Sunday, December 9, 2012

ఇంగ్లీషు మీడియం చిదంబర రహస్యం - తొలి చదువులు -22

8-12-2012
                                                 www.andhrabhoomi.net/content/early-studies-2

గతంలో లేని విధంగా నేడు జనం తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల నుండి ప్రయివేటు బడులు వైపు, తెలుగు మీడియం నుండి ఇంగ్లీషు మీడియం వైపు మొగ్గు చూపటానికి గల కారణాలను వెతకాల్సి ఉంటుంది. దీనికి జనం అనుకొనేది ఏమిటి అంటే ప్రభుత్వ బడుల్లో చదువు సరిగా చెప్పరు అనీ, తెలుగులో చదివిన వారికంటే ఇంగ్లీషు మీడియం చదివిన పిల్లల విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అని.

నిజానికి ఇది కేవలం పైపైన కనిపించే మెరుగు మాత్రమే. దాని లోతుల్లోకి తొంగి చూస్తే ఈ అనిపింపు ఉత్త డొల్లే. లేనివి ఉన్నట్టు అనిపించే మాయ మాత్రమే. ప్రయివేటు బడుల్లో ప్రమాణాలు పెరిగినట్టు అనిపించ టానికి కారణం వారు ఇంగ్లీషు మీడియంలో చదవటం కాదు. అందుకు బయటకు కనిపించని కారణాలు వేరే ఉన్నాయి. అవి ఏమిటో కాస్త లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే తప్ప ఇంగ్లీషు మీడియం దౌర్భాగ్యం నుండి మనం బయట పడలేము.

సాధారణంగా అందరూ అనుకొనేది ఏమిటి అంటే పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేది కేవలం పాఠశాలో, బోధనా భాషో అనుకుంటారు. అంతకంటే పొరపాటు మరొకటి లేదు. నిజానికి పిల్లల ప్రతిభ బయటకు రావటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి.


ఇందులో మొదటిది విద్యార్థిలో ఇమిడి ఉండే చేవ. అంటే పిల్లలకు పుట్టుకతో వచ్చే తెలివి సామర్థ్యం, వారిలో ఉండే కల్పానికత (క్రియేటివిటీ), చురుకుదనం లేదా ఉత్సాహం, నేర్చుకునే తత్వం మొదలయినవి. రెండో అంశం కుటుంబం. అంటే తల్లిదండ్రులు విద్యా స్థాయి, చదువు పట్ల వారు చూపే మార్గదర్శకత్వం, పిల్లలపట్ల తీసుకునే జాగర్తలు, చదువుకోసం వారు కల్పించే వసతులు. అంటే పిల్లలకు కల్పించే మవులిక సదుపాయాలు. ఈ రెండింటి మీద ఆధారపడి మూడోది అయిన పాఠశాల విద్య ఉంటుంది. అంటే బోధనా మాధ్యమం, బోధించే పద్ధతులు, బోధనా ప్రణాళిక, ఉపాధ్యాయుల బోధనా తీరులు మొదలయినవి.

ఒక పాఠశాలలో చదివే పిల్లలు అందరికీ బోధనా మాధ్యమం, బోధించే పద్ధతులూ, ప్రణాళిక, పాఠం చెప్పే ఉపాధ్యాయుడు, వారు పాఠం చెప్పే తీరూ ఒకే రకంగా ఉంటుంది. ఇవి విద్యార్థికీ విద్యార్థికీ మారవు. అయినప్పటికీ, పిల్లలు అందరూ ఒకే స్థాయిలో ప్రతిభను చూపలేకపోతున్నారు అంటే అర్థం మిగతా రెండు కారణాలలోనే తేడా ఉండి తీరాలి. అవే తొలి రెండు కారణాలు అయిన విద్యార్థి సొంత సామర్థ్యం, వారి తల్లిదండ్రుల కుటుంబ నేపథ్యం. పిల్లవాడి చేవ, వారి తల్లిదండ్రులు అందించే మవులిక తోడ్పాటు పిల్లలు రాణించటానికి కారణం అనేది బయటకు కనిపించదు. ఇవి తెర వెనుక వాటి పాత్రను పోషిస్తాయి. కేవలం పాఠశాల స్థాయివల్లే బిడ్డకు ప్రతిభ అబ్బదు. ప్రతిభను వెలికి తీయటంలో పాఠశాల కూడా తన పాత్రను సరిగా పోషించాలి. కార్పోరేటు బడిలో చదివినంత మాత్రాన పిల్లల్లో ప్రతిభ వెలికిరాదు. ప్రభుత్వ బడిలో చదివిన వారికి ప్రతిభ లేకుండా పోదు. ‘‘విద్యార్థి - కుటుంబం - బడి’’ ఈ మూడు పరస్పర కదలికల (డైనమిక్సు)వల్లే పిల్లల్లో ప్రతిభ తన్నుకొని వస్తుంది.

