11-08-2012
కారణాలు ఏవి అయినా బిడ్డల చదువు పట్ల ఈనాటి తల్లిదండ్రుల ఆలోచనలు గొర్రె దాటు పద్ధతిలోనే ఉంటున్నాయి. వారి ఆలోచనలు, చర్యలు బిడ్డల నిజమయిన ఎదుగుదల వయిపు కాకుండా, రాబోయే కాలంలో చేయబోయే ‘ఉద్యోగం’ చుట్టూ అల్లుకొని ఉంటున్నాయి. ఉన్నత ఉద్యోగాలు అంది పుచ్చు కోవటంలో తమ పిల్లలు ముందు ఉండాలనే కోరిక తెలియకుండానే తల్లిదండ్రుల పయిన పని చేస్తుంది. అందుకు తగ్గట్టు పిల్లలను మలచటంలో భాగంగా బిడ్డలు మనిషిగా ఎదగ టానికి ఉన్న దారులు అన్నీ మూసేసి, కేవలం చదువు దారి లోకే తోలు తున్నారు.
శాస్ర్తియంగా పిల్లలకు అయిదు ఏళ్ళు నిండి ఆరో ఏడు వస్తేనే చదువు నేర్పాలి. జాతి, రంగు, ఉండే చోటుతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం అంగీకరించి పాటిస్తున్న నిజం ఇది. కానీ మన సమాజంలో నడిమి, ఎగువ తరగతి తల్లి దండ్రులు బిడ్డకు ఈ వయసు వచ్చే వరకు ఆగి బడిలో వేయటానికి సిద్ధంగా లేరు. అందుకు కారణం తమ బిడ్డలు వెనుక పడి పోతారేమో అన్న ఆందోళన. తల్లి దండ్రుల్లో ఉన్నఆందోళనను సొమ్ము చేసు కోవటానికి పుట్టిన చదువులే ఎల్కేజి, యూకేజీలు. ఇప్పుడు ఆ పాకం ఇంకాస్త ముదిరి వాటికి ముందు ప్రీ కేజీ కూడా వచ్చి చేరింది. రాబోయే కొన్ని ఏళ్ళలో ప్రీ కేజీ కంటే ముందు నడకను, నవ్వులను కూడా ఇంగ్లీషులో నేర్పించే ‘పావు కేజీ’ లాంటి కోర్సులు ఒస్తే పాల బుగ్గలు ఆరక ముందే ఆ కోర్సులకు పంపినా అబ్బుర పడాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ ధోరణులు దిగువ, పేద వర్గాలకు కూడా పాకుతున్నాయి.
తెలిసి చేసినా, తెలియక చేసినా, పక్కవారిని చూసి చేసినా, లోకం పోకడను బట్టి చేసినా పిల్లలకు బంగారు బాటలు వేస్తున్నాము అనే పేరు మీద వారి సహజత్వాన్ని, సామర్థ్యాన్ని, స్వేచ్ఛను అణగ తొక్కటమే ఇప్పుడు ప్రయివేటు బడుల్లో, అందునా ఇంగ్లీషు మీడియపు బడుల్లో జరుగుతున్న తంతు. చదువులో చోటు చేసుకుంటున్న నేటి పెడ ధోరణుల పట్ల తల్లి దండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలి అంటే బిడ్డల మెదడు, మనసు, వ్యక్తిత్వం ఎలా ఎదుగుతాయో అన్న సంగతులు తెలియాలి. అందులో చదువు పాత్ర ఏమిటో వారికి తెలియాలి. బిడ్డ నిండు మనిషిగా ఎదగటానికి తల్లి దండ్రులు సమకూర్చాల్సిన సదుపాయాలన గురించి కొంత అవగాహన ఉండాలి. అది తెలిస్తే కానీ అప్రయత్నంగా (డిఫాల్టు) మనసుల్లో నాటుకు పోయిన పొరపాటు ధోరణులను వదిలి సరి అయిన దారి లోకి రాలేరు.
