Tuesday, February 19, 2013

దళిత పిల్లలకు ఇంగ్లిషు మీడియం న్యాయం చేస్తుందా?: తొలి చదువులు-32


పిల్లల చదువులో బోధనా భాషగా సొంత భాషను వాడాలా లేక ఇంగ్లీషును వాడాలా అనే దానిమీద వాదనలు, ప్రతివాదనలు చాలా కాలంగా జరుగుతున్నవే. తల్లి నుడిలోనే చదువు ఉండాలని ఒక వర్గం అంటుండగా, అక్కర్లేదు, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో, అవసరాలకు తగ్గట్టు ఇంగ్లీషు మీడియంలో బోధన జరగాలని మరో వర్గం వాదిస్తుంది. భాషను కాపాడు కోవడం, స్వావలంబన, సంస్కృతి, మేథాతనం, వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాలు మొదటి వర్గానికి వాదనా వస్తువులు కాగా, ఉపాధి అవకాశాలు, మార్కెటింగు, గ్లోబలయిజేషను, ఆర్థిక అసమానతలు, కుల వివక్షత బాణాలు రెండో వర్గపు అమ్ముల పొదిలో ఉంటున్నాయి.

నిజం ఏమిటో తెలుసు కోవాలి అంటే ఆ అంశం మీద పరిశోధన జరగాలి. పరిశోధనల్లో తేలిన నిజం అనుభవంలో మరింత రుజువు అవుతుంది. సైన్సులో ‘నిజా’నికి ‘అభిప్రాయా’నికి మధ్య కచ్చితమయిన విభజన రేఖ ఉంటుంది. ఇక్కడ నిజం తెలియనంత వరకే అభిప్రాయానికి విలువ. ‘ఇదీ నిజం’ అని నిగ్గు తేలాక ఇక దాని మీద వాదనలు - తిరుగు వాదనలకు తావు ఉండదు. తెల్లటి కాంతిలో ఏడు రంగులు ఉంటాయి అనేది ప్రయోగ పూర్వకంగా తేల్చిన సత్యం. దీని మీద అభిప్రాయాలకు తావు లేదు.

శాస్ర్తియ అంశాలను ప్రస్తావించేటప్పుడు సాధారణ అంశాలను పరిశీలించినట్టు పై పైన తడిమితే సరి పోదు. తొలుత ప్రాథమిక పరిశీలన, ఆ తరువాత కొంత లోతు అవగాహనకు పోతూ పరిశోధనను తటస్థ దృష్టితో సాగించాలి. అప్పుడు కాని నిజం తేలదు. ముందుగా ఏర్పరచుకున్న ఇరుకు మనసుతో పరిశోధన మొదలు పెడితే ఆ పరిశోధన అంతా మనసులో ఉండే నమ్మకానికి అనుకూలంగా కట్టడి చేయడం మొదలవుతుంది. అప్పుడు వచ్చే ఫలితం నిజానికి దగ్గరగా ఉండ వచ్చు, ఉండక పోవచ్చు. కారణం ఏమిటి అంటే నిజం వేరు, నమ్మకం వేరు. నిజం నమ్మకంగా ఉండవచ్చు కానీ నమ్మకం నిజం కావాలని ఏమీ లేదు.

విద్యా విధానంపట్ల ప్రత్యేకించి బిడ్డలకు పునాదులు వేసే తొలి చదువుల్లో ఏ అంశాలను బోధించాలి అనే దాని పట్ల ఎవరి అభిప్రాయాలు వారికి ఉండ వచ్చు. ఇది ప్రాంతానికీ ప్రాంతానికీ, జాతికి జాతికీ మారుతూ ఉంటాయి. కానీ ఆ విద్యను పిల్లల్లో చొప్పించ టానికి ఉపయోగించే బోధనా ‘పద్ధతి’కి ఒక శాస్ర్తియ తీరు ఉంది. బిడ్డలకు తొలి చదువును ఏ భాషలో మొదలు పెట్టినా ఆ చెప్పే భాష మీద పట్టు ఉండాలి. తెలిసిన భాషలో పునాదులు వేసి దాని పునాదుల మీద ఎన్ని భాషలు అయినా, ఎన్ని శాస్త్రాలు అయినా నేర్పటం అనేది శాస్ర్తియ బోధనా పద్ధతి. తొలి చదువుల్లో స్వతహాగా అది అమ్మ భాషే అయి ఉంటుంది. అక్కడక్కడా తల్లి భాషే కాకుండా సమాజ భాష కూడా అయి ఉంటుంది. అయినా దీని కంటే తొలి పద్ధతే నూటికి నూరు పాళ్ళూ శాస్ర్తియం. రెండోది గుడ్డిలో మెల్ల. ఇది వేల కొద్ది పరిశోధనల్లో, అనుభవంలో తేలిన సత్యం. ప్రపంచం అంతా అనుసరిస్తున్న దారి. భాష మీద పట్టు లేకుండా చదివే బిడ్డలకు పుటుకతో వచ్చే తెలివి సామర్థ్యం, సృజనాత్మకత పాక్షికంగానే ఉపయోగం లోకి వస్తాయి అనేది కూడా అన్ని పరిశోధనలు తేల్చి చెప్పాయి.

అగ్రవర్ణాల పిల్లలు ఆది నుంచి ఇంగ్లీషు మీడియంలో చదవటం వల్ల పైకి ఎగ బాకుతున్నారు అనే వాదన ముందుకు తెచ్చి వారికి మల్లే దళితులకు కూడా ఎల్కేజీ నుండి ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్పాలి అంటూ కంచె అయిలయ్య లాంటి మేథావులు కొత్తగా వాదన ముందుకు తెస్తున్నారు. శాస్ర్తియ బోధనా పద్ధతులను కాదని తమ నమ్మకాలకు తగ్గట్టు బోధన ఉండాలి అనేది వీరి వాదన.

ఇది మొండి వాదన, పిడి వాదన. మొండి వాదనకు కులం లేదా మతం సెంటిమెంటు జోడించి వాదనలు వినిపించటం వల్ల ఎదుటి వారు ఎంత శాస్ర్తియంగా మాట్లాడినా అది సెంటిమెంటు సరి చెయ్య లేదు. ఈ సంగతిని ప్రభుత్వ బడుల్లో గత ఏడాది ప్రవేశ పెట్టిన ‘సక్సెసు’ బడులు ఏ మేరకు సక్సెసు అయ్యాయో తెలుపకనే తెలిపాయి. అప్పటి వరకూ తెలుగులో చదువుతున్న పిల్లల్ని ఆశ పెట్టి, టార్గెట్లు పెట్టి ఇంగ్లీషు మీడియం లోకి తోసిన పిల్లలు మూడు నెలలు లోపే దాదాపు తిరిగి తెలుగు మీడియం లోకి గోడకు కొట్టిన బంతిలా వెనక్కి వచ్చేసారు. మిగిలి ఉన్న ఆ కొద్ది పిల్లల భవిత రేపు జరిగే పదో తరగతి పరీక్షలు తేల్చనున్నాయి.

కులం, డబ్బు, హోదా, తెలివి, ఖరీదు అయిన కార్పోరేటు విద్య, ఇలా అన్ని అంశాలలో అనుకూలంగా ఉన్న పిల్లలకే పరాయి భాషలో ప్రాథమిక విద్య పనికి రాదని పరిశోధనలు, అనుభవాలు తెలుపుతున్నాయ. కులం, సామాజిక వెనుకబాటు అనే కంతలో నుంచి శాస్ర్తియ బోధనా పద్ధతులను ఎగతాళి చేస్తున్నారు వారు ఆశించినట్టుగా నిజంగా దళిత ఎదుగుదల జరగాలి అంటే అందుకు తిరుగులేని ఆయుధం దళితులకు వారి సొంత భాషలో తొలి చదువులను మొదలు పెట్టడం. దాని ద్వారా మంచి ఇంగ్లీషు నేర్పటం. వీరి వాదన దళితులకు మేలు చేయక పోగా వారిని అత్యంత కీడులోకి నెట్టేస్తుంది. స్వాతంత్య్రం వచ్చాక కూడా వ్యవసాయం, చేతి పనులు, కుల వృత్తులలో ఉన్న పేద, దళిత, గిరిజన కుటుంబాల పిల్లలకు చదువు అందని పండుగానే ఉండింది. అందుకు కారణం చదువుకొనే అవకాశాలు మెరుగు పడుతున్నప్పటికీ చదువులో భాష గుదిబండగా మారటం. అప్పట్లో ఒక పక్క ఇంగ్లీషు మీడియం, మరో వైపు తెలుగు పేరుతో గ్రాంథిక భాష రూపంలో ఉన్న సంస్కృత చదువుల వల్ల ఈ వర్గాలకు చెందిన పిల్లలు బడి అంటే హడలి పోయి దాని వైపు కనె్నత్తి చూడని పరిస్థితి ఉండింది. అంబేద్కరు పోరాట ఫలితంగా కలిపించిన రిజర్వేషను ఉద్యోగాలలోకి ఆయా వర్గాలను ఇముడ్చు కోవటానికి చదువుకున్న వారు దొరకని పరిస్థితులు ఆనాటివి.

గిడుగు రామ్మూర్తి లేవనెత్తిన ‘వాడుక భాష ఉద్యమం’ పుణ్యమా అని చదువులు దాదాపు వాడుక భాష లోకి దిగినాయి. అప్పటివరకూ చదువుకు దూరంగా ఉన్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల పిల్లలకే కాకుండా ఎగువ కులాల లోని నిరక్షరాస్య పిల్లలకు సయితం చదువు చేరువగా వచ్చింది. అంటే తల్లిదండ్రులకు చదువు లేక పోయినా పిల్లలు చదవటం అనేది చదువు వ్యవహారిక భాష లోకి దిగాక కానీ ఎక్కువ మొత్తంలో జరగ లేదు. మరో మాటలో చెప్పాలి అంటే చదువు సొంత భాష లోకి వచ్చాకే ఆయా వర్గాల ప్రజలలో ఉద్యోగాలు అందుకొనే తొలి తరం తయారు అయింది.

దళితులతో సహా ఆయా సామాజిక వర్గాలలో తొలి తరంలో విద్యా, ఉద్యోగాలు పొందగలిగిన వారు ఎంతో కొంత సామాజిక మట్టును పెంచు కోగలిగారు. దీని వల్ల అప్పటి పేదలు, దళితులు వెనుకబడిన వర్గాలు, గిరిజనులలో వారి వారి స్థాయి మేరకు ఆర్థికంగా ఎదిగారు. అలా ఎదిగిన వారు ఇప్పుడు తమ బిడ్డలకు ఇంకా మరింత మెరుగు అయిన విద్య, ఉపాధి కోసం ఎంత డబ్బు అయినా పెట్టి ఎగువ కులాలకు ధీటుగా చదువు చెప్పించటం కోసం కార్పోరేటు విద్య వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇపుడు దళితుల్లో ధనిక దళితులు, పేద దళితులు అనే రెండు వర్గాలు మనుగడలో ఉన్నాయి. ధనిక దళిత వర్గాల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో ఎంతో కొంత రాణించటానికి కావాల్సిన కుటుంబ, ఆర్థిక వాతావరణ వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ చదువులో రాణించక పోయినా ఆర్థిక స్థితికి ఢోకా లేదు కాబట్టి వారికి పోయేది ఏమీ లేదు. ఎటొచ్చీ పేద దళిత పిల్లలకే జరిగే నష్టం అంతా. ఈ ఇంగ్లీషు మాధ్యమమే చదవాలనే వాదనే కనుక అమలు అయ్యే పరిస్థితే వస్తే అది ఇప్పుడిప్పుడే చదువు బాట పడుతున్న తొలి తరం దళిత పిల్లలను పైకి రానీయకుండా మొగ్గలోనే తుంచటమే అవుతుంది. అయితే అది నేరుగా కాకుండా అందంగా కనిపించే ఇంగ్లీషు మీడియం గుదిబండను వారి మెడలో వేలాడదీయటం ద్వారా జరుగుతుంది.

అలనాడు సొంత భాషలో చదివి, రిజర్వేషను ఉపయోగించుకొని పైకి వచ్చిన ధనిక దళితుల పిల్లలకు పోటీ లేకుండా చేయటమే దళితులకు ఇంగ్లీషు మీడియం అనే వాదన. అంటే ఉన్న రిజర్వేషను కోటా లోనికి కొత్తగా వచ్చే పేద దళిత పిల్లలు రాకుండా అడ్డుకొనే కుట్రలో భాగమే దళితులకు ఇంగ్లీషు మీడియం వాదన.
వారు గ్రహించాల్సింది ఏమిటి అంటే ఒక్క దళితులే కాదు. ధనికులు, ఎగువ కులాలు, వెనుకబడిన తరగతులు ఎవరు అయినా సరే తమ బిడ్డలకు పుట్టుకతో వచ్చిన తెలివితేటలు మొత్తం బయటికి వెలికి రావాలి అంటే అది తొలి చదువులు సొంత భాష ద్వారా జరిగినపుడే వీలు అవుతుంది.
                                  తొలి చదువులు వ్యాసాలు ఇంతటితో ముగిసాయి 



Saturday, February 9, 2013

ఇంకా బానిస చదువేనా?- తొలి చదువులు-31


9-2-2013
కాలం ఎప్పుడు నిలకడగా ఉండదు. మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజపు పోకడలూ మారుతూ ఉంటాయి. విద్య సమాజంలో భాగంగా, సమాజానికి దన్నుగా, సమాజానికి అద్దం పట్టేదిగా ఉంటే సమాజంలో వచ్చే మార్పు లకు తగ్గట్టు విద్య ఉంటుంది. విద్య, దాని ద్వారా జరిగే పరిశోధనల వల్ల పుట్టుకు వచ్చే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సమాజ మార్పులను, ఉత్పత్తిని వేగిర పరుస్తాయి. అంటే సమాజం- విద్య విడదీయ రానివిగా ఉండేటట్టు ఆయా జాతులు తమవి అయిన విద్యా విధానాన్ని అనుసరిస్తాయి. అలాంటి సమాజంలో మారుతున్న కాలానికి, కొత్తగా వచ్చే భావాలకు తగ్గట్టు విద్యా విధానాలను ఎప్పటికి అప్పుడు మెరుగు పరచు కుంటాయి. అంతే కాకుండా విద్య ద్వారా ఆయా సమాజాల భాష, జీవన విధానం, సాంప్రదాయం, మతం, సాంస్కృతిక వారసత్వాన్ని తరువాత తరాలకు అందజేస్తాయి. అంటే కొత్తగా వచ్చే ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ జాతి ప్రయోజనాలకు వాడు కొనేందుకు మానవ వనరులను తయారు చేసు కోవటం తోపాటు భాష, సాంస్కృతిక వారసత్వ కొన సాగింపు కూడా విద్యలో భాగంగా ఉంటాయి. ఇది తమ కాళ్ళ మీద తాము నిల బడే జాతి, ఆత్మాభిమానం గల జాతి పాటించే పద్ధతులు. భారత ఉప ఖండంలో తప్పించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని జాతులు పాటించే విధానం ఇది.
సమాజం ముందు పోకలో ఇంతటి ప్రాధాన్యత ఉన్న విద్య, దానికి పునాదులు వేసే ప్రాథమిక విద్యను గురించి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసు కుంటాయి. దానికి తగ్గట్టు పిల్లల తొలి చదువులు ఉంటాయి. మరయితే ఇప్పుడు మన పిల్లలు చదివే చదువులు ప్రపంచం అంతటా పాటించే పద్ధతుల్లో సాగుతుందా లేక పెడ దారిన పోతుందా? అని చూడాల్సిన అవసరం ఉంది.


భారత దేశానికి తెల్ల దొరలు రాక మునుపు వరకూ విద్య అనేది సాంప్రదాయ ముసుగులో కొన సాగుతూ వచ్చింది. చదువు అంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలే తప్ప జన జీవితానికి పనికి వచ్చే సంగతులు కానీ, జనాన్ని ముందుకు నడిపే చేవ కానీ అప్పటి విద్యకు లేదు. గట్టిగా చెప్పాలంటే ఉత్పాదనకు విద్యకూ ఏ రకమైన సంబంధం లేకుండా సాగింది. ఉత్పత్తితో ముడి పడని చదువుల్లో ఎదుగు బొదుగు ఉండదు. కాబట్టి కొన్ని వేల ఏళ్ళుగా చదువు అంటే వేదాలు పురాణాలే తప్ప మరొకటి కన పడని పరిస్థితి వచ్చింది. చదువుకున్న వారు ప్రబంధాలు రాసు కుంటూ కూర్చో గలిగారే కానీ సమాజపు ఉత్పత్తిలో చదువును భాగం చేయ లేక పోయారు. మరో వైపు ఉత్పత్తి రంగంలో ప్రధాన భూమికను పోషించే జనానికి చదువులో చోటు లేకుండా పోయింది. అందు వల్ల వ్యవసాయం, చేతి వృత్తుల్లో వచ్చే కొత్త కొత్త నైపుణ్యాలు, ఒరవడులు కుటుంబ పరంగా తరువాత తరానికి అందాల్సిందే కానీ బయట ప్రపంచానికి చాటటానికి వారికి నాలుగు అక్షరం ముక్కలు కరువు అయ్యాయి. కాబట్టే బయటి ప్రపంచానికి భారతదేశం అంటే ముక్కు మూసుకుని తపస్సు చేసే మనులు, వేదాలు, ఉపనిషత్తులే తప్ప ఆవిష్కరణలు లేని భూమిగా పేరు పడింది.
      

