Thursday, January 31, 2013

వినదగునెవ్వరు చెప్పిన-తొలి చదువులు-29


26-1-2012

తొలి చదువులు కొంత భాష లోనే ఉండాలి అనేది ఏదో భాషమీద అభిమానం ఉండటం వల్లనో, ఉద్వేగాల తోనో లేదా పరాయి భాష మీద ద్వేషం తోనో అనే మాటలు కాదు. అవి పరిశోధనల్లో, అనుభవంలో, కాల నిర్ణయంలో నిగ్గు తేలిన సత్యాలు. ఈ నిజ చూపును కాదని కేవలం ఉపాధి, సంపాదనా, పోటీతత్వ అనే వ్యాపార పరమయిన సంగతులను ముందుకు తెచ్చిఆ కంతల్లో నుంచి చూస్తే నిజాలు నెత్తికి ఎక్కవు. మన చేత మేథావులుగా పరిగణించ బడిన గొప్ప వ్యక్తులు, సంస్థలు, పరిశోధకులు ఏమంటున్నారో ఒక సారి పరికించాల్సిన అవసరం ఉంది.

మహాత్మాగాంధీ: ‘‘విద్య వ్యక్తికి జీవిత సూత్రాలను నేర్పేదిగా ఉండాలి. లేత ప్రాయంలో చదివే ప్రాథమిక విద్య అందుకు పునాది వేసేదిగా ఉండాలి. బిడ్డ శరీర పోషణకు తల్లిపాలు ఎంత అవసరమో, మనసు విరబూయటానికి సొంత భాష కూడా అంతే అవసరం. బిడ్డ తన తొలి పాఠాన్ని తల్లి దగ్గరే నేర్చు కుంటుంది. కాబట్టి బిడ్డల పయిన విదేశీ భాషను రుద్దటం మాతృ దేశానికి ద్రోహం చేయటమే అనేది నా అభిప్రాయం’’.

రవీద్రనాథ ఠాగూరు: ‘‘ఆంగ్లాన్ని ప్రత్యేక మెళకువలతో, జాగర్తలతో రెండో భాషగా నేర్పాలి. కానీ బోధన మాత్రం సొంత భాషలోనే జరగాలి. యూనివర్సిటీ స్థాయి వరకూ సొంత భాషలో చదివే అవకాశాలు కలిగించాలి. ఇందుకు నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి.
  • సొంత భాషలో మాత్తరమే జీవితానికి సంబంధించిన లోతు లను తాకగలరు.
  • ఏ విషయంలో అయినా ప్రత్యేక నైపుణ్యాన్ని పొందాలి అంటే అందుకు భాష   అడ్డంకిగా ఉండ కూడదు.
  • వ్యక్తికి ఉన్న చేవ అంతా కొత్త భాష నేర్చు కొనేందుకే సరి పోతుంది. అందువల్ల అవసరం అయిన పరిజ్ఞానాన్ని నేర్చు కోవటంలో వెనుక పడతారు.
  • సొంత భాషలో చదువు చెప్పటంవల్ల ఆడపిల్లల్లో చదువు మెరుగు అవుతుంది. భారతీయ సమాజంలో మహిళా విద్యకు తక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి సొంత భాషలో విద్య బోధన వల్ల బాలికల్లో విద్యకు సంబంధించిన అదనపు భారం లేకుండా ఉంటే వారి విద్యా అవకాశాలు మెరుగు అవుతాయి’’.


ఎ.పి.జె.అబ్దుల్ కలాం (మాజీ రాష్టప్రతి): ‘‘నేను తమిళంలో చదివాను. మనం సొంత భాషను నేర్చు కోవాలి. బాగా పుస్తకాలు చదవాలి. జనం భాషలో చదువును చెప్పటానికి ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణ మీద మనం చూపు సారించాలి’’.

యునెస్కో: నాణ్యమయిన విద్య అందరికీ అందించాలి అనే గురితో ప్రణాళికలు ఉండాలి. పసితనం నుంచి చెప్పే చదువులో వారి సొంత భాషనే ఉపయోగించాలి. ఆ రకంగా పాఠశాల విద్యా విధానం ఉండాలి. అధికార జాతీయ భాషతో పాటు సొంత భాషను కూడా ఉపయోగించడం ద్వారా విద్యార్థుల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి అని ఇటీవలి పరిశోధనలు నిక్కచ్చిగా తెలుపుతూ ఉన్నాయి. అంతే కాదు, సొంత భాషలో చదువు వల్ల జ్ఞానం పెరగటానికి వీలుగా పిల్లల్లో చదివే చేవను ఇనుమడింప చేస్తుంది. ప్రస్తుతం సగటున నెలకు రెండు భాషలు కను మరుగు అయి పోతున్నాయి. కనుక భాషలను కాపాడే చర్యలు చేపట్టాలి.

నేడు ప్రధానంగా ప్రపంచం లోని ప్రాచీన తెగల భాషల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వారసత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, సొంత భాషను కాపాడు కోవటం అనేది వారి కీలకం అయిన హక్కుగా మనం గుర్తించాలి. భాషా బోధన, ప్రత్యేకించి సొంత భాషలో బోధన అనేది ప్రపంచ వ్యాప్తంగా నేడు అత్యంత ప్రధాన అంశంగా ఉంది. విశ్వ వ్యాప్తంగా తమ భావాలను ఈ భాషలు తెలియ చేయ గలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి తన సొంత భాషను కాపాడుకుంటూ, దానిని ఒక వ్యక్తీకరణ రూపంగా జీవితాంతం ఉపయోగించు కోవాలి’’.

