Saturday, August 25, 2012

తెల్లోడి గేయాలు మన పిల్లలకు ఎలా తెలుస్తాయి? ; తొలి చదువులు - 7


                                                                                 25-8-2012

పిల్లల్లో మనసు, మేను, భాష ఎదుగుదలకు తోడ్పడాల్సిన ‘ముందు బడి’(Pre School or Nursery) కూడా పిల్లలను బట్టీ పెట్టించటానికి ముందస్తు (Pilot) కార్యక్రమంగా మారింది. అంటే ఎగువ తరగతుల్లో ఎలాగూ బట్టీ ద్వారానే కొనసాగాలి కాబట్టి ‘ముందు బడి’లో కూడా తరగతి గది, బోధన, హోం-వర్కులు, పరీక్షలు, ర్యాంకులు వచ్చి చేరి పోయాయి. కాకుంటే కాస్త తేలిగ్గా ఉంటాయి. అంటే మునుముందు పిల్లలు బట్టీ పెట్టటానికి కావాల్సిన ‘మనసు మూస’ను తయారు చేయటమే గురిగా ముందు బడి మారి పోయింది. 

తొలి చదువులను పరాయి (ఇంగ్లీషు) భాషలో చెప్పటం శాస్ర్తియం కాదని పరిశోధనలు అన్నీ కోడి అయ కూస్తున్నా, సంపన్న వర్గం, దాన్ని అనుసరించే నడిమి, దిగువ తరగతి వర్గాల దన్నుతో విద్యా వ్యవస్థ మొండిగా అటు వయిపే పోతున్నది. అశాస్ర్తియ పద్ధతిలో చదువు సాగినప్పుడు దాని వల్ల వచ్చే ఫలితాలు కూడా అశాస్ర్తియంగానే ఉంటాయ. కానీ బయటకు అలా కనపడటంలేదు. అంతా బాగున్నట్టు కనిపించే ఆ ఫలితాలలో ఉన్నది చాలావరకు డొల్లతనమే. బాగున్నట్టు కనిపించటానికి కారణం కూడా పిల్లల్లో ఉన్న బట్టీ పెట్టగల చేవ వల్లనే.
పిల్లల్లో మనసు, మేను, భాష ఎదుగుదలకు తోడ్పడాల్సిన ‘ముందు బడి’ కూడా పిల్లలను బట్టీ పెట్టించటానికి ‘పయిలెట్’ కార్యక్రమంగా మారింది. అంటే ఎగువ తరగతుల్లో ఎలాగూ బట్టీ ద్వారానే కొనసాగాలి కాబట్టి ‘ముందు బడి’లో కూడా తరగతి గది, బోధన, హోంవర్కులు, పరీక్షలు, ర్యాంకులు వచ్చి చేరిపోయాయి. కాకుంటే కాస్త తేలిగ్గా ఉంటాయి. అంటే మునుముందు పిల్లలు బట్టీ పెట్టటానికి కావాల్సిన ‘మనసు మూస’ను తయారుచేయటమే గురిగా ముందు బడి మారిపోయింది.
పిల్లలకు అనుకరణ శక్తి చాలా ఎక్కువ. మనం నేర్పిన ప్రతిదాన్ని అర్థం తెలియకపోయినా దాన్ని అలాగే తిరిగి ఒప్పచెబుతారు. ఈ సూత్రానే్న బట్టీవిద్యకు పునాదిగా ఉపయోగపడుతుంది. ఎలానో చూద్దాం.
పేరు ప్రఖ్యాతులు ఉన్న కార్పోరేటు బడుల్లో చదివే తెలివిగల పిల్లల్ని ‘‘హాట్‌క్రాస్ బన్స్’’ గేయాన్ని చెప్పమనండి. ఆ గేయం ఇలా ఉంటుంది. ‘‘హాట్ క్రాస్ బన్స్ / హాట్ క్రాస్ బన్స్ / వన్ ఏ పెన్ని /టూ ఏ పెన్ని/ హాట్‌క్రాస్ బన్స్’’. పిల్లలు చెప్పిన తరువాత ఈ గేయానికి అర్థం ఏమిటో వారిని అడగండి. దాదాపు చెప్పలేరు. ఎక్కువ మంది పిల్లలు అర్థం తెలియదని నేరుగా చెప్పరు. చెప్పమని మనం బలవంతం చేస్తే ముడుచుకుపోతారు. చెప్పలేకపోయినందుకు రెండోసారి మీరు పిలిస్తే మీ దగ్గరకు రారు.
‘‘హట్‌క్రాస్ బన్స్’’ గేయాన్ని పిల్లలు చెప్పటానికి అయితే గడ గడా చెప్పేస్తారు. ఈ గేయం పిల్లల చెవికి ఇంపుగా, లయగా ఉండే సవ్వడి మాత్రమే. దాన్ని అలాగే ఒప్పచెబుతారు. అందులోని పదాలకు అర్థాలు కానీ, వాటి మేనుక (్ఫజికల్) రూపాలు కానీ వాళ్ల మెదళ్లలో ఉండవు. ఎందుకంటే అందులోని సంగతులు మన పరిసరాలకు, సంస్కృతికి చెందినవి కావు. పిల్లల రోజువారీ జీవితంలో ఈ పదాలు ఎక్కడా తారసపడవు.
