2-2-2013
ఒక వ్యక్తి ఆశించిన దానికీ, నిజంగా
జరిగే దానికీ లేదా జరగ బోతున్న దానికి మధ్య ఉండే తేడానే ఒత్తిడి. ఒత్తిడికి గురి
అయినపుడు అందుకు ప్రతిగా వారి మనసు, శరీరం స్పందిస్తాయి. ప్రతి వారికీ కొంత
ఒత్తిడిని భరించే శక్తి ఉంటుంది. కలిగే ఒత్తిడి భరించే దానికన్నా తక్కువగా ఉంటే
అది ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని దాటితే నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి పిల్లల
చదువులో కొంత మేరకు ఒత్తిడి అవసరమే. అయితే అది వారి భరింపు గిరి లోనే ఉండాలి. అది
కూడా ఎవరికి వారు ఒత్తిడిని తెచ్చి పెట్టు కోవాలి లేదా ఆ వయిపుగా పెద్ద వారు,
టీచర్లు ప్రోత్సహించాలి. బలవంతంగా రుద్ద కూడదు. ఏ కారణం వల్ల అయినా పిల్లల చదువు ఒత్తిడి
భరించ లేని స్థాయికి చేరింది అంటే మానసిక అలజడి (యాంగ్జయిటీ)కి లోను అవుతారు. దాంతో
శారీరక ఆందోళన (టెన్షను) మొదలు అవుతుంది.
ఇది ఒత్తిడి యుగం.
అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు కాటికి కాళ్లు చాపుకున్న ముసలి వాళ్ళ వరకూ ఒత్తిడికి లోను
కాని వారు అంటూ ఎవరూ ఉండరు. అయితే ఒత్తిడికి గురి అయిన సంగతిని వారు
గుర్తించ వచ్చూ, గుర్తించ లేక పోవచ్చు. ఒత్తిడి కలగ టానికి గల కారణాన్ని బట్టి, దాని
తీవ్రతను బట్టి ఉంటుంది. ఒత్తిడికి కలిగిన వ్యక్తిని బట్టీ దాన్ని అసలు
గుర్తించ లేని స్థాయి మొదలు కొని ఆత్మహత్య చేసు కొనే వరకూ ఏ స్థాయిలో అయినా ఉండ ఒచ్చు.
ఒత్తిడికి గురయ్యే వ్యక్తి, అతని మానసిక పరిణతి, వ్యక్తిత్వాన్ని బట్టీ ఫలితం
ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఒకే రకపు ఒత్తిడికి గురి అయినపుడు ఒకరు దాన్ని అసలు
ఒత్తిడి కింద పరిగణించక పోగా, రెండో వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చు కునేంతగా స్పందించ
ఒచ్చు. ఒత్తిడికి స్పందించే తీరు వారి సర్దుబాటుతత్వం, సమస్యను ఎదుర్కొనే
సామర్థ్యం మీద ఆధార పడి ఉంటుంది.
పిల్లల
మోతాదుకు మించి ఎక్కువ ఒత్తిడికి గురి అయినప్పుడు మనసుకు నిలకడ కుదరదు. అందువల్ల ఏ పని మీద ధ్యాస పెట్ట లేరు.
నేర్చు కోవటం మందగిస్తుంది. నేర్చు కున్న విషయాలు సరిగా గుర్తుకు రావు. మతి మరుపు
ఎక్కువ అవుతుంది, చిన్న చిన్న విషయాలకు తికమక పడతారు. ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఒస్తుంటాయి,
వారి మీద వారికి నమ్మకం పోతుంది.. ఆలోచన లలో స్పష్టత లేక పోవటం వల్ల నిర్ణయాలు సరిగా
తీసు కోలేరు. తట పటాయింపులు ఎక్కువ అవుతాయి. చదువుల మీద, ఆటల మీద ఆసక్తి కోల్పో తారు.
ఎవ్వరితో కలవ టానికి ఇష్ట పడరు. తల్లిదండ్రులతో ముభావంగా ఉంటారు. బడికి వెళ్లనని మొరాయించ
ఒచ్చు. ఇంట్లో వారి పట్ల తెలియ కుండానే వ్యతిరేక అనిపింపును ఏర్పరచు కుంటారు. ఇంటి
నుండి పారి పోవటం, ఆత్మహత్యా ప్రయత్నం లాంటి చర్యలకు పాల్పడతారు.
చిన్న పిల్లలు
వారికి ఉన్న ఒత్తిడిని గుర్తించ లేరు. ఒత్తిడి వల్ల బాధ పడుతున్నాము అని కూడా
వారికి తెలియదు. అలాంటప్పుడు వారి ఆందోళన శారీరక లక్షణాల రూపంలో బయట పెడుతుంటారు. తలనొప్పి,
వొళ్ళు నొప్పులు, నిద్ర పట్టక పోవడం లేదా ఎప్పుడూ పడుకొని ఉండటం, ఆకలి మందగించటం లేదా
అతిగా తినటం, నీరసంగా కనపడతారు.