ఐక్యరాజ్య సమితి: మానవ సంబంధాలూ, సమాచార మార్పిడి లాంటి విషయా లలో సొంత భాష పదును అయిన, చేవ కలిగిన ఆయుధం. జాతి సొంత ప్రయోజనాలు, కళలు, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో స్వంత భాష పాత్ర అంతా ఇంతా కాదు. సమాచార మార్పిడిలో ఇపుడు తనది అయిన పాత్ర పోషిస్తున్న ఇంటర్నెట్టు, ఇప్పటి వరకు ఆంగ్లం లోనే అందుబాటులో ఉంది. సభ్య దేశాలు వారి వారి సొంత భాషలో ఈ సమాచార నిధిని తర్జుమా చేయించి ప్రజలకు అందించే విధానాలను రూపొందించి అమలు పరచు కోవాలి.

క్లింటన్ రాబిన్‌సన్స్ (సమ్మర్ ఇన్టిట్యూట్ ఆఫ్ లింగ్విస్టిక్ అధిపతి, బ్రిటన్): ‘‘జ్ఞానం నిండుగా పెంపొందించు కోవాలి అంటే అది సొంత భాష ద్వారానే వీలు అవుతుంది. సొంత భాషలో కాకుండా, వారిది కాని ఇతర భాషలో చదివే విద్యార్థుల్ని చూస్తే రెండు సంగతులు తెల్లం అవుతాయి. ఒకటి సొంత భాషలో విద్య నేర్చుకోక పోవడంవల్ల వారి జ్ఞానంలో నిండుదనం ఉండటం లేదనీ, రెండోది వారు వారి జ్ఞానం ఎదుగుదలలో తమ సొంత భాష పూర్తిగా వాడు కోలేక పోయారు కాబట్టి వారికి సొంత భాష ఉపయోగం లేకుండా పోయిందని.

జిమ్ కుమీన్స్ (టోరోంటో యూనివర్సిటీ): ‘‘విద్యార్థికి సొంత భాష మీద ఉన్న పట్టు ఆ విద్యార్థి రెండో భాషను ఎంత బాగా నేర్చుకోగలడు అనేదానికి గీటురాయిగా ఉంటుంది. బడిలో సొంత భాషలో బోధించడం వల్ల తరువాత కాలంలో ఇతర భాషలను నేర్చుకొనే చేవ పెరుగుతుంది. తద్వారా బిడ్డలో ఉండే మొత్తం చేవ వినియోగం లోకి వస్తుంది. పిల్లలకు సొంత భాష పూర్తిగా నేర్పకుండా పరాయి భాషను నేర్పడం వల్ల నష్టం ఎక్కువ. బిడ్డలో సొంత భాష పూర్తిగా ఎదిగి స్థిర పడక పోతే అది వాళ్ళనుండి త్వరగా మాయం అవుతుంది. అందువల్ల తల్లి భాష బాగా ఎదిగాకే రెండో భాషను నేర్పాలి. పాఠశాలల్లో పిల్లల్ని తమ సొంత భాషలో మాట్లాడనీక పోవటం అంటే అది పిల్లలను నిరాకరించినట్టే.

ఆసియా దేశాల భాషా సదస్సు: యునెస్కో, మాషిడోలు యూనివర్సిటీ ఉమ్మడిగా చేపట్టిన ఆసియా దేశాల సదస్సులో వెలువరించిన అభిప్రాయాల సారాంశం ఏమిటంటే ‘‘ప్రాథమిక విద్యను సొంత భాషలో చదివిన విద్యార్థులు ఆ తర్వాత ఏ మాధ్యమంలో చదివినా, తొలి నుంచీ ఇంగ్లీషు మాధ్యమంలో చదివిన వారి కంటే ఎక్కువ నైపుణ్యాలను కలిగి ఉంటారు’’ అని అభిప్రాయ పడింది.

పంజాబు నిపుణుల కమిటీ: పంజాబు ప్రభుత్వం, ప్రాథమిక విద్యలో ఆంగ్లాన్ని ఏ స్థాయిలో నేర్పించాలి అనే విషయం మీద ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులు, మొదట సొంత భాష చదవటం, రాయటం వచ్చాకే ఆంగ్ల భాషను పరిచయం చెయ్యాలని అభిప్రాయ పడ్డారు.

Saturday, January 19, 2013

తాడెక్కే జనం తలదన్నే ప్రభుత్వం: తొలి చదువులు-28


19-01-2013

తొలి విద్యను పరాయి భాషలో జరపడం అనేది అశాస్ర్తియమని తెలిసినా ధనిక, ఉన్నత మధ్య తరగతి ప్రజల్లో ఇంగ్లీషు మీడియం పట్ల ఆదరణ పెరుగుతుంది అనేది కళ్లకు కనిపిస్తున్న నిజం. సామాజికంగా ఉన్నత స్థితిలో ఉన్న ఈ వర్గాన్ని అనుసరించడం మధ్య తరగతి లక్షణం. ఇక మిగిలింది పేద ప్రజానీకం. పేదరికంలో ఉన్న వర్గాలు వ్యాపార వస్తువు అయిన విద్యను తమ బిడ్డలకు కొని ఇవ్వలేక ప్రభుత్వ బడులకు పంపి, తెలుగు మీడియంలో చదివిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చదివే గ్రామీణ ప్రజానీకం, బలహీనవర్గాలు, దళితులు దీన్ని అవమానంగా భావిస్తూ మీ పిల్లలకు ఏబీసీడీలు మా పిల్లలకు అ ఆ ఇ ఈలా అని నిలదీస్తున్నారు. దీన్ని సరిచేసి శాస్ర్తియం అయిన బోధనా పద్ధతులను తెచ్చి, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వాన్ని నడిపే వారి సంకుచిత ప్రయోజనాల కోసం, ఓట్ల రాజకీయం కోసం మీ బిడ్డలకు కూడా ఇంగ్లీషు లోనే చదువు చెబుతాం అని ప్రభుత్వ బడుల్లో ప్రాధమిక స్థాయి నుంచే ఇంగ్లీషు మీడియాన్ని తేవటానికి మొక్కలు నాటటం మొదలు అయింది.

