Monday, October 29, 2012

సొంత భాషలోనే వ్యక్తి పునాది - తొలి చదువులు16

27-10-2012

మనసు - అంటే మెదడు పని చేసే విధానమే. చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు, సందర్భం, సంఘటనలకు మనసు స్పందిస్తుంది. అలా స్పందించటం దాని నయిజం. మనసు తత్వం ఎలాంటిది అయినా అది పని చేసే తీరు, తంతు అందరిలో ఒకే రకంగా ఉంటుంది. మనసు చేసే ముఖ్యమయిన పని తనువును పరిసరాలతో సమన్వయ పరచటం. మనసు తరపున ఈ పని చేసి పెట్టేది ‘ఆలోచన’. అంటే ఆలోచన అనేది మనసుకు చెందిన ముఖ్య కార్య నిర్వహణ అధికారి అన్న మాట. మనసుకు నమ్మిన బంటు అయిన కాగ్నిషను ఏ పనిని అయినా 
  1. ‘ప్రేరణ’ (Stimulation)
  2. ‘అనిపింపు’(Feeling ) 
  3. ‘పని’ (Conation)
అనే మూడు అంచె లలో చేస్తుంది. మచ్చుకు ‘‘ఒక వ్యక్తి పామును చూసి భయపడి దూరంగా పరిగెత్తాడు’’ అనుకుందాం. అక్కడ కాగ్నిషను పని చేసే విధానం ‘ప్రేరణ-అనిపింపు-పని’ అనే మూడు అంచెల్లో జరుగుతుంది. పాము అనేది పరిసరాలలో ఉన్న ఒక మేనుక (బౌతిక) రూపం. ఆ మేనుక ‘ప్రేరణ’గా పనిచేసి అది కరిస్తే చని పోతారని అంతకు ముందే మనసులో నాటుకు పోయి ఉన్న నమ్మకాన్ని కదిలించింది. దాంతో భయం అనే ‘అనిపింపు’ (ఫీలింగు) పుట్టి, ప్రమాదం నుండి కాపాడు కోవటానికి దూరంగా పరుగు తీయటము అనే ‘పని’ (కొనేషను) జరిగింది.

పామును చూసిన క్షణం నుండి ఇక్కడ జరిగిన తతంగాన్ని అంతా నడిపింది ఆ వ్యక్తి మనసులో ఉన్న ‘ఆలోచన’. మనసు పనిలో దాదాపు 90 పాళ్ళు ‘ఆలోచన’దే. దీనినే  శాస్త్ర పరి భాషలో ‘కాగ్నిషన్’ (cognition) అంటారు. ఇది మనసులో దండలో దారంలా ఉండి బయటకు కనపడదు. మనసు చేసే అన్ని మానసిక కార్య కలాపాలకు ఆలోచనే కేంద్ర బిందువు. ఒక రకంగా చెప్పాలి అంటే మనసుకు మరో రూపం ఆలోచన. ఒక సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా మసలటానికి కారణం వారి ఆలోచనా పునాదులే. వ్యక్తి ప్రవర్తన ఎవరికివారు కట్టుకున్న ఆలోచనా విధానానికి లోబడి ఉంటుంది. అంటే వారి కాగ్నిషన్ని బట్టి ఉంటుంది.

‘ఆలోచనా వ్యవస్థ’ (కాగ్నిటివు సిస్టం) మనిషికి పుట్టుకతో ఉండదు. దాన్ని కట్టుకొనే చేవ మట్టుకే పుట్టుకతో వస్తుంది. పుట్టాక ఏ బిడ్డకు ఆ బిడ్డ దాన్ని తయారు చేసుకోవాలి. పుట్టిన మరుక్షణం నుంచి వచ్చే అనుభవాలను ఉపయోగించు కొని ఆలోచనా వ్యవస్థను కట్టుకోవాలి. ఈ కట్టు బడికి ఇటుకల లాంటివి మాటలు. అంటే కాగ్నిషను రూపు దిద్దు కోవటం అనేది భాష పునాది మీద జరుగు తుంది. భాష ఎదిగే కొద్ది ఆలోచన పరిధి పెరుగు తుంది. వాటి నుండి నమ్మకాలు ఏర్పడతాయి.
నిజమా కాదా అన్న దానితో సంబంధం లేకుండా నమ్మకాలు ఏర్పడటము, మంచి చెడులతో సంబంధం లేకుండా అభిప్రాయాలు రూపొందించు కోవటం, నైతికమా అనైతికమా అనే దానితో సంబంధం లేకుండా విలువలు పాటించటము అనేవి ఆలోచనా వ్యవస్థ కట్టుబడి మీదే ఆధారపడి ఉంటుంది. బిడ్డలు పెరుగుతున్న సామాజిక పరిసరాలనుండి, మేనుక ప్రేరణల నుండి పొందే సమాచారంతో తమది అయిన ఒక కాగ్నిషన్ని కట్టు కుంటారు. కుటుంబ ఆచారాలు, సమాజపు కట్టుబాట్లు, మనం అందించే శిక్షణ మొదలయినవి అన్నీ పిల్లల కాగ్నిషను రూపు దిద్దు కోవటంలో పాలు పంచుకుంటాయి. కాగ్నిషను దన్నుగా పిల్లవాడి ప్రవర్తన ఉంటుంది. బిడ్డల్లో పుట్టుకతో లేని ఆలోచన వ్యవస్థ పురుడు పోసు కోవాలంటే దానికి ముందు బయిటి సమాచారాన్ని మెదడుకు చేర వేసే ఇంద్రియాలు అయిన చూపు, వినికిడి బాగా పని చేస్తూ ఉండి ఉండాలి. చూపు, వినికిడి లోపంతో పుట్టిన పిల్లలకు తీవ్రతను బట్టి వారి ‘కాగ్నిషను’లో కూడా లోటు ఉంటుంది.

మానవులు ఉపయోగించే భాష ఏది అయినా ఉపయోగించేటప్పుడు అది రెండు పనులు చేస్తుంది. ఒకటి ‘మాట భాష’ (కమ్యూనికేషన్)గా, రెండోది ‘ఆలోచనా భాష’ (కాగ్నిటివ్)గా. మాట భాష అంటే జీవితంలో రోజు వారీ అవసరాల కోసం మాట్లాడుకొనే భాష. మాట్లాడేటప్పుడు వాడే పదాలు, వాటి అర్థాలు, ఉచ్చారణ, ధ్వని స్థాయి, వ్యాకరణం మొదలైనవి అన్నీ ఇందులో భాగం. పిల్లల్లో మొట్ట మొదటిగా ఏర్పడేది ఈ భాషే.

ఆలోచనా భాష అంటే నమ్మకాలు ఏర్పరచు కోవటానికి, మంచీ చెడు ఆలోచించటానికి, విజ్ఞానాన్ని నేర్చు కోవటానికి, విద్యా బోధనకు, సాహిత్య ప్రక్రియలకు ఉపయోగ పడే భాష. ఇది పుట్టుకతో రాదు. ‘మాట భాష’ భాష పెంపు చెందే కొద్దీ, దానిలోని మాటలను, భావాలను తీసుకొని ఆలోచనా భాష కట్టుబడి జరుగుతూ ఉంటుంది. ఏ కట్టడానికి అయినా పునాదులు ముఖ్యం. బిడ్డ ఏ లోపం లేకుండా, పుట్టి, ఎదుగుదల సరిగా ఉన్నట్టు అయితే ఆలోచన వ్యవస్థకు రహదారి భాష. పిల్లల్లో ఇది భాష తోనే మొదలు అయి, భాష ద్వారా జరుగుతూ, భాష తోపాటే పెరుగుతూ 18 ఏళ్ళకు ముగుస్తుంది. ఆ లెక్కన లేత వయసులో భాష పునాదులు ఎంత గట్టిగా ఉంటే ఆ మేరకు ఆలోచన కట్టుబడి కూడా అంతే గట్టిగా ఉంటుంది. ఒకసారి ఆలోచన నిర్మాణాన్ని బలంగా కట్టాక వ్యక్తి అవసరాలకు అనుగుణంగా దాన్ని ఎప్పుడు అయినా మార్చుకోవచ్చు.

