Saturday, July 28, 2012

బోధనా భాష అంగడి సరుకు; తొలి చదువులు -3

                                                                         28-7-2012


ఏ సమాజం అయినా భావితరాలకు బోధించే విద్యలో జాతి అవసరాలతోపాటు దాని సామాజిక, సాంస్కృతిక వారసత్వం కొనసాగే విధంగా జాగర్త తీసుకుంటుంది. అలా చేస్తేనే ఆ జాతి తన ఉనికిని చాటుకోగలదు. అలాంటి బాధ్యతను ఆయా ప్రభుత్వాలు తీసుకుంటాయి. విద్యా రంగంలో ప్రభుత్వం తన బాధ్యత నుండి పక్కకు తప్పుకొని అదుపును పోగొట్టుకుంటుందో అప్పటినుంచి ఆ జాతి సామాజిక, సాంస్కృతిక వారసత్వానికి పతనం మొదలు అయినట్టే. విద్యా విధానంలో ప్రయివేటు వాటా పెరిగే కొద్ద్దీ దాని మీద నియంత్రణ లేకుండా పోతే వ్యాపార ధోరణులు ముందుకు వస్తాయి. వ్యాపారంగా మారిన విద్యలో ‘లాభం’ ముందు సామాజిక ప్రయోజనం ఎవరికీ పట్టదు.