వేలాది ఏళ్ళుగా చదువు కేవలం కొన్ని కులాల, వర్గాల గుత్త ఆధిపత్యం కింద ఉండే పరిస్థితుల్లో తెల్ల దొరలు భారత ఉప ఖండంలోకి రంగ ప్రవేశం చేశారు. వారి చొరబాటు ముఖ్య ఉద్దేశం దోపిడి. ఇక్కడ సంపద అయితే ఉంది కానీ ఈ సంపదను తరలించ టానికి, దాన్ని పర్య వేక్షణ చేయటానికీ, లెక్కలు రాయ టానికి కావాల్సిన మానవ వనరులు ఇక్కడ లేవు. ఏ ఉద్దేశ్యంతో అయితే వలస దారులు పాలక పగ్గాలను చే పట్టారో, ఆ పని జరగ టానికి కావాల్సిన మానవ వనరులు ఇక్కడ లేవు. కాబట్టి కావాల్సిన మానవ వనరులను కూడా వారు తమ దేశం నుంచి తెచ్చు కోవాల్సి వచ్చేది. ఇది చాలా ఖర్చు, ప్రయాస లతో కూడిన పని. కాబట్టి ఈ నేలను దోచు కోవటానికి కావాల్సిన మానవ నరులను కూడా ఇక్కడే తయారు చేసు కోవాలి అనే ప్రతిపాదన వలస పాలకుల ముందుకు వచ్చింది.

తమకు అవసరం అయిన కూలి పనుల కోసం ఒక కొత్త తరాన్ని భారత గడ్డలో తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి తగ్గట్టు భారత విద్యా విధానంలో మార్పులు తీసుకు రావటానికి ఆనాటి వలస ప్రభుత్వం సంకల్పించింది. భారతదేశంలో ఏ రకమైన విద్యా విధానంలో ప్రవేశ పెట్టాలో అప్పటి బ్రిటీషు పార్లమెంటేరియను అయిన లార్డు మెకాలేను ఇండియాకు పిలిపించి ప్రతిపాదనలను కోరింది. దేశాన్ని నాలుగేళ్ళ పాటు గమనించి ఆయన తన ప్రతిపాదనలను బ్రిటీషు పార్లమెంటు ముందుంచే సమయంలో ఆయన చేసిన ఉపన్యాసం మన పరిస్థితికి అద్దం పడుతుంది.

‘‘నేను భారతదేశం నలువైపులా తిరిగి గమనించింది ఏమిటీ అంటే నా యాత్రలో నేను ఎక్కడా ఒక దొంగను కానీ, అడుక్కునే వాడిని కానీ చూడలేదు. భారతదేశంలో కావాల్సినంత సంపద ఉంది. వారసత్వ నైతికత, సాంస్కృతిక సంపదను పుణికిపుచ్చుకున్న చేవ అక్కడి ప్రజల సొత్తు. అది ఇలాగే ఉంటే భారత దేశాన్ని మనం లోబరచుకునే అవకాశం ఎప్పటికీ ఉండదు. భారతీయులు పాటించే ఈ వారసత్వ సంస్కృతి నడ్డి విరగ్గొడితే కాని మనం ఈ దేశంలో మకాం పెట్ట లేము అనేది నా తలపోత.
ఇక్కడి ప్రజల్లో పాతుకు పోయి ఉన్న సంప్రదాయ పద్ధతులను, విద్యా విధానాన్ని సమూలంగా పెకిలించి మనకు దాసోహంగా పడి ఉండే తరాన్ని తయారు చేయాలి. మన పద్ధతులను అక్కడి జనం బుర్ర ల్లోకి నాటాల్సి ఉంటుంది. మనం నాటే విదేశీయ మైన ఇంగ్లీషు సంస్కృతి, ఇంగ్లీషు భాష తమ సంస్కృతి, భాషల కంటే గొప్పవి అని భావించే బానిస తరాన్ని మనం తయారు చేసినట్టు అయితే వారే ఆ సమాజపు సాంస్కృతిక ఉనికిని, అస్థిత్వాన్ని పోగొట్ట టానికి పనికి వస్తారు. ఈ ఉద్దేశానికి తగ్గట్టు భారత దేశంలో మనం విద్యా విధానాన్ని అమలు పరచాల్సి ఉంటుంది’’.


మెకాలే బ్రిటీషు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికకు తగ్గట్టు భారత దేశంలో విద్యా విధానం అమలు అయింది. బయటకు అది బ్రిటీషు ప్రభుత్వానికి గుమాస్తాలను తయారు చేయటమే కానీ మాటు అజెండా మానసికబానిసలను తయారు చేయటమే. మెకాలే మూసలో తయారు అయిన విద్యా విధానాన్ని బ్రిటీషు ప్రభుత్వం స్వాతంత్య్రం ఇచ్చే నాటి వరకు అంటే నూరేళ్ళ పాటు అమలు పరిచింది.

స్వాతంత్య్రం వచ్చాక దాన్ని మార్చి మనది అయిన విద్యా విధానాన్ని కట్టు కున్నామా? అంటే అలాంటిది ఏమీ లేదు. కారణం ఏమిటి అంటే ఈ నూరేళ్ళలో మెకాలే ఆశించిన విధంగా ఇక్కడ బానిస జాతి కావాల్సిన దాని కంటే మెండుగా తయారు అయింది.


తెల్ల దొరలు చెప్పిన చదువులో నుంచి పుట్టుకు వచ్చిన భారత మేధావి వర్గం అంతా దాదాపు ఇదే. తనువులు భారతీయమే కానీ మనసులు ఇంగ్లీషు సంస్కృతికీ, ఇంగ్లీషు భాషకూ దాసోహులు. పాలనలో ప్రధాన భూమికను పోషించే బ్యూరోక్రట్లు, ఉన్నత చదువులు చదివిన రాజకీయ నాయకులు, విశ్వ విద్యాలయాలలో పని చేసే కులపతులు, ఆచార్యులు ఇందులో ముందు వరుసలో ఉన్న వారు. వీరు పాటించే ఈ మానసిక దాసోహానికి అప్పటి పేరు ఆధునికతఆ ఆధునికతకు నేటి కొన సాగింపు పేర్లే మార్కెట్టు, ఉద్యోగాలు, ప్రపంచీకరణ, గ్లోబలయిజేషను, విదేశీ ఉద్యోగాలు.
ఈ మొత్తం పరిణామాన్ని పరికించి చూస్తే సాంప్రదాయ పద్ధతిలో చదువు సాగినంత కాలం అది సమాజానికి పనికి ఉపయోగ పడనిదిగా ఉండటమే కాక ఆ ఉన్న చదువు కూడా కొద్ది మంది గుత్త ఆధిపత్యం  ఉండింది. దీనిని సంస్కరించి కొత్తగా వస్తున్న ఆధునిక పోకడలను మేళవించి మెరిగించిన విద్యను జనానికి అందుబాటులో తెచ్చి ఉండాలి. అలా తెచ్చి ఉన్నట్టు అయితే అలాంటి విద్య ద్వారా భాషా సంస్కృతులను, వారసత్వాన్ని కొనసాగించు కుంటూనే ఆధునికత వైపు ప్రయాణించే అవకాశం ఉండేది. బ్రిటీషు వలసకు ముందు జనానికి అందుబాటులో లేని, ఉత్పత్తిలో పాలు పంచు కోని సాంప్రదాయ విద్య నుండి నేరుగా బానిస విద్యా విధానం లోకి మరలాము. ఎంతగా మారాము అంటే తెలుగు చదివితే అవమాన పడేంతగా. 

మహుశా మెకాలే కూడా భారత జాతి నుంచి ప్రత్యేకించి తెలుగు జాతి నుంచి ఇంత బానినసత్వాన్ని ఆశించి ఉండడు.