‘హాట్‌క్రాస్ బన్’ అంటే క్రయిస్తవులు ‘గుడ్‌ఫ్రైడే’ నాడు చేసుకొని తినే రొట్టె. పండగ ప్రత్యేకంగా దానిపైన శిలువ గుర్తు వేస్తారు. ఇంగ్లాండులో ‘గుడ్‌ఫ్రైడే’ సమయంలో వీధుల్లో అరచుకుంటూ రొట్టెల్ని అమ్ముకొనేవారిని నేపథ్యంగా తీసుకొని రాసిన గేయం ఇది. దీని భావం వివరించి చెబితే కాని మన పిల్లలకు అర్థం కాదు. ‘వన్ ఏ పెన్ని, టు ఏ పెన్ని’లలో ఈ ‘పెన్ని’ అనేది ఏమిటో చంటిబుర్రలకు ఎక్కదు. పెన్ని అనేది బ్రిటీషు వాళ్ళ నాణెం. దాని గురించి మన పిల్లలకు తెలియదు.
ఈ ‘హాట్‌క్రాస్ బన్స్’ గేయంలో ఉన్న ప్రతీ పదం బ్రిటీషు సమాజపు సంస్కృతినుండి, వాళ్ళ పిల్లల కోసం రాసింది. పేరుకి ఇంగ్లీషు గేయమే అయినా బహుశా ఇది అమెరికా పిల్లలకు కూడా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇది అమెరికా సంస్కృతికి కూడా సంబంధం లేనిది. అమెరికాలో బిడ్డలకు డాలర్లు, సెంట్లు అంటేనే తెలుసు. మన బిడ్డలకు రూపాయలు, పైసలంటేనే తెలుసు. కాబట్టి ఈ గేయంలో ఒక్క ముక్క కూడా పిల్లల బుర్రల్లో దూరే అవకాశమే లేదు. ఇదే పిల్లలకు ‘చుకు చుకు రైలు వస్తుంది’’ అడిగి చెప్పించుకోండి. ఆ గేయం ఇలా ఉంటుంది. ‘‘చుకు చుకు రైలూ వస్తుందీ / దూరం దూరం జరగండీ/ ఆగినాక ఎక్కండీ/ జోజో పాప ఏడవకూ / లడ్డూ మిఠాయి కొనిపెడతా/ కమ్మని పాలు తాగిస్తా’’. ఒకవేళ ఈ గేయం పిల్లలకు రాకపోతే మీరే లయబద్ధంగా, ఇంకా వీలు అయితే అభినయంతో పాడి వినిపించండి. వాళ్ళలో ఆసక్తినీ, ముఖంలో మార్పును గమనించండి. అలా నాలుగు అయిదు సార్లు చెప్పగానే ఇక వాళ్ళే తిరిగి చెప్పటం మొదలుపెడతారు. ఆ రకంగా అది పిల్లల నోళ్ళలో నానుతూ ఉంటుంది.
‘‘చుకు చుకు రైలు’’ గేయం తెలుగులో ఉంది. దానిలోని పదాలు అన్నీ పిల్లలకు తెలిసినవే. రైలు ఇంగ్లీషు పదం అయినా తెలుగు నుడికారంలో ఇమిడిపోయి ఉంది. దూరం - జరగటం- ఆగటం- ఎక్కటం- జోజో (అంటే జోకొట్టటం అని చెప్పకుండానే అర్థం అవుతుంది)- పాప- ఏడవటం.. ఈ పదాలు అన్ని పిల్లలకు మనం చెప్పకుండానే అర్థం అవుతాయి. ఆ పదాల మేనుక రూపాలు పిల్లల బుర్రల్లో ముందుగానే ముద్రపడి ఉంటాయి. అందువల్ల ఆ గేయాన్ని మొత్తంగా మనసులోకి తీసుకుంటారు. అలా తీసుకున్న వాటితోనే మనసు ఎదుగుతుంది.

Saturday, August 18, 2012

క్లాసులో ‘శిక్ష’ణ; తొలి చదువులు -6

                                                                           18-08-2012

పిల్లలు బడికి పోక ముందు ఇచ్చే శిక్షణను ‘నర్సరీ’లేదా ‘ముందు బడి’ (ప్రీ స్కూలు) విద్య అంటారు. చదువుకు ముందు పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల కోసం కలిపించే సామాజిక ఉమ్మడి కార్యక్రమాలు. చంటి పిల్లలు పాఠశాల బోధన కంటే తోటి పిల్లలతో ఆడుకోవటం, అనుకరించటం, మాట్లాడుకోవటం, బొమ్మలు గీసుకోవటం, ఆట వస్తువుల్ని తయారుచేయటం ద్వారా ఎక్కువ వికాసాన్ని పొందుతారు. ఈ కార్యక్రమాలకు ఒక పద్ధతి ప్రకారం చేయించే చోటునే ‘కిండరు గార్డెను’ అంటారు. వీటిని మనం ఎల్కేజీ, యూకేజీలని, రెండింటిని కలిపి కేజి క్లాసులని అంటాం.


మునుపటి రోజుల్లో అయితే మన సమాజానికి ముందుబడి శిక్షణ అవసరం ఉండేది కాదు. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకే ఇంట్లో చాలా మంది పిల్లలు ఉండేవారు. అలాంటి కుటుంబాలతో ఉండే లోగిళ్ళలో బోలెడు మంది పిల్లలు ఉంటారు. కాబట్టి ఏ వయసు పిల్లలు ఆ వయసు వారితో గుంపుగా ఆడుకోవటానికి వెసులుబాటు ఉండేది. భాష ఎదుగుదలకు, సామాజిక కట్టుబాట్లు నేర్చుకోవటానికి (మచ్చుకు ఆట నియమాలు) మానవ సంబంధాలు రూపు దిద్దుకో టానికి ఈ  గుంపు ప్రవర్తనే మూలం.


ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల తావులో చిన్న కుటుంబాలు వచ్చాయి. ఒక కుటుంబంలో ఒకరు ఇద్దరు పిల్లలకు పరిమితం కావటం, తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్థులు కావటం, పిల్లల్ని చూసుకోవటానికి పెద్ద దిక్కు లేక పోవటం, ఇరుగూ పొరుగు కుటుంబాలతో పెద్దగా సంబంధాలు లేక పోవటం లాంటి కారణాలవల్ల పిల్లలు ఆడుకో టానికి, ఇతరులతో కలిసి మెలగ టానికి అవకాశాలు తగ్గి పోయాయి. కాబట్టి ఇప్పుటి పిల్లలకు ఆ లోటు తీర్చటానికి ‘ముందు బడి’ విద్య అక్కర ఉంది.

పిల్లలను బడిలో వేయటానికి ముందు ఇచ్చే ఈ శిక్షణను సరి అయిన రీతిలో, సరి అయిన విధంగా ఇస్తే బిడ్డల ఎదుగుదలకు బాగా ఉపయోగ పడుతుంది. ఇద్దరూ ఉద్యోగం చేసే తల్లిదండ్రులుకు నర్సరీ విద్య కొంత ఊరటను ఇస్తుంది. అంతే కాకుండా పిల్లలు తరువాత బడికి పోవటానికి, చదువును మొదలు పెట్టటానికి ముందు బడి శిక్షణ బాగా ఉపయోగ పడుతుంది.
శాస్ర్తియంగా నడిచే నర్సరీలలో పిల్లలకు ఏమి నేర్పాలి. ఎలా నేర్పాలి, ఎందుకు నేర్పాలి అనే గీటులు, గోటులు ఆయా సమాజాల ప్రభుత్వాలు నిర్దేశిస్తాయి. ఏవో కొన్ని చిన్న తేడాలు తప్ప దాదాపు అన్ని దేశాలలో ముందు బడి శిక్షణలో పిల్లలకు ఇతరులతో మెలిగే విధానాన్ని, స్థానిక సమాజ నియమాలను, నీతిని తెలియ చెప్పటం. వారిలో వున్న తెలివి తేటలను, ఆలోచనా (సృజనాత్మకత) శక్తిని పెంచే కార్యక్రమాలు సిలబసుగా ఉంటుంది.

మన దేశానికి కూడా అలాంటి విధానమే ఒకటి ఉన్నది. పిల్లలకు నర్సరీ విద్యలో ఏయే అంశాలలో శిక్షణ ఇవ్వాలో చెప్పండని ప్రభుత్వం కొన్ని కమిటీలను వేసింది. వాళ్ళు దేశ దేశాలు తిరిగి, అవన్నీ పట్టుకు వచ్చి, వాటి అన్నింటిని కలిపి పెద్ద పుస్తకం తయారు చేసి ‘అలా, ఈ సంగతులు నేర్పండి’ అని చెప్పారు. అనేక అంశాలతో ప్రపంచంలోనే అతి పెద్ద ‘రాత రాజ్యాంగం’ మనకు ఉన్నట్టే, ప్రపంచంలో ఎవరికి లేనన్ని ముందుబడి ఉద్దేశాలను ప్రభుత్వం తయారు చేసింది. అంటే లిఖిత రాజ్యాంగం లాగా చంటి బిడ్డ కోసం లిఖిత ముందుబడి లక్ష్యాలు అన్నమాట. మన రాజ్యాంగం లాగే ఇవీ కూడా అమలుకు నోచుకోవు. రాజ్యాంగాన్ని అప్పుడప్పుడు కోర్టులు అయినా కనీసం గుర్తు చేస్తుంటాయి. వీటిని పట్టించుకొనేది ఎవరు?