‘ఈ-కాలం’లో కార్పోరేటు రంగానికి మెతక కూలీలు కావాలి. అందులోనూ ఇంగ్లీషు పనితనం ఉన్న కూలీలు కావాలి. దొరకాలే కానీ నేరుగా కాలేజీలనుండే ఏరుకు పోయి, వేలకువేలు జీతాలు ఇస్తున్న పరిస్థితి. మన బిడ్డ వాటిని అందిపుచ్చుకోవాలి. అంతేనా... పట్టా (పొట్ట కాదు) చేత పట్టుకొని వలస పోతే కూడా కావాల్సినంత డబ్బు. వీటి అన్నింటికి ఇపుడు ఇంగ్లీషు కావాలి. అంటే ఇంగ్లీషును కొనే ‘ఇంగ్లీశుదారీ’ వర్గం ఒకటి వెలిసింది. వీరికి ఇంగ్లీషు సరుకు కావాలి. గతంలో అయితే అక్కడక్కడా ఈ సరుకును అమ్మే చిన్న చిన్న అంగళ్ళు (బడులు) ఉండేవి. ఇప్పుడు డిమాండు పెరిగింది. వ్యాపారం ఊపు అందుకుంది. అమ్మే అంగళ్ళకు మంచి డిమాండు ఉంది.
విద్య వ్యాపారం అయినప్పుడు మార్కెట్టులో ‘బోధనా’ వస్తువును అమ్ము కునేందుకు పోటీ ఉంటుంది. వ్యాపార పోటీలో నెగ్గ టానికి ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్నింటిని విద్యా వ్యాపారులు ఉపయోగిస్తారు . ‘వినియోగదారులు’ అయిన విద్యార్థి తల్లిదండ్రుల్ని ఆకర్షించటానికి టక్కు టమారాలతో ప్రచారం మొదలవుతుంది. అందులో మొదటిది పిల్లల శక్తి, సామర్థ్యాలతో సంబంధం లేకుండా ఎక్కువ మార్కుల్ని తెప్పించటం, తద్వారా మీ పిల్లలు తెలివిగలవారు అని తల్లిదండ్రుల్ని నమ్మించటం. రెండోది పిల్లల తెలివితో, మానసిక వికాసంతో సంబంధం లేకుండా బోధించటం జరుగుతుంది. అందుకు తగ్గట్టు బోధనా పద్ధతుల్లో, చదివించే తీరులో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ తీరులోనూ అశాస్ర్తియ పద్ధతులు చోటుచేసుకున్నాయి. బుద్ధి మాంద్యం ఉన్న పిల్లలకు కూడా నూటికి 90 మార్కులు ‘తెప్పించి’ తల్లిదండ్రుల్ని మురిపించగల చాకచక్యం ఇప్పటి ప్రయివేటు బడుల దగ్గర ఉంది.
గ్రామ ప్రాంత పిల్లలూ, పట్టణాలలో పేద పిల్లలు ఎక్కువ భాగం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా పట్టణాలు, నగరాలలో అధిక భాగం తమ పిల్లల్ని ప్రయివేటు బడులకు పంపుతున్నారు. రానురాను ఈ పరిస్థితి కూడా మారుతూ ఉంది. గ్రామాలలో ఉండే ఉన్నత కుటుంబాలవారు తమ పిల్లల్ని పట్టణాలో ఉంచి ప్రయివేటు పాఠశాలల్లో చదివించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరో పక్క పట్టణాలు, నగరాలలో పేద ప్రజలు సయితం కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఏ మాత్రం కాస్త బాగున్నా తమ పిల్లల్ని ప్రయివేటు పాఠశాల్లో చేర్పించేందుకు వెనుకాడటంలేదు. ప్రయివేటు విద్యాలయాల వైపు ప్రజలు మొగ్గు చూపటానికి కారణాలను ఆరాతీస్తే, ఈ కారణాలు కనపడుతాయి.
  • విద్యార్థిపట్ల చూపే వ్యక్తిగత శ్రద్ధ
  • వారి బోధనా పద్ధతి
  • సెలవుల్లో టీచర్లని ఇంటింటికి తిప్పి పిల్లల్ని చేర్పించటం
  • చేర్పించిన వారికి కమీషన్లు ఇవ్వటం
  • మార్కులు, ర్యాంకులకు సంబంధించిన ప్రచార ఆర్భాటం
  • బోధనా మీడియం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యామోహం
  • ఉన్నంతలో మవులిక సదుపాయాల కల్పన
  • విద్య లాభసాటి వ్యాపారంగా మారటంతో ఎక్కువ ప్రోత్సాహం
  • ప్రభుత్వ బడుల అలసత్వం, కొడిగట్టు తున్న వాటి నాణ్యత
ప్రైవేటు బడుల్లో వౌలిక సదుపాయాలు, బోధనా వసతులు మెరుగ్గా ఉన్నాయి అనేది కాదనలేని నిజం. దానికి తగ్గట్టు విద్యా ప్రమాణాలుకూడా పెరిగినట్లు బయటకు ‘అనిపిస్తున్నాయి’ కానీ మొత్తంగా పట్టి చూస్తే అది ఉత్త డొల్లే అనేది ‘ఆసర్’ నివేదిక చెప్పకనే చెప్పింది.
మన చెడు రాత ఏమిటి అంటే పయిన చెప్పిన తీరులో పిల్లల్ని మలిచి, అదే ప్రతిభ అనీ, అలా చదువు చెబితేనే తెలివిగలవారిని తయారుచెయ్యొచ్చని ఒక ‘నమూనా’ (Model) తయారయి ఉంది. అంతటా అవే సరి అయిన పద్ధతులుగా చలామణి అవుతున్నాయి. ఈ ధోరణులు ఎంతవరకు పోయాయి అంటే వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం కూడా ప్రయివేటు పాఠశాలలు ప్రదర్శించే టక్కు టమారాలకు తోడు గోకర్ణ, గజకర్ణ విద్యల్ని కలిపి ప్రదర్శించేందుకు సిద్ధపడుతున్నది. ఈ మొత్తం పరిణామాలు జాతి, భాషా, సంస్కృతుల మనుగడకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి.