సమకాలిక ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లను, సమాజ పోకడల్ని గీటు రాయిగా తీసు కున్నప్పుడు బలమయిన కాగ్నిషను ఏర్పరచుకున్న వ్యక్తులు వారి వారి ఆలోచనా విధానంలో స్థిరంగా ఉంటారు. అలా కానప్పుడు చిన్న చిన్న వత్తుడులకు కూడా తట్టు కోలేరు. ఇలాంటి వారు ఒత్తిడికి గురి అయినప్పుడు డొల్లలాగా ఉన్న వారి ఆలోచనా వ్యవస్థ సుళువుగా చెదిరి పోతుంది. దానితో వ్యక్తి మానసిక రుగ్మతలకు లోను అవుతాడు.

లేత వయసులో సొంత భాష ఎదగకుండా చేయటం అంటే వారి ఆలోచనా భాషను ఎదగనీయకుండా ఆపటం అవుతుంది. పటిష్టంగా ఉండాల్సిన ఆలోచనా భాష బోలుగా ఉండటం వల్ల దానిమీద ఆధారపడి కట్టుకొనే కాగ్నిషను కూడా పునాదులు లేని మేడగానే ఉంటుంది. సొంత భాష అదిమి దాని చోటులోనే నేర్చుకొనే మాట భాష ఎప్పటికీ మాట భాషే. అది వ్యక్తి కట్టుబడిలో ఏ మాత్రం పాలు పంచు కోలేదు. అదే సొంత భాష బాగా ఎదిగాక నేర్చుకొనే ఏ ఇతర భాష అయినా ఆ వ్యక్తిత్వానికి అలంకారంగా మారగలదు

Saturday, October 20, 2012

మెదడు.. మానసిక ఎదుగుదల - తొలి చదువులు-15


                                                                         20-10-2012

ఈ ప్రకృతిలో మనిషి కూడా ఒక జంతువే. అయినప్పటికీ జంతువులకి మనిషికి మధ్య స్పష్ట మయిన తేడా ఉంది. అదే ‘తెలివి’. జీవ పరిణామంలో మానవ జాతికి ప్రకృతి ప్రసాదించిన వరం తెలివి. ఈ తెలివి వల్లే ఇతర జంతువుల కంటే మనిషి ఎగువ మెట్టులో ఉన్నాడు. మనిషి తప్ప దాదాపు అన్ని జంతువులూ ప్రకృతి నిర్దేశించిన నియమాల ప్రకారం నడుచు కుంటాయి. మనిషి మాత్రమే ప్రకృతిని, ప్రకృతి సూత్రాలను తన జీవనానికి తగ్గట్టు మలుచు కోగలడు. అందుకు కారణం ఈ తెలివే. మనిషిని జంతువుల నుండి వేరు చేసింది ఇదే.

జంతువులు అన్నింటి లోకీ సాపేక్షంగా పాలిచ్చే జంతువుల తెలివి ఎక్కువ. వీటిల్లో కూడా మనిషి తెలివి మరీ ఎక్కువ. తెలివి మానవుడిలో ఎదిగినంతగా ఇతర మరే జంతువు ల్లోనూ జరగ లేదు. ఇప్పటి మన తెలివి ఈ రోజుకి ఈ రోజే వచ్చింది కాదు. సుమారు 5 లక్షల ఏళ్ళ నాడు మొదలు అయి, కాలాను గుణంగా సంపాదించుకున్న మార్పులను ఇముడ్చుకుంటూ అవన్నీ పోగుపడి ప్రస్తుత స్థితికి ఎదిగాము. మానవుడిలో పోగు పడిన తెలివిని ఇముడ్చు కొనేందుకు వీలుగా మెదడు కట్టుబడి లోనూ, పరిమాణం లోనూ, పని లోనూ మార్పులు జరిగాయి, ఇంకా  జరుగుతున్నాయి.