ఉన్నత విద్యా విధానం పట్ల ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు, కానీ ప్రాధమిక విద్యకు సంబంధించి ఏ విషయాన్ని మాట్లాడాలన్నా దాన్ని అనేక కోణాల నుంచి పరిశీలించాలి. ఎందుకంటే ప్రాధమిక విద్యలో కేంద్ర బిందువు ఇంకా వికసించని బిడ్డ. విద్యా బోధనకు చెందినంత వరకు ప్రత్యేకించి ప్రాథమిక విద్యకు ప్రపంచం అంతా ఆమోదించిన ఒక శాస్ర్తియ పద్ధతి ఉంది. బిడ్డ శారీరక మానసిక సామర్ధ్యాన్నీ, బిడ్డ పెరుగుతున్న సమాజం, సంస్కృతి, వారసత్వాన్నీ చూపులో ఉంచు కోవాలి. అంతే కాకుండా సామాజిక పరిస్థితుల్ని, ప్రాంతీయ, జాతీయ విలువలు లాంటి అనేక కోణాల నుంచి చూడాలి. వీటి ఆనింపుగా ప్రాధమిక విద్య ఎలా ఉండాలని అనేది నిర్ణయిస్తే అది శాస్ర్తియంగా ఉంటుంది.


మొత్తంమీద మార్పు రావాల్సింది ప్రజల్లో అయినప్పటికీ జాతి, సంస్కృతి, భాషల మనుగడకే గండం ఏర్పడిన అప్పుడు వాటిని కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించాలి. అవసరం అయితే చట్టాన్ని ప్రయోగించాలి. అంతే కాకుండా అశాస్ర్తియ పద్ధతుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాలు పంచు కోవాలి. జరుగుతున్న పొరపాటు దిద్ద టానికి ప్రభుత్వం స్పందించాలి. మొత్తంగా మార్పు రావ టానికి సమయం పట్ట ఒచ్చు. అంత వరకూ ఎవరి స్థాయిలో వారు కొన్ని ముందస్తు చర్యలు, జాగర్తలు తీసుకుని జరిగే నష్టాన్ని కొంత మేర అయినా ఆపటం కనీసం గుడ్డిలో మెల్ల అవుతుంది.


తల్లిదండ్రులు

  • ఇంగ్లీషులో చదవడం, ఇంగ్లీషు మాట్లాడడం రెండూ ఒకటి కాదని ముందుగా గుర్తించండి. 
  • కేజీ క్లాసులతో సహా ప్రాధమిక విద్య గురి పిల్లల బుర్రలు విరపూయ టానికే తప్ప ఉపాధికి కాదని గుర్తించండి.
  •  తెలిసిన ఏ భాషలో అయినా జ్ఞానాన్ని బోధించ ఒచ్చు. అర్థం కాని భాషలో చదువు చెబితే మీ బిడ్డల బుర్రలు ఎలా ఎదుగుతాయో ఆలోచించండి. 
  • సొంత భాష ద్వారా పొందిన విజ్ఞానం అంతా ఆ తరువాత మీ పిల్లలు ఎన్ని భాషలు నేర్చుకున్నా దాని అంతట అదే అన్ని భాషల్లోకి మారుతుంది. తెలుగులో నేర్చుకున్నారు కదా అని అది తెలుగు లోనే ఉండదు. 
  • ఒక వేళ మీ పిల్లలను ఎగువ తరగతుల్లో ఇంగ్లీషులో చదివించాలి అనుకున్నా ఆ భాష కనీసంగా నేర్చుకునే వరకు తెలుగు లోనే చదివించండి. ఇంగ్లీషు నేర్చుకున్నాక ఆ మీడియంలో చదివించు కోవచ్చు.
  • మీ పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివిస్తూ వుంటే బడిలో అర్థం కాని అంశాలను తెలుగులో చెప్పమని యాజమాన్యాన్ని నిలదీయండి. 
  • మీరు చెప్పగలిగితే పుస్తకాల లోని విషయాలను పిల్లలకు తెలుగులో వివరించండి. దీనివల్ల మీ పిల్లలు చదువులో ఏ స్థాయిలో ఉన్నారో మీకు అర్థం అవుతుంది. 
  • మధ్య మధ్యలో మీ బిడ్డ ప్రోగ్రెస్ కార్డుల్లో వున్న మార్కులకు, బిడ్డ తెలివికి పొంతన కుదురుతుందో లేదో చేస్తూ ఉండండి. అలాగే బడిలో మీ బిడ్డకు లేని ప్రతిభను అంట గడుతున్నారేమో మొదటి లోనే గుర్తించి తగిన జాగర్తలు తీసుకోండి. 
  • తేడాను గుర్తించినా, గుర్తించనట్లు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మిమ్మల్ని, మీ బిడ్డని ఎవరూ కాపాడలేరని గమనించండి.
  • తెలుగులో చదివే వాళ్లను తక్కువ చేసి చూడకండి. 
  • మీరు ఏ మీడియంలో చదివిస్తున్నా పిల్లల్ని మన భాష పట్ల, సంస్కృతి పట్ల గౌరవం కలిగించే విధంగా పెంచండి. 
  • బిడ్డలకు బట్లరు ఇంగ్లీషు కాకుండా మంచి ఇంగ్లీషు నేర్పండి. సొంత భాషమీద పట్టు లేకుండా మంచి ఇంగ్లీషు రాదని మరో సారి గుర్తించండి.


