Saturday, December 15, 2012

విద్య వ్యాపారమా? సేవా??: తొలి చదువులు -23


15-12-2012


ముందు కాలంలో విద్య సేవలు అన్నీ పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉండేవి. ఇందులోకి క్రమేణా ప్రయివేటు విద్యా సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. అయితే వచ్చిన ఈ విద్యా సంస్థలు సామాజిక సేవా చూపుతో వచ్చినవే. ఇందులో క్రిస్టియను మిషనరీ విద్యా సంస్థలకి చెప్పుకో తగిన పాత్ర. ఇవి మత వ్యాప్తిని ప్రచారం చేస్తున్నాయని వాటికి పోటీగా హిందూ ధార్మిక సంస్థలు విద్యా సంస్థలను నెలకొల్పాయి. వీనికి తోడు స్థానికంగా సామాజిక సేవా చూపు ఉన్నవారు కూడా విద్యా సంస్థలను మొదలు పెట్టారు. అయితే ఇవి ఏవి కూడా వ్యాపార చూపుతో నడిచేవి కావు. కాబట్టి సమాజంలో ఏ సామాజిక వర్గపు పిల్లలకు అయినా విద్యా అవకాశాలు అటూ ఇటూగా ఒకే రకంగా అందుబాటులో ఉండేవి. గత పాతికేళ్ళ ముందు వరకూ దాదాపు ఈ పరిస్థితి ఉండేది.


కాలానుగుణంగా ప్రపంచంలో చోటు చేసుకొనే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్థిక విధానాలు, వీటిని నియంత్రించే రాజకీయ వ్యవస్థల నడక తీరులు (డైనమిక్సు) మారాయి. ఈ పరిస్థితుల్లో గతంలో నేరుగా రాజ్యాలను ఆక్రమించుకొనే సామ్రజ్య వాదం తన రూపుమార్చుకొని సాంస్కృతిక సామ్రాజ్య వాదం దుప్పటి కప్పుకుంది. దీని పర్యవసానమే నేటి గ్లోబలయిజేషను.

ఈ నేపథ్యంలో గతంలో సేవగా పరిగణించేవి అన్నీ నేడు వ్యాపారం అయి కూర్చున్నాయి. ఇందులో విద్యకు మినహాయింపు ఏమీ లేదు. అందులో భాగంగా విద్య, సేవా రంగం నుండి క్రమంగా వ్యాపార రంగంగా మారింది. తొలి నాళ్ళలో చిన్న చిన్న కాన్వెంటులుగా దుకాణాలు తెరిచిన వ్యాపార విద్యా సంస్థలు సాంస్కృతిక సామ్రజ్య వాదం ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా, ఏపుగా పెరిగి నేటి కార్పొరేటు బడుల రూపం మన ముందు ఉన్నాయి.


సాంస్కృతిక సామ్రాజ్యవాదం ప్రధాన అజెండా ఆయా సమాజాల భాషను, సంస్కృతిని చంపి, వాటి చోటులో మార్కెట్టు సంస్కృతిని, ఇంగ్లీషు భాషను నాటటం. విద్య ద్వారా మానసిక దాసోహాన్ని నింపటం. ఆ పని చేసి పెట్టటానికి వీలుగా మన ముందు ఉన్నవే కార్పొరేటు బడులూ, అందులో ఇంగ్లీషు మీడియం.


ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్పే బడులు దాదాపుగా ప్రయివేటు రంగంలో నడిచేవే. చాలా తక్కువగా సర్కారు బడులు ఉంటాయి. సర్కారు బడులు ఉన్నా వాటిలో పిల్లలు చెల్లించే బోధనా రుసుం మామూలుగా సర్కారు బడుల్లో ఉన్నట్టే ఉంటుంది. ప్రయివేటు బడుల్లో చదువు చెప్పినందుకు ప్రతి ఫలంగా ఫీజు వసూలు చేస్తారు. అంటే రుసుము చెల్లింపునకు సమానం అయిన సేవను అందించటం. ఇక్కడ విద్యార్థి (పరోక్షంగా తల్లిదండ్రులు) వినియోగదారుడు కాగా పాఠశాల యాజమాన్య సర్వీసు ప్రొవైడరు. తీసుకున్న డబ్బుకు సమానం అయిన సేవలు అందించక పోతే వినియోగదారుడు ఒప్పుకోడు. అటువంటిది ఏమయినా జరిగితే ఈ వినియోగదారుడు మరో బడిని వెతుక్కుంటాడు. కాబట్టి వసూలు చేసే ఫీజును బట్టి అదనపు సేవలు అందించాలి. అందులో భాగంగానే బోధనలో శ్రద్ధ, చదివించటంలో వ్యక్తిగత పర్యవేక్షణ ఉంటాయి. బోధించే సమయంలో ఉపకరణాలు వాడటం, పిల్లలచేత పదే పదే ప్రాక్టీసు చేయించటం వీరు అందించే అదనపు సేవలు అంటే పిల్లలు ఏదో ఒక రకంగా నేర్చుకునేంత వరకు మళ్లీ మళ్లీ అదే పని చేయించటం. బట్టీ పెట్టించటం, ఇంపోజిషను రాయించడం లాంటివి ఏడాదిపొడవునా చేయిస్తుంటారు. హోం వర్కుల పేర ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా పిల్లల చేత మళ్లీ అదే పని చేయిస్తూ ఉంటారు.


