03-11-212
మెదడు పని చేసే తీరునే మనసు అంటాము. మెదడుకు మేనుక (ఫిజికల్) రూపం ఉంటుంది కానీ మనసుకు ఉండదు. మెదడు - మనసుల పనిని కంప్యూటరు తో పోల్చ ఒచ్చు. మనకు కంప్యూటరు మేనుక అయిన ‘హార్డు వేరు’ కనిపిస్తుందే తప్ప అందులో పని చేసే ‘సాప్టువేరు’ కనిపించదు. కంప్యూటర్ల మేనుక రూపాలు అన్నీ ఒకటిగానే ఉంటాయి. వాటిలాగే మెదడు మేనుక రూపాలు కూడా చూసేందుకు ఒకటి గానే ఉంటాయి. కంప్యూటరు పని చేసే వేగం, దాని నిలువ శక్తి ప్రతీ కంప్యూటరుకు తేడాగా ఉంటుంది. మెదడు సామర్థ్యము, దాని పని వేగం ప్రతీ మెదడుకు వేరుగా ఉంటాయి. ఇవి తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వస్తాయి.
కంప్యూటరులో కంప్యూటరులో వివిధ ప్రోగ్రాములను కలిపి సమన్వయంగా పని చేయించడానికి ఒక ‘సాప్టువేరు’ కావాలి. దీనినే ‘ఆపరేటింగ్ సిస్టం’ లేదా ‘ఒ.ఎస్’ అంటాము. అంటే విండోను, లినెన్సు, జావా, ఆండ్రాయిడు లాంటివి. కంప్యూటరు పని సామర్థ్యం ఈ ‘ఆపరేటింగ్ సిస్టం’ బలంమీదనే ఆధారపడి ఉంటుంది. ఆపరేటింగు సిస్టం బాగా ఉంటేనే అందులో మనకు అవసరం అయిన అదనపు ప్రోగ్రాముని నింపి వాడుకోగలము. కంప్యూటరు సమర్థవంతంగా పని చేయాలంటే నిర్మాణాత్మకంగా హార్డువేరు అంతా ఏ లోపం లేకుండా ఉండాలి. అప్పుడు దాన్లో నింపే ‘ఆపరేటేంగు సిస్టం’ ప్రకారం కంప్యూటరు పని చేస్తుంది. మనిషి మెదడును పని చేయించే ఆపరేటింగు సిస్టంను కాగ్నిషను అంటారని ఇంతకు ముందు చెప్పు కున్నాము. కంప్యూటర్లలో అయితే ఒ.ఎస్‌ని మనం తయారు చేసి ఎక్కిస్తాము. మనిషి మెదడులో అలా ఎక్కించ లేము. ఎవరి ఆపరేటింగు సిస్టం (కాగ్నిషను)ని వారే తయారు చేసు కోవాలి. అందుకు కావల్సిన దినుసులను సమాజం అందిస్తుంది. అది కూడా భాష ద్వారా అందిస్తుంది. పుట్టుకతో వచ్చే మెదడు సామర్థ్యాన్ని ఉపయోగించుకొని మనం ఏర్పాటు చేసుకొనే కాగ్నిషనుని బట్టి మన మానసిక కార్య కలాపాలు, వాటి చురుకుదనం ఆధార పడి ఉంటుంది.
కాగ్నిషను రూపు దిద్దుకోవటంలో ముందుగా బిడ్డ మెదడు సామర్థ్యానికి భాష జత కావాలి. దానిద్వారా కాగ్నిషను ఎదుగుతుంది. బిడ్డ పెరిగే పరిసరాలు, సామాజిక, ఆర్థిక భౌగోళిక పరిస్థితులు మలుపులు తిప్పుతాయి. అందుకే ఏ ఇద్దరికి ఒకే రకమయిన ఆలోచనా తీరు ఉండదు. చివరకు కవలలుగా పుట్టి ఒకే పరిసరాలలో, ఒకే పరిస్థితుల్లో పెంచిన పిల్లలకు కూడా వారి ఆలోచనా తీరులు వేరు వేరుగా ఉంటాయి. వ్యక్తి కాగ్నిషను అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దానంతట అదే మార్పు (అప్‌డేట్) చెందుతుంది. మనం కావాలని ప్రయత్నించి కూడా మార్పు చేసుకోవచ్చు.
మనిషిలో కాగ్నిటిపు వ్యవస్థ ఏ విధంగా ఏర్పడుతుంది? అనే అంశంమీద ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది లోతుగా పరిశోధనలు చేశారు. వారిలో స్విడ్జర్లాండుకు చెందిన శాస్తవ్రేత్త ‘జీన్’ పియూజె (1896-1980) పరిశోధన చాలా ముఖ్యం అయినది. ఆయన పిల్లల మీద చేసిన పరిశోధనలను ‘జెనిటిక్ ఎపిస్టెమాలజీ’ అనే పేరుతో ప్రపంచానికి తెలియజేశారు. అంటే జీవ పరిణామంలో వేల ఏళ్ళుగా పోగు పడుతూ వారసత్వంగా పొందిన ‘ఆలోచన’ గుణ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా కాగ్నిషనుని కట్టు కుంటారో చెప్పటం అన్న మాట.
