19-01-2013
తొలి విద్యను పరాయి భాషలో జరపడం
అనేది అశాస్ర్తియమని తెలిసినా ధనిక, ఉన్నత మధ్య తరగతి
ప్రజల్లో ఇంగ్లీషు మీడియం పట్ల ఆదరణ పెరుగుతుంది అనేది కళ్లకు కనిపిస్తున్న నిజం. సామాజికంగా
ఉన్నత స్థితిలో ఉన్న ఈ వర్గాన్ని అనుసరించడం మధ్య తరగతి లక్షణం. ఇక మిగిలింది పేద
ప్రజానీకం. పేదరికంలో ఉన్న వర్గాలు వ్యాపార వస్తువు అయిన విద్యను తమ బిడ్డలకు కొని
ఇవ్వలేక ప్రభుత్వ బడులకు పంపి, తెలుగు మీడియంలో చదివిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో
ఎక్కువగా చదివే గ్రామీణ ప్రజానీకం, బలహీనవర్గాలు, దళితులు దీన్ని అవమానంగా భావిస్తూ ‘మీ
పిల్లలకు ఏబీసీడీలు మా పిల్లలకు అ ఆ ఇ ఈలా’ అని నిలదీస్తున్నారు. దీన్ని సరిచేసి శాస్ర్తియం అయిన బోధనా పద్ధతులను
తెచ్చి, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సింది ప్రభుత్వం. అయితే
ప్రభుత్వాన్ని నడిపే వారి సంకుచిత ప్రయోజనాల కోసం, ఓట్ల
రాజకీయం కోసం ‘మీ
బిడ్డలకు కూడా ఇంగ్లీషు లోనే చదువు చెబుతాం’ అని ప్రభుత్వ బడుల్లో ప్రాధమిక స్థాయి నుంచే ఇంగ్లీషు మీడియాన్ని
తేవటానికి మొక్కలు నాటటం మొదలు అయింది.
ఉన్నత విద్యా విధానం
పట్ల ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు, కానీ ప్రాధమిక
విద్యకు సంబంధించి ఏ విషయాన్ని మాట్లాడాలన్నా దాన్ని అనేక కోణాల నుంచి పరిశీలించాలి.
ఎందుకంటే ప్రాధమిక విద్యలో కేంద్ర బిందువు ఇంకా ‘వికసించని’ బిడ్డ. విద్యా బోధనకు చెందినంత వరకు ప్రత్యేకించి ప్రాథమిక విద్యకు
ప్రపంచం అంతా ఆమోదించిన ఒక శాస్ర్తియ పద్ధతి ఉంది. బిడ్డ శారీరక మానసిక
సామర్ధ్యాన్నీ, బిడ్డ పెరుగుతున్న సమాజం, సంస్కృతి, వారసత్వాన్నీ చూపులో ఉంచు కోవాలి. అంతే
కాకుండా సామాజిక పరిస్థితుల్ని, ప్రాంతీయ, జాతీయ విలువలు లాంటి అనేక కోణాల నుంచి చూడాలి. వీటి ఆనింపుగా ప్రాధమిక
విద్య ఎలా ఉండాలని అనేది నిర్ణయిస్తే అది శాస్ర్తియంగా ఉంటుంది.
మొత్తంమీద
మార్పు రావాల్సింది ప్రజల్లో అయినప్పటికీ జాతి, సంస్కృతి, భాషల మనుగడకే గండం ఏర్పడిన అప్పుడు వాటిని కాపాడేందుకు
ప్రభుత్వం నడుం బిగించాలి. అవసరం అయితే చట్టాన్ని ప్రయోగించాలి. అంతే కాకుండా
అశాస్ర్తియ పద్ధతుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.
ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాలు పంచు కోవాలి. జరుగుతున్న పొరపాటు
దిద్ద టానికి ప్రభుత్వం స్పందించాలి. మొత్తంగా మార్పు రావ టానికి సమయం పట్ట ఒచ్చు.