నిర్వహణ తీరును బట్టి, నిర్వహించే యాజమాన్యాన్ని బట్టి వీటిని నర్సరీ స్కూళ్ళు, కిండరు గార్డెను, మాంటిసోరి, శిశు మందిరాలు, బాల మందిరాలు లాంటి పేర్లతో ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే ‘పిండిబడి’ కేంద్రాల (అంగనువాడీలు) కూడా ఇవే. ఇక్కడకు వచ్చిన పిల్లలకు తినటానికి మొక్క జొన్న పిండి పెడతారు కాబట్టి జనం వీటిని అలా పిలుచుకుంటారు. ఏ పేరుతో పిలిచినా ఇవి అన్నీ ముందు బడులే. వీటి గురి ఒకటే. బిడ్డని ఇంటిలో నుండి ఉమ్మడి కార్యక్రమం వైపు మళ్లించటం.
ముందు చెప్పినట్లు నర్సరీ చదువు చెప్పే బడి కాదు. ఇక్కడ చెప్పాల్సింది చదువు కాదు. నమూనా తరగతి పద్ధతిని ఇక్కడ పాటించ కూడదు. మూస పోసినట్టు ఉండే సిలబసు అంటూ ఏమీ ఉండదు. ఇది చదవటం, రాయటం, లెక్కలు నేర్పించే కార్యక్రమం కాదు. పరీక్షలు పెట్టటం, మార్కులు ఇచ్చే కార్యక్రమం కాదు. యాంత్రికంగా చెప్పినదల్లా విని బట్టీ పెట్టి నేర్చుకొనే విధానం అంత కంటే కాదు. విధేయతనూ, కఠోర క్రమ శిక్షణనూ ఆశించే విధానంగా ఉండదు.

మొత్తం కార్యక్రమాలన్నీ విద్యార్థి కేంద్రంగా ఉండేటట్లు ముందు బడి పని చేయాలి. పిల్లల వికాసానికి తోడ్పడేటట్లుగా కార్యక్రమాలుం ఉండాలి. సొంత భాష ఎదగనీయటం, సామాజిక నియమాలు తెలియ జేయటం, ఉమ్మడి పనులను అలవాటు చేయటం, వయసుకు లోబడి సమస్యలకు పరిష్కారాలను కనుగొనటాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ విద్యలో అరవటము, తిట్టటము, కొట్టటం లాంటి నేరుగా మందలించే పద్ధతులకు బదులు పరోక్ష నియంత్రణ ఉంటుంది.

కిండరు గార్డెనులో టీచర్లు పిల్లల పనులను పర్యవేక్షించాలే తప్ప తరగతిలో చెప్పినట్టు బోధన ఉండకూడదు. ఈ రెండేళ్ళలో పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే ఆటలు ఆడించడం, ఇతరులతో మెలగాల్సిన పద్ధతుల్ని నేర్పించటం, క్రమశిక్షణను, సహ జీవనాన్ని అలవాటు చేయటం లాంటి విషయాలలో శిక్షణ ఇవ్వాలి. ఈ శిక్షణ కూడా కథలూ, ఆటలూ, లయబద్ధంగా ఉండే పాటలు, బొమ్మలు ద్వారా, కార్యక్రమాల (యాక్టివిటీ) ద్వారా నేర్పించాలి.

భాషకు సంబంధించిన అంత వరకు కిండరు గార్డెను పూర్తయ్యే లోపల స్వంత భాషను ధారాళంగా మాట్లాడ గలగటం (రాయటం, చదవటం కాదు), పదాలను సరిగ్గా తప్పులు లేకుండా పలక గలగాలి. వారు ఉపయోగించే ప్రతి మాటకు అర్థం తెలియాలి. ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయాలు తెలియాలి.

తమాషా ఏమిటంటే మన దేశంలో తప్ప పాశ్చాత్య దేశాలలో కానీ, అభివృద్ధి చెందిన ఇతర దేశాలలో కాని ఈ రోజుకీ కేజి పిల్లలకు చదవటం, రాయటం నేర్పించరు. కానీ మన పరిస్థితి ఏమిటీ? పైన చెప్పినట్టు మనం ఏ కాన్వెంటు బడిలో  అయినా చూడగలమా? కేజీ క్లాసుల్లో కేజీల కొద్ది పుస్తకాలు ఏమిటీ? పరీక్షల పేరుతో శిక్షలు ఏమిటి? ఎల్కేజీలోనే మొత్తం ఇంగ్లీషు, లెక్కలూ, సైన్సు, సోషలు నేర్పించాలని తొందర. అంతటితో ఆగకుండా ఇంటి దగ్గర కూడా ఆడు కోనివ్వకుండా మళ్ళీ హోం వర్కులు. అదేమంటే ఉత్తమ శిక్షణ అలాగే ఉంటుందని వివరణ. భలే దేశం! భలే చదువులు కదూ?