మెదడు నాడీ కణాలతో కట్టి ఉంటుంది. ఈ నాడీ కణాలు అవి చేసే పనిని బట్టి రెండు రకాలుగా ఉంటాయి. పనిచేసే ‘అసలు’ నాడి కణాలు ఒక రకం కాగా రెండో రకం వాటికి ఊతను, పోషణను అందించే ‘గ్లియల్’ (బంక) నాడీ కణాలు. అసలు నాడీ కణాలను అతికించి ఉంచుతాయి కాబట్టి వాటికి అలా అంటారు. 
మొత్తం మెదడు నాడీ కణాలలో పని చేయని గ్లియలు కణాలు 90 పాళ్ళు కాగా పని చేసే నాడీ కణాలు కేవలం 10 పాళ్ళే. ఒక మనిషిలో ఉండే ఈ 10 పాళ్ళ నాడీ కణాలను విడి విడిగా తీసి 121 కోట్ల భారతీయులు అందరికీ సమానంగా పంచితే ఒక్కొక్కరి చేతిలో 82 కణాలు పెట్టవచ్చు. అంటే వాటి మొత్తం సుమారుగా పది వేల కోట్లు.

పుట్టే నాటికి బిడ్డ మెదడులో ఎన్ని నాడీ కణాలు ఉంటాయో ఆ తర్వాత కూడా అనే్న కణాలు ఉంటాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ కణాల సంఖ్య పెరగదు. మరయితే పుట్టినప్పుడు చిన్నదిగా ఉన్న మెదడు వయసు వచ్చే కొద్దీ పెద్దదిగా ఎలా పెరుగుతుంది?

వయసు పెరిగేకొద్ది మనిషి పొందే అనుభవాలు మెదడులో నమోదు అవుతూ వుంటాయి. వ్యక్తి పొందే ప్రతీ అనుభవము నాడీ కణాలలో మేనుకంగా (ఫీజికల్) జ్ఞాపకపు ప్రొటీనులుగా మారుతాయి. అవి తరువాత మన జ్ఞాపకాలకు ‘బ్లూ ప్రింటు’లా పని చేస్తాయి. అనుభవం ఎంతగా పెరుగుతుంటే వాటి తాలూకు ప్రొటీనులు తయారీ కూడా అంతే మేరకు పెరుగుతాయి. నాడీ కణాలలో పేరుకు పోయే ప్రొటీనుల నిలువలు ఎక్కువ అయ్యే కొద్దీ నాడీ కణాలు ఉబి పరిమాణంలో పెరుగుతాయి. పరిమాణంలో పెరగటం తోపాటు వాటి మధ్య సమాచార మార్పిడి కోసం అనుసంధానపు తీగలను ఏర్పరచుకుంటాయి. ఒక పక్క నాడీ కణాల పరిమాణం పెరగటం, మరో పక్క వాటి మధ్య అను సంధానపు తీగలు ఏర్పడటం వల్ల మొత్తంగా మెదడు పరిమాణం పెరుగుతుంది.

మెదడు మేనుక ఎదుగుదలలో 90 శాతం మొదటి అయిదు ఏళ్ళలోపే జరుగుతుంది. 16 ఏళ్ళ వరకూ మిగిలింది జరిగి ఆగి పోతుంది. బిడ్డ ఎదుగుదలలో ఈ మొదటి అయిదు ఏళ్ళు అత్యంత కీలకం అయినవి. మెదడు ఎదుగుదల మేనుకంగా ఆగి పోయినా అవసరాన్ని బట్టి ఇతర కణాలతో సంబంధాన్ని అదుపు చేసుకోగల చేవ నాడీ కణాలుకు ఉంటుంది. అక్కర ఎక్కువ అయినప్పుడు సంబంధాలు పెంచుకోవటాన్ని ‘న్యూరోనల్ బ్రాంచింగ్’ (అంటే చిగురించటం) అని, తెంచుకోవటాన్ని ‘న్యూరోనల్ ప్రూనింగ్’ (అంటే కత్తిరించటం) అని అంటారు. మానవుడి మెదడులో నిరంతరం అవసరం మేరకు బ్రాంచింగులూ, ప్రూనింగులూ జరుగుతూనే ఉంటాయి. ఈ మొత్తం తతంగాన్ని వైద్య భాషలో ‘న్యూరో ప్లాస్టిసిటి’ అంటారు.


