దీ నాడీ కణాలు ఉబి పరిమాణంలో పెరుగుతాయి. పరిమాణంలో పెరగటం తోపాటు వాటి మధ్య సమాచార మార్పిడి కోసం అనుసంధానపు తీగలను ఏర్పరచుకుంటాయి. ఒక పక్క నాడీ కణాల పరిమాణం పెరగటం, మరో పక్క వాటి మధ్య అను సంధానపు తీగలు ఏర్పడటం వల్ల మొత్తంగా మెదడు పరిమాణం పెరుగుతుంది.

మెదడు మేనుక ఎదుగుదలలో 90 శాతం మొదటి అయిదు ఏళ్ళలోపే జరుగుతుంది. 16 ఏళ్ళ వరకూ మిగిలింది జరిగి ఆగి పోతుంది. బిడ్డ ఎదుగుదలలో ఈ మొదటి అయిదు ఏళ్ళు అత్యంత కీలకం అయినవి. మెదడు ఎదుగుదల మేనుకంగా ఆగి పోయినా అవసరాన్ని బట్టి ఇతర కణాలతో సంబంధాన్ని అదుపు చేసుకోగల చేవ నాడీ కణాలుకు ఉంటుంది. అక్కర ఎక్కువ అయినప్పుడు సంబంధాలు పెంచుకోవటాన్ని ‘న్యూరోనల్ బ్రాంచింగ్’ (అంటే చిగురించటం) అని, తెంచుకోవటాన్ని ‘న్యూరోనల్ ప్రూనింగ్’ (అంటే కత్తిరించటం) అని అంటారు. మానవుడి మెదడులో నిరంతరం అవసరం మేరకు బ్రాంచింగులూ, ప్రూనింగులూ జరుగుతూనే ఉంటాయి. ఈ మొత్తం తతంగాన్ని వైద్య భాషలో ‘న్యూరో ప్లాస్టిసిటి’ అంటారు.


ఎదిగే పిల్లల నాడీ కణాలు అత్యంత వేగంగా, చురుగ్గా ‘బ్రాంచింగ్’ జరుపగల చేవను కలిగి ఉంటాయి. అయితే ఈ చేవ మొత్తం ఉపయోగం లోకి రావాలి అంటే అందుకు ‘అవసరం’ ఏర్పడాలి. అంటే పని ఉంటేనే నాడీ కణాల మధ్య ‘బ్రాంచింగ్’ బాగా జరుగుతుంది. అంటే పరిసరాల ప్రేరణలు ఉంటేనే మెదడు ఎదిగేది. పరిసరాల ప్రేరణలు అంటే బిడ్డ సమాజం నుండి పొందే అనుభవాలు. అందులో అర్థం అయ్యే చదువు కూడా ఒకటి.


Sunday, October 14, 2012

స్వంత భాషతోనే ముందడుగు - తొలి చదువులు-14

                                                                           12-10-2012 
                               

                                   ఆఫ్రికా-యునెస్కో అధ్యయనం

ఆఫ్రికా విద్య అభివృద్ధి సంస్థ, యునెస్కోకి చెందిన విద్యా సంస్థ ఉమ్మడిగా ఆఫ్రికాలో అమలు అవుతున్న విద్యా విధానం పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచటంలో ఎందుకు విఫలం అవుతుందో తెలుసుకోవటానికి ఆ దేశంలో ఉన్న పలు రాష్ట్రాలలో పెద్ద పరిశోధన జరిపింది.

ఆఫ్రికా ప్రభుత్వాలకు మన ప్రభుత్వంలాగే పసి బిడ్డలు అందరికీ ఒకటో తరగతి నుంచే అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లాన్ని నేర్పించాలనే ఉబలాటం ఎక్కువ. కొన్ని ప్రభుత్వాలు పిల్లల మీద దయదలచి నాలుగో తరగతి నుండి ఆంగ్లాన్ని ప్రవేశ పెట్టాయి. కొంత కాలానికి విద్యా ప్రమాణాలు మొత్తంగా పడి పోవటం మొదలు అయింది. అమలులో ఉన్న విద్యా విధానం ఎందుకు విఫలం అయిందో విచారించటానికి పై రెండు సంస్థలు రంగం లోకి దిగి కారణాలను వెతకటం మొదలు పెట్టాయి. పిల్లలకు సొంత భాషను ఎదగనిచ్చి ఆ తరువాత దాని ద్వారా ఆంగ్లాన్ని సరిగా నేర్పకుండా నేరుగా పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలోకి తొయ్యటం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నట్టు తేల్చి చెప్పాయి. పరిశోధనా ఫలితాలు ఇలా ఉన్నాయి.