Saturday, August 11, 2012

చదువు అంటే ఏమిటి?; తొలి చదువులు -5


                                                                         11-08-2012

కారణాలు ఏవి అయినా బిడ్డల చదువు పట్ల ఈనాటి తల్లిదండ్రుల ఆలోచనలు గొర్రె దాటు పద్ధతిలోనే ఉంటున్నాయి. వారి ఆలోచనలు, చర్యలు బిడ్డల నిజమయిన ఎదుగుదల వయిపు కాకుండా, రాబోయే కాలంలో చేయబోయే ‘ఉద్యోగం’ చుట్టూ అల్లుకొని ఉంటున్నాయి. ఉన్నత ఉద్యోగాలు అంది పుచ్చు కోవటంలో తమ పిల్లలు ముందు ఉండాలనే కోరిక తెలియకుండానే తల్లిదండ్రుల పయిన  పని చేస్తుంది. అందుకు తగ్గట్టు పిల్లలను మలచటంలో భాగంగా బిడ్డలు మనిషిగా ఎదగ టానికి ఉన్న దారులు అన్నీ మూసేసి, కేవలం చదువు దారి లోకే తోలు తున్నారు.

శాస్ర్తియంగా పిల్లలకు అయిదు ఏళ్ళు  నిండి ఆరో ఏడు వస్తేనే చదువు నేర్పాలి. జాతి, రంగు, ఉండే చోటుతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం అంగీకరించి పాటిస్తున్న నిజం ఇది. కానీ మన సమాజంలో నడిమి, ఎగువ తరగతి తల్లి దండ్రులు బిడ్డకు ఈ వయసు వచ్చే వరకు ఆగి బడిలో వేయటానికి సిద్ధంగా లేరు. అందుకు కారణం తమ బిడ్డలు వెనుక పడి పోతారేమో అన్న ఆందోళన. తల్లి దండ్రుల్లో ఉన్నఆందోళనను సొమ్ము చేసు కోవటానికి పుట్టిన చదువులే ఎల్కేజి, యూకేజీలు. ఇప్పుడు ఆ పాకం ఇంకాస్త ముదిరి వాటికి ముందు ప్రీ కేజీ కూడా వచ్చి చేరింది. రాబోయే కొన్ని ఏళ్ళలో  ప్రీ కేజీ కంటే ముందు నడకను, నవ్వులను కూడా ఇంగ్లీషులో నేర్పించే ‘పావు కేజీ’ లాంటి కోర్సులు ఒస్తే పాల బుగ్గలు ఆరక ముందే ఆ కోర్సులకు పంపినా అబ్బుర పడాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ ధోరణులు దిగువ, పేద వర్గాలకు కూడా పాకుతున్నాయి.


తెలిసి చేసినా, తెలియక చేసినా, పక్కవారిని చూసి చేసినా, లోకం పోకడను బట్టి చేసినా పిల్లలకు బంగారు బాటలు వేస్తున్నాము అనే పేరు మీద వారి సహజత్వాన్ని, సామర్థ్యాన్ని, స్వేచ్ఛను అణగ తొక్కటమే ఇప్పుడు ప్రయివేటు బడుల్లో, అందునా ఇంగ్లీషు మీడియపు బడుల్లో జరుగుతున్న తంతు. చదువులో చోటు చేసుకుంటున్న నేటి పెడ ధోరణుల పట్ల తల్లి దండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలి అంటే బిడ్డల మెదడు, మనసు, వ్యక్తిత్వం ఎలా ఎదుగుతాయో అన్న సంగతులు తెలియాలి. అందులో చదువు పాత్ర ఏమిటో వారికి తెలియాలి. బిడ్డ నిండు మనిషిగా ఎదగటానికి తల్లి దండ్రులు సమకూర్చాల్సిన సదుపాయాలన గురించి కొంత అవగాహన ఉండాలి. అది తెలిస్తే కానీ అప్రయత్నంగా (డిఫాల్టు) మనసుల్లో నాటుకు పోయిన పొరపాటు ధోరణులను వదిలి సరి అయిన దారి లోకి రాలేరు.

ప్రకృతిలో ఉన్న జంతువులు ఏవీ వాటి పిల్లలకు విద్యను నేర్పించవు. ఎగువ మట్టులో ఉండే కొన్ని జాతుల్లో పెద్ద జంతువులు వేటాడే తీరుని చూసి అనుకరించటం ద్వారా పిల్ల జంతువులు నేర్చుకుంటాయి. అంతేకాని ‘అలా చేయ కూడదు, ఇలా చెయ్యి’ అనే పద్దతుల్లో ఉండదు. కేవలం మానవ జాతి మట్టుకే తన సంతతికి ‘నేర్పించే’ విద్యను అందించ గలదు. ఆది మానవుడి నుండి ఆధునిక మానవుని వరకు సమ కాలీన సామాజిక నియమాలను, కట్టుబాట్లు, వృత్తి విద్యను వారసత్వంగా నేర్పించటం ఆనవాయితీగా వస్తున్నదే. దానికి ఆధునిక కొనసాగింపే ఇపుడు పిల్లలకు మనం అందించే చదువు.


