Thursday, January 10, 2013

పనికి మాలుతున్న ప్రభుత్వ టీచర్లు; తొలి చదువులు-26

06-01-2013

ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు ఎందుకు రావటం లేదని టీచర్లను అడిగితే, ‘‘పిల్లలు సరిగా బడికి రారు, స్కూళ్ళలో వసతులు సరిగా ఉండవు, బోధనేతర పనులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లలపట్ల శ్రద్ధ తీసుకోరు, పుస్తకాలు సరైన సమయానికి రావు...’’ ఇలా సమస్యల్ని ఏకరువు పెడతారు.

పిల్లలు బడికి రావటము లేదు అంటే వాళ్ళకి చదువు మీద ఆసక్తి లేదు అనేగా అర్థం. పిల్లలకు ఆసక్తి కలిగించటం కూడా బోధనలో ఒక భాగమే. పిల్లల్లో కుతూహలం కలుగజేసి, చదువు పట్ల ఇష్టాన్ని కలుగచేసే మెళకువలను నేర్పించటం కూడా ఉపాధ్యాయ శిక్షణలో ఒక భాగం. సామాజిక పరిస్థితుల కారణాలవల్ల బడికి రాని వాళ్ళు ఎలాగూ రారు. వచ్చినవాళ్ళలో సగం మందికి చదవటం, రాయటం సరిగా రావటంలేదే! మరి దీనిని ఎలా అర్థం చేసు కోవాలి? ఇక్కడ మరో సంగతి కూడా చెప్పు కోవాలి. అక్కడ్కడ ఇలాంటి మట్టు లోనే ఉండే కొన్ని బడుల్లో టీచర్లు నిబద్ధతతో, బాధ్యతతో చదువు చెప్పి, పిల్లల్ని బాగా తీర్చి దిద్దుతున్న మచ్చులు కూడా మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. అయితే అలాంటి టీచర్లు అరుదుగా కనిపిస్తారు.

ప్రభుత్వ బడుల్లో వసతులు లేని మాట నిజమే. అయినప్పటికీ వసతులు ఉన్న బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగ్గా లేవు. ఇక బోధనేతర పనులకు టీచర్లను వాడుకుంటున్నారు అన్న వివరణకు అర్థమే లేదు. ఒకటి రెండు తరగతులకు సిలబసు పూర్తి చేయటానికి ఏడాదిలో 110 నుండి 120 పని రోజులు సరిపోతాయని పాఠ్య ప్రణాళిక అంచనా. ఇన్నీ సెలవుల తోపాటు బోధనేతర పనులలో టీచర్లు పనిచేసే రోజులు కలిపినా అయ్యవార్లు ఏడాదిలో 170 రోజులు పనిచేస్తున్నారు. పిల్లలు 30 శాతం పని రోజులు బడికి రారు అనుకున్నా ఇంకా 70 శాతం హాజరు ఉంటుంది. అంటే 110 నుండి 120 రోజులు పిల్లలు బడిలో ఉంటారు. పాఠ్యప్రణాళిక ప్రకారం అక్షరాలు నేర్పటానికి ఆ రోజులు సరిపోతాయి. దీన్ని బట్టి బోధనేతర పనులకు ఉపాధ్యాయుల్ని వాడుకుంటున్నారు అనే వాదనలో పస లేదు అని తెల్లం అవుతుంది.