ప్రయివేటు బడులు 


  • మీది ప్రయివేటు పాఠశాల అయితే, పిల్లలకు చదువు చెప్పటంలో మీ నిజాయితీని ఒకసారి మీకు మీరే పరీక్షించుకోండి. 
  • మీరు చేసేది వ్యాపారమే కావొచ్చు. మీరు అమ్మేది గిరాకీ ఉన్న ఇంగ్లీషు మీడియాన్నే కావచ్చు. అయినప్పటికీ అది అశాస్ర్తియం అన్న సంగతి మీకు తెలుసు. దాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకోండి. 
  • బడిలో పిల్లలు మంచి ఇంగ్లీషు మాట్లాడాలి అంటే అంతకు ముందు వారికి మంచి తెలుగు వచ్చి ఉండాలని గుర్తించండి. 
  • బోధించే విషయాలు పిల్లలకు అర్ధం అవుతున్నాయో లేదో చూడండి. తెలుగులో చెప్తే అర్థం అవుతున్నాయి అనుకుంటే అలానే చెప్పండి. తెలుగులో అర్థం అయినట్టు చెప్పాక అదే పాఠాన్ని ఇంగ్లీషులో చెప్పించండి. ఇంగ్లీషు మీడియం కదా అని ఇంగ్లీషులోనే చెప్పడానికి ప్రయత్నిస్తే మీరు చెప్పేది ఉపయోగం లేదని గుర్తించండి.
  • పిల్లలను బట్టీ పద్ధతికి అలవాటు చెయ్యొద్దు. రాని మార్కులను వెయ్య ఒద్దు. 
  • తెలుగు సబ్జెక్టును నిర్లక్ష్యం చేయకండి. పిల్లలకు చదవడం, రాయడం బాగా నేర్పించండి. 
  • పిల్లల్ని ఆయా ప్రత్యేక పీరియడ్‌లో ఇంగ్లీషులోనే మాట్లాడమని ప్రోత్సహించాలే కాని బలవంతం చెయ్య ఒద్దు. అలా చేసి వాళ్ల స్వేచ్ఛను హరించ కూడదు. 
  • ముందు మీ టీచర్లు అందరికి ఇంగ్లీషు మాట్లాడడం బాగా నేర్పించండి. 
  • ఇంగ్లీషును తెలుగు ద్వారా నేర్పాలి తప్ప ఇంగ్లీషును ఇంగ్లీషు ద్వారా నేర్పడం అశాస్ర్తియం. 
  • వ్యాపారంలో నిజాయితీ ఉన్నప్పుడే నాలుగు కాలాల పాటు నిలబడతారు అనేది కాలం తేల్చిన సత్యం.


ప్రభుత్వ బడులు 


  • మీరు తెలుగులో బోధించే ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తుంటే మీ బాధ్యతల్ని సక్రమంగా చేయండి. 
  • మీరు మనసు పెట్టి చెప్పాలే కాని ప్రైవేటు పాఠశాలల్లో చెప్పే చదువు కంటే మెరుగ్గా, నాణ్యమైన బోధనని అందించ  కలరు. 
  • ఒకటి, రెండు, మూడు తరగతుల్లో చదవడం, రాయడం నేర్పకుండా ఎగువ తరగతులకు పంపిస్తే పిల్లలు ఎంత తెలివి కలవారు అయినా ఉపయోగం లోకి రారు అని గుర్తించండి. 
  • మీ బాధ్యతను మీరు చెయ్యక పోవడం వల్ల ఒక నిండు జీవితం వికసించకుండా పోవడం మీకు ఇష్టమా? అని ప్రశ్నించుకోండి. అంటే పిల్లలకు బాగా చదువు చెప్పండి. 
  • ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యార్థుల్ని తీర్చి దిద్దండి. పిల్లలకు మంచి ఇంగ్లీషు నేర్పండి. 
  • మీ విద్యార్థులకు తెలుగు బాగా వచ్చి ఉంటుంది కాబట్టి ఏబీసీడీలతో విద్యాభ్యాసం చేసిన పిల్లలకంటే త్వరగా బాగా ఇంగ్లీషు నేర్చుకోగలిగి ఉంటారు. ఆ అవకాశాన్ని ఉపయోగించండి.






Saturday, January 12, 2013

ఇంగ్లషు కోసం వితండ వాదనలు; తొలి చదువులు-27


12-01-2013



నేటి కాలంలో బిడ్డల ఎదుగుదలలో చదువు ఒక ముఖ్యమయిన భాగం. పుట్టిన బిడ్డకు మాటలు ఒచ్చాక చదువు కోసం బడిలో వేస్తాము. బిడ్డ బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టటంలో ఇది తొలి మెట్టు. ఆ తరువాత అది పలు అంచెల్లో కొన సాగుతుంది. తొలి అంచెలో మొదలు అయ్యే ప్రాథమిక విద్యలో తన భాషను చదవటం- రాయటం, లెక్కల్లో ఉన్న కూడిక - తీసివేత- పెంచటం- భాగించటం అనే నాలుగు ప్రక్రియలను నేర్చు కోవటం తోపాటు పరిసరాల గురించి కొంత ప్రాథమిక పరిజ్ఞానాన్ని పొందటమే. ఒక ప్రాంతంలో ఉండే బిడ్డలు అందరికీ ఒకే రకమయిన ఉమ్మడి విధానంగా చదువు ఉంటుంది. దీని తరువాత మొదలయ్యే రెండో అంచె (సెకండరీ ఎడ్యుకేషన్) విద్యలో దేశాన్ని గురించీ, ప్రపంచాన్ని గురించీ, ప్రకృతిని గురించి తెలియచెప్పేది. ఇది కూడా పిల్లలు అందరికీ ఉమ్మడిగా అందించాలి. ఆ తరువాత మొదలు అయ్యేది ఉన్నత విద్య. బతకడానికి ఉపాధిని చూపించేది వృత్తి విద్య లేదా యూనివర్సిటీ విద్య. ఇది ఆసక్తిని బట్టి, అవసరాన్ని బట్టి, అందుబాటును బట్టి ప్రతి బిడ్డకూ మారుతూ ఉంటుంది.


ముందు చెప్పినట్టు ప్రాథమిక విద్య అంటే కేవలం చదవటం, రాయటం నేర్చు కోవటం మాత్తరమే కాదు. వ్యక్తి మొత్తం ఎదుగుదలకు పునాది వేయటం. విద్య గురి బిడ్డను ఇంట్లో నుంచి సమాజంలోకి ప్రవేశ పెట్టడం. ఇక్కడి బిడ్డ తన గురించి తన కుటుంబాన్ని గురించి చుట్టూ వున్న సమాజం, పరిసరాలను గురించి తెలుసుకోవాలి. సమాజపు నియమాలూ, జనంతో సంబంధాల గురించి తెలుసు కోవాలి. బిడ్డ ఎదిగాక ఏమి అవుతారు అనే దానితో సంబంధం లేకుండా ప్రాథమిక విద్య ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బిడ్డ వ్యక్తిగా ఎదగటంలో తొలి మెట్టు ప్రాథమిక విద్య. ఇది బిడ్డ ఇంటి భాష, సమాజపు భాష ఏది అయితే ఇందులో జరగాలి. ఇది శాస్ర్తియమైన పద్ధతి. ప్రపంచం అంతా ఈ పద్ధతినే అనుసరిస్తుంది.

పసి పిల్లలకు సొంత భాషలో చదువు పనికిరాదని, ఇది అశాస్ర్తియం అని ఇంతవరకూ ఎవరూ అనలేదు. ఇది నూటికి నూరుపాళ్ళూ శాస్ర్తియమే అని అందరూ ఒప్పుకుంటారు. చివరికి ఇంగ్లీషులో చదువును సమర్థించే వారు సయితం ‘‘తొలిచదువుకు సొంత భాష శాస్ర్తియమే... కానీ...’’ అంటూ ఫలానా పరిస్థితుల్లో కాబట్టి ఇంగ్లీషు అవసరం అని తమ వాదనలకి ఏవో కొన్ని ఆధారాలు వెతుక్కుంటారు.

నూటికి నూరుపాళ్ళు శాస్ర్తియం అని ఒప్పుకొనే సొంత భాషలో తొలి విద్యను అమలు చేసుకోవటంలో క్రమేణా నీళ్ళు ఒదులుతున్నాం. గాడి తప్పుతున్న ఈ పద్ధతిని సరిచేద్దాం అని ఎవరైనా అంటేనో, ఇపుడయినా మేలుకొని బిడ్డలను తెలుగులో చదివిద్దాం అని ఎవరు అయినా అనుకుంటే వారికి సవాలక్ష సవాళ్లు ఎదురవుతాయి. ఈ సంగతిని చర్చకు పెడితే ఇక చూడండి! రకరకాల ప్రశ్నలు, అనర్గళంగా వాదనలు, లేని పోని అనుమానాలు, సందేహాలు బయలుదేరతాయి. ఎక్కువ మంది చేసే వాదనలూ, లేవదీసే అడకలు ఎలా ఉంటాయి అంటే- 

·                     తెలుగులో చదివితే ఇంగ్లీషు ఎలా వస్తుంది? 
·                     ఇప్పటి రోజుల్లో ఇంగ్లీషు లేకుండా జ్ఞానం ఎలా వస్తుంది?
·                     ఉన్నత విద్య చదవాలి అంటే ఇంగ్లీషు నేర్చుకోవాలి కదా! 
·                     విదేశాలకు వెళ్ళాలి అంటే తెలుగులో చదివితే ఎలా? 
·                     సాఫ్టువేరు ఉద్యోగాలు ఎలా వస్తాయి? 
·                     ఇంగ్లీషు అంతర్జాతీయ భాష. దాన్లో చదవక పోతే వెనుకడిపోమా? 
·                     తెలుగులో రెఫరెన్సు పుస్తకాలు దొరకవు కదా! 
·                     ఇంగ్లీషును కాదని బతకడం వీలు అవుతుందా? 
·                     సాంకేతిక పదాలకు తెలుగు అర్థాలులేవు కదా? 
·                     డాక్టర్లు, ఇంజనీర్లు కావాలంటే ఇంగ్లీషు లేకపోతే ఎలా?

ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కొంత మంది అయితే పోట్లాడతారు కూడా. ఒక అశాస్ర్తియ పద్ధతిని సమర్థించడానికి ఇంత బలమయిన వాదనలు ముందుకు రావటానికి కారణం ఏమిటి? ఈ ఆలోచనలు బుర్రలో దూరటానికి కారణం ఏమిటి? అన్న సంగతిని చూడాల్సి ఉంటుంది.

పయి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం అయితే ఒకటే. అది ఏమిటి అంటే వాదనలు ప్రతి వాదనలు జరిగేటప్పుడు సంగతిని సరిగా బుర్రకు ఎక్కించు కోకుండా, అర్థం చేసుకోకుండా అర తలకాయతో మాట్లాడటమే. వీరిలో సామాన్య మానవుడి నుండి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకూ అనేక మంది ఉన్నారు.