అంత వరకూ ఎవరి స్థాయిలో వారు కొన్ని ముందస్తు చర్యలు, జాగర్తలు తీసుకుని జరిగే నష్టాన్ని కొంత మేర అయినా ఆపటం
కనీసం గుడ్డిలో మెల్ల అవుతుంది.
తల్లిదండ్రులు
- ఇంగ్లీషులో చదవడం, ఇంగ్లీషు మాట్లాడడం రెండూ ఒకటి కాదని ముందుగా గుర్తించండి.
- కేజీ క్లాసులతో సహా ప్రాధమిక విద్య గురి పిల్లల బుర్రలు విరపూయ టానికే తప్ప ఉపాధికి కాదని గుర్తించండి.
- తెలిసిన ఏ భాషలో అయినా జ్ఞానాన్ని బోధించ ఒచ్చు. అర్థం కాని భాషలో చదువు చెబితే మీ బిడ్డల బుర్రలు ఎలా ఎదుగుతాయో ఆలోచించండి.
- సొంత భాష ద్వారా పొందిన విజ్ఞానం అంతా ఆ తరువాత మీ పిల్లలు ఎన్ని భాషలు నేర్చుకున్నా దాని అంతట అదే అన్ని భాషల్లోకి మారుతుంది. తెలుగులో నేర్చుకున్నారు కదా అని అది తెలుగు లోనే ఉండదు.
- ఒక వేళ మీ పిల్లలను ఎగువ తరగతుల్లో ఇంగ్లీషులో చదివించాలి అనుకున్నా ఆ భాష కనీసంగా నేర్చుకునే వరకు తెలుగు లోనే చదివించండి. ఇంగ్లీషు నేర్చుకున్నాక ఆ మీడియంలో చదివించు కోవచ్చు.
- మీ పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివిస్తూ వుంటే బడిలో అర్థం కాని అంశాలను తెలుగులో చెప్పమని యాజమాన్యాన్ని నిలదీయండి.
- మీరు చెప్పగలిగితే పుస్తకాల లోని విషయాలను పిల్లలకు తెలుగులో వివరించండి. దీనివల్ల మీ పిల్లలు చదువులో ఏ స్థాయిలో ఉన్నారో మీకు అర్థం అవుతుంది.
- మధ్య మధ్యలో మీ బిడ్డ ప్రోగ్రెస్ కార్డుల్లో వున్న మార్కులకు, బిడ్డ తెలివికి పొంతన కుదురుతుందో లేదో చేస్తూ ఉండండి. అలాగే బడిలో మీ బిడ్డకు లేని ప్రతిభను అంట గడుతున్నారేమో మొదటి లోనే గుర్తించి తగిన జాగర్తలు తీసుకోండి.
- తేడాను గుర్తించినా, గుర్తించనట్లు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మిమ్మల్ని, మీ బిడ్డని ఎవరూ కాపాడలేరని గమనించండి.
- తెలుగులో చదివే వాళ్లను తక్కువ చేసి చూడకండి.
- మీరు ఏ మీడియంలో చదివిస్తున్నా పిల్లల్ని మన భాష పట్ల, సంస్కృతి పట్ల గౌరవం కలిగించే విధంగా పెంచండి.
- బిడ్డలకు బట్లరు ఇంగ్లీషు కాకుండా మంచి ఇంగ్లీషు నేర్పండి. సొంత భాషమీద పట్టు లేకుండా మంచి ఇంగ్లీషు రాదని మరో సారి గుర్తించండి.
ప్రయివేటు బడులు
- మీది ప్రయివేటు పాఠశాల అయితే, పిల్లలకు చదువు చెప్పటంలో మీ నిజాయితీని ఒకసారి మీకు మీరే పరీక్షించుకోండి.