Saturday, July 21, 2012

గొర్రెదాటు పోకడలు; తొలి చదువులు -2


22-7-2012

గతంలో పిల్లలు పది పాసు అయ్యాక చదువులో వారి సమర్థతను బట్టి ఇంటరులో ఏ గ్రూపు తీసుకోవాలో నిర్ణయం తీసుకునేవారు. పిల్లలకు అప్పటికి 15 ఏళ్ళు నిండి ఉంటాయి. ముందు జీవితాన్ని గమనంలో ఉంచుకొని ఆలోచించగల కనీస మానసిక వికాసం వారికి ఆ వయసులో ఉంటుంది. కాబట్టి ఉన్న సమర్థతకు తమ ఇష్టాన్ని కూడా కలుపుకొని గ్రూపును ఎన్నుకొనేవారు. తల్లిదండ్రులు మహా అంటే అవసరం అయిన సలహాలను, సమాచారాన్ని మట్టుకే అందించేవారు. ఇది పోయిన కాలం.

నేడు మన రాష్ట్రంలో నడుస్తున్నది ఐ.ఐ.టీ., మెడికలు ఫౌండేషను సంస్కృతి. అంటే ఎనిమిదో తరగతి నుంచే ఐఐటిలలో, మెడికలు కాలేజీలలో సీటు కొట్టటమే గురిగా ‘పునాది’ (్ఫండేషన్) కోర్సులను మెదడులోకి చొప్పించే చదువు అన్నమాట. ఈ బాపతు స్కూళ్ళు వచ్చాక భవిష్యత్తులో బిడ్డ చదవాల్సింది ఐ.ఐ.టి లేదా మెడిసిను అనీ 8-దో తరగతిలోనే తల్లిదండ్రులు నిర్ణయించేసేస్తారు. బిడ్డ తన ఇష్టాన్ని తెలుసుకొనే ఈడు రాకుండానే ఏ గ్రూపును చదవాలో ముందుగానే నిర్ణయం జరిగిపోతుంది. ఇక పిల్లవాడి నిర్ణయం మారటానికి లేదు.
ఇపుడు ఆ పోకడ ఇంకా కాస్త ముదిరి కొన్ని విద్యా సంస్థలు 6-రో తరగతిలోనే ఐఐటీ, మెడికలు పునాది కోర్సులు మొదలుపెట్టాయి. ఈ బడులు ‘ఈ-టెక్నో’ స్కూళ్ళు, ‘నానో’ స్కూళ్ళు, ‘ఒలింపియాడులు’, ‘గ్లోబలు’ స్కూళ్ళు లాంటి తేనె పూసిన పేర్లతో బోర్డులు లేపాయి. జనం కూడా వాటి ముందు ‘క్యూ’ కడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ జాడ్యం ఎల్కేజీ, యూకేజీలకు పాకినా అబ్బుర పడాల్సిన పనిలేదు.
ఐఐటి ఫౌండేషను అనేది ఏమిటో, అందులో సాధారణ విద్యకు మించి ఏమి నేర్పిస్తారో చేరే పిల్లలకు కాని, చేర్పించే తల్లిదండ్రులకు కానీ, చివరికి ఆ కోర్సులను అందించే విద్యా సంస్థలకు కూడా తెలియదు. విచారించగా విచారించిగా ఒక్క సంగతి మట్టుకు తెలిసింది. అదేమిటి అంటే ఐ.ఐ.టీలుకు అయితే లెక్కలను, మెడికలుకు అయితే బయాలజీని పదే పదే ప్రాక్టీసు చేయిస్తారట. దిగువ తరగతుల్లోనే ఎగువ తరగతులు సిలబసు నేర్పించేస్తారట. పోనీ ఐఐటి/మెడిసినులో సీటు సంపాదించటమే పిల్లల (నిజానికి తల్లిదండ్రుల) జీవిత గురి అనుకున్నా, ఏటా కొన్ని వందల మందికి మట్టుకే దొరికే అవకాశం ఉన్న ఆ సీట్ల