‘‘ప్రాథమిక విద్య తెలుగులో ఉండాలి’’ అని ఎవరు అయినా అంటే, ఆ మాటలను వీళ్ళ అర బుర్రల్లోకి ఎలా దూరుతాయి అంటే, 

·                     ఇంగ్లీషును వ్యతిరేకిస్తున్నట్టు 
·                     ఇంగ్లీషును పూర్తిగా ఒద్దు అంటున్నట్టు 
·                     తెలుగులో చదివితే, తెలుగు తప్ప ఇంగ్లీషు రాదు అన్నట్టు 
·                     ఇంగ్లీషు రాకపోతే పని దొరకనట్టూ 
·                     ఉపాధి కోర్సులు అంటే కేవలం మెడికలు, ఇంజనీరింగు, సాఫ్టువేరు, మేనేజిమెంటు కోర్సులే అయినట్టు 
·                     ప్రతి బిడ్డా విదేశాలకు పోతున్నట్టూ 
·                     బిడ్డలకు సొంత నాడులో, సొంత దేశంలో ఉపాధి దొరకనట్టు 
·                     విదేశాలకు వెళ్ళటమే చదువు పరమార్థం అన్నట్టు.

ఇలా రక రకాలుగా, తప్పుగా అర్థం చేసుకుంటారు. వారికి అర్థం అయిన అర తలకాయతో, అనాలోచితంగా వాదనలు మొదలు పెడతారు. దీనితో చర్చ ప్రాథమిక విద్య మీద కాకుండా సాంకేతిక విద్య మీదకు, వృత్తి విద్య మీదకు, ఉపాధి అవకాశాలు మీదకు, విదేశీ ఉద్యోగాల మీదకు మళ్ళుతుంది. దీనితో చర్చ పక్కదారి మళ్ళి, గందరగోళంగా మారుతుంది. అందువల్ల అసలు సంగతి మరుగున పడి, వాదన నెగ్గటం అన్నది సంగతి సారాంశం మీద కాకుండా వ్యక్తుల వాదనా పటిమ మీద, మొండి వాదన మీద అరుపుల మీద ఆధారపడి ఉంటుంది. టీవీలల్లో నిర్వహించే చర్చా వేదికల్లో, పత్రికల్లో వచ్చే వ్యాసాలలో ఈ బాపతు వాదనలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ప్రాథమిక విద్య అంటే ఉన్నత విద్య కాదనీ కాలేజీ విద్యలు కాదనీ, సాంకేతిక విద్య, యూనివర్సిటీ చదువులూ, వృత్తి విద్యలు అసలే కాదని ఈ అర తలకాయ మేథావులకు చర్చ జరుగుతున్నంత సేపు మళ్లీ మళ్లీ గుర్తు చేసి మాట్లాడాల్సిన అక్కర ఉంది. దీనికి చాలా ఓర్పు, నేర్పు అవసరం. ఎంత ప్రయత్నించి చర్చను గాడిలో పెట్టాలని చూసినా ఆ అర తల కాయలు తిరిగి మళ్లీ అదే దరువు ఎత్తుకుంటూ వుంటారు. కారణం మరేమీ లేదు వారి దగ్గర శాస్ర్తియం అయిన వాదనా వస్తువు లేక పోవటమే. ఇలాంటి వారితో వాదించినా, చర్చలు జరిపినా సమయం వృధా అవుతుందే తప్ప చీమ తలకాయ అంత ఉపయోగం కూడా ఉండక పోవచ్చు.

ఎగువ చదువులు, విరివి చదువులు (అడ్వాన్సుడు స్టడీసు) అన్నీ ఇంగ్లీషులో చదువు కోవచ్చు. ఇంగ్లీషు కాక పోతే ఫ్రెంచిలో చదువు కోవచ్చు. అదీ కాక పోతే మరో భాష. కాదన్నది ఎవరూ? అసలు చదవాలి అంటే ముందుగా ఆ భాష నేర్చు కోవాలి కదా!

ఇంగ్లీషును బోధనా భాషగా ఎంచు కోవాలి అంటే ముందుగా దాన్ని నేర్చు కోవాలి. తొలి చదువుల్లో బిడ్డ సొంత భాషను ఎదగనిచ్చి, కొంత కాలానికి ఇంగ్లీషును పరిచయం చేసి, దాన్ని బాగా నేర్పించాలి. తరువాత అవసరం అయిన వారికి దాన్ని బోధనా భాషగా ఎంచుకొనే అవకాశం ఇవ్వవచ్చు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. పాల బుగ్గల పసి మొగ్గలకు అసలు భాషే రాక పోతే అందులో బోధన ఏమిటి? అనే సంగతి ఈ మట్టి బుర్రల్లోకి ఎక్కించ టానికి ఏదయినా మర ఉంటే బాగుణ్ణు.

Thursday, January 10, 2013

పనికి మాలుతున్న ప్రభుత్వ టీచర్లు; తొలి చదువులు-26

06-01-2013

ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు ఎందుకు రావటం లేదని టీచర్లను అడిగితే, ‘‘పిల్లలు సరిగా బడికి రారు, స్కూళ్ళలో వసతులు సరిగా ఉండవు, బోధనేతర పనులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లలపట్ల శ్రద్ధ తీసుకోరు, పుస్తకాలు సరైన సమయానికి రావు...’’ ఇలా సమస్యల్ని ఏకరువు పెడతారు.

పిల్లలు బడికి రావటము లేదు అంటే వాళ్ళకి చదువు మీద ఆసక్తి లేదు అనేగా అర్థం. పిల్లలకు ఆసక్తి కలిగించటం కూడా బోధనలో ఒక భాగమే. పిల్లల్లో కుతూహలం కలుగజేసి, చదువు పట్ల ఇష్టాన్ని కలుగచేసే మెళకువలను నేర్పించటం కూడా ఉపాధ్యాయ శిక్షణలో ఒక భాగం. సామాజిక పరిస్థితుల కారణాలవల్ల బడికి రాని వాళ్ళు ఎలాగూ రారు. వచ్చినవాళ్ళలో సగం మందికి చదవటం, రాయటం సరిగా రావటంలేదే! మరి దీనిని ఎలా అర్థం చేసు కోవాలి? ఇక్కడ మరో సంగతి కూడా చెప్పు కోవాలి. అక్కడ్కడ ఇలాంటి మట్టు లోనే ఉండే కొన్ని బడుల్లో టీచర్లు నిబద్ధతతో, బాధ్యతతో చదువు చెప్పి, పిల్లల్ని బాగా తీర్చి దిద్దుతున్న మచ్చులు కూడా మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. అయితే అలాంటి టీచర్లు అరుదుగా కనిపిస్తారు.