Tuesday, February 5, 2013

పిల్లల్లో చదువు ఒత్తిడి- తొలి చదువులు-30


2-2-2013

ఒక వ్యక్తి ఆశించిన దానికీ, నిజంగా జరిగే దానికీ లేదా జరగ బోతున్న దానికి మధ్య ఉండే తేడానే ఒత్తిడి. ఒత్తిడికి గురి అయినపుడు అందుకు ప్రతిగా వారి మనసు, శరీరం స్పందిస్తాయి. ప్రతి వారికీ కొంత ఒత్తిడిని భరించే శక్తి ఉంటుంది. కలిగే ఒత్తిడి భరించే దానికన్నా తక్కువగా ఉంటే అది ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని దాటితే నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి పిల్లల చదువులో కొంత మేరకు ఒత్తిడి అవసరమే. అయితే అది వారి భరింపు గిరి లోనే ఉండాలి. అది కూడా ఎవరికి వారు ఒత్తిడిని తెచ్చి పెట్టు కోవాలి లేదా ఆ వయిపుగా పెద్ద వారు, టీచర్లు ప్రోత్సహించాలి. బలవంతంగా రుద్ద కూడదు. ఏ కారణం వల్ల అయినా పిల్లల చదువు ఒత్తిడి భరించ లేని స్థాయికి చేరింది అంటే మానసిక అలజడి (యాంగ్జయిటీ)కి లోను అవుతారు. దాంతో శారీరక ఆందోళన (టెన్షను) మొదలు అవుతుంది.

ఇది ఒత్తిడి యుగం. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు కాటికి కాళ్లు చాపుకున్న ముసలి వాళ్ళ వరకూ ఒత్తిడికి లోను కాని వారు అంటూ ఎవరూ ఉండరు. అయితే ఒత్తిడికి గురి అయిన సంగతిని వారు గుర్తించ వచ్చూ, గుర్తించ లేక పోవచ్చు. ఒత్తిడి కలగ టానికి గల కారణాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి ఉంటుంది. ఒత్తిడికి కలిగిన వ్యక్తిని బట్టీ దాన్ని అసలు గుర్తించ లేని స్థాయి మొదలు కొని ఆత్మహత్య చేసు కొనే వరకూ ఏ స్థాయిలో అయినా ఉండ ఒచ్చు. 

ఒత్తిడికి గురయ్యే వ్యక్తి, అతని మానసిక పరిణతి, వ్యక్తిత్వాన్ని బట్టీ ఫలితం ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఒకే రకపు ఒత్తిడికి గురి అయినపుడు ఒకరు దాన్ని అసలు ఒత్తిడి కింద పరిగణించక పోగా, రెండో వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చు కునేంతగా స్పందించ ఒచ్చు. ఒత్తిడికి స్పందించే తీరు వారి సర్దుబాటుతత్వం, సమస్యను ఎదుర్కొనే సామర్థ్యం మీద ఆధార పడి ఉంటుంది.

పిల్లల మోతాదుకు మించి ఎక్కువ ఒత్తిడికి గురి అయినప్పుడు మనసుకు నిలకడ కుదరదు. అందువల్ల ఏ పని మీద ధ్యాస పెట్ట లేరు. నేర్చు కోవటం మందగిస్తుంది. నేర్చు కున్న విషయాలు సరిగా గుర్తుకు రావు. మతి మరుపు ఎక్కువ అవుతుంది, చిన్న చిన్న విషయాలకు తికమక పడతారు. ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఒస్తుంటాయి, వారి మీద వారికి నమ్మకం పోతుంది.. ఆలోచన లలో స్పష్టత లేక పోవటం వల్ల నిర్ణయాలు సరిగా తీసు కోలేరు. తట పటాయింపులు ఎక్కువ అవుతాయి. చదువుల మీద, ఆటల మీద ఆసక్తి కోల్పో తారు. ఎవ్వరితో కలవ టానికి ఇష్ట పడరు. తల్లిదండ్రులతో ముభావంగా ఉంటారు. బడికి వెళ్లనని మొరాయించ ఒచ్చు. ఇంట్లో వారి పట్ల తెలియ కుండానే వ్యతిరేక అనిపింపును ఏర్పరచు కుంటారు. ఇంటి నుండి పారి పోవటం, ఆత్మహత్యా ప్రయత్నం లాంటి చర్యలకు పాల్పడతారు. 

చిన్న పిల్లలు వారికి ఉన్న ఒత్తిడిని గుర్తించ లేరు. ఒత్తిడి వల్ల బాధ పడుతున్నాము అని కూడా వారికి తెలియదు. అలాంటప్పుడు వారి ఆందోళన శారీరక లక్షణాల రూపంలో బయట పెడుతుంటారు. తలనొప్పి, వొళ్ళు నొప్పులు, నిద్ర పట్టక పోవడం లేదా ఎప్పుడూ పడుకొని ఉండటం, ఆకలి మందగించటం లేదా అతిగా తినటం, నీరసంగా కనపడతారు.

ఒత్తిడివల్ల పిల్లల మీద కలిగించే దుష్ఫలితాలు పెద్ద వారితో పోలీస్తే చాలా తీవ్రంగా ఉంటాయి. కారణం ఏమిటంటే వారి మీద పడే ఒత్తిడి బయటకు కనిపించని విధంగా ఉంటుంది. పిల్లలు వారికి వారుగా ఒత్తిడిని గుర్తించ లేరు. పలానా కారణం వల్ల ఇబ్బంది పడు తున్నాము అని పెద్ద వారికి తెలియ చేయ లేరు. అందు వల్ల పిల్లల మీద ఒత్తిడి కొన సాగుతూనే ఉంటుంది. రెండోది పయిన చెప్పినట్టు ఒత్తిడి ఒక స్థాయి దాటితో అది చదువు మీద ప్రతికూల ప్రభావం చూపు తుంది కాబట్టి బిడ్డ భవిష్యత్తు వారి సామర్థ్యానికి తగ్గట్టు ఉండదు. చదువుకు సంబంధించిన కారణాలు అదనపు ఒత్తిళ్ళు ఇలా ఉంటాయి.
  1. మార్కులు, రాంకులు గురిగా నడిపే రెసిడెన్షియలు, కార్పొరేటు బడుల వల్ల
  2. పిల్లల వయసుకు మించి హోం వర్కు ఇవ్వటం
  3. విపరీతమయిన క్రమశిక్షణ పాటించడం
  4. సొంత భాషలో మాట్లాడ నివ్వక పోవటం, ఇంగ్లీషు లోనే మాట్లాడ మనటం
  5. వచ్చిన భాషలో తేలికగా నేర్చు కోవాల్సిన అంశాలు రాని భాషలో కష్టంగా ఉండటం 
  6. పిల్లలను అవమాన పరచే, చావబాదే టీచర్లు ఉన్నప్పుడు.
  7. చదివే పిల్లలు, చదవని పిల్లలు అని తేడా చూపించటం.
  8. శక్తికిమించిన గురిని ఇచ్చినపుడు
  9. పిల్లల చదువుల గురించి హయిరానా పడే తల్లిదండ్రులు ఉన్నప్పుడు.

పిల్లల పైన ఒత్తిడిని తగ్గించే పద్ధతులు:

  • పిల్లల శక్తికి మించిన చదువు నేర్పే ప్రయత్నం చేయ కూడదు.
  • చదువుపట్ల పిల్లల్లో ఆసక్తిని కలిగించాలే తప్ప బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయ కూడదు.
  • ఇంగ్లీషును పూర్తిగా నేర్పాకే దాన్ని బోధనా భాషగా తీసు కోవాలి. ప్రాథమిక తరగతుల్లో సొంత భాషలో బోధించటం వల్ల దాదాపు చదువు ఒత్తిడిని తగ్గించ చ్చు.
  • సరళమయిన, శాస్ర్తియమైన బోధనా పద్ధతులను టీచర్లకు నేర్పాలి.
  • బడి నుంచి వచ్చాక ట్యూషన్లు, కోచింగుల్లో ఇరికించ కూడదు.
  • పిల్లల్ని ఫలానా సమయంలో లేదా ఫలానా సమయం వరకు చదవమని బలవంత పెట్ట కూడదు. ఒక వేళ వారికయి వారు వాళ్ళు చదువు కుంటుంటే అభ్యంతరం కూడా చెప్ప కూడదు.
  • పిల్లల్ని ఎక్కువగా తమ ఈడు పిల్లలతో ఆడుకోనివ్వాలి. చదువు పేరుతో ఆటల సమయాన్ని కుదించకూడదు.
  • పరీక్షల సమయంలో కూడా 8 గంటల నిద్ర అవసరం. ఒత్తిడిని తగ్గించే ఒకే ఒక సహజ చికిత్స నిద్ర.
  • పిల్లలు మంచి ఫలితాలను సాధిస్తే అభినందించాలి. చిన్న చిన్న బహుమతులు కూడా ఇవ్వాలి. అలా అని దాన్ని అలవాటుగా మార్చ కూడదు.
  • పిల్లలకు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకు పోవటం లేదా ఎదుర్కొనే నైపుణ్యాలను, నైపుణ్యాన్ని (కోపింగ్ స్కిల్స) అలవాటు చేయాలి.
  • మనసుకు హాయిని ఇచ్చే వినోద కార్యక్రమాలకు పిల్లలను దూరం చేయ కూడదు.
  • చదువు అంటే పరీక్షలు, మార్కులు, ర్యాంకులే కాక జీవితాన్ని గురించి తెలుసు కోవటం అనేదిగా ఉండాలి.
  • పిల్లల్ని ప్రతి విషయంలో అదుపాజ్ఞల్లో పెట్టడం మానెయ్యాలి.