ఎదిగే పిల్లల నాడీ కణాలు అత్యంత వేగంగా, చురుగ్గా ‘బ్రాంచింగ్’ జరుపగల చేవను కలిగి ఉంటాయి. అయితే ఈ చేవ మొత్తం ఉపయోగం లోకి రావాలి అంటే అందుకు ‘అవసరం’ ఏర్పడాలి. అంటే పని ఉంటేనే నాడీ కణాల మధ్య ‘బ్రాంచింగ్’ బాగా జరుగుతుంది. అంటే పరిసరాల ప్రేరణలు ఉంటేనే మెదడు ఎదిగేది. పరిసరాల ప్రేరణలు అంటే బిడ్డ సమాజం నుండి పొందే అనుభవాలు. అందులో అర్థం అయ్యే చదువు కూడా ఒకటి.


Sunday, October 14, 2012

స్వంత భాషతోనే ముందడుగు - తొలి చదువులు-14

                                                                           12-10-2012 
                               

                                   ఆఫ్రికా-యునెస్కో అధ్యయనం

ఆఫ్రికా విద్య అభివృద్ధి సంస్థ, యునెస్కోకి చెందిన విద్యా సంస్థ ఉమ్మడిగా ఆఫ్రికాలో అమలు అవుతున్న విద్యా విధానం పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచటంలో ఎందుకు విఫలం అవుతుందో తెలుసుకోవటానికి ఆ దేశంలో ఉన్న పలు రాష్ట్రాలలో పెద్ద పరిశోధన జరిపింది.

ఆఫ్రికా ప్రభుత్వాలకు మన ప్రభుత్వంలాగే పసి బిడ్డలు అందరికీ ఒకటో తరగతి నుంచే అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లాన్ని నేర్పించాలనే ఉబలాటం ఎక్కువ. కొన్ని ప్రభుత్వాలు పిల్లల మీద దయదలచి నాలుగో తరగతి నుండి ఆంగ్లాన్ని ప్రవేశ పెట్టాయి. కొంత కాలానికి విద్యా ప్రమాణాలు మొత్తంగా పడి పోవటం మొదలు అయింది. అమలులో ఉన్న విద్యా విధానం ఎందుకు విఫలం అయిందో విచారించటానికి పై రెండు సంస్థలు రంగం లోకి దిగి కారణాలను వెతకటం మొదలు పెట్టాయి. పిల్లలకు సొంత భాషను ఎదగనిచ్చి ఆ తరువాత దాని ద్వారా ఆంగ్లాన్ని సరిగా నేర్పకుండా నేరుగా పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలోకి తొయ్యటం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నట్టు తేల్చి చెప్పాయి. పరిశోధనా ఫలితాలు ఇలా ఉన్నాయి.