కోసం ఆరో తరగతినుండే కొన్ని లక్షల మందిని బలి చేయడం అవసరమా? ఒకటో తరగతిలో చేరిన వెయ్యి మందిలో ఒకరు అలాంటి స్థాయికి పోయినా మిగతా పిల్లలు ఎక్కడ రాలి పోయారు అన్న సంగతి గురించి మనకు కన పడదా? కనపడ్డా మనం పట్టించుకోమా? ఆ కొద్ది మందికి తప్పిస్తే మిగిలిన వారికి అది ఎండమావే కదా! ఎండమావి నీరు కోసం పిల్లల్ని అంతగా ఇక్కట్లకు గురి చేయాలా? సీటు రాని పిల్లలు ఆ తరువాత ఎందుకు పనికి వస్తారూ? అనే విషయాల మీద బిడ్డల్ని చదివించే తల్లిదండ్రులకు సవాలక్ష సందేహాలు కలుగుతున్నాయి. ఈ సంగతులను శాస్ర్తియంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు సమాజంలో వేళ్ళూనుకొని ఉన్న ఓ పెద్ద భ్రమ ఏమిటంటే, ప్రయివేటు బడుల్లో, అందులోనూ ఇంగ్లీషు మీడియంలో చదివితే పిల్లలకు చదువు బాగా వస్తుందని, ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రయివేటు బడుల్లో విద్యా ప్రమాణాలు పిసరంత ఎక్కువే అనిపించినా వాటికి ఉన్న మవులిక  సదుపాయాలు, బోధనా సౌకర్యాలు, సిబ్బంది, వీటికోసం వెచ్చిస్తున్న డబ్బును పరిగణనలోకి తీసుకుంటే అవి సాధించే ఫలితాలు ఆవగింజలో అరవయ్యోవంతే.
దేశంలో ప్రాథమిక విద్య స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోను కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద సర్వే చేయిస్తుంది. ఆ సర్వే పేరు ‘ఆసర్’ ((ASER - Annual Status of Education Report)) ఈ సర్వేలోనే ప్రభుత్వ విద్యా విధానం లోటు పాట్ల తోపాటు ప్రయివేటు బడుల మేడిపండు పొట్టను విచ్చింది. తమ బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాయి అనుకుంటూ, వేలకు వేలు ఫీజులు కట్టి తమ పిల్లలను చదివిస్తున్న ప్రయివేటు బడుల్లో (మీడియం ఇంగ్లీషు అని చెప్పాల్సిన పనిలేదు) ప్రమాణాలు ఇలా ఉన్నాయి.
ప్రయివేటు బడుల్లో ప్రాథమిక విద్యను చదివే పిల్లల్లో నూటికి 34 మంది పిల్లలు చిన్న పేరాని చదవలేరు, అలాగే 60 మంది పిల్లలు సరళంగా ఉండే కథను చదవలేక పోతున్నారు. ఇక లెక్కల సంగతి చూస్తే తీసివేత చేయలేని పిల్లలు నూటికి 42కాగా, భాగాహారం చేయలేని వారు 71గా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం అయ్యేది ఏమిటంటే, ప్రాథమిక విద్య పూర్తయ్యే నాటికి దాదాపు సగం మందికి పూర్తిగా చదవటము రాయటము కూడా రావటం లేదు.

