Tuesday, February 19, 2013

దళిత పిల్లలకు ఇంగ్లిషు మీడియం న్యాయం చేస్తుందా?: తొలి చదువులు-32


పిల్లల చదువులో బోధనా భాషగా సొంత భాషను వాడాలా లేక ఇంగ్లీషును వాడాలా అనే దానిమీద వాదనలు, ప్రతివాదనలు చాలా కాలంగా జరుగుతున్నవే. తల్లి నుడిలోనే చదువు ఉండాలని ఒక వర్గం అంటుండగా, అక్కర్లేదు, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో, అవసరాలకు తగ్గట్టు ఇంగ్లీషు మీడియంలో బోధన జరగాలని మరో వర్గం వాదిస్తుంది. భాషను కాపాడు కోవడం, స్వావలంబన, సంస్కృతి, మేథాతనం, వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాలు మొదటి వర్గానికి వాదనా వస్తువులు కాగా, ఉపాధి అవకాశాలు, మార్కెటింగు, గ్లోబలయిజేషను, ఆర్థిక అసమానతలు, కుల వివక్షత బాణాలు రెండో వర్గపు అమ్ముల పొదిలో ఉంటున్నాయి.

నిజం ఏమిటో తెలుసు కోవాలి అంటే ఆ అంశం మీద పరిశోధన జరగాలి. పరిశోధనల్లో తేలిన నిజం అనుభవంలో మరింత రుజువు అవుతుంది. సైన్సులో ‘నిజా’నికి ‘అభిప్రాయా’నికి మధ్య కచ్చితమయిన విభజన రేఖ ఉంటుంది. ఇక్కడ నిజం తెలియనంత వరకే అభిప్రాయానికి విలువ. ‘ఇదీ నిజం’ అని నిగ్గు తేలాక ఇక దాని మీద వాదనలు - తిరుగు వాదనలకు తావు ఉండదు. తెల్లటి కాంతిలో ఏడు రంగులు ఉంటాయి అనేది ప్రయోగ పూర్వకంగా తేల్చిన సత్యం. దీని మీద అభిప్రాయాలకు తావు లేదు.

శాస్ర్తియ అంశాలను ప్రస్తావించేటప్పుడు సాధారణ అంశాలను పరిశీలించినట్టు పై పైన తడిమితే సరి పోదు. తొలుత ప్రాథమిక పరిశీలన, ఆ తరువాత కొంత లోతు అవగాహనకు పోతూ పరిశోధనను తటస్థ దృష్టితో సాగించాలి. అప్పుడు కాని నిజం తేలదు. ముందుగా ఏర్పరచుకున్న ఇరుకు మనసుతో పరిశోధన మొదలు పెడితే ఆ పరిశోధన అంతా మనసులో ఉండే నమ్మకానికి అనుకూలంగా కట్టడి చేయడం మొదలవుతుంది. అప్పుడు వచ్చే ఫలితం నిజానికి దగ్గరగా ఉండ వచ్చు, ఉండక పోవచ్చు. కారణం ఏమిటి అంటే నిజం వేరు, నమ్మకం వేరు. నిజం నమ్మకంగా ఉండవచ్చు కానీ నమ్మకం నిజం కావాలని ఏమీ లేదు.

విద్యా విధానంపట్ల ప్రత్యేకించి బిడ్డలకు పునాదులు వేసే తొలి చదువుల్లో ఏ అంశాలను బోధించాలి అనే దాని పట్ల ఎవరి అభిప్రాయాలు వారికి ఉండ వచ్చు. ఇది ప్రాంతానికీ ప్రాంతానికీ, జాతికి జాతికీ మారుతూ ఉంటాయి. కానీ ఆ విద్యను పిల్లల్లో చొప్పించ టానికి ఉపయోగించే బోధనా ‘పద్ధతి’కి ఒక శాస్ర్తియ తీరు ఉంది. బిడ్డలకు తొలి చదువును ఏ భాషలో మొదలు పెట్టినా ఆ చెప్పే భాష మీద పట్టు ఉండాలి. తెలిసిన భాషలో పునాదులు వేసి దాని పునాదుల మీద ఎన్ని భాషలు అయినా, ఎన్ని శాస్త్రాలు అయినా నేర్పటం అనేది శాస్ర్తియ బోధనా పద్ధతి. తొలి చదువుల్లో స్వతహాగా అది అమ్మ భాషే అయి ఉంటుంది. అక్కడక్కడా తల్లి భాషే కాకుండా సమాజ భాష కూడా అయి ఉంటుంది. అయినా దీని కంటే తొలి పద్ధతే నూటికి నూరు పాళ్ళూ శాస్ర్తియం. రెండోది గుడ్డిలో మెల్ల. ఇది వేల కొద్ది పరిశోధనల్లో, అనుభవంలో తేలిన సత్యం. ప్రపంచం అంతా అనుసరిస్తున్న దారి. భాష మీద పట్టు లేకుండా చదివే బిడ్డలకు పుటుకతో వచ్చే తెలివి సామర్థ్యం, సృజనాత్మకత పాక్షికంగానే ఉపయోగం లోకి వస్తాయి అనేది కూడా అన్ని పరిశోధనలు తేల్చి చెప్పాయి.