Thursday, January 31, 2013

వినదగునెవ్వరు చెప్పిన-తొలి చదువులు-29


26-1-2012

తొలి చదువులు కొంత భాష లోనే ఉండాలి అనేది ఏదో భాషమీద అభిమానం ఉండటం వల్లనో, ఉద్వేగాల తోనో లేదా పరాయి భాష మీద ద్వేషం తోనో అనే మాటలు కాదు. అవి పరిశోధనల్లో, అనుభవంలో, కాల నిర్ణయంలో నిగ్గు తేలిన సత్యాలు. ఈ నిజ చూపును కాదని కేవలం ఉపాధి, సంపాదనా, పోటీతత్వ అనే వ్యాపార పరమయిన సంగతులను ముందుకు తెచ్చిఆ కంతల్లో నుంచి చూస్తే నిజాలు నెత్తికి ఎక్కవు. మన చేత మేథావులుగా పరిగణించ బడిన గొప్ప వ్యక్తులు, సంస్థలు, పరిశోధకులు ఏమంటున్నారో ఒక సారి పరికించాల్సిన అవసరం ఉంది.

మహాత్మాగాంధీ: ‘‘విద్య వ్యక్తికి జీవిత సూత్రాలను నేర్పేదిగా ఉండాలి. లేత ప్రాయంలో చదివే ప్రాథమిక విద్య అందుకు పునాది వేసేదిగా ఉండాలి. బిడ్డ శరీర పోషణకు తల్లిపాలు ఎంత అవసరమో, మనసు విరబూయటానికి సొంత భాష కూడా అంతే అవసరం. బిడ్డ తన తొలి పాఠాన్ని తల్లి దగ్గరే నేర్చు కుంటుంది. కాబట్టి బిడ్డల పయిన విదేశీ భాషను రుద్దటం మాతృ దేశానికి ద్రోహం చేయటమే అనేది నా అభిప్రాయం’’.

రవీద్రనాథ ఠాగూరు: ‘‘ఆంగ్లాన్ని ప్రత్యేక మెళకువలతో, జాగర్తలతో రెండో భాషగా నేర్పాలి. కానీ బోధన మాత్రం సొంత భాషలోనే జరగాలి. యూనివర్సిటీ స్థాయి వరకూ సొంత భాషలో చదివే అవకాశాలు కలిగించాలి. ఇందుకు నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి.
  • సొంత భాషలో మాత్తరమే జీవితానికి సంబంధించిన లోతు లను తాకగలరు.
  • ఏ విషయంలో అయినా ప్రత్యేక నైపుణ్యాన్ని పొందాలి అంటే అందుకు భాష   అడ్డంకిగా ఉండ కూడదు.
  • వ్యక్తికి ఉన్న చేవ అంతా కొత్త భాష నేర్చు కొనేందుకే సరి పోతుంది. అందువల్ల అవసరం అయిన పరిజ్ఞానాన్ని నేర్చు కోవటంలో వెనుక పడతారు.
  • సొంత భాషలో చదువు చెప్పటంవల్ల ఆడపిల్లల్లో చదువు మెరుగు అవుతుంది. భారతీయ సమాజంలో మహిళా విద్యకు తక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి సొంత భాషలో విద్య బోధన వల్ల బాలికల్లో విద్యకు సంబంధించిన అదనపు భారం లేకుండా ఉంటే వారి విద్యా అవకాశాలు మెరుగు అవుతాయి’’.


ఎ.పి.జె.అబ్దుల్ కలాం (మాజీ రాష్టప్రతి): ‘‘నేను తమిళంలో చదివాను. మనం సొంత భాషను నేర్చు కోవాలి. బాగా పుస్తకాలు చదవాలి. జనం భాషలో చదువును చెప్పటానికి ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణ మీద మనం చూపు సారించాలి’’.

యునెస్కో: నాణ్యమయిన విద్య అందరికీ అందించాలి అనే గురితో ప్రణాళికలు ఉండాలి. పసితనం నుంచి చెప్పే చదువులో వారి సొంత భాషనే ఉపయోగించాలి. ఆ రకంగా పాఠశాల విద్యా విధానం ఉండాలి. అధికార జాతీయ భాషతో పాటు సొంత భాషను కూడా ఉపయోగించడం ద్వారా విద్యార్థుల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి అని ఇటీవలి పరిశోధనలు నిక్కచ్చిగా తెలుపుతూ ఉన్నాయి. అంతే కాదు, సొంత భాషలో చదువు వల్ల జ్ఞానం పెరగటానికి వీలుగా పిల్లల్లో చదివే చేవను ఇనుమడింప చేస్తుంది. ప్రస్తుతం సగటున నెలకు రెండు భాషలు కను మరుగు అయి పోతున్నాయి. కనుక భాషలను కాపాడే చర్యలు చేపట్టాలి.

నేడు ప్రధానంగా ప్రపంచం లోని ప్రాచీన తెగల భాషల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వారసత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, సొంత భాషను కాపాడు కోవటం అనేది వారి కీలకం అయిన హక్కుగా మనం గుర్తించాలి. భాషా బోధన, ప్రత్యేకించి సొంత భాషలో బోధన అనేది ప్రపంచ వ్యాప్తంగా నేడు అత్యంత ప్రధాన అంశంగా ఉంది. విశ్వ వ్యాప్తంగా తమ భావాలను ఈ భాషలు తెలియ చేయ గలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి తన సొంత భాషను కాపాడుకుంటూ, దానిని ఒక వ్యక్తీకరణ రూపంగా జీవితాంతం ఉపయోగించు కోవాలి’’.

ఐక్యరాజ్య సమితి: మానవ సంబంధాలూ, సమాచార మార్పిడి లాంటి విషయా లలో సొంత భాష పదును అయిన, చేవ కలిగిన ఆయుధం. జాతి సొంత ప్రయోజనాలు, కళలు, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో స్వంత భాష పాత్ర అంతా ఇంతా కాదు. సమాచార మార్పిడిలో ఇపుడు తనది అయిన పాత్ర పోషిస్తున్న ఇంటర్నెట్టు, ఇప్పటి వరకు ఆంగ్లం లోనే అందుబాటులో ఉంది. సభ్య దేశాలు వారి వారి సొంత భాషలో ఈ సమాచార నిధిని తర్జుమా చేయించి ప్రజలకు అందించే విధానాలను రూపొందించి అమలు పరచు కోవాలి.

క్లింటన్ రాబిన్‌సన్స్ (సమ్మర్ ఇన్టిట్యూట్ ఆఫ్ లింగ్విస్టిక్ అధిపతి, బ్రిటన్): ‘‘జ్ఞానం నిండుగా పెంపొందించు కోవాలి అంటే అది సొంత భాష ద్వారానే వీలు అవుతుంది. సొంత భాషలో కాకుండా, వారిది కాని ఇతర భాషలో చదివే విద్యార్థుల్ని చూస్తే రెండు సంగతులు తెల్లం అవుతాయి. ఒకటి సొంత భాషలో విద్య నేర్చుకోక పోవడంవల్ల వారి జ్ఞానంలో నిండుదనం ఉండటం లేదనీ, రెండోది వారు వారి జ్ఞానం ఎదుగుదలలో తమ సొంత భాష పూర్తిగా వాడు కోలేక పోయారు కాబట్టి వారికి సొంత భాష ఉపయోగం లేకుండా పోయిందని.