బాగా చదువుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించటం, హోం వర్కులు చేయించటం, అర్థం కాని వాటిని అర్థం అయ్యేటట్టు విశదీకరించటం లాంటివి చేస్తారు. పిల్లల ఆసక్తి, అభిరుచులను గమనించి వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం పిల్లల్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాక పిల్లల మానసిక ఎదుగుదలకు అవసరం అయిన చదువేతర విజ్ఞానాన్ని అందించటంలో చదువుకొన్న తల్లిదండ్రులు ముందు ఉంటున్నారు. ఈ కారణాలవల్ల వాళ్ళ పిల్లలు బోధనా భాషతో సంబంధం లేకుండా స్వతహాగా రాణించటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి.

ఆర్థికంగా బాగా ఉన్నా, తల్లిదండ్రులు విద్యావంతులు కానప్పుడు, వారిపిల్లలు చదవుల్లో అంతగా రాణించటం లేదు అన్న నిజాన్ని కూడా గమనించాలి. వారు ధనవంతులు అయినప్పటికీ చదువుకోని తల్లిదండ్రులు తమ బిడ్డల్ని చదువు విషయంలో దారిచూపించలేరు. అయినప్పటికి వారి స్థాయికి తగ్గట్టు పిల్లలకు ట్యూషన్లు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ట్యూషన్లలో చెప్పేది బడిలో చెప్పే చదువుకు కొన సాగింపుగానే ఉంటుంది తప్ప విద్యావంతులు అయిన తల్లి దండ్రులు తీసుకొనే శ్రద్ధకు సాటి రాదు. అందు వల్లే ధనిక వర్గానికి చెందిన పిల్లలు కూడా చదువు లోకి వచ్చేసరికి మూడో వంతు పిల్లల వర్గం లోకి చేరు తున్నారు.

చదువు రాని తల్లి దండ్రులు అంతో ఇంతో చదువుకున్న పేద, దిగువ మధ్య తరగతి తల్లి దండ్రులు తమ పిల్లల్ని బాగా చదివించు కోవాలి అని తాహతుకు మించి స్కూళ్ళు అనబడే కార్పోరేటు బడుల్లో చేర్పిస్తున్నారు. కాని విద్యా వంతుల మాదిరి తమ బిడ్డలను ‘గైడ్’ చేయలేక పోతున్నారు. ఎంతో కొంత చదువుకున్నవాళ్ళు ఒకటి రెండు తరగతుల్లో కొంత చెప్ప గలిగినా ఆ తరువాత ఇంగ్లీషులో వాళ్ళ స్థాయి చాలదు కాబట్టి బిడ్డలకు బడిలో చెప్పిందే చదువు. బిడ్డ చదువులో రాణించటం లేదని ట్యూషన్లు ఏర్పాటు చేసినా ముందు చెప్పినట్లు అది బడి విద్యకు కొనసాగింపే కాని విద్యావంతులు అయిన తల్లి దండ్రులు తీసుకొనే శ్రద్ధకు ప్రత్యామ్నాయం కాదు.

ఈ కారణాల వల్ల ఇంగ్లీషు మీడియంలో చదివే పేద, దిగువ మధ్య తరగతి వర్గాల పిల్లలు చదువు కోని తల్లి దండ్రులు ఉన్న పిల్లలకు పాఠశాలలో చెప్పేది అర్థం కాక, ఇంట్లో చెప్పే వాళ్ళు లేక పోవటంతో వీళ్ళకు చదువు మొక్కుబడి తంతుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లలు స్వతహాగా తెలివిగల పిల్లలు అయితే ఆ తెలివిని అంతా బట్టీ పెట్టటానికి ఉపయోగించి ఎలాగో ఒకలా నెట్టు కొస్తారు. కానీ ఇంగ్లీషు మట్టుకు సరిగా ఒంట పట్టదు. బట్టీ పట్టటానికి కూడా సామర్థ్యం లేని పిల్లలు బడి అంటే విముఖత ఏర్పడి పక్కదార్లు పడుతారు లేదా చదువుకు నాగా పెట్టేస్తారు.


దిగువ మధ్య తరగతి, లేదా పేద ప్రజానీకం నివసించే ప్రాంతాలలో ఉన్న ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో కేజీ క్లాసుల్లో చేరిన పిల్లల్లో ఎంతమంది పదో తరగతి వరకూ వస్తారో గమనిస్తే ఆ సంగతి అట్టే తెల్లం అవుతుంది. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో ఇప్పుడు జరుగుతున్న తంతు ఇదే. అయితే అవేమీ బయటకు కనపడవు. మనకు కన పడేదల్లా ఎంసెట్టు, ఐ.ఐ.టిలలో ర్యాంకులు తెచ్చిన పిల్లలే. వీరు వందలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరిని చూపించి మిగతా పిల్లలకు వాతలు పెడుతుంటారు. 

No comments:

Post a Comment