ప్రభుత్వ బడుల్లో వసతులు లేని మాట నిజమే. అయినప్పటికీ వసతులు ఉన్న బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగ్గా లేవు. ఇక బోధనేతర పనులకు టీచర్లను వాడుకుంటున్నారు అన్న వివరణకు అర్థమే లేదు. ఒకటి రెండు తరగతులకు సిలబసు పూర్తి చేయటానికి ఏడాదిలో 110 నుండి 120 పని రోజులు సరిపోతాయని పాఠ్య ప్రణాళిక అంచనా. ఇన్నీ సెలవుల తోపాటు బోధనేతర పనులలో టీచర్లు పనిచేసే రోజులు కలిపినా అయ్యవార్లు ఏడాదిలో 170 రోజులు పనిచేస్తున్నారు. పిల్లలు 30 శాతం పని రోజులు బడికి రారు అనుకున్నా ఇంకా 70 శాతం హాజరు ఉంటుంది. అంటే 110 నుండి 120 రోజులు పిల్లలు బడిలో ఉంటారు. పాఠ్యప్రణాళిక ప్రకారం అక్షరాలు నేర్పటానికి ఆ రోజులు సరిపోతాయి. దీన్ని బట్టి బోధనేతర పనులకు ఉపాధ్యాయుల్ని వాడుకుంటున్నారు అనే వాదనలో పస లేదు అని తెల్లం అవుతుంది.

ప్రభుత్వ బడుల్లో చదివే ఎక్కువ మంది పిల్లల తల్లిదండ్రులు చదువు లేని వారు లేదా అరా కొరా చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు. వారి స్థాయిలో వారు పిల్లల పట్ల శ్రద్ధ తీ సుకోకుండా గాలికి వదిలివేయరు. ఒకవేళ శ్రద్ధ తీసుకోక పోయినా తల్లిదండ్రులకు ఆ సంగతి మీద అవగాహన కలిపించి పిల్లల్ని చదువుకు తీసుకురావాల్సిన సామాజిక బాధ్యత కూడా ఉపాధ్యాయులదే. ఇక పుస్తకాలు సమయానికి రావు అనీ, తడవ తడవకీ ప్రభుత్వం బోధనా పద్ధతులను మార్చుతుందనీ, ఏ బోధనా పద్ధతితో చెప్పాలో అర్థం కావటంలేదు అనేది కూడా ఉపాధ్యాయుల ఆరోపణ. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? అ ఆ లు, కూడికలు తీసివేతలు నేర్పటానికి పలకా బలపాలు చాలవా ఇవికూడా తీసి ఇవ్వకుండా తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపుతున్నారా?
తొలి బడిలో ముఖ్యంగా ఒకటీ, రెండు తరగతులకు బోధించే టీచర్లకు బాధ్యత చాలా ఎక్కువగా ఉండాలి. ఎందుకు అంటే మొదటి తరగతిలో నేర్పాల్సిన అక్షరమాలను, గుణింతాలను సరిగా నేర్పకపోతే దాని కొనసాగింపుగా రెండో తరగతిలో నేర్పాల్సిన వాటిని అనుసరించలేరు. ఒకటి రెండు తరగతుల్లో చేయాల్సింది పిల్లలకు చదవటం, రాయటం నేర్పించటం. ఈ తరగతుల్లో అవి రాకుండా మూడో తరగతిలో చదువు చెప్పడం కష్టం. మూడో తరగతిలో ఎంత బాధ్యతగల టీచరు ఉన్నా, ఎంత బాగా చదువు చెప్పగలిగినా అక్షరాలు సరిగా చదవలేని, రాయలేని పిల్లలకు వారు చేయగలిగింది ఏమీ లేదు. ఆ తరగతి ఉపాధ్యాయుడు మళ్లీ అ ఆ ఇ ఈలు నేర్పించుకుంటూ తన పాఠాలను కొనసాగించలేడు.

ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు పడిపోవటానికి ఉపాధ్యాయ సంఘాలు చెప్పే కారణాలు ఏమిటంటే, ‘‘ప్రమోషన్లు, బదిలీలు ఆగిపోయాయి. తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటేనే చదువుచెప్పటం వీలు అవుతుంది. పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది’’ అని ఏకరువు పెడతారు.

ప్రమోషన్లు వచ్చినా, బదిలీలు జరిగినా, చెప్పాల్సింది చదువే అయినప్పుడు పిల్లలు ఎవరు అయితే ఏమీ? బడి ఏది అయితే ఏమి? చదువు చెప్పటమే పని అయినప్పుడు బదిలీలకు, పిల్లలకు చెప్పే చదువుకు సంబంధం ఏమిటో అర్థం కాదు. తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండటం అనేది కాదనలేని నిజం. అయినప్పటికి ఆ మేరకు ఉన్న బడుల్లోకూడా ప్రమాణాలు అట్టడుగు మట్టులో ఉంటున్నాయి. ప్రభుత్వ బడుల్లో పిల్లల హాజరు శాతం కొడిగట్టుతున్న నేటి రోజుల్లో కొన్ని బడుల్లో అయితే పట్టుమని పది మంది కూడా పిల్లలు ఉండటం లేదు. మరి అలాంటి బడుల్లో ప్రమాణాలు ఏమయినా బాగున్నాయా? అని చూస్తే అవీ అంతే.