ప్రభుత్వ బడుల్లో చదివే ఎక్కువ మంది పిల్లల తల్లిదండ్రులు చదువు లేని వారు లేదా అరా కొరా చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు. వారి స్థాయిలో వారు పిల్లల పట్ల శ్రద్ధ తీ సుకోకుండా గాలికి వదిలివేయరు. ఒకవేళ శ్రద్ధ తీసుకోక పోయినా తల్లిదండ్రులకు ఆ సంగతి మీద అవగాహన కలిపించి పిల్లల్ని చదువుకు తీసుకురావాల్సిన సామాజిక బాధ్యత కూడా ఉపాధ్యాయులదే. ఇక పుస్తకాలు సమయానికి రావు అనీ, తడవ తడవకీ ప్రభుత్వం బోధనా పద్ధతులను మార్చుతుందనీ, ఏ బోధనా పద్ధతితో చెప్పాలో అర్థం కావటంలేదు అనేది కూడా ఉపాధ్యాయుల ఆరోపణ. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? అ ఆ లు, కూడికలు తీసివేతలు నేర్పటానికి పలకా బలపాలు చాలవా ఇవికూడా తీసి ఇవ్వకుండా తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపుతున్నారా?
తొలి బడిలో ముఖ్యంగా ఒకటీ, రెండు తరగతులకు బోధించే టీచర్లకు బాధ్యత చాలా ఎక్కువగా ఉండాలి. ఎందుకు అంటే మొదటి తరగతిలో నేర్పాల్సిన అక్షరమాలను, గుణింతాలను సరిగా నేర్పకపోతే దాని కొనసాగింపుగా రెండో తరగతిలో నేర్పాల్సిన వాటిని అనుసరించలేరు. ఒకటి రెండు తరగతుల్లో చేయాల్సింది పిల్లలకు చదవటం, రాయటం నేర్పించటం. ఈ తరగతుల్లో అవి రాకుండా మూడో తరగతిలో చదువు చెప్పడం కష్టం. మూడో తరగతిలో ఎంత బాధ్యతగల టీచరు ఉన్నా, ఎంత బాగా చదువు చెప్పగలిగినా అక్షరాలు సరిగా చదవలేని, రాయలేని పిల్లలకు వారు చేయగలిగింది ఏమీ లేదు. ఆ తరగతి ఉపాధ్యాయుడు మళ్లీ అ ఆ ఇ ఈలు నేర్పించుకుంటూ తన పాఠాలను కొనసాగించలేడు.

ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు పడిపోవటానికి ఉపాధ్యాయ సంఘాలు చెప్పే కారణాలు ఏమిటంటే, ‘‘ప్రమోషన్లు, బదిలీలు ఆగిపోయాయి. తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటేనే చదువుచెప్పటం వీలు అవుతుంది. పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది’’ అని ఏకరువు పెడతారు.

ప్రమోషన్లు వచ్చినా, బదిలీలు జరిగినా, చెప్పాల్సింది చదువే అయినప్పుడు పిల్లలు ఎవరు అయితే ఏమీ? బడి ఏది అయితే ఏమి? చదువు చెప్పటమే పని అయినప్పుడు బదిలీలకు, పిల్లలకు చెప్పే చదువుకు సంబంధం ఏమిటో అర్థం కాదు. తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండటం అనేది కాదనలేని నిజం. అయినప్పటికి ఆ మేరకు ఉన్న బడుల్లోకూడా ప్రమాణాలు అట్టడుగు మట్టులో ఉంటున్నాయి. ప్రభుత్వ బడుల్లో పిల్లల హాజరు శాతం కొడిగట్టుతున్న నేటి రోజుల్లో కొన్ని బడుల్లో అయితే పట్టుమని పది మంది కూడా పిల్లలు ఉండటం లేదు. మరి అలాంటి బడుల్లో ప్రమాణాలు ఏమయినా బాగున్నాయా? అని చూస్తే అవీ అంతే.

టీచర్లమీద అధికార్లు ఒత్తిడి తెస్తున్నారు అంటే అది పిల్లలకి చదువు చెప్పే విషయంలో మట్టుకు అయి ఉండదు. చదువు చెప్పవద్దని ఏ అధికారి చెప్పడు. ఉపాధ్యాయ సంఘాలు దాదాపుగా ఉపాధ్యాయుల జీత భత్యాలు, బదిలీలు, ప్రమోషన్లు వరకే పరిమితం అయి పనిచేస్తాయి తప్ప విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచే దిశగా తమ సభ్యుల్ని మలిచే శక్తి వాటికి లేదు. ఒకవేళ ఏ సంఘం అయినా నిబంధనల ప్రకారం నడచుకోండి అనీ, పనిచేసే చోట ఉండండీ అని, పిల్లలకు చదువు బాగా చెప్పమని తమ సభ్యులను కోరింది అంటే ఇక ఆ సంఘానికి నూకలు చెల్లినట్టే. దీనికి పోటీగా మరో సంఘం ఊపిరి పోసుకుంటుంది. ఈ రాతలు ఉపాధ్యాయ సంఘాలకు మింగుడు పడక పోయినా నేడు ఉన్న నిజం ఇది.

ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి కేంద్రంగా తమ కార్యక్రమాలను మలచు కోక పోయినట్టు అయితే మును ముందు ఆ సంఘాల మనుగడే కష్టం కావచ్చు. దీనివల్ల వచ్చే నష్టాలు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పిల్లల్లో ప్రమాణాలు పడి పోవడం వల్ల జనం ఈ బడుల్లోకి తమ పిల్లలను పంపటం మానేస్తారు. ఇప్పుడు ఆ పని చాలా వేగంగా జరుగుతుంది. దీని వల్ల ప్రయివేటుగా నడిచే వ్యాపార బడుల వైపు జనాన్ని తోయకనే తోచినట్టు అవుతుంది. మరో వైపు ప్రభుత్వ బడుల్లో పిల్లల హాజరు శాతం తక్కువగా ఉండటం, ఉన్నా ఆ వచ్చే తక్కువ ప్రమాణాలను సాకుగా చూపి క్రమంగా ప్రభుత్వ బడులను మూసివేసే పరిస్థితిలోకి తెచ్చినట్టు అవుతుంది. సరిగ్గా ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదే. విద్య పట్ల ప్రభుత్వం తమ బాధ్యతలనుండి తప్పుకొని కేవలం అజమాయిషీ వరకే అట్టిపెట్టుకొని విద్యను ప్రయివేటీకరణ వైపు నెట్టటం గ్లోబలయిజేషను విజయవంతం కావాలంటే జరగాల్సింది కూడా ఇదే. అంటే అయ్యవార్లే తమ నాశనానికి ఉపయోగపడే ఆయుధాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు అన్న మాట.
ఇక అధికార్లను ఈ విషయంమీద కదిలిస్తే ‘‘టీచర్లలో నిబద్ధత లేదని, వారు పనిచేసే చోట ఉండరనీ, చదువులు చెప్పని ఉపాధ్యాయుల మీద చర్య తీసు కోవాలి అంటే ఉపాధ్యాయ సంఘాల జోక్యం ఎక్కువగా ఉంటుందని’’ అంటున్నారు. ఇందులో ఒకటి మటుకు నిజం, అందరూ కాక పోయినా అత్యధిక భాగం ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో నిబద్ధత లేదు అనేది అందరూ ఎరిగిన సంగతే. అయితే అందుకు టీచర్లను మాత్రమే బాధ్యుతలను చేసి చూడటం కూడా సరి కాదు. సమాజంలో ఉండే అవలక్షణాలలో భాగంగా టీచర్లూ ఉంటారు. అధికారులు ఏమీ ఎక్కువగా తినరుగా!

కారణాలు ఏవి అయినా సగానికిపైగా ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు పట్టుమని పది అక్షరాలు రాక పోవటానికి కారణం టీచర్ల బాధ్యత, మరుపు, అధికారుల అలసత్వం కారణాలు. ఆ తర్వాతే అన్నీ. ప్రయివేటు టీచర్లతో పోలిస్తే తగిట పొందిన వారు అయి ఉండి, వారి కంటే అయిదు ఆరు రెట్లు ఎక్కువగా జీతం తీసుకొంటూ సామాజిక బాధ్యత లేకుండా ప్రవర్తించటం వల్లే పసి పిల్లలకి అక్షరం ముక్కలు కరువు అవుతున్నాయి. ప్రభుత్వం కూడా విద్యలో తన బాధ్యతను కొడిగట్టించటమే గురిగా పెట్టుకొని ఉంది. తనకు కావాల్సిన పనిని వారు చక్కగా చేసి పెడుతున్నారు కనుక ఉపాధ్యాయ చర్యలను చూసీ చూడనట్లు వదిలివేస్తుంది.

ప్రభుత్వపు బడుల్లో చదువు సొంత భాషలో, శాస్ర్తియ పద్ధతుల్లో ఉంటుంది. ఆ ప్రకారం ఆ బడుల్లో తెలుగు బోధించినా టీచర్లు బాధ్యత లేకుండా ఉండటంవల్ల ప్రమాణాలు ఉండాల్సినంత ఉండటంలేదు. మరో వైపు ప్రయివేటు బడుల్లో టీచర్లు బాధ్యతగా ఉన్నా అశాస్ర్తియ పద్ధతిలో చదువు చెప్పటంవల్ల పిల్లలు చూపాల్సిన అంతగా తమ ప్రతిభను చూపలేకపోతున్నారు. దీనివల్ల మొత్తం విద్యా వ్యవస్థ మేడిపండు చందంగా మారిపోయి ఉంది.


3 comments:

  1. meeku teliyademo prbahutava patlasaalo ma mother work chesthunaru .anduvalla chebuthuna private school stho smanam ga extra clases even sunday also,and quartely nuchi final exams varuku result 70% below vunte they need to give expalnation to the commisoner . i know how much my mother used to worry for children as they are all from labour they will egt money if they go to work instead ,they dont want to come school and if they come also how many days they will come.please dont write such language about them.my sister she is a M.ed,B.ed ins cience and she can teach abotu 10 class and higher,but in govt school sheteaches for primary section adn i know much attention she takes.as i felt bad when u commneted panikimalintanam i am wrting this comment.

    ReplyDelete
  2. నేను రాసింది 1,2 తరగతుల టీచర్ల గురించి. మీ అక్క గారు బాగా చదువు చెబుతున్నందుకు సంతోషం. కానీ అలాంటి వారు ఎంత మంది ఉంటారు? నేను రాసింది బాగా చదువు చెప్పే వారి గురించి కాదు. బాద్యత లేకుండా ప్రవర్తించే 70% మంది టీచర్ల గురించి. మీరు అవును అన్నా కాదు అన్నా ఇది ముమ్మాటికి నిజం

    ReplyDelete
  3. మీరు ప్రస్తావించిన ఏ అంశమూ వాస్తవదూరం కాదు,.పాఠశాల స్థాయిలో ఇంకొన్ని పరిశీలించాల్సినవి వున్నాయి,.రికార్డులు,గ్రేడులు,ఆర్ వి యమ్ లో ఎప్పటికప్పుడు కొత్త గా తీసుకొస్తున్న పనికిరాని సంస్కరణలు( ఇవి ఎవరు ప్రవేశపెడతారో కాని వారికి పాఠశాల బాగుపడడం కంటే సెమినార్లలో ప్రశంసింసబడటమే కావాలనుకుంటా)గత పది సంవత్సరాల ప్రాథమిక విద్యమీద ఎవరైనా రిసెర్చి చేస్తే బావుండు,.డిపెప్, క్లిప్, క్లాప్, లెప్,.విన్నూత్న కార్యక్రమాలు,..ప్రపంచంలో వండే అన్నింటిని ప్రభుత్వబళ్లళ్లోకి వంపేసారు,ఏది రెండు సంవత్సరాలకు మించి వుండదు,అర్థంచేసుకునే లోపే మార్చేస్తారు, నిజంగా పిల్లలకి న్యాయం చేద్దామనుకుండే టీచర్ నలిగపోతున్నాడు,(వారి సంఖ్య తక్కువే,) యూనియన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది,.అకడమిక్ విషయాలు ఎందుకు పట్టించుకోరో అర్థంగాదు,మంచి విషయాలు రాస్తున్నారు, అభినందనలు,.వీలైతే ఆర్ వి యమ్ విధానాలు,గ్రేడులు, సామర్థ్యాల గురించి రాయండి,..ధన్యవాదాలు,...

    ReplyDelete