బిడ్డలో ఆలోచనా ఎదుగుదల ఒక పద్ధతి ప్రకారం, అంచెలు అంచెలుగా దశల వారీగా జరుగుతుంది. పూర్తి స్థాయి ఆలోచనా వ్యవస్థ తయారు కావాలి అంటే దానికి ముందున్న ప్రతీ దశలోనూ సంపూర్ణత సాధించాలి. ఏ దశలో అయినా ఎదుగుదల కుంటుపడింది అంటే తరువాత దశ మొదలు కావడానికి సరైన పునాది ఉండదు. అందువల్ల మొత్తం ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది. అందులో కీలక దశలు మొదటి పదేళ్ళలో ఉంటుంది. అంటే ప్రాథమిక విద్య పూర్తయ్యే వయస్సు. ఈ పదేళ్ళలో ఏర్పడే కాగ్నిషనే మును ముందు మనిషి ఆలోచనా విధానానికి ప్రవర్తనకూ పునాదిగా ఉంటుంది.
తొలి దశ బిడ్డ పుట్టినప్పటినుంచి రెండేళ్ళ వరకు ఉంటుంది. ఈ దశలో చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ అవయవాలు బాగా పరిణతి పూర్తి అందుబాటులోకి వస్తాయి. మరోపక్క ఒంటి కండరాలు మెదడు అదుపులోకి వస్తాయి. అలాగే ఒంటికీ పంచేంద్రియాలకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది. దీన్ని ‘సెన్సరీ - మోటారు’ దశ అంటారు. బిడ్డ మునుముందు జరపబోయే కార్యకలాపాలకు శరీరం, నాడీ వ్యవస్థ తయారుఅయి ఉండటం అన్న మాట.
రెండో దశలో భాష ఏర్పడటానికి కావాల్సిన వేదిక జోరుగా తయారు అవుతూ ఉంటుంది. రోజూ చూస్తున్న వస్తువులకు, వ్యక్తులకు పేర్లు జోడిస్తూ ఉంటారు. చదువుకి సంబంధించిన అంతవరకు ఇది ఎల్కేజి నుండి రెండవ తరగతి వరకూ ఉండే దశ. ఈ దశలో భాషా పరమయిన పెంపు బాగా ఊపు అందుకుంటుంది. అంటే భాష ఏర్పడటంలో ఇది అత్యంత కీలక దశ అన్నమాట. ఈ దశలో కొత్త భాషను నేర్పించటానికి ప్రయత్నిస్తే అది బిడ్డలో గందరగోళానికి దారితీస్తుంది. అలాంటిది కొత్త భాషలో వేరుగా మొత్తం బోధనే మొదలు పెడితే ఎంత గందరగోళానికి దారితీస్తుందో? ఈ పసి పిల్లలకు ఎంత చిత్ర హింసగా ఉంటుందో పెద్ద వారు అయిన మనం వారి రూపం లోకి మారి అనుభవిస్తే కాని తెలియదు. మూడో దశ 7 నుండి 11 ఏళ్ళ వరకు కొన సాగుతుంది. ఇది పిల్లలు నిలకడ అయిన ఆలోచనలను అలవాటు చేసుకొనే దశ. ప్రతి విషయాన్ని వాస్తవ దృష్టితో చూటానికి అలవాటు పడే దశ. ఒక విషయాన్ని అనేక కోణాల నుండి పరిశీలించటం ఈ దశలోనే వస్తుంది. అంటే పిల్లలు ఇతరుల దృష్టితో కూడా ఆలోచించ గలరు. ఈ దశను ‘ఆపరేషనల్ థింకింగ్’ దశ అంటారు. ఆలోచనల్లో ఒక క్రమ పద్ధతి ఉంటుంది. దేనినీ గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించే తత్వం అలవాటు అవుతుంది.
తొలి దశను వదిలితే తక్కిన రెండు, మూడు దశలు ప్రాథమిక విద్యను నేర్పించే పరిధిలోనివి. అంతే కాకుండా జీవితానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలు పెంపొందే దశలు కూడా. మును ముందు బిడ్డ జరపబోయే ఆలోచనలు ఈ పునాదుల మీదే ఆధార పడి ఉంటాయి.
ఈ పునాదుల కట్టుబడిలో బిడ్డకు సమాజానికి మధ్య వారధిగా ఉండేదే భాష, భాషా వారధి ద్వారానే ఆలోచనా వ్యవస్థ పెంపు చెందుతుంది. భాష ఎల్కేజి మీడియపు బడిలో దొరికినట్టు ‘రెడీమేడు’గా దొరకదు. ఒక పదముతో మొదలు పెట్టి చేవ ఉన్న మేరకు అనంతంగా ఎవరికివారు సాగు చేసు కోవాలి. అంటే తొలుత నేర్చు కోవాలి. తరువాత వాడుకోవాలి.
No comments:
Post a Comment