నేటి సామాజిక జీవన తీరులో, సాంస్కృతిక, సాంకేతిక రంగాలలో వచ్చిన మార్పుల నేపథ్యంలో చదువు నిర్వచనం కొద్దిగా మారింది. ‘బిడ్డకు జీవ- భౌతిక పరిసరాల గురించి, సామాజిక జ్ఞానాన్ని ఒక పథకం ప్రకారం పద్ధతిగా బిడ్డకు నేర్పించటమే’ చదువు. పథకం ప్రకారం, పద్ధతి ప్రకారం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే చదువుకోని బిడ్డకి కూడా సామాజిక జ్ఞానం అబ్బుతుంది కానీ ఆ అబ్బే జ్ఞానం పని కట్టుకొని ఒకరు నేర్పిందికాదు. అలాగే ఒక పద్ధతి ప్రకారం నేర్చుకున్నది కాదు. సమాజంతో మమేకం అయి చూడటం, వినటం, పరికించటం ద్వారా సొంత అనుభవాలతో నేర్చుకున్నది. ఈ విద్యను సమాజం నేర్పుతుంది. చదువు లేని వారికి సమాజమే ఓ పెద్ద బడి.


అయితే చదువు ద్వారా జ్ఞానాన్ని పొందే బిడ్డకు అదనంగా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. అంతకు ముందు చూడటం, వినటం వల్లనే తెలుసుకొనే వారు అక్షరాలు నేర్వటం వల్ల ‘చదవటం’ ద్వారా కూడా విజ్ఞానాన్నిపొందటం. అలాగే తెలిసిన దాన్ని నోటితో చెప్పటానికి తోడు ఇపుడు ‘రాయటం’ ద్వారా తెలియ పరచటం. నేర్పించటానికి గురువులు ఉండటం, నేర్పించే చదువును ఒక వరుసలో (కరికులం) అంచెలు అంచెలుగా నేర్పించటం నేటి చదువులకు ఉండే మరో వెసులుబాటు చెప్పే భాష, చెప్పే సంగతుల్లో తేడా ఉన్నప్పటికీ చదువు మొదలు అయిన అప్పటి నుంచి పూర్తయ్యే వరుస ఇలా ఉంటుంది. 
  1. ఆటబడి 
  2. తొలిబడి 
  3. ఎగువబడి 
  4. రెండో ఎగువ బడి (హైయ్యరు సెకండరి)
  5. డిగ్రీ (వృత్తి విద్యలతో కలిపి) 
  6. విశ్వవిద్యాలయ స్థాయి.
వీటిలో ఆయా స్థాయిల్లో నేర్చుకో వాల్సిన సంగతులు ఉంటాయి. ఇందులో బిడ్డ ముందు జీవితానికి బాటలు వేసేది, ఎదుగుదలకు వేళ్ళు ఊనుకొనేది తొలి బడి చదువులో. దానికి ముందు (చదువు కాక పోయినా చదువులాగా మనం పాటిస్తున్న) నర్సరీ విద్య. ఈ రెండు స్థాయిల్లో బిడ్డలకు నేర్పించే అంశాలు, నేర్పించే తీరు తెన్నులు ఎలా ఉంటుందో? అనే దానితో పాటు ఇప్పుడు ఎలా ఉన్నాయో పరికించి చూస్తే మన పిల్లల చదువులు ఎంత దరిద్రంగా ఉన్నాయో తెలుస్తుంది.

Saturday, August 4, 2012

'బట్టి' విక్ర 'మార్కులు'; తొలి చదువులు -4


04-08-2012

చదువు అర్థం కానప్పుడు బట్టీ సాధనం అవుతుంది. ఇంగ్లీషు మీడియం బడుల్లో భాష మీద పట్టు రాకమునుపే ఆ భాషలో చదువు చెప్పటం వల్ల అర్థం కాదు. అర్థంకాని చదువుతో మార్కులు తెచ్చుకోవాలి అంటే పిల్లలకు బట్టీనే దారి. అర్థం చేసుకుని చదివితే అరగంటలో అయ్యే పాఠానికి బట్టీ పెట్టటం కోసం కొన్ని గంటలు కుస్తీ పడాలి. పైగా బట్టీ పెట్టింది ఎక్కువ కాలం గుర్తుండదు కనుక మళ్ళీ మళ్ళీ దాన్ని తిరగతోడుతూ ఉండాలి ఇందువల్ల చదువుకోసం మామూలుగా వెచ్చించాల్సిన సమయం కంటే అదనపు సమయం కావాలి. దీనితో బుద్ధి వికాసానికి, వ్యక్తిత్వ ఎదుగుదలకు ఉపయోగపడే చదువేతర కార్యక్రమాలకు కోత పడుతుంది. ఇందువల్ల పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోయే నైపుణ్యాలు ఈ తరం పిల్లల్లో పెంపొందటం లేదు. 