అగ్రవర్ణాల పిల్లలు ఆది నుంచి ఇంగ్లీషు మీడియంలో చదవటం వల్ల పైకి ఎగ బాకుతున్నారు అనే వాదన ముందుకు తెచ్చి వారికి మల్లే దళితులకు కూడా ఎల్కేజీ నుండి ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్పాలి అంటూ కంచె అయిలయ్య లాంటి మేథావులు కొత్తగా వాదన ముందుకు తెస్తున్నారు. శాస్ర్తియ బోధనా పద్ధతులను కాదని తమ నమ్మకాలకు తగ్గట్టు బోధన ఉండాలి అనేది వీరి వాదన.

ఇది మొండి వాదన, పిడి వాదన. మొండి వాదనకు కులం లేదా మతం సెంటిమెంటు జోడించి వాదనలు వినిపించటం వల్ల ఎదుటి వారు ఎంత శాస్ర్తియంగా మాట్లాడినా అది సెంటిమెంటు సరి చెయ్య లేదు. ఈ సంగతిని ప్రభుత్వ బడుల్లో గత ఏడాది ప్రవేశ పెట్టిన ‘సక్సెసు’ బడులు ఏ మేరకు సక్సెసు అయ్యాయో తెలుపకనే తెలిపాయి. అప్పటి వరకూ తెలుగులో చదువుతున్న పిల్లల్ని ఆశ పెట్టి, టార్గెట్లు పెట్టి ఇంగ్లీషు మీడియం లోకి తోసిన పిల్లలు మూడు నెలలు లోపే దాదాపు తిరిగి తెలుగు మీడియం లోకి గోడకు కొట్టిన బంతిలా వెనక్కి వచ్చేసారు. మిగిలి ఉన్న ఆ కొద్ది పిల్లల భవిత రేపు జరిగే పదో తరగతి పరీక్షలు తేల్చనున్నాయి.

కులం, డబ్బు, హోదా, తెలివి, ఖరీదు అయిన కార్పోరేటు విద్య, ఇలా అన్ని అంశాలలో అనుకూలంగా ఉన్న పిల్లలకే పరాయి భాషలో ప్రాథమిక విద్య పనికి రాదని పరిశోధనలు, అనుభవాలు తెలుపుతున్నాయ. కులం, సామాజిక వెనుకబాటు అనే కంతలో నుంచి శాస్ర్తియ బోధనా పద్ధతులను ఎగతాళి చేస్తున్నారు వారు ఆశించినట్టుగా నిజంగా దళిత ఎదుగుదల జరగాలి అంటే అందుకు తిరుగులేని ఆయుధం దళితులకు వారి సొంత భాషలో తొలి చదువులను మొదలు పెట్టడం. దాని ద్వారా మంచి ఇంగ్లీషు నేర్పటం. వీరి వాదన దళితులకు మేలు చేయక పోగా వారిని అత్యంత కీడులోకి నెట్టేస్తుంది. స్వాతంత్య్రం వచ్చాక కూడా వ్యవసాయం, చేతి పనులు, కుల వృత్తులలో ఉన్న పేద, దళిత, గిరిజన కుటుంబాల పిల్లలకు చదువు అందని పండుగానే ఉండింది. అందుకు కారణం చదువుకొనే అవకాశాలు మెరుగు పడుతున్నప్పటికీ చదువులో భాష గుదిబండగా మారటం. అప్పట్లో ఒక పక్క ఇంగ్లీషు మీడియం, మరో వైపు తెలుగు పేరుతో గ్రాంథిక భాష రూపంలో ఉన్న సంస్కృత చదువుల వల్ల ఈ వర్గాలకు చెందిన పిల్లలు బడి అంటే హడలి పోయి దాని వైపు కనె్నత్తి చూడని పరిస్థితి ఉండింది. అంబేద్కరు పోరాట ఫలితంగా కలిపించిన రిజర్వేషను ఉద్యోగాలలోకి ఆయా వర్గాలను ఇముడ్చు కోవటానికి చదువుకున్న వారు దొరకని పరిస్థితులు ఆనాటివి.

గిడుగు రామ్మూర్తి లేవనెత్తిన ‘వాడుక భాష ఉద్యమం’ పుణ్యమా అని చదువులు దాదాపు వాడుక భాష లోకి దిగినాయి. అప్పటివరకూ చదువుకు దూరంగా ఉన్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల పిల్లలకే కాకుండా ఎగువ కులాల లోని నిరక్షరాస్య పిల్లలకు సయితం చదువు చేరువగా వచ్చింది. అంటే తల్లిదండ్రులకు చదువు లేక పోయినా పిల్లలు చదవటం అనేది చదువు వ్యవహారిక భాష లోకి దిగాక కానీ ఎక్కువ మొత్తంలో జరగ లేదు. మరో మాటలో చెప్పాలి అంటే చదువు సొంత భాష లోకి వచ్చాకే ఆయా వర్గాల ప్రజలలో ఉద్యోగాలు అందుకొనే తొలి తరం తయారు అయింది.

దళితులతో సహా ఆయా సామాజిక వర్గాలలో తొలి తరంలో విద్యా, ఉద్యోగాలు పొందగలిగిన వారు ఎంతో కొంత సామాజిక మట్టును పెంచు కోగలిగారు. దీని వల్ల అప్పటి పేదలు, దళితులు వెనుకబడిన వర్గాలు, గిరిజనులలో వారి వారి స్థాయి మేరకు ఆర్థికంగా ఎదిగారు. అలా ఎదిగిన వారు ఇప్పుడు తమ బిడ్డలకు ఇంకా మరింత మెరుగు అయిన విద్య, ఉపాధి కోసం ఎంత డబ్బు అయినా పెట్టి ఎగువ కులాలకు ధీటుగా చదువు చెప్పించటం కోసం కార్పోరేటు విద్య వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇపుడు దళితుల్లో ధనిక దళితులు, పేద దళితులు అనే రెండు వర్గాలు మనుగడలో ఉన్నాయి. ధనిక దళిత వర్గాల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో ఎంతో కొంత రాణించటానికి కావాల్సిన కుటుంబ, ఆర్థిక వాతావరణ వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ చదువులో రాణించక పోయినా ఆర్థిక స్థితికి ఢోకా లేదు కాబట్టి వారికి పోయేది ఏమీ లేదు. ఎటొచ్చీ పేద దళిత పిల్లలకే జరిగే నష్టం అంతా. ఈ ఇంగ్లీషు మాధ్యమమే చదవాలనే వాదనే కనుక అమలు అయ్యే పరిస్థితే వస్తే అది ఇప్పుడిప్పుడే చదువు బాట పడుతున్న తొలి తరం దళిత పిల్లలను పైకి రానీయకుండా మొగ్గలోనే తుంచటమే అవుతుంది. అయితే అది నేరుగా కాకుండా అందంగా కనిపించే ఇంగ్లీషు మీడియం గుదిబండను వారి మెడలో వేలాడదీయటం ద్వారా జరుగుతుంది.

అలనాడు సొంత భాషలో చదివి, రిజర్వేషను ఉపయోగించుకొని పైకి వచ్చిన ధనిక దళితుల పిల్లలకు పోటీ లేకుండా చేయటమే దళితులకు ఇంగ్లీషు మీడియం అనే వాదన. అంటే ఉన్న రిజర్వేషను కోటా లోనికి కొత్తగా వచ్చే పేద దళిత పిల్లలు రాకుండా అడ్డుకొనే కుట్రలో భాగమే దళితులకు ఇంగ్లీషు మీడియం వాదన.
వారు గ్రహించాల్సింది ఏమిటి అంటే ఒక్క దళితులే కాదు. ధనికులు, ఎగువ కులాలు, వెనుకబడిన తరగతులు ఎవరు అయినా సరే తమ బిడ్డలకు పుట్టుకతో వచ్చిన తెలివితేటలు మొత్తం బయటికి వెలికి రావాలి అంటే అది తొలి చదువులు సొంత భాష ద్వారా జరిగినపుడే వీలు అవుతుంది.
                                  తొలి చదువులు వ్యాసాలు ఇంతటితో ముగిసాయి 



3 comments:

  1. తెలుగు మాధ్యమమే ఉత్తమమయితే పెద్ద కులాల పిల్లలు ఇంగ్లీషు బడులకు ఎందుకు ఎగబడుతున్నారు? వారు పైకి రావడానికి మాతృభాషలో చడువుకోలేదన్న విషయం ఎందుకు అడ్డం రాలేదు?

    ఒక విధానం శాస్త్రీయం అని బల్ల గుద్దగానే సరిపోదు. ఆచరణలో ఆధారాలు చూపించాలి. స్వాతంత్ర్యం తరువాత ఇన్నేళ్ళయినా, ఇంగ్లీషులో చదువుకున్నవారే అగ్రస్తానాలలో ఉన్నారనేది వాస్తవం.

    ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మాధ్యమం చదువులు విఫలం కావడానికి కారణం ప్రభుత్వరంగం తాలూకా పరిమితులు కావచ్చు కదా.

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశ్నలకూ, అనుమానాలకూ,ఆశ్చర్యాలకు అన్నిటికీ ముందు వ్యాసాలలో సమాధానాలు, వివరణలు, రుజువులు ఉన్నాయి. చదివే ఓపిక మీకు ఉండటమే ఆలస్యం

      Delete
  2. // రిజర్వేషను కోటా లోనికి కొత్తగా వచ్చే పేద దళిత పిల్లలు రాకుండా అడ్డుకొనే కుట్రలో భాగమే దళితులకు ఇంగ్లీషు మీడియం వాదన.//
    చాలా బాగా చెప్పారు. అగ్ర వర్ణ పాలక వర్గాలు పిడికెడు ధనిక '' దలితుల్ని'' అడ్డం పెట్టుకొని ధలితుల్ని అణచి వేయడంలో భాగమే!

    ReplyDelete