Saturday, July 14, 2012

ఏది నిజం ?; తొలి చదువులు -1


14-7-2012

పిల్లల చదువులో బోధనా భాషగా తల్లి భాషను వాడాలా? లేక ఇంగ్లీషును వాడాలా? అని గత పాతిక ఏళ్ళుగా చర్చలు, వాదనలు, ప్రతి వాదనలు జరుగుతున్నాయి. పసి పిల్లలకు వారి సొంత భాషలోనే విద్యా బోధన ఉండాలి అని ఒక వర్గం అంటుండగా, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ఇప్పటి అవసరాలకు తగ్గట్టు ఇంగ్లీషులో బోధన జరగాలని మరో వర్గం గట్టిగా వాదిస్తున్నది. భాషను కాపాడటము, స్వావలంబన, సంస్కృతి, మేథాతనం, వ్యక్త్తిత్వ వికాసం లాంటి అంశాలు మొదటి వర్గానికి వాదనా వస్తువులు. ఉపాధి అవకాశాలు, మార్కెటింగు, ఆర్థిక అసమానతలు, కుల వివక్షతలు రెండో వర్గానికి పనికివస్తున్నాయి.



ఈ విషయం మీద అక్షర జ్ఞానం లేని తల్లిదండ్రులు మొదలు విద్యా వేత్తలవరకూ ఏదో ఒక వాదన పక్క నిలబడక తప్పని పరిస్థితి. ఇందులో మళ్లీ ఎవరి కోణం వారిదే. ఎవరి వాదనలను వారు వినిపిస్తున్నా ఉభయ గుడారాలలోనూ నిజాయితీగా సమాజ మంచి కోరే వారు ఉన్నారు. అలాగే వ్యాపారం, వర్గ ప్రయోజనాల కోణంతో మాట్లాడేవారూ ఉన్నారు. వీరిలో ఏ కొద్దిమందో తప్ప ఎక్కువ భాగం గుడ్డివాళ్ళు ఏనుగును తడిమినట్టు ఉంటుంది. చదువు చుట్టూ ఉన్న అనేక అంశాలను పట్టించు కోకుండా పైపైన కనిపించేదే నిజం అని నమ్మే ధోరణితో సొంత అనిపింపులు వినిపిస్తుంటే ఈ గందరగోళంలో అసలు నిజం ఏది అన్నది పెద్ద ప్రశ్న.

సైన్సులో ‘నిజా’నికి ‘అభిప్రాయా’నికి మధ్య స్పష్టమయిన విభజన రేఖ ఉంటుంది. ఇక్కడ నిజం తెలియనంత వరకే అభిప్రాయానికి విలువ. నిజం తేలాక ఇక దానిమీద అభిప్రాయాలకు తావు లేదు. తెల్లటి కాంతిలో ఏడు రంగులు ఉన్నాయి అని ఒకసారి ప్రయోగపూర్వకంగా తేలాక ఇక దీనిమీద అభిప్రాయాలకు తావు వుండదు. ఆ విధంగా భౌతిక శాస్త్రాలలో నిజాన్ని- అభిప్రాయాన్ని వేరుచేసే గీత ఉంటుంది. సామాజిక అంశాలు కూడా శాస్త్రాలే అయినప్పటికీ అవి భౌతిక శాస్త్రాలు ఉన్నంత నిలకడగా ఉండవు. కారణం ఏమిటంటే అవి తేడాలతో ఉన్న వ్యక్తుల గుంపులతో కట్టబడిన సమాజాన్ని గురించి చదివే శాస్త్రాలు. వీటిని గురించి అటు నిష్ణాతుల నుండి ఇటు సామాన్యుడు వరకు ఎవరైనా మాటాడవచ్చు. అయితే మాటల్లో పరిశీలన, లోతు లేకుండా పైపై గమనింపులతో బిగింపు ‘చూపు’తో వాదనలకు దిగితే అందులో గందరగోళం తప్ప చివరిగా నిజం బయటకు రాదు.

విద్యా విధానం పట్ల ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. కానీ విద్యా ‘బోధన’కు సంబంధించి కొన్ని శాస్ర్తియ పద్ధతులు ఉన్నాయి. వాటిని కాదని సొంత అనిపింపుల ప్రకారం వాదనలు వినిపించటం, ప్రణాళికలు తయారుచెయ్యటం సరైన పద్ధతి కాదు. ఎందుకూ అంటే ప్రాథమిక విద్యలో కేంద్ర బిందువు ఇంకా ‘వికసించని’ బిడ్డ.

ప్రాథమిక విద్యకు సంబంధించి ఏ అంశాన్ని ముందుకు తేవాలి అన్నా, దాన్ని అనేక మూలాల నుంచి పరిశీలించాలి. బిడ్డ పుట్టుక, సామర్థ్యం, శారీర ఎదుగుదల, మానసిక వికాసం గమనంలో ఉంచుకోవాలి. బిడ్డ పెరుగుతున్న వాతావరణం, సామాజిక అవసరాలు, సాంస్కృతిక వారసత్వం లాంటి అనేక కోణాల నుంచి చూడాలి. వీటి ఆధారంగా ప్రాథమిక విద్యా బోధన ఎలా ఉండాలో నిర్ణయిస్తే అది ఉన్నంతలో శాస్ర్తియంగా ఉంటుంది. దానివల్ల అనుకున్న ఫలితాలూ వస్తాయి.

బోధనా తీరులు ఎలా ఉన్నా, ఏ సంగతులు బోధిస్తున్నా, బోధించే భాష మీద పిల్లలకు పట్టులేనట్టు అయితే పుట్టుకతో వచ్చే తెలివి, సృజనాత్మకత పూర్తిగా విరబూయవు అని ఇప్పటివరకూ ప్రపంచంలో జరిగిన ప్రతి పరిశోధనా తేల్చింది. అయినా సాంస్కృతిక సామ్రాజ్యవాదం పరోక్షంగా అమలు అవుతున్న నేడు వీటిని వినిపించుకొనే వారే కరువు అయ్యారు.
ఈ నేపథ్యంలో శాస్ర్తియ పరిశోధనా ఫలితాలను ఆయా సమాజాలు కానీ వాటిని నడిపే ప్రభుత్వాలు కానీ తలకు ఎక్కించు కోకపోతే బిడ్డల్లో పుట్టుకతో వచ్చే మానవ వనరులు పూర్తిగా వినియోగం లోకి రావు. ఇది మొత్తం సమాజానికే నష్టం. చదువుకు చెందినంత వరకు బిడ్డకు ప్రకృతి ఇచ్చిన తెలివి మీద సామాజిక శిక్షణ (చదువు) ఇవ్వటంలో ఉండే శాస్ర్తియ సూత్రాలను చర్చకు తేవాల్సిన అక్కర ఉంది.

అందుబాటులో ఉన్న మానవ వనరులను ఉపయోగించుకోకుండా ఏ దేశం ముందుకు పోలేదు. పిల్లల్లో ముడిసరుకుగా ఉన్న మానవ వనరులను వెలికి తీయటానికి, వాటిని మెరిగించి ఉపయోగంలోకి తేవటానికి విద్య ఒక పనిముట్టు. దేశ ఎదుగుదలలో, ముందుపోకలో అంత ప్రాధాన్యత ఉన్న విద్యను బాధ్యతగల ప్రభుత్వాలు తమ జాతి అవసరాలకు తగ్గట్టు మలచుకుంటాయి. తమకంటూ ఒక జాతీయ విద్యా విధానాన్ని కట్టుకుంటాయి. ఇది తమ కాళ్ళమీద తాము నిలబడే జాతులు పాటించే పద్ధతి.

మన చెడు రాత (bad luck) ఏమిటి అంటే, ఇక్కడ మనం చదివే చదువులు మన కోసం కాదు. అంటే మన జాతి అవసరాలకు కాదు. కూలీలను తయారు చేయటానికి చెప్పే చదువులు. పరాయివాడికి ఊడిగం ఎలా చేయాలో నేర్పించే చదువులు, వలస పోవటానికి ఉద్దేశించిన చదువులు. జాతికి వెన్ను లేకుండా తయారుచేసే చదువులు.
ఈ నేపథ్యాన్ని తెల్లం చేసుకోకుండా, మన విద్య తీరు తెన్నులు ఎలా ఉన్నాయో పరిగణనలోకి తీసుకోకుండా ‘‘అభివృద్ధికి ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నామనే’’ అంచనాలు ఎవరిని మోసం చేయటానికో, జాతిని ఎక్కడికి తీసుకు పోవటానికో పరికించి చూడాల్సిన అవసరం ఉంది.
                                                     ..............ఈ అంశం పై ప్రతి శనివారం ఒక వ్యాసం ఒస్తుంది