- మీరు చేసేది వ్యాపారమే కావొచ్చు. మీరు అమ్మేది గిరాకీ ఉన్న ఇంగ్లీషు మీడియాన్నే కావచ్చు. అయినప్పటికీ అది అశాస్ర్తియం అన్న సంగతి మీకు తెలుసు. దాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకోండి.
- బడిలో పిల్లలు మంచి ఇంగ్లీషు మాట్లాడాలి అంటే అంతకు ముందు వారికి మంచి తెలుగు వచ్చి ఉండాలని గుర్తించండి.
- బోధించే విషయాలు పిల్లలకు అర్ధం అవుతున్నాయో లేదో చూడండి. తెలుగులో చెప్తే అర్థం అవుతున్నాయి అనుకుంటే అలానే చెప్పండి. తెలుగులో అర్థం అయినట్టు చెప్పాక అదే పాఠాన్ని ఇంగ్లీషులో చెప్పించండి. ఇంగ్లీషు మీడియం కదా అని ఇంగ్లీషులోనే చెప్పడానికి ప్రయత్నిస్తే మీరు చెప్పేది ఉపయోగం లేదని గుర్తించండి.
- పిల్లలను బట్టీ పద్ధతికి అలవాటు చెయ్యొద్దు. రాని మార్కులను వెయ్య ఒద్దు.
- తెలుగు సబ్జెక్టును నిర్లక్ష్యం చేయకండి. పిల్లలకు చదవడం, రాయడం బాగా నేర్పించండి.
- పిల్లల్ని ఆయా ప్రత్యేక పీరియడ్‌లో ఇంగ్లీషులోనే మాట్లాడమని ప్రోత్సహించాలే కాని బలవంతం చెయ్య ఒద్దు. అలా చేసి వాళ్ల స్వేచ్ఛను హరించ కూడదు.
- ముందు మీ టీచర్లు అందరికి ఇంగ్లీషు మాట్లాడడం బాగా నేర్పించండి.
- ఇంగ్లీషును తెలుగు ద్వారా నేర్పాలి తప్ప ఇంగ్లీషును ఇంగ్లీషు ద్వారా నేర్పడం అశాస్ర్తియం.
- వ్యాపారంలో నిజాయితీ ఉన్నప్పుడే నాలుగు కాలాల పాటు నిలబడతారు అనేది కాలం తేల్చిన సత్యం.
ప్రభుత్వ బడులు
- మీరు తెలుగులో బోధించే ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తుంటే మీ బాధ్యతల్ని సక్రమంగా చేయండి.
- మీరు మనసు పెట్టి చెప్పాలే కాని ప్రైవేటు పాఠశాలల్లో చెప్పే చదువు కంటే మెరుగ్గా, నాణ్యమైన బోధనని అందించ కలరు.
- ఒకటి, రెండు, మూడు తరగతుల్లో చదవడం, రాయడం నేర్పకుండా ఎగువ తరగతులకు పంపిస్తే పిల్లలు ఎంత తెలివి కలవారు అయినా ఉపయోగం లోకి రారు అని గుర్తించండి.
- మీ బాధ్యతను మీరు చెయ్యక పోవడం వల్ల ఒక నిండు జీవితం వికసించకుండా పోవడం మీకు ఇష్టమా? అని ప్రశ్నించుకోండి. అంటే పిల్లలకు బాగా చదువు చెప్పండి.
- ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యార్థుల్ని తీర్చి దిద్దండి. పిల్లలకు మంచి ఇంగ్లీషు నేర్పండి.
- మీ విద్యార్థులకు తెలుగు బాగా వచ్చి ఉంటుంది కాబట్టి ఏబీసీడీలతో విద్యాభ్యాసం చేసిన పిల్లలకంటే త్వరగా బాగా ఇంగ్లీషు నేర్చుకోగలిగి ఉంటారు. ఆ అవకాశాన్ని ఉపయోగించండి.
మంచి వ్యాసం,ఆచరించదగిన సూచనలు
ReplyDelete