జిమ్ కుమీన్స్ (టోరోంటో యూనివర్సిటీ): ‘‘విద్యార్థికి సొంత భాష మీద ఉన్న పట్టు ఆ విద్యార్థి రెండో భాషను ఎంత బాగా నేర్చుకోగలడు అనేదానికి గీటురాయిగా ఉంటుంది. బడిలో సొంత భాషలో బోధించడం వల్ల తరువాత కాలంలో ఇతర భాషలను నేర్చుకొనే చేవ పెరుగుతుంది. తద్వారా బిడ్డలో ఉండే మొత్తం చేవ వినియోగం లోకి వస్తుంది. పిల్లలకు సొంత భాష పూర్తిగా నేర్పకుండా పరాయి భాషను నేర్పడం వల్ల నష్టం ఎక్కువ. బిడ్డలో సొంత భాష పూర్తిగా ఎదిగి స్థిర పడక పోతే అది వాళ్ళనుండి త్వరగా మాయం అవుతుంది. అందువల్ల తల్లి భాష బాగా ఎదిగాకే రెండో భాషను నేర్పాలి. పాఠశాలల్లో పిల్లల్ని తమ సొంత భాషలో మాట్లాడనీక పోవటం అంటే అది పిల్లలను నిరాకరించినట్టే.

ఆసియా దేశాల భాషా సదస్సు: యునెస్కో, మాషిడోలు యూనివర్సిటీ ఉమ్మడిగా చేపట్టిన ఆసియా దేశాల సదస్సులో వెలువరించిన అభిప్రాయాల సారాంశం ఏమిటంటే ‘‘ప్రాథమిక విద్యను సొంత భాషలో చదివిన విద్యార్థులు ఆ తర్వాత ఏ మాధ్యమంలో చదివినా, తొలి నుంచీ ఇంగ్లీషు మాధ్యమంలో చదివిన వారి కంటే ఎక్కువ నైపుణ్యాలను కలిగి ఉంటారు’’ అని అభిప్రాయ పడింది.

పంజాబు నిపుణుల కమిటీ: పంజాబు ప్రభుత్వం, ప్రాథమిక విద్యలో ఆంగ్లాన్ని ఏ స్థాయిలో నేర్పించాలి అనే విషయం మీద ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులు, మొదట సొంత భాష చదవటం, రాయటం వచ్చాకే ఆంగ్ల భాషను పరిచయం చెయ్యాలని అభిప్రాయ పడ్డారు.

Saturday, January 19, 2013

తాడెక్కే జనం తలదన్నే ప్రభుత్వం: తొలి చదువులు-28


19-01-2013

తొలి విద్యను పరాయి భాషలో జరపడం అనేది అశాస్ర్తియమని తెలిసినా ధనిక, ఉన్నత మధ్య తరగతి ప్రజల్లో ఇంగ్లీషు మీడియం పట్ల ఆదరణ పెరుగుతుంది అనేది కళ్లకు కనిపిస్తున్న నిజం. సామాజికంగా ఉన్నత స్థితిలో ఉన్న ఈ వర్గాన్ని అనుసరించడం మధ్య తరగతి లక్షణం. ఇక మిగిలింది పేద ప్రజానీకం. పేదరికంలో ఉన్న వర్గాలు వ్యాపార వస్తువు అయిన విద్యను తమ బిడ్డలకు కొని ఇవ్వలేక ప్రభుత్వ బడులకు పంపి, తెలుగు మీడియంలో చదివిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చదివే గ్రామీణ ప్రజానీకం, బలహీనవర్గాలు, దళితులు దీన్ని అవమానంగా భావిస్తూ మీ పిల్లలకు ఏబీసీడీలు మా పిల్లలకు అ ఆ ఇ ఈలా అని నిలదీస్తున్నారు. దీన్ని సరిచేసి శాస్ర్తియం అయిన బోధనా పద్ధతులను తెచ్చి, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వాన్ని నడిపే వారి సంకుచిత ప్రయోజనాల కోసం, ఓట్ల రాజకీయం కోసం మీ బిడ్డలకు కూడా ఇంగ్లీషు లోనే చదువు చెబుతాం అని ప్రభుత్వ బడుల్లో ప్రాధమిక స్థాయి నుంచే ఇంగ్లీషు మీడియాన్ని తేవటానికి మొక్కలు నాటటం మొదలు అయింది.

ఉన్నత విద్యా విధానం పట్ల ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు, కానీ ప్రాధమిక విద్యకు సంబంధించి ఏ విషయాన్ని మాట్లాడాలన్నా దాన్ని అనేక కోణాల నుంచి పరిశీలించాలి. ఎందుకంటే ప్రాధమిక విద్యలో కేంద్ర బిందువు ఇంకా వికసించని బిడ్డ. విద్యా బోధనకు చెందినంత వరకు ప్రత్యేకించి ప్రాథమిక విద్యకు ప్రపంచం అంతా ఆమోదించిన ఒక శాస్ర్తియ పద్ధతి ఉంది. బిడ్డ శారీరక మానసిక సామర్ధ్యాన్నీ, బిడ్డ పెరుగుతున్న సమాజం, సంస్కృతి, వారసత్వాన్నీ చూపులో ఉంచు కోవాలి. అంతే కాకుండా సామాజిక పరిస్థితుల్ని, ప్రాంతీయ, జాతీయ విలువలు లాంటి అనేక కోణాల నుంచి చూడాలి. వీటి ఆనింపుగా ప్రాధమిక విద్య ఎలా ఉండాలని అనేది నిర్ణయిస్తే అది శాస్ర్తియంగా ఉంటుంది.


మొత్తంమీద మార్పు రావాల్సింది ప్రజల్లో అయినప్పటికీ జాతి, సంస్కృతి, భాషల మనుగడకే గండం ఏర్పడిన అప్పుడు వాటిని కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించాలి. అవసరం అయితే చట్టాన్ని ప్రయోగించాలి. అంతే కాకుండా అశాస్ర్తియ పద్ధతుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాలు పంచు కోవాలి. జరుగుతున్న పొరపాటు దిద్ద టానికి ప్రభుత్వం స్పందించాలి. మొత్తంగా మార్పు రావ టానికి సమయం పట్ట ఒచ్చు. అంత వరకూ ఎవరి స్థాయిలో వారు కొన్ని ముందస్తు చర్యలు, జాగర్తలు తీసుకుని జరిగే నష్టాన్ని కొంత మేర అయినా ఆపటం కనీసం గుడ్డిలో మెల్ల అవుతుంది.


తల్లిదండ్రులు

  • ఇంగ్లీషులో చదవడం, ఇంగ్లీషు మాట్లాడడం రెండూ ఒకటి కాదని ముందుగా గుర్తించండి. 
  • కేజీ క్లాసులతో సహా ప్రాధమిక విద్య గురి పిల్లల బుర్రలు విరపూయ టానికే తప్ప ఉపాధికి కాదని గుర్తించండి.
  •  తెలిసిన ఏ భాషలో అయినా జ్ఞానాన్ని బోధించ ఒచ్చు. అర్థం కాని భాషలో చదువు చెబితే మీ బిడ్డల బుర్రలు ఎలా ఎదుగుతాయో ఆలోచించండి. 
  • సొంత భాష ద్వారా పొందిన విజ్ఞానం అంతా ఆ తరువాత మీ పిల్లలు ఎన్ని భాషలు నేర్చుకున్నా దాని అంతట అదే అన్ని భాషల్లోకి మారుతుంది. తెలుగులో నేర్చుకున్నారు కదా అని అది తెలుగు లోనే ఉండదు. 
  • ఒక వేళ మీ పిల్లలను ఎగువ తరగతుల్లో ఇంగ్లీషులో చదివించాలి అనుకున్నా ఆ భాష కనీసంగా నేర్చుకునే వరకు తెలుగు లోనే చదివించండి. ఇంగ్లీషు నేర్చుకున్నాక ఆ మీడియంలో చదివించు కోవచ్చు.
  • మీ పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివిస్తూ వుంటే బడిలో అర్థం కాని అంశాలను తెలుగులో చెప్పమని యాజమాన్యాన్ని నిలదీయండి. 
  • మీరు చెప్పగలిగితే పుస్తకాల లోని విషయాలను పిల్లలకు తెలుగులో వివరించండి. దీనివల్ల మీ పిల్లలు చదువులో ఏ స్థాయిలో ఉన్నారో మీకు అర్థం అవుతుంది. 
  • మధ్య మధ్యలో మీ బిడ్డ ప్రోగ్రెస్ కార్డుల్లో వున్న మార్కులకు, బిడ్డ తెలివికి పొంతన కుదురుతుందో లేదో చేస్తూ ఉండండి. అలాగే బడిలో మీ బిడ్డకు లేని ప్రతిభను అంట గడుతున్నారేమో మొదటి లోనే గుర్తించి తగిన జాగర్తలు తీసుకోండి. 
  • తేడాను గుర్తించినా, గుర్తించనట్లు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మిమ్మల్ని, మీ బిడ్డని ఎవరూ కాపాడలేరని గమనించండి.
  • తెలుగులో చదివే వాళ్లను తక్కువ చేసి చూడకండి. 
  • మీరు ఏ మీడియంలో చదివిస్తున్నా పిల్లల్ని మన భాష పట్ల, సంస్కృతి పట్ల గౌరవం కలిగించే విధంగా పెంచండి. 
  • బిడ్డలకు బట్లరు ఇంగ్లీషు కాకుండా మంచి ఇంగ్లీషు నేర్పండి. సొంత భాషమీద పట్టు లేకుండా మంచి ఇంగ్లీషు రాదని మరో సారి గుర్తించండి.