పిల్లలు తమ సొంత భాషలో చదివినంత వరకూ విద్యా ప్రమాణాలు బాగా ఉంటున్నాయి. ఆంగ్ల మాధ్యమంలోకి మారిన ఒకటి రెండేళ్ళలోనే వారి చదువు దిగజారటం మొదలు అయి ఉన్నత విద్య పూర్తి అయ్యే నాటికి సరాసరిన 30 శాతం విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. చాలా కొద్దిమంది పిల్లలు మట్టుకు ఆరో తరగతికి వచ్చేసరికి ఆంగ్ల మాధ్యమంలో నిలతొక్కుకోగలుగుతున్నారు. మిగిలిన పిల్లలు అసంపూర్ణ చదువులతో బడి మానేయటమో, అత్తెసరు ప్రమాణాలతో పాఠశాల నుండి బయటపడటమో జరుగుతుంది. సొంత భాషలో చదివిన పిల్లల విద్యా ప్రమాణాలు జాతీయ స్థాయి సరాసరి 69 శాతం కాగా అదే ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లల జాతీయ సరాసరి విద్యా ప్రమాణాలు 32 శాతంగా ఉన్నట్టు తేలింది. అధ్యయన మొత్తం సారం ఇలా ఉంది.
  • కనీసం మూడో తరగతి వరకూ సొంత భాషను బాగా ఎదగ నివ్వటం అవసరం. కానీ అలా జరగటం లేదు. 
  • ఆంగ్లాన్ని బోధనా భాషగా వాడాలి అంటే దాన్ని బాగా నేర్పించాలి. ఆంగ్లాన్ని బాగా నేర్చు కోవటానికి కనీసం ఏడేళ్లు పడుతుంది. 
  • ఆంగ్ల మాధ్యమం కోసం మధ్య లోనే సొంత భాషను వదిలేయటం వల్ల పిల్లల విద్య పెంపు, మానసిక ఎదుగుదల దెబ్బ తింటున్నాయి. 
  • సరిగా రాని భాషలో బోధన వల్ల గణితం, సైన్సులలో పిల్లలు రాణించలేక పోతున్నారు.

                                                               తమిళనాడు అధ్యయనం
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలో డా కె. రామస్వామి, డా శ్రీవాత్సవ 8, 9 తరగతుల పిల్లలతో ‘బోధనా భాష - నైపుణ్యం’ అనే అంశం మీద చేసిన పరిశోధనలో సొంత భాషలో చదివిన పిల్లల్లో, మానసిక వికాసం, భావ ప్రకటనా నైపుణ్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లలు చదవటం, రాయటం నైపుణ్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లలు చదవటం, రాయటం నైపుణ్యాలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ (ఇది శిక్షణలో తేడా వల్ల కనిపించే మార్పు) మిగిలిన విషయాలలో సొంత భాషలో చదివిన వారి కంటే వెనుక పడి ఉన్నారు. తమాషా ఏమిటంటే ఇదే ఇంగ్లీషు మీడియం పిల్లలకు ఎగువ తరగతులకు రాక మునుపు మంచి భావ ప్రకటనా నైపుణ్యం ఉంది. తరగతులు పెరిగే కొద్దీ చదవాల్సిన సిలబసు పెరగటం ఒక కారణం కాగా సొంత భాష ద్వారా పొందాల్సిన మానసిక వికాసం, మాటల చాతుర్యం తగ్గటం ఇందుకు కారణాలు. 

ప్రపంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా జరిగిన ప్రతి పరిశోధనలోనూ తేలిన నిప్పులాంటి నిజం ఏమిటంటే, తొలి ప్రాయంలో చెప్పే చదువును సొంత భాషలో చదివిన పిల్లల్లో ప్రతిభా పాటవాలు అత్యంత ఉన్నతంగా ఉంటున్నాయి అని. దీని అర్థం ప్రాథమిక విద్యను ఇతర భాషలో చదివిన పిల్లలకు ప్రతిభ లేదనే కదా.

బోధనా ప్రమాణాలు, వసతులు ఒకే రకంగా ఉన్నప్పుడు, ఉన్న తెలివి చేవను ఉపయోగించుకొని ప్రతిభగా మలచుకొనే దారిలో సొంత భాషలో చదివిన వారి కంటే పరాయి భాషలో చదివిన పిల్లలు ఖచ్చితంగా వెనుక బడి ఉంటారు. సొంత భాషలో విద్య నేర్చు కోవటంవల్ల పిల్లలకు ఉన్న సామర్థ్యాన్ని అత్యంత ఎక్కువగా చూప గలరు అనేది మొత్తం పరిశోధనల సారం.