పిల్లలు తమ సొంత భాషలో చదివినంత వరకూ విద్యా ప్రమాణాలు బాగా ఉంటున్నాయి. ఆంగ్ల మాధ్యమంలోకి మారిన ఒకటి రెండేళ్ళలోనే వారి చదువు దిగజారటం మొదలు అయి ఉన్నత విద్య పూర్తి అయ్యే నాటికి సరాసరిన 30 శాతం విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. చాలా కొద్దిమంది పిల్లలు మట్టుకు ఆరో తరగతికి వచ్చేసరికి ఆంగ్ల మాధ్యమంలో నిలతొక్కుకోగలుగుతున్నారు. మిగిలిన పిల్లలు అసంపూర్ణ చదువులతో బడి మానేయటమో, అత్తెసరు ప్రమాణాలతో పాఠశాల నుండి బయటపడటమో జరుగుతుంది. సొంత భాషలో చదివిన పిల్లల విద్యా ప్రమాణాలు జాతీయ స్థాయి సరాసరి 69 శాతం కాగా అదే ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లల జాతీయ సరాసరి విద్యా ప్రమాణాలు 32 శాతంగా ఉన్నట్టు తేలింది. అధ్యయన మొత్తం సారం ఇలా ఉంది.
  • కనీసం మూడో తరగతి వరకూ సొంత భాషను బాగా ఎదగ నివ్వటం అవసరం. కానీ అలా జరగటం లేదు. 
  • ఆంగ్లాన్ని బోధనా భాషగా వాడాలి అంటే దాన్ని బాగా నేర్పించాలి. ఆంగ్లాన్ని బాగా నేర్చు కోవటానికి కనీసం ఏడేళ్లు పడుతుంది. 
  • ఆంగ్ల మాధ్యమం కోసం మధ్య లోనే సొంత భాషను వదిలేయటం వల్ల పిల్లల విద్య పెంపు, మానసిక ఎదుగుదల దెబ్బ తింటున్నాయి. 
  • సరిగా రాని భాషలో బోధన వల్ల గణితం, సైన్సులలో పిల్లలు రాణించలేక పోతున్నారు.

                                                               తమిళనాడు అధ్యయనం
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలో డా కె. రామస్వామి, డా శ్రీవాత్సవ 8, 9 తరగతుల పిల్లలతో ‘బోధనా భాష - నైపుణ్యం’ అనే అంశం మీద చేసిన పరిశోధనలో సొంత భాషలో చదివిన పిల్లల్లో, మానసిక వికాసం, భావ ప్రకటనా నైపుణ్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లలు చదవటం, రాయటం నైపుణ్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లలు చదవటం, రాయటం నైపుణ్యాలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ (ఇది శిక్షణలో తేడా వల్ల కనిపించే మార్పు) మిగిలిన విషయాలలో సొంత భాషలో చదివిన వారి కంటే వెనుక పడి ఉన్నారు. తమాషా ఏమిటంటే ఇదే ఇంగ్లీషు మీడియం పిల్లలకు ఎగువ తరగతులకు రాక మునుపు మంచి భావ ప్రకటనా నైపుణ్యం ఉంది. తరగతులు పెరిగే కొద్దీ చదవాల్సిన సిలబసు పెరగటం ఒక కారణం కాగా సొంత భాష ద్వారా పొందాల్సిన మానసిక వికాసం, మాటల చాతుర్యం తగ్గటం ఇందుకు కారణాలు. 

ప్రపంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా జరిగిన ప్రతి పరిశోధనలోనూ తేలిన నిప్పులాంటి నిజం ఏమిటంటే, తొలి ప్రాయంలో చెప్పే చదువును సొంత భాషలో చదివిన పిల్లల్లో ప్రతిభా పాటవాలు అత్యంత ఉన్నతంగా ఉంటున్నాయి అని. దీని అర్థం ప్రాథమిక విద్యను ఇతర భాషలో చదివిన పిల్లలకు ప్రతిభ లేదనే కదా.

బోధనా ప్రమాణాలు, వసతులు ఒకే రకంగా ఉన్నప్పుడు, ఉన్న తెలివి చేవను ఉపయోగించుకొని ప్రతిభగా మలచుకొనే దారిలో సొంత భాషలో చదివిన వారి కంటే పరాయి భాషలో చదివిన పిల్లలు ఖచ్చితంగా వెనుక బడి ఉంటారు. సొంత భాషలో విద్య నేర్చు కోవటంవల్ల పిల్లలకు ఉన్న సామర్థ్యాన్ని అత్యంత ఎక్కువగా చూప గలరు అనేది మొత్తం పరిశోధనల సారం.