ప్రయివేటు బడులు 


  • మీది ప్రయివేటు పాఠశాల అయితే, పిల్లలకు చదువు చెప్పటంలో మీ నిజాయితీని ఒకసారి మీకు మీరే పరీక్షించుకోండి. 
  • మీరు చేసేది వ్యాపారమే కావొచ్చు. మీరు అమ్మేది గిరాకీ ఉన్న ఇంగ్లీషు మీడియాన్నే కావచ్చు. అయినప్పటికీ అది అశాస్ర్తియం అన్న సంగతి మీకు తెలుసు. దాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకోండి. 
  • బడిలో పిల్లలు మంచి ఇంగ్లీషు మాట్లాడాలి అంటే అంతకు ముందు వారికి మంచి తెలుగు వచ్చి ఉండాలని గుర్తించండి. 
  • బోధించే విషయాలు పిల్లలకు అర్ధం అవుతున్నాయో లేదో చూడండి. తెలుగులో చెప్తే అర్థం అవుతున్నాయి అనుకుంటే అలానే చెప్పండి. తెలుగులో అర్థం అయినట్టు చెప్పాక అదే పాఠాన్ని ఇంగ్లీషులో చెప్పించండి. ఇంగ్లీషు మీడియం కదా అని ఇంగ్లీషులోనే చెప్పడానికి ప్రయత్నిస్తే మీరు చెప్పేది ఉపయోగం లేదని గుర్తించండి.
  • పిల్లలను బట్టీ పద్ధతికి అలవాటు చెయ్యొద్దు. రాని మార్కులను వెయ్య ఒద్దు. 
  • తెలుగు సబ్జెక్టును నిర్లక్ష్యం చేయకండి. పిల్లలకు చదవడం, రాయడం బాగా నేర్పించండి. 
  • పిల్లల్ని ఆయా ప్రత్యేక పీరియడ్‌లో ఇంగ్లీషులోనే మాట్లాడమని ప్రోత్సహించాలే కాని బలవంతం చెయ్య ఒద్దు. అలా చేసి వాళ్ల స్వేచ్ఛను హరించ కూడదు. 
  • ముందు మీ టీచర్లు అందరికి ఇంగ్లీషు మాట్లాడడం బాగా నేర్పించండి. 
  • ఇంగ్లీషును తెలుగు ద్వారా నేర్పాలి తప్ప ఇంగ్లీషును ఇంగ్లీషు ద్వారా నేర్పడం అశాస్ర్తియం. 
  • వ్యాపారంలో నిజాయితీ ఉన్నప్పుడే నాలుగు కాలాల పాటు నిలబడతారు అనేది కాలం తేల్చిన సత్యం.


ప్రభుత్వ బడులు 


  • మీరు తెలుగులో బోధించే ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తుంటే మీ బాధ్యతల్ని సక్రమంగా చేయండి. 
  • మీరు మనసు పెట్టి చెప్పాలే కాని ప్రైవేటు పాఠశాలల్లో చెప్పే చదువు కంటే మెరుగ్గా, నాణ్యమైన బోధనని అందించ  కలరు. 
  • ఒకటి, రెండు, మూడు తరగతుల్లో చదవడం, రాయడం నేర్పకుండా ఎగువ తరగతులకు పంపిస్తే పిల్లలు ఎంత తెలివి కలవారు అయినా ఉపయోగం లోకి రారు అని గుర్తించండి. 
  • మీ బాధ్యతను మీరు చెయ్యక పోవడం వల్ల ఒక నిండు జీవితం వికసించకుండా పోవడం మీకు ఇష్టమా? అని ప్రశ్నించుకోండి. అంటే పిల్లలకు బాగా చదువు చెప్పండి. 
  • ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యార్థుల్ని తీర్చి దిద్దండి. పిల్లలకు మంచి ఇంగ్లీషు నేర్పండి. 
  • మీ విద్యార్థులకు తెలుగు బాగా వచ్చి ఉంటుంది కాబట్టి ఏబీసీడీలతో విద్యాభ్యాసం చేసిన పిల్లలకంటే త్వరగా బాగా ఇంగ్లీషు నేర్చుకోగలిగి ఉంటారు. ఆ అవకాశాన్ని ఉపయోగించండి.






Saturday, January 12, 2013

ఇంగ్లషు కోసం వితండ వాదనలు; తొలి చదువులు-27


12-01-2013



నేటి కాలంలో బిడ్డల ఎదుగుదలలో చదువు ఒక ముఖ్యమయిన భాగం. పుట్టిన బిడ్డకు మాటలు ఒచ్చాక చదువు కోసం బడిలో వేస్తాము. బిడ్డ బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టటంలో ఇది తొలి మెట్టు. ఆ తరువాత అది పలు అంచెల్లో కొన సాగుతుంది. తొలి అంచెలో మొదలు అయ్యే ప్రాథమిక విద్యలో తన భాషను చదవటం- రాయటం, లెక్కల్లో ఉన్న కూడిక - తీసివేత- పెంచటం- భాగించటం అనే నాలుగు ప్రక్రియలను నేర్చు కోవటం తోపాటు పరిసరాల గురించి కొంత ప్రాథమిక పరిజ్ఞానాన్ని పొందటమే. ఒక ప్రాంతంలో ఉండే బిడ్డలు అందరికీ ఒకే రకమయిన ఉమ్మడి విధానంగా చదువు ఉంటుంది. దీని తరువాత మొదలయ్యే రెండో అంచె (సెకండరీ ఎడ్యుకేషన్) విద్యలో దేశాన్ని గురించీ, ప్రపంచాన్ని గురించీ, ప్రకృతిని గురించి తెలియచెప్పేది. ఇది కూడా పిల్లలు అందరికీ ఉమ్మడిగా అందించాలి. ఆ తరువాత మొదలు అయ్యేది ఉన్నత విద్య. బతకడానికి ఉపాధిని చూపించేది వృత్తి విద్య లేదా యూనివర్సిటీ విద్య. ఇది ఆసక్తిని బట్టి, అవసరాన్ని బట్టి, అందుబాటును బట్టి ప్రతి బిడ్డకూ మారుతూ ఉంటుంది.


ముందు చెప్పినట్టు ప్రాథమిక విద్య అంటే కేవలం చదవటం, రాయటం నేర్చు కోవటం మాత్తరమే కాదు. వ్యక్తి మొత్తం ఎదుగుదలకు పునాది వేయటం. విద్య గురి బిడ్డను ఇంట్లో నుంచి సమాజంలోకి ప్రవేశ పెట్టడం. ఇక్కడి బిడ్డ తన గురించి తన కుటుంబాన్ని గురించి చుట్టూ వున్న సమాజం, పరిసరాలను గురించి తెలుసుకోవాలి. సమాజపు నియమాలూ, జనంతో సంబంధాల గురించి తెలుసు కోవాలి. బిడ్డ ఎదిగాక ఏమి అవుతారు అనే దానితో సంబంధం లేకుండా ప్రాథమిక విద్య ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బిడ్డ వ్యక్తిగా ఎదగటంలో తొలి మెట్టు ప్రాథమిక విద్య. ఇది బిడ్డ ఇంటి భాష, సమాజపు భాష ఏది అయితే ఇందులో జరగాలి. ఇది శాస్ర్తియమైన పద్ధతి. ప్రపంచం అంతా ఈ పద్ధతినే అనుసరిస్తుంది.