ఒత్తిడివల్ల పిల్లల మీద కలిగించే దుష్ఫలితాలు పెద్ద వారితో పోలీస్తే చాలా తీవ్రంగా
ఉంటాయి. కారణం ఏమిటంటే వారి మీద పడే ఒత్తిడి బయటకు కనిపించని విధంగా ఉంటుంది.
పిల్లలు వారికి వారుగా ఒత్తిడిని గుర్తించ లేరు. పలానా కారణం వల్ల ఇబ్బంది పడు తున్నాము
అని పెద్ద వారికి తెలియ చేయ లేరు. అందు వల్ల పిల్లల మీద ఒత్తిడి కొన సాగుతూనే ఉంటుంది.
రెండోది పయిన చెప్పినట్టు ఒత్తిడి ఒక స్థాయి దాటితో అది చదువు మీద ప్రతికూల
ప్రభావం చూపు తుంది కాబట్టి బిడ్డ భవిష్యత్తు వారి సామర్థ్యానికి తగ్గట్టు ఉండదు.
చదువుకు సంబంధించిన కారణాలు అదనపు ఒత్తిళ్ళు ఇలా ఉంటాయి.
- మార్కులు, రాంకులు గురిగా నడిపే రెసిడెన్షియలు, కార్పొరేటు బడుల వల్ల
- పిల్లల వయసుకు మించి హోం వర్కు ఇవ్వటం
- విపరీతమయిన క్రమశిక్షణ పాటించడం
- సొంత భాషలో మాట్లాడ నివ్వక పోవటం, ఇంగ్లీషు లోనే మాట్లాడ మనటం
- వచ్చిన భాషలో తేలికగా నేర్చు కోవాల్సిన అంశాలు రాని భాషలో కష్టంగా ఉండటం
- పిల్లలను అవమాన పరచే, చావబాదే టీచర్లు ఉన్నప్పుడు.
- చదివే పిల్లలు, చదవని పిల్లలు అని తేడా చూపించటం.
- శక్తికిమించిన గురిని ఇచ్చినపుడు
- పిల్లల చదువుల గురించి హయిరానా పడే తల్లిదండ్రులు ఉన్నప్పుడు.
పిల్లల పైన ఒత్తిడిని తగ్గించే పద్ధతులు:
- పిల్లల శక్తికి మించిన చదువు నేర్పే ప్రయత్నం చేయ కూడదు.
- చదువుపట్ల పిల్లల్లో ఆసక్తిని కలిగించాలే తప్ప బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయ కూడదు.
- ఇంగ్లీషును పూర్తిగా నేర్పాకే దాన్ని బోధనా భాషగా తీసు కోవాలి. ప్రాథమిక తరగతుల్లో సొంత భాషలో బోధించటం వల్ల దాదాపు చదువు ఒత్తిడిని తగ్గించ ఒచ్చు.
- సరళమయిన, శాస్ర్తియమైన బోధనా పద్ధతులను టీచర్లకు నేర్పాలి.
- బడి నుంచి వచ్చాక ట్యూషన్లు, కోచింగుల్లో ఇరికించ కూడదు.
- పిల్లల్ని ఫలానా సమయంలో లేదా ఫలానా సమయం వరకు చదవమని బలవంత పెట్ట కూడదు. ఒక వేళ వారికయి వారు వాళ్ళు చదువు కుంటుంటే అభ్యంతరం కూడా చెప్ప కూడదు.
- పిల్లల్ని ఎక్కువగా తమ ఈడు పిల్లలతో ఆడుకోనివ్వాలి. చదువు పేరుతో ఆటల సమయాన్ని కుదించకూడదు.
- పరీక్షల సమయంలో కూడా 8 గంటల నిద్ర అవసరం. ఒత్తిడిని తగ్గించే ఒకే ఒక సహజ చికిత్స నిద్ర.
- పిల్లలు మంచి ఫలితాలను సాధిస్తే అభినందించాలి. చిన్న చిన్న బహుమతులు కూడా ఇవ్వాలి. అలా అని దాన్ని అలవాటుగా మార్చ కూడదు.
- పిల్లలకు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకు పోవటం లేదా ఎదుర్కొనే నైపుణ్యాలను, నైపుణ్యాన్ని (కోపింగ్ స్కిల్స) అలవాటు చేయాలి.
- మనసుకు హాయిని ఇచ్చే వినోద కార్యక్రమాలకు పిల్లలను దూరం చేయ కూడదు.
- చదువు అంటే పరీక్షలు, మార్కులు, ర్యాంకులే కాక జీవితాన్ని గురించి తెలుసు కోవటం అనేదిగా ఉండాలి.
- పిల్లల్ని ప్రతి విషయంలో అదుపాజ్ఞల్లో పెట్టడం మానెయ్యాలి.
Thank you for your interest and contribution
ReplyDelete