టీచర్లమీద అధికార్లు ఒత్తిడి తెస్తున్నారు అంటే అది పిల్లలకి చదువు చెప్పే విషయంలో మట్టుకు అయి ఉండదు. చదువు చెప్పవద్దని ఏ అధికారి చెప్పడు. ఉపాధ్యాయ సంఘాలు దాదాపుగా ఉపాధ్యాయుల జీత భత్యాలు, బదిలీలు, ప్రమోషన్లు వరకే పరిమితం అయి పనిచేస్తాయి తప్ప విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచే దిశగా తమ సభ్యుల్ని మలిచే శక్తి వాటికి లేదు. ఒకవేళ ఏ సంఘం అయినా నిబంధనల ప్రకారం నడచుకోండి అనీ, పనిచేసే చోట ఉండండీ అని, పిల్లలకు చదువు బాగా చెప్పమని తమ సభ్యులను కోరింది అంటే ఇక ఆ సంఘానికి నూకలు చెల్లినట్టే. దీనికి పోటీగా మరో సంఘం ఊపిరి పోసుకుంటుంది. ఈ రాతలు ఉపాధ్యాయ సంఘాలకు మింగుడు పడక పోయినా నేడు ఉన్న నిజం ఇది.

ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి కేంద్రంగా తమ కార్యక్రమాలను మలచు కోక పోయినట్టు అయితే మును ముందు ఆ సంఘాల మనుగడే కష్టం కావచ్చు. దీనివల్ల వచ్చే నష్టాలు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పిల్లల్లో ప్రమాణాలు పడి పోవడం వల్ల జనం ఈ బడుల్లోకి తమ పిల్లలను పంపటం మానేస్తారు. ఇప్పుడు ఆ పని చాలా వేగంగా జరుగుతుంది. దీని వల్ల ప్రయివేటుగా నడిచే వ్యాపార బడుల వైపు జనాన్ని తోయకనే తోచినట్టు అవుతుంది. మరో వైపు ప్రభుత్వ బడుల్లో పిల్లల హాజరు శాతం తక్కువగా ఉండటం, ఉన్నా ఆ వచ్చే తక్కువ ప్రమాణాలను సాకుగా చూపి క్రమంగా ప్రభుత్వ బడులను మూసివేసే పరిస్థితిలోకి తెచ్చినట్టు అవుతుంది. సరిగ్గా ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదే. విద్య పట్ల ప్రభుత్వం తమ బాధ్యతలనుండి తప్పుకొని కేవలం అజమాయిషీ వరకే అట్టిపెట్టుకొని విద్యను ప్రయివేటీకరణ వైపు నెట్టటం గ్లోబలయిజేషను విజయవంతం కావాలంటే జరగాల్సింది కూడా ఇదే. అంటే అయ్యవార్లే తమ నాశనానికి ఉపయోగపడే ఆయుధాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు అన్న మాట.
ఇక అధికార్లను ఈ విషయంమీద కదిలిస్తే ‘‘టీచర్లలో నిబద్ధత లేదని, వారు పనిచేసే చోట ఉండరనీ, చదువులు చెప్పని ఉపాధ్యాయుల మీద చర్య తీసు కోవాలి అంటే ఉపాధ్యాయ సంఘాల జోక్యం ఎక్కువగా ఉంటుందని’’ అంటున్నారు. ఇందులో ఒకటి మటుకు నిజం, అందరూ కాక పోయినా అత్యధిక భాగం ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో నిబద్ధత లేదు అనేది అందరూ ఎరిగిన సంగతే. అయితే అందుకు టీచర్లను మాత్రమే బాధ్యుతలను చేసి చూడటం కూడా సరి కాదు. సమాజంలో ఉండే అవలక్షణాలలో భాగంగా టీచర్లూ ఉంటారు. అధికారులు ఏమీ ఎక్కువగా తినరుగా!

కారణాలు ఏవి అయినా సగానికిపైగా ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు పట్టుమని పది అక్షరాలు రాక పోవటానికి కారణం టీచర్ల బాధ్యత, మరుపు, అధికారుల అలసత్వం కారణాలు. ఆ తర్వాతే అన్నీ. ప్రయివేటు టీచర్లతో పోలిస్తే తగిట పొందిన వారు అయి ఉండి, వారి కంటే అయిదు ఆరు రెట్లు ఎక్కువగా జీతం తీసుకొంటూ సామాజిక బాధ్యత లేకుండా ప్రవర్తించటం వల్లే పసి పిల్లలకి అక్షరం ముక్కలు కరువు అవుతున్నాయి. ప్రభుత్వం కూడా విద్యలో తన బాధ్యతను కొడిగట్టించటమే గురిగా పెట్టుకొని ఉంది. తనకు కావాల్సిన పనిని వారు చక్కగా చేసి పెడుతున్నారు కనుక ఉపాధ్యాయ చర్యలను చూసీ చూడనట్లు వదిలివేస్తుంది.

ప్రభుత్వపు బడుల్లో చదువు సొంత భాషలో, శాస్ర్తియ పద్ధతుల్లో ఉంటుంది. ఆ ప్రకారం ఆ బడుల్లో తెలుగు బోధించినా టీచర్లు బాధ్యత లేకుండా ఉండటంవల్ల ప్రమాణాలు ఉండాల్సినంత ఉండటంలేదు. మరో వైపు ప్రయివేటు బడుల్లో టీచర్లు బాధ్యతగా ఉన్నా అశాస్ర్తియ పద్ధతిలో చదువు చెప్పటంవల్ల పిల్లలు చూపాల్సిన అంతగా తమ ప్రతిభను చూపలేకపోతున్నారు. దీనివల్ల మొత్తం విద్యా వ్యవస్థ మేడిపండు చందంగా మారిపోయి ఉంది.