కొంతమందిలో పెంపొందినా బడితో సంబంధం లేకుండా వారి తల్లిదండ్రులు తీసుకున్న అదనపు జాగ్రత్తలవల్ల అయి ఉంటుంది. మార్కులతో సంబంధం లేని ఇలాంటి నైపుణ్యాలను నేర్పే తీరికా, అవసరమూ ప్రస్తుత బడులకు లేదు. మార్కులు వస్తున్నాయా లేదా అన్నదే వారికి గీటురాయి. దీంతో బిడ్డలు ఎదిగాక, జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఎదుర్కొనే చేవలేనివారుగా, సామాజిక చైతన్యం లేని చచ్చు తరంగా తయారు  అవుతున్నారు. అందుకనే పాతికేళ్ళకు మునుపు కనీ వినీ ఎరగని ‘‘చదువు ఒత్తిడి’’ అనే గుదిబండ ఇపుడు పిల్లల మెడలో వేలాడుతోంది. 21-టో నూరేడు తొలి అంకం నుంచి పిల్లల్లో మానసిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయని సర్వేలు తెలుపుతున్నాయి. ఇందుకు కారణం చదువూ, దానికి సంబంధించిన ఒత్తిడి. ‘‘విద్యా విధానంలో, బోధనా పద్ధతి, బోధనా భాషలో వచ్చిన మార్పులు పిల్లల్లో ఎక్కువ ఒత్తిడికి కారణం’’ అని శాస్ర్తియ పరికింతలు తెలుపుతున్నాయి.

అసలే మనం ఒత్తిడి యుగంలో ఉన్నాం. అంటే సమాజం మొత్తంమీద ఒత్తిడి ఉంటుంది. సమాజం మీద పడే ఒత్తిడి పిల్లల మీదకు కూడా జారుతుంది. దీనికితోడు గోరుచుట్టు మీద రోకటి పోటులా చదువు ఒత్తిడి అదనంగా వచ్చి చేరటంవల్ల దాని ప్రభావం వారిలో రెట్టింపు అవుతుంది. ఒత్తిడి ఎదుర్కొనే మెళకువలు కానీ, దాని నుండి బయటపడే ఉపశమన పద్ధతులు కాని పసిబిడ్డల్లో అపుడే ఏర్పడి ఉండవు. కాబట్టి వాళ్ళకు వాళ్ళుగా ఒత్తిడి నుండి బయటపడలేరు. ఒత్తిడి ప్రభావం పిల్లల మీద రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పిల్లలు తాము ఒత్తిడికి గురవుతున్నాము అన్న సంగతిని గుర్తించలేరు, కానీ దానివల్ల కలిగే భయం, ఆందోళనల్ని అనుభవిస్తూ ఉంటారు. అయినా దాన్ని బయటికి చెప్పలేరు. రెండోది, పిల్లలు ఎంత తెలివిగలవాళ్ళు అయినప్పటికీ, ఒత్తిడిలో ఉంటే అది నేర్చుకొనేదారికి అడ్డుగా నిలుస్తుంది. అందువల్ల చదువు మందగిస్తుంది. దీనివల్ల తెలివి ఉన్నా పిల్లల్లో చదువు అంటే ఆసక్తి కోల్పోయి, మరతనం (మెకానికల్) చోటుచేసుకుంటుంది. ఫలితంగా బిడ్డలో దాగి వున్న ప్రతిభ విరబూయటం మందగిస్తుంది. కొందరు అయితే చదువు పట్ల వ్యతిరేకత ఏర్పరుచుకొని పక్కదారులు పట్టే అవకాశం ఉంది. అందుకే పిల్లల్ని ఒత్తిడికి దూరంగా ఉంచాలి. ఒత్తిడిలేని చదువుని మనం బిడ్డలకు అందించాలి. కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏమిటి? తగిన వయస్సు రాకముందే, భాష రాక మునుపే పరాయి భాషలో చదువును నాటడానికి ప్రయత్నించటంవల్ల అసలు ఎదుగుదలే మందగిస్తోంది. 

సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని బోధనా పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీనివల్ల పిల్లలకు పాఠాలు సులభంగా అర్థం అవుతాయి. గతంలో ఎగువ తరగతుల్లో కానీ అర్థం అయ్యే పాఠాలను నేడు దిగువ తరగతి పిల్లలు సయితం బాగా అర్థం చేసుకోగలిగిన పరిస్థితి ఉంది. పరమాణు నిర్మాణం, జెనెటిక్సు లాంటి అతి కష్టమయిన అంశాలను కూడా 5దో తరగతి పిల్లలకు అలవోకగా అర్థం అయ్యేలా చెప్పే బోధనా ఉపకరణలు ఇపుడు వాడుతున్నాము. అలాంటప్పుడు చదువు చాలా సుళువు కావాలి, విద్యా ప్రమాణాలు పెరగాలి, నాణ్యత పెరగాలి. ఆ మేరకు చదువు కోసం కేటాయించాల్సిన సమయం తగ్గాలి, బట్టీ విధానానికి ముగింపు పలకాలి. కానీ నిజానికి జరుగుతున్నది ఏమిటి? చదువు గంటలు పెరిగాయి. ఎందుకు పెరిగాయి? బట్టీ ఎందుకు పెట్టాలి? చదువు అర్థం కాక! ఎందుకు అర్థంకావటంలేదూ? ఇంగ్లీషు సరిగా రాక! ఇంగ్లీషు మీడియంలో చదివినా ఇంగ్లీషు ఎందుకు రావటం లేదూ? సొంత భాష ఎదగకముందే, రాని భాషలో మొదలుపెట్టటంవల్ల. ఒక మొక్క ఎదిగేటపుడు దాని పక్క మరో మొక్క ఉంటే కావాల్సిన మొక్క సరిగా ఎదగదు. కాబట్టే రైతు ‘కలుపు’తీస్తాడు. లేత వయసులో ఎదగాల్సిన భాషను వదిలి కలుపు భాష పెరగటానికి ఎరువులు వేస్తున్నాము. ఇందువల్ల ఏ భాషా సరిగా ఎదగదు. భాష మీద పట్టు లేకపోతే చదువు మీద పట్టురాదు. చదువుమీద పట్టు వచ్చినట్టు అనిపించాలి అంటే ఉన్న ఒకే ఒక అడ్డదారి బట్టీ. బట్టీకోసం ఎక్కువ కష్టపడాలి. బట్టీకోసం ఎక్కువ సమయం కావాలి. 
కాబట్టే పిల్లలు ‘బట్టి’కొట్టి ‘మార్కులు’ తెచ్చే బట్టివిక్రమార్కుల అవతారం ఎత్తుతున్నారు. అర్థం కాని చదువు శవాన్ని పదే పదే మెదడులోకి దించటానికి ప్రయత్నించటం. దిగిన వెంటనే అది మెదడులోనుండి మాయం కావటం. ఏడాది పొడుగునా పిల్లలకు ఈ జంజాటానికే సమయంచాలటం లేదు. ఇక మనిషిగా ఎదగటానికి సమయం ఎక్కడ?

Friday, August 3, 2012

తేట తెలుగు మాటలు



తేట తెలుగు మాటలను వాడదగిన చోట కూడా సంస్కృత సమములను వాడడం మన పండితులు, కవులు, రచయితల అలవాటు చేశారు. ఇందువల్ల చక్కని తెలుగు మాటల్ని వాడుకలోంచి మెల్లమెల్లగా పోగొట్టుకొంటున్నాం. ఉదాహరణకు కొన్ని మాటల్ని ఇక్కడ చూడండి.


సంస్కృతసమం              తేటతెలుగు

అసహ్యం         ..........          ఈసడింపు

సామూహికం    ..........          ఉమ్మడి
 
జన్మస్థలం       ........             పుట్టిన ఊరు

నిష్క్రమించు     .......             తొలగు

శతాబ్దం            .......             నూరేడు

ధ్యేయం            .......            ఉల్లనం

సందిగ్ధం            .......            ఊగిసలాట

నవ్యధోరణులు     .......          కొత్తపుంతలు

మార్గం             .......            దారి

ప్రభువు           .......             ఏలిక

అంగీకారం,       .......             సమ్మతి, ఒప్పుకోలు

ఉద్యమం          .......            కదలింపు

యత్నించు        .......           కడంగు, పూనుకొను

గళం                .......           గొంతు

నాళిక             .......            గొట్టము

సమూహం/
బృందం,            .......          గుంపు

లక్ష్యం               .......         గురి

స్థాయి, స్థితి       ........         మట్టు (మట్టు మర్యాద status and respect )

పరిస్థితి                ......        పరిమట్టు

ఉన్నతస్థాయి,      .......        పయి మట్టు, ఎగువ మట్టు,

శక్తి, దారుఢ్యం      .......         పస, చేవ

ఉత్సవం            ........         పండుగ

బ్రహ్మోత్చావం                    తిరునాళ్ళు

ప్రామాణికం       ........          పాడి (పదుగురాడు మాట 'పాడి'అయి ధరజెల్లు...) 
                                        పడి (తూకం లో వాడే 'పడి' కట్టు, మాటల్లో వాడే  'పడి' కట్టు పదాలు  )

పూజ                 .......         కొలుపు, 

దేవాలయం        ........          గుడి 

విద్యాలయం       .........       బడి 

నివాసం, స్థానం         ........ నెలవు

ఉదాహరణ               ..... ... మచ్చు

అధికం, బహు           .. ...... పెక్కు


ఉపాధ్యాయుడు         .  .....  వాతేరు

మనసు                 ...  ......  ఉల్లము

ఆలోచన              .....   ...    తలపోత  ఎన్నం

దృష్టి                    .....    ..    చూపు 

కరదీపిక             .....    ....    చేతిక

విషయం      .............            సంగతి

సంక్షిప్త   ...................           పొట్టి

విస్తృత అధ్యయనం....    .     లోతుచదువు

సమగ్ర అధ్యయనం ......   ... విరివి చదువు


 ....................................  ఇంకా మీకు తోచిన  తెలుగు  పలుకులను కొన్నింటిని తలపోయండి