పసి పిల్లలకు సొంత భాషలో చదువు పనికిరాదని, ఇది అశాస్ర్తియం అని ఇంతవరకూ ఎవరూ అనలేదు. ఇది నూటికి నూరుపాళ్ళూ శాస్ర్తియమే అని అందరూ ఒప్పుకుంటారు. చివరికి ఇంగ్లీషులో చదువును సమర్థించే వారు సయితం ‘‘తొలిచదువుకు సొంత భాష శాస్ర్తియమే... కానీ...’’ అంటూ ఫలానా పరిస్థితుల్లో కాబట్టి ఇంగ్లీషు అవసరం అని తమ వాదనలకి ఏవో కొన్ని ఆధారాలు వెతుక్కుంటారు.

నూటికి నూరుపాళ్ళు శాస్ర్తియం అని ఒప్పుకొనే సొంత భాషలో తొలి విద్యను అమలు చేసుకోవటంలో క్రమేణా నీళ్ళు ఒదులుతున్నాం. గాడి తప్పుతున్న ఈ పద్ధతిని సరిచేద్దాం అని ఎవరైనా అంటేనో, ఇపుడయినా మేలుకొని బిడ్డలను తెలుగులో చదివిద్దాం అని ఎవరు అయినా అనుకుంటే వారికి సవాలక్ష సవాళ్లు ఎదురవుతాయి. ఈ సంగతిని చర్చకు పెడితే ఇక చూడండి! రకరకాల ప్రశ్నలు, అనర్గళంగా వాదనలు, లేని పోని అనుమానాలు, సందేహాలు బయలుదేరతాయి. ఎక్కువ మంది చేసే వాదనలూ, లేవదీసే అడకలు ఎలా ఉంటాయి అంటే- 

·                     తెలుగులో చదివితే ఇంగ్లీషు ఎలా వస్తుంది? 
·                     ఇప్పటి రోజుల్లో ఇంగ్లీషు లేకుండా జ్ఞానం ఎలా వస్తుంది?
·                     ఉన్నత విద్య చదవాలి అంటే ఇంగ్లీషు నేర్చుకోవాలి కదా! 
·                     విదేశాలకు వెళ్ళాలి అంటే తెలుగులో చదివితే ఎలా? 
·                     సాఫ్టువేరు ఉద్యోగాలు ఎలా వస్తాయి? 
·                     ఇంగ్లీషు అంతర్జాతీయ భాష. దాన్లో చదవక పోతే వెనుకడిపోమా? 
·                     తెలుగులో రెఫరెన్సు పుస్తకాలు దొరకవు కదా! 
·                     ఇంగ్లీషును కాదని బతకడం వీలు అవుతుందా? 
·                     సాంకేతిక పదాలకు తెలుగు అర్థాలులేవు కదా? 
·                     డాక్టర్లు, ఇంజనీర్లు కావాలంటే ఇంగ్లీషు లేకపోతే ఎలా?

ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కొంత మంది అయితే పోట్లాడతారు కూడా. ఒక అశాస్ర్తియ పద్ధతిని సమర్థించడానికి ఇంత బలమయిన వాదనలు ముందుకు రావటానికి కారణం ఏమిటి? ఈ ఆలోచనలు బుర్రలో దూరటానికి కారణం ఏమిటి? అన్న సంగతిని చూడాల్సి ఉంటుంది.

పయి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం అయితే ఒకటే. అది ఏమిటి అంటే వాదనలు ప్రతి వాదనలు జరిగేటప్పుడు సంగతిని సరిగా బుర్రకు ఎక్కించు కోకుండా, అర్థం చేసుకోకుండా అర తలకాయతో మాట్లాడటమే. వీరిలో సామాన్య మానవుడి నుండి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకూ అనేక మంది ఉన్నారు.

‘‘ప్రాథమిక విద్య తెలుగులో ఉండాలి’’ అని ఎవరు అయినా అంటే, ఆ మాటలను వీళ్ళ అర బుర్రల్లోకి ఎలా దూరుతాయి అంటే, 

·                     ఇంగ్లీషును వ్యతిరేకిస్తున్నట్టు 
·                     ఇంగ్లీషును పూర్తిగా ఒద్దు అంటున్నట్టు 
·                     తెలుగులో చదివితే, తెలుగు తప్ప ఇంగ్లీషు రాదు అన్నట్టు 
·                     ఇంగ్లీషు రాకపోతే పని దొరకనట్టూ 
·                     ఉపాధి కోర్సులు అంటే కేవలం మెడికలు, ఇంజనీరింగు, సాఫ్టువేరు, మేనేజిమెంటు కోర్సులే అయినట్టు 
·                     ప్రతి బిడ్డా విదేశాలకు పోతున్నట్టూ 
·                     బిడ్డలకు సొంత నాడులో, సొంత దేశంలో ఉపాధి దొరకనట్టు 
·                     విదేశాలకు వెళ్ళటమే చదువు పరమార్థం అన్నట్టు.

ఇలా రక రకాలుగా, తప్పుగా అర్థం చేసుకుంటారు. వారికి అర్థం అయిన అర తలకాయతో, అనాలోచితంగా వాదనలు మొదలు పెడతారు. దీనితో చర్చ ప్రాథమిక విద్య మీద కాకుండా సాంకేతిక విద్య మీదకు, వృత్తి విద్య మీదకు, ఉపాధి అవకాశాలు మీదకు, విదేశీ ఉద్యోగాల మీదకు మళ్ళుతుంది. దీనితో చర్చ పక్కదారి మళ్ళి, గందరగోళంగా మారుతుంది. అందువల్ల అసలు సంగతి మరుగున పడి, వాదన నెగ్గటం అన్నది సంగతి సారాంశం మీద కాకుండా వ్యక్తుల వాదనా పటిమ మీద, మొండి వాదన మీద అరుపుల మీద ఆధారపడి ఉంటుంది. టీవీలల్లో నిర్వహించే చర్చా వేదికల్లో, పత్రికల్లో వచ్చే వ్యాసాలలో ఈ బాపతు వాదనలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ప్రాథమిక విద్య అంటే ఉన్నత విద్య కాదనీ కాలేజీ విద్యలు కాదనీ, సాంకేతిక విద్య, యూనివర్సిటీ చదువులూ, వృత్తి విద్యలు అసలే కాదని ఈ అర తలకాయ మేథావులకు చర్చ జరుగుతున్నంత సేపు మళ్లీ మళ్లీ గుర్తు చేసి మాట్లాడాల్సిన అక్కర ఉంది. దీనికి చాలా ఓర్పు, నేర్పు అవసరం. ఎంత ప్రయత్నించి చర్చను గాడిలో పెట్టాలని చూసినా ఆ అర తల కాయలు తిరిగి మళ్లీ అదే దరువు ఎత్తుకుంటూ వుంటారు. కారణం మరేమీ లేదు వారి దగ్గర శాస్ర్తియం అయిన వాదనా వస్తువు లేక పోవటమే. ఇలాంటి వారితో వాదించినా, చర్చలు జరిపినా సమయం వృధా అవుతుందే తప్ప చీమ తలకాయ అంత ఉపయోగం కూడా ఉండక పోవచ్చు.

ఎగువ చదువులు, విరివి చదువులు (అడ్వాన్సుడు స్టడీసు) అన్నీ ఇంగ్లీషులో చదువు కోవచ్చు. ఇంగ్లీషు కాక పోతే ఫ్రెంచిలో చదువు కోవచ్చు. అదీ కాక పోతే మరో భాష. కాదన్నది ఎవరూ? అసలు చదవాలి అంటే ముందుగా ఆ భాష నేర్చు కోవాలి కదా!

ఇంగ్లీషును బోధనా భాషగా ఎంచు కోవాలి అంటే ముందుగా దాన్ని నేర్చు కోవాలి. తొలి చదువుల్లో బిడ్డ సొంత భాషను ఎదగనిచ్చి, కొంత కాలానికి ఇంగ్లీషును పరిచయం చేసి, దాన్ని బాగా నేర్పించాలి. తరువాత అవసరం అయిన వారికి దాన్ని బోధనా భాషగా ఎంచుకొనే అవకాశం ఇవ్వవచ్చు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. పాల బుగ్గల పసి మొగ్గలకు అసలు భాషే రాక పోతే అందులో బోధన ఏమిటి? అనే సంగతి ఈ మట్టి బుర్రల్లోకి ఎక్కించ టానికి ఏదయినా మర ఉంటే బాగుణ్ణు.