Monday, October 8, 2012

తల్లి బాషలో చదువు పై పరిశోధనలు ఏమంటున్నాయి? తొలి చదువులు-13


7 సెప్టెంబర్ 2012

తొలి చదువులు-13

పిల్లలకు చదువు ఏ భాషలో చెబితే బాగా అర్థం అవుతుందో అనేది (అందరికీ తెలిసిన సంగతినే) నిరూపించటానికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల శాస్ర్తియ పరిశోధనలు జరిగాయి. వాటిల్లో అంతర్జాతీయ ప్రాధాన్యతను పొందిన కొన్ని పరిశోధనలను పరికించి చూద్దాము. 
    
                                                    ప్రపంచ బ్యాంకు అధ్యయనం 

తొలి చదువును బిడ్డల సొంతభాషలో చెప్పినప్పుడు, అదేపనిగా నేర్పించిన రెండో భాషలో చెప్పినపుడు - దేని ప్రభావం ఎలా ఉంటుంది అన్న సంగతిని ప్రపంచ బ్యాంకు తెలుసుకోవాలి అనుకుంది. దాని కోసం ఓ అంతర్జాతీయ సమీక్షా అధ్యయనాన్ని (Dutcher 1994) నిర్వహించారు. ఈ అధ్యయనాన్ని మూడు వేరు వేరు ప్రత్యేక నేపథ్యాలున్న దేశాలలో జరిపారు. తమ సొంత భాషను విరివిసమాచారం (వైడ్ కమ్యూనికేషన్) కోసం అసలు వాడని (హైతి, నైజీరియా) దేశాలు, పాక్షికంగా వాడే (గాటిమాల లాంటి) దేశాలు, పూర్తిగా వాడే (కెనడా, న్యూజిలాండు, అమెరికా) దేశాలలో విడివిడిగా చేశారు. ఈ అధ్యయన ఫలితాలు ఇలా ఉన్నాయి. 
  1. బోధనా భాష మీద పట్టు ఉన్న విద్యార్థులు చదువులో బాగా రాణిస్తున్నారు. 
  2. బోధనా భాష మీద పట్టు రావటానికి నాలుగు నుంచి ఏడు ఏళ్ళు పడుతుంది. 
  3. మది ఎదుగుదల (కాగ్నీషను), ‘సబ్జక్టు’ల నైపుణ్యాలు విద్యార్థికి పట్టు ఉన్న భాషలోనే ఎక్కువగా ఉన్నాయి. 
  4. తొలినాళ్లలో సొంత భాషలో పొందిన శిక్షణ అంతా ఆ తరువాత నేర్చుకొనే రెండో భాషలోకి మార్పిడి జరుగుతుంది. 
  5. సొంత భాష మీద ఎంత పట్టు ఉంటే అంత బాగా రెండో భాషను నేర్చుకుంటారు. 
  6. నేర్చుకొనే రెండవ భాష స్వచ్ఛత, వేగం ఆ సమాజపు పోకడలు, సంస్కృతి, వసతులు నిర్ణయిస్తాయి.

ఈ ఫలితాలను ఆనింపుగా చేసుకొని విద్యార్థుల్లో దాగి ఉన్న తెలివి చేవను వెలికితీసి ప్రతిభగా మార్చేందుకు ఉన్నదాన్నంతా ఉపయోగం లోకి తెచ్చేందుకు కొన్ని సాధారణ పాటింపులను సూచించారు. (పూర్తి వివరాలకు www.cal.org లో ఛూడవచ్చు)
  • పరాయి భాషను బోధనా భాషగా ఎన్నుకోవాలి అంటే, ఆ భాష మీద ప్రావీణ్యం రావాలి. అందుకుగాను ముందు సొంత భాషను బాగా ఎదగనివ్వాలి. కాని - ఇక్కడ మనం అణచివేస్తున్నాం.