పిల్లలు పడే ఇలాంటి కఠోర శ్రమ వల్ల పుస్తకాలలో ఉన్న వాక్యాలు అలాగే మెడులోకి వెళ్లి, పరీక్షల సమయంలో తిరిగి పేపరు మీదకు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు కట్టిన ఫీజు మార్కుల రూపంలో ప్రోగ్రెసు కార్డు మీద కనపడుతుంది. అది తమ బిడ్డల ప్రతిభలా కనపడే సరికి మురిసి పోతారు. కానీ దాదాపు 80 శాతం అవి ఇవి నిజమయిన ప్రమాణాలు కావు. పరీక్షలకు తగ్గట్టు పిల్లల్ని రుబ్బించటం వల్ల తెలివితో సంబంధం లేకుండా వచ్చే మార్కులు అవి.


కార్పోరేటు బడులను చూడండి! తొమ్మిదో తరగతి పరీక్షలు కాకుండానే పదో తరగతి సిలబసు మొదలు పెట్టటము, వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహించటం వల్ల ఫిబ్రవరికి పూర్తి కావాల్సిన సిలబసు అక్టోబరుకే పూర్తి చేస్తారు, మళ్లీ ‘రివిజన్’ పేరుతో వేద మంత్రాలకు మల్లే ప్రశ్నలకు సమాధానాలను రుబ్బించటం మొదలు అవుతుంది. ఆ సమయమూ చాలక బడి అయిపోయాకకూడా ‘స్టడీ అవర్సు’ పేరులో రాత్రి ఏడు ఎనిమిది వరకూ పిల్లల్ని వదలరు. నిజానికి పుస్తకాలలో ఉన్న అంశాలను పిల్లల బుర్రల్లోకి ఎక్కించటానికి అంత సమయం అవసరమా? అశాస్ర్తియ పద్ధతులు పాటిస్తున్నారు కాబట్టే అంత సమయం పడుతుంది. నిజం మార్కులా ఉత్తుత్తి మార్కులా అనేదాంతో సంబంధం లేకుండా ఎలాంటి పద్ధతులు పాటించి అయినా ఎక్కువ మార్కులు రావటమే తెలివికి కొలబద్దగా పరిగణించటమే ఇప్పుడు కొనసాగుతున్న పద్ధతి. అందుకు వారి దగ్గర ఉన్న ఒకే ఒక, గత్యంతరం లేని దారి ‘బట్టి’ పద్ధతి.


చదువు అర్థం కాక పోయినా, బుర్ర ఎదగక పోయినా మార్కులు రాగల అనేక పద్ధతుల్లో ‘బట్టి’ది ముఖ్య పాత్ర. కాబట్టి మార్కుల కోసం బట్టీ పద్ధతి ఇంగ్లీషు బడుల్లో అలవాటు చేస్తారు. విద్యా వ్యవస్థలో బట్టీ పద్ధతి ఎంత సంస్థాగతం అయింది అంటే పాతిక ఏళ్ళలో మొత్తం పరీక్షా విధానమే బట్టికి అనుకూలం అయిన పరీక్షా విధానంగా  రూపు దిద్దుకొని ఇప్పుడు అమలు అవుతుంది. పరీక్షల్లో మార్కులు రాబట్టటం కోసం ఎలాంటి పద్ధతుల్లో బోధించాలో అలాంటి పద్ధతుల్లోనే బోధిస్తారు. అలానే పరీక్షలు రాయిస్తారు. అలా బిడ్డల్ని తెలివిగలవారిగా చూపెడతారు. ఈ రకంగా బిడ్డల బుల్రు ఎదగక పోయినా ఎదుగుతుందని నమ్మించే విధంగా బురిడీ కొట్టిస్తారు. ఎగువ క్లాసులకు వచ్చి బొక్క బోర్లాపడే దాకా ఆ సంగతిని తల్లిదండ్రులకు తెలియను గాక తెలియనివ్వరు. 

వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం! నిజం మార్కులు వేస్తే తల్లిదండ్రులు అరిగించుకోలేరు. బిడ్డ పరిమితిని గుర్తించటం మాని టీచర్లను బాధ్యులుగా చేసి బడి మారిస్తే ఆ వచ్చే ఫీజు పోతుంది కదా! కాబట్టి బిడ్డ చదువును అరచేతిలో వయికుంఠం చూపినట్టు ఎదుగుదల అట్ట (ప్రోగ్రసు కార్డు) లో మార్కులు ‘ఎగేసి’ చూపిస్తారు. అవగాహన లేని తల్లిదండ్రులకు బిడ్డల మార్కులే కొలబద్ద. అవి ఎలా వస్తున్నాయి అనే సంగతి మీద చూపు నిలుపరు.


ప్రయివేటు బడుల్లో ప్రత్యేకించి ఇంగ్లీషు బడుల్లో చదివే పిల్లల ప్రోగ్రసు రిపోర్టులు చూస్తే అసలు ఫెయిలు అయ్యేవారే ఉండరు. సరి కదా! ముందు చెప్పినట్టు మార్కులు బాగా ‘తెప్పించి’ ఉంటారు. కాబట్టి మీ పిల్లలు ‘నిజ్జం’ ప్రతిభ ఉన్నవారా లేక ‘చూపెట్టిన’ ప్రతిభ కలవారా అనేది చూసుకోక పోతే ఆ తరువాత ఒక్కసారిగా బొక్క బోర్లా పడక తప్పదు.


విద్యా విధానంలో శాస్ర్తియ పద్ధతి లోపించినప్పుడు అశాస్ర్తియ పద్ధతి రాజ్యం ఏలుతుంది. అంటే అడ్డ దారుల్లోకి విద్యా విధానం కొట్టుకు పోతుంది. మన చెడు రాత ఏమిటంటే ఆ అడ్డ దారుల్లో ఉన్న దాన్ని సరి చేసి గాడిలో పెట్టు కోవాల్సింది పోయి అదే సరి అయినది అని ఒకరిని చూసి ఒకరు అనుకరిస్తూ అందరూ మూకుమ్మడిగా ఆ వయిపే నడుస్తున్నాం.


ఎప్పుడో చదవబోయే వృత్తి విద్యల వయిపు చూపు సారించి, పసితనం నుంచే పిల్లల జీవితాలతో ఆట మొదలు పెడుతున్నాం. ఊరిస్తున్న ఆదాయ మార్గాలు అయిన ‘కార్పోరేటు ఉద్యోగాలు’, ‘విదేశీ అవకాశాలు’, ‘సాఫ్టువేరు ఉద్యోగాల’ కోసం పిల్లల్ని బలిపీఠం మీదకు ఎక్కించాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాం. అందుకు తగ్గట్టు ఫీజు తీసుకొని బలిపీఠం మీదకు ఎక్కించేవే ఇంగ్లీషు మీడియం బడులు.


బోధనా ప్రమాణాలలో ఏ మాత్రం తేడా చూపకుండా బిడ్డల సొంత భాషలో చదువు చెప్పిన పిల్లలకు, అదే విద్యను పరాయి భాషలో చదువు చెప్పిన పిల్లలతో పోలిస్తే పరాయి భాషలో చదివిన పిల్లలు ఖచ్చితంగా వెనుకబడి ఉంటారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రతీ పరిశోధనలోనూ నిగ్గుతేల్చిన సత్యం ఇది. ప్రాథమిక స్థాయిలో ప్రయివేటు బడుల్లో అదే ప్రమాణాలతో సొంత భాషలో చదువు చెబితే పిల్లల్లో దాగి ఉన్న మొత్తం సామర్థ్యాన్ని వెలికితీయవచ్చు. సొంత భాషలో చదివిన పిల్లలు చదువులో మెరుగ్గా రాణించటమే కాకుం డా మాటకారితనం (కమ్యూనికేటివ్ స్కిల్స్), భావ ప్రకటన తోపాటు వ్యక్తిత్వం కూడా వికసిస్తుంది. ఈ పునాది పయిన ఎన్ని భాషలు అయినా అవలీలగా నేర్చుకుంటారు.

2 comments:





  1. 1,మనసంప్రదాయం ప్రకారం,విద్య వ్యాపారం కాదు.2.ప్రైవేటు విద్యలయాలు ఉన్నా ,కులంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం అల్పాదాయ విద్యార్థులందరికీ ఉచితవిద్యను సబ్సిడైజ్ చెయాలి. 3.మాతృభాష ఇంటర్ వరకు నిర్బంధం చెయ్యాలి.( ప్రైవేటు స్కూళ్ళతో సహా ) 4.ఉన్నతవిద్య మాత్రం ఇంగ్లిష్ లో బోధన తప్పదు.

    ReplyDelete
  2. అయ్యో రామా! మంచినీళ్లే వ్యాపారమయినప్పుడు, మంచి విద్య వ్యాపారంకాదా! ఉచితంగా విద్య,వైద్యం,న్యాయం ఇవ్వగలిగితేనే "సంక్షేమ రాజ్యం" . లేకుంటె "దొంగల రాజ్యమే".

    ReplyDelete