20-10-2012
ఈ ప్రకృతిలో మనిషి కూడా ఒక జంతువే. అయినప్పటికీ జంతువులకి మనిషికి మధ్య స్పష్ట మయిన తేడా ఉంది. అదే ‘తెలివి’. జీవ పరిణామంలో మానవ జాతికి ప్రకృతి ప్రసాదించిన వరం తెలివి. ఈ తెలివి వల్లే ఇతర జంతువుల కంటే మనిషి ఎగువ మెట్టులో ఉన్నాడు. మనిషి తప్ప దాదాపు అన్ని జంతువులూ ప్రకృతి నిర్దేశించిన నియమాల ప్రకారం నడుచు కుంటాయి. మనిషి మాత్రమే ప్రకృతిని, ప్రకృతి సూత్రాలను తన జీవనానికి తగ్గట్టు మలుచు కోగలడు. అందుకు కారణం ఈ తెలివే. మనిషిని జంతువుల నుండి వేరు చేసింది ఇదే.
జంతువులు అన్నింటి లోకీ సాపేక్షంగా పాలిచ్చే జంతువుల తెలివి ఎక్కువ. వీటిల్లో కూడా మనిషి తెలివి మరీ ఎక్కువ. తెలివి మానవుడిలో ఎదిగినంతగా ఇతర మరే జంతువు ల్లోనూ జరగ లేదు. ఇప్పటి మన తెలివి ఈ రోజుకి ఈ రోజే వచ్చింది కాదు. సుమారు 5 లక్షల ఏళ్ళ నాడు మొదలు అయి, కాలాను గుణంగా సంపాదించుకున్న మార్పులను ఇముడ్చుకుంటూ అవన్నీ పోగుపడి ప్రస్తుత స్థితికి ఎదిగాము. మానవుడిలో పోగు పడిన తెలివిని ఇముడ్చు కొనేందుకు వీలుగా మెదడు కట్టుబడి లోనూ, పరిమాణం లోనూ, పని లోనూ మార్పులు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి.
మెదడు నాడీ కణాలతో కట్టి ఉంటుంది. ఈ నాడీ కణాలు అవి చేసే పనిని బట్టి రెండు రకాలుగా ఉంటాయి. పనిచేసే ‘అసలు’ నాడి కణాలు ఒక రకం కాగా రెండో రకం వాటికి ఊతను, పోషణను అందించే ‘గ్లియల్’ (బంక) నాడీ కణాలు. అసలు నాడీ కణాలను అతికించి ఉంచుతాయి కాబట్టి వాటికి అలా అంటారు.
మొత్తం మెదడు నాడీ కణాలలో పని చేయని గ్లియలు కణాలు 90 పాళ్ళు కాగా పని చేసే నాడీ కణాలు కేవలం 10 పాళ్ళే. ఒక మనిషిలో ఉండే ఈ 10 పాళ్ళ నాడీ కణాలను విడి విడిగా తీసి 121 కోట్ల భారతీయులు అందరికీ సమానంగా పంచితే ఒక్కొక్కరి చేతిలో 82 కణాలు పెట్టవచ్చు. అంటే వాటి మొత్తం సుమారుగా పది వేల కోట్లు.
పుట్టే నాటికి బిడ్డ మెదడులో ఎన్ని నాడీ కణాలు ఉంటాయో ఆ తర్వాత కూడా అనే్న కణాలు ఉంటాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ కణాల సంఖ్య పెరగదు. మరయితే పుట్టినప్పుడు చిన్నదిగా ఉన్న మెదడు వయసు వచ్చే కొద్దీ పెద్దదిగా ఎలా పెరుగుతుంది?
వయసు పెరిగేకొద్ది మనిషి పొందే అనుభవాలు మెదడులో నమోదు అవుతూ వుంటాయి. వ్యక్తి పొందే ప్రతీ అనుభవము నాడీ కణాలలో మేనుకంగా (ఫీజికల్) జ్ఞాపకపు ప్రొటీనులుగా మారుతాయి. అవి తరువాత మన జ్ఞాపకాలకు ‘బ్లూ ప్రింటు’లా పని చేస్తాయి. అనుభవం ఎంతగా పెరుగుతుంటే వాటి తాలూకు ప్రొటీనులు తయారీ కూడా అంతే మేరకు పెరుగుతాయి. నాడీ కణాలలో పేరుకు పోయే ప్రొటీనుల నిలువలు ఎక్కువ అయ్యే కొద్దీ నాడీ కణాలు ఉబి పరిమాణంలో పెరుగుతాయి. పరిమాణంలో పెరగటం తోపాటు వాటి మధ్య సమాచార మార్పిడి కోసం అనుసంధానపు తీగలను ఏర్పరచుకుంటాయి. ఒక పక్క నాడీ కణాల పరిమాణం పెరగటం, మరో పక్క వాటి మధ్య అను సంధానపు తీగలు ఏర్పడటం వల్ల మొత్తంగా మెదడు పరిమాణం పెరుగుతుంది.
మెదడు మేనుక ఎదుగుదలలో 90 శాతం మొదటి అయిదు ఏళ్ళలోపే జరుగుతుంది. 16 ఏళ్ళ వరకూ మిగిలింది జరిగి ఆగి పోతుంది. బిడ్డ ఎదుగుదలలో ఈ మొదటి అయిదు ఏళ్ళు అత్యంత కీలకం అయినవి. మెదడు ఎదుగుదల మేనుకంగా ఆగి పోయినా అవసరాన్ని బట్టి ఇతర కణాలతో సంబంధాన్ని అదుపు చేసుకోగల చేవ నాడీ కణాలుకు ఉంటుంది. అక్కర ఎక్కువ అయినప్పుడు సంబంధాలు పెంచుకోవటాన్ని ‘న్యూరోనల్ బ్రాంచింగ్’ (అంటే చిగురించటం) అని, తెంచుకోవటాన్ని ‘న్యూరోనల్ ప్రూనింగ్’ (అంటే కత్తిరించటం) అని అంటారు. మానవుడి మెదడులో నిరంతరం అవసరం మేరకు బ్రాంచింగులూ, ప్రూనింగులూ జరుగుతూనే ఉంటాయి. ఈ మొత్తం తతంగాన్ని వైద్య భాషలో ‘న్యూరో ప్లాస్టిసిటి’ అంటారు.
ఎదిగే పిల్లల నాడీ కణాలు అత్యంత వేగంగా, చురుగ్గా ‘బ్రాంచింగ్’ జరుపగల చేవను కలిగి ఉంటాయి. అయితే ఈ చేవ మొత్తం ఉపయోగం లోకి రావాలి అంటే అందుకు ‘అవసరం’ ఏర్పడాలి. అంటే పని ఉంటేనే నాడీ కణాల మధ్య ‘బ్రాంచింగ్’ బాగా జరుగుతుంది. అంటే పరిసరాల ప్రేరణలు ఉంటేనే మెదడు ఎదిగేది. పరిసరాల ప్రేరణలు అంటే బిడ్డ సమాజం నుండి పొందే అనుభవాలు. అందులో అర్థం అయ్యే చదువు కూడా ఒకటి.
No comments:
Post a Comment