  • నేర్చుకొనే రెండో భాష ఎదుగుదలలో తల్లిదండ్రులను, సమాజాన్ని భాగస్వాములుగా చేయాలి. - మనకు సొంత భాష విషయంలో ఇది జరుగుతుంది. ఇంగ్లీషుకు ఈ రెండూ లేవు.

  • భాషను బోధించే ఉపాధ్యాయులు దీన్ని అత్యంత చాకచక్యంగా నేర్పించే నేర్పును కలిగి ఉండాలి. దాన్ని నిరంతరం మెరుగుపరచుకుంటూ ఉండాలి. - మన టీచర్లు అందరూ దాదాపు ఇంగ్లీషు సరిగా రాని పదో తరగతి / ఇంటరు చదివినవాళ్లు.


                                                      బ్రిటన్ ప్రభుత్వం అధ్యయనం:

బ్రిటను ప్రభుత్వం 2,200 మైనారిటీ తెగలకు చెందిన విద్యార్థులకు పాక్షికంగా వారి సొంత భాషలో చదువు చెప్పటం మొదలు పెట్టింది. సాధారణ విద్య తోపాటు మిగతా సమయంలో ఎవరి సొంత భాషలో వాళ్ళకు అదే సిలబసును తిరిగి బోధిస్తారు. వీటివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఈ నిర్ణయం తీసుకోవటానికి బ్రిటీషు ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఇవి.విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సంకల్పం పెరిగాయి. అలాగే సామాజిక నైపుణ్యాలు పెరిగాయి.ఇలా చేశాక వారు గతంలో కంటే ఎక్కువ ప్రతిభను కనపరిచారు. జార్జి మాసన్ అధ్యయనం: జార్జి మాసన్ యూనివర్సిటీకి చెందిన ‘వర్జీనియా పి.కొల్లియర్’ తదితరులు వలస పిల్లలకు ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం మీద ఒక పరిశోధన చేశారు. 

అమెరికాలో బోధనా భాష ఇంగ్లీషు. ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారి పిల్లలు కూడా ఇంగ్లీషు మీడియంలో చదవాలి. అమెరికా బడుల్లోకి రావడానికి మునుపు సొంత దేశంలో రెండు మూడేళ్ళు తమ భాషలో చదివిన పిల్లలు 5 నుండి 7 సంవత్సరాలలో అమెరికా పిల్లలతో దీటుగా ఇంగ్లీషు మీద పట్టు సంపాదించగా, తమ సొంత భాషలో చదవని వారికి ఇంగ్లీషు మీద పట్టు రావడానికి 7 నుండి 11 లేదా ఇంకా ఎక్కువ కాలం పట్టింది. ప్రఖ్యాత భాషా శాస్తవ్రేత్త ‘కుమ్మిన్స్’ అంతకు ముందే (1981) పరిశోధన చేసి ఇదే విషయాలను తేల్చాడు. కొల్లియర్ తదితరులు చేసిన ప్రయోగాలలో కూడా కుమ్మిన్స్ ఫలితాలను పోలి ఉన్నాయి. ఈ పరిశోధన మొత్తం సారం ఏమిటంటే, ఎవరికి అయితే సొంత భాషలో బాగా పట్టు ఉంటుందో ఆ పిల్లలు చాలా వేగంగా ఏ భాషను అయినా తొందరగా నేర్చుకుంటారు అనేది.

ఇదే యూనివర్సిటీ ఆధ్వర్యంలో మరో పెద్ద పరిశోధన జరిగింది. ఇందులో 15 రాష్ట్రాలలో 23 పాఠశాలల్లో 11 ఏళ్ళపాటు సొంత భాషలో ప్రాథమిక విద్య మీద పరిశోధన నిర్వహించారు. ఇందులో ఆంగ్లంలో బోధించిన పాఠాలను తిరిగి వాళ్ల తల్లి భాషలో కూడా బోధించారు. తర్వాత ఫలితాలను విడమరచి చూస్తే పాక్షికంగా అయినా సరే తల్లి భాషలో బోధన జరిపిన పిల్లలు ఎక్కువ ప్రతిభను కనపరచడం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.