ప్రకృతిలో ఉన్న జంతువులు ఏవీ వాటి పిల్లలకు విద్యను నేర్పించవు. ఎగువ మట్టులో ఉండే కొన్ని జాతుల్లో పెద్ద జంతువులు వేటాడే తీరుని చూసి అనుకరించటం ద్వారా పిల్ల జంతువులు నేర్చుకుంటాయి. అంతేకాని ‘అలా చేయ కూడదు, ఇలా చెయ్యి’ అనే పద్దతుల్లో ఉండదు. కేవలం మానవ జాతి మట్టుకే తన సంతతికి ‘నేర్పించే’ విద్యను అందించ గలదు. ఆది మానవుడి నుండి ఆధునిక మానవుని వరకు సమ కాలీన సామాజిక నియమాలను, కట్టుబాట్లు, వృత్తి విద్యను వారసత్వంగా నేర్పించటం ఆనవాయితీగా వస్తున్నదే. దానికి ఆధునిక కొనసాగింపే ఇపుడు పిల్లలకు మనం అందించే చదువు.
నేటి సామాజిక జీవన తీరులో, సాంస్కృతిక, సాంకేతిక రంగాలలో వచ్చిన మార్పుల నేపథ్యంలో చదువు నిర్వచనం కొద్దిగా మారింది. ‘బిడ్డకు జీవ- భౌతిక పరిసరాల గురించి, సామాజిక జ్ఞానాన్ని ఒక పథకం ప్రకారం పద్ధతిగా బిడ్డకు నేర్పించటమే’ చదువు. పథకం ప్రకారం, పద్ధతి ప్రకారం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే చదువుకోని బిడ్డకి కూడా సామాజిక జ్ఞానం అబ్బుతుంది కానీ ఆ అబ్బే జ్ఞానం పని కట్టుకొని ఒకరు నేర్పిందికాదు. అలాగే ఒక పద్ధతి ప్రకారం నేర్చుకున్నది కాదు. సమాజంతో మమేకం అయి చూడటం, వినటం, పరికించటం ద్వారా సొంత అనుభవాలతో నేర్చుకున్నది. ఈ విద్యను సమాజం నేర్పుతుంది. చదువు లేని వారికి సమాజమే ఓ పెద్ద బడి.
అయితే చదువు ద్వారా జ్ఞానాన్ని పొందే బిడ్డకు అదనంగా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. అంతకు ముందు చూడటం, వినటం వల్లనే తెలుసుకొనే వారు అక్షరాలు నేర్వటం వల్ల ‘చదవటం’ ద్వారా కూడా విజ్ఞానాన్నిపొందటం. అలాగే తెలిసిన దాన్ని నోటితో చెప్పటానికి తోడు ఇపుడు ‘రాయటం’ ద్వారా తెలియ పరచటం. నేర్పించటానికి గురువులు ఉండటం, నేర్పించే చదువును ఒక వరుసలో (కరికులం) అంచెలు అంచెలుగా నేర్పించటం నేటి చదువులకు ఉండే మరో వెసులుబాటు చెప్పే భాష, చెప్పే సంగతుల్లో తేడా ఉన్నప్పటికీ చదువు మొదలు అయిన అప్పటి నుంచి పూర్తయ్యే వరుస ఇలా ఉంటుంది.
- ఆటబడి
- తొలిబడి
- ఎగువబడి
- రెండో ఎగువ బడి (హైయ్యరు సెకండరి)
- డిగ్రీ (వృత్తి విద్యలతో కలిపి)
- విశ్వవిద్యాలయ స్థాయి.
వీటిలో ఆయా స్థాయిల్లో నేర్చుకో వాల్సిన సంగతులు ఉంటాయి. ఇందులో బిడ్డ ముందు జీవితానికి బాటలు వేసేది, ఎదుగుదలకు వేళ్ళు ఊనుకొనేది తొలి బడి చదువులో. దానికి ముందు (చదువు కాక పోయినా చదువులాగా మనం పాటిస్తున్న) నర్సరీ విద్య. ఈ రెండు స్థాయిల్లో బిడ్డలకు నేర్పించే అంశాలు, నేర్పించే తీరు తెన్నులు ఎలా ఉంటుందో? అనే దానితో పాటు ఇప్పుడు ఎలా ఉన్నాయో పరికించి చూస్తే మన పిల్లల చదువులు ఎంత దరిద్రంగా ఉన్నాయో తెలుస్తుంది.
No comments:
Post a Comment