Saturday, January 12, 2013

ఇంగ్లషు కోసం వితండ వాదనలు; తొలి చదువులు-27


12-01-2013



నేటి కాలంలో బిడ్డల ఎదుగుదలలో చదువు ఒక ముఖ్యమయిన భాగం. పుట్టిన బిడ్డకు మాటలు ఒచ్చాక చదువు కోసం బడిలో వేస్తాము. బిడ్డ బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టటంలో ఇది తొలి మెట్టు. ఆ తరువాత అది పలు అంచెల్లో కొన సాగుతుంది. తొలి అంచెలో మొదలు అయ్యే ప్రాథమిక విద్యలో తన భాషను చదవటం- రాయటం, లెక్కల్లో ఉన్న కూడిక - తీసివేత- పెంచటం- భాగించటం అనే నాలుగు ప్రక్రియలను నేర్చు కోవటం తోపాటు పరిసరాల గురించి కొంత ప్రాథమిక పరిజ్ఞానాన్ని పొందటమే. ఒక ప్రాంతంలో ఉండే బిడ్డలు అందరికీ ఒకే రకమయిన ఉమ్మడి విధానంగా చదువు ఉంటుంది. దీని తరువాత మొదలయ్యే రెండో అంచె (సెకండరీ ఎడ్యుకేషన్) విద్యలో దేశాన్ని గురించీ, ప్రపంచాన్ని గురించీ, ప్రకృతిని గురించి తెలియచెప్పేది. ఇది కూడా పిల్లలు అందరికీ ఉమ్మడిగా అందించాలి. ఆ తరువాత మొదలు అయ్యేది ఉన్నత విద్య. బతకడానికి ఉపాధిని చూపించేది వృత్తి విద్య లేదా యూనివర్సిటీ విద్య. ఇది ఆసక్తిని బట్టి, అవసరాన్ని బట్టి, అందుబాటును బట్టి ప్రతి బిడ్డకూ మారుతూ ఉంటుంది.


ముందు చెప్పినట్టు ప్రాథమిక విద్య అంటే కేవలం చదవటం, రాయటం నేర్చు కోవటం మాత్తరమే కాదు. వ్యక్తి మొత్తం ఎదుగుదలకు పునాది వేయటం. విద్య గురి బిడ్డను ఇంట్లో నుంచి సమాజంలోకి ప్రవేశ పెట్టడం. ఇక్కడి బిడ్డ తన గురించి తన కుటుంబాన్ని గురించి చుట్టూ వున్న సమాజం, పరిసరాలను గురించి తెలుసుకోవాలి. సమాజపు నియమాలూ, జనంతో సంబంధాల గురించి తెలుసు కోవాలి. బిడ్డ ఎదిగాక ఏమి అవుతారు అనే దానితో సంబంధం లేకుండా ప్రాథమిక విద్య ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బిడ్డ వ్యక్తిగా ఎదగటంలో తొలి మెట్టు ప్రాథమిక విద్య. ఇది బిడ్డ ఇంటి భాష, సమాజపు భాష ఏది అయితే ఇందులో జరగాలి. ఇది శాస్ర్తియమైన పద్ధతి. ప్రపంచం అంతా ఈ పద్ధతినే అనుసరిస్తుంది.

పసి పిల్లలకు సొంత భాషలో చదువు పనికిరాదని, ఇది అశాస్ర్తియం అని ఇంతవరకూ ఎవరూ అనలేదు. ఇది నూటికి నూరుపాళ్ళూ శాస్ర్తియమే అని అందరూ ఒప్పుకుంటారు. చివరికి ఇంగ్లీషులో చదువును సమర్థించే వారు సయితం ‘‘తొలిచదువుకు సొంత భాష శాస్ర్తియమే... కానీ...’’ అంటూ ఫలానా పరిస్థితుల్లో కాబట్టి ఇంగ్లీషు అవసరం అని తమ వాదనలకి ఏవో కొన్ని ఆధారాలు వెతుక్కుంటారు.

నూటికి నూరుపాళ్ళు శాస్ర్తియం అని ఒప్పుకొనే సొంత భాషలో తొలి విద్యను అమలు చేసుకోవటంలో క్రమేణా నీళ్ళు ఒదులుతున్నాం. గాడి తప్పుతున్న ఈ పద్ధతిని సరిచేద్దాం అని ఎవరైనా అంటేనో, ఇపుడయినా మేలుకొని బిడ్డలను తెలుగులో చదివిద్దాం అని ఎవరు అయినా అనుకుంటే వారికి సవాలక్ష సవాళ్లు ఎదురవుతాయి. ఈ సంగతిని చర్చకు పెడితే ఇక చూడండి! రకరకాల ప్రశ్నలు, అనర్గళంగా వాదనలు, లేని పోని అనుమానాలు, సందేహాలు బయలుదేరతాయి. ఎక్కువ మంది చేసే వాదనలూ, లేవదీసే అడకలు ఎలా ఉంటాయి అంటే- 

·                     తెలుగులో చదివితే ఇంగ్లీషు ఎలా వస్తుంది? 
·                     ఇప్పటి రోజుల్లో ఇంగ్లీషు లేకుండా జ్ఞానం ఎలా వస్తుంది?
·                     ఉన్నత విద్య చదవాలి అంటే ఇంగ్లీషు నేర్చుకోవాలి కదా! 
·                     విదేశాలకు వెళ్ళాలి అంటే తెలుగులో చదివితే ఎలా? 
·                     సాఫ్టువేరు ఉద్యోగాలు ఎలా వస్తాయి? 
·                     ఇంగ్లీషు అంతర్జాతీయ భాష. దాన్లో చదవక పోతే వెనుకడిపోమా? 
·                     తెలుగులో రెఫరెన్సు పుస్తకాలు దొరకవు కదా! 
·                     ఇంగ్లీషును కాదని బతకడం వీలు అవుతుందా? 
·                     సాంకేతిక పదాలకు తెలుగు అర్థాలులేవు కదా? 
·                     డాక్టర్లు, ఇంజనీర్లు కావాలంటే ఇంగ్లీషు లేకపోతే ఎలా?

ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కొంత మంది అయితే పోట్లాడతారు కూడా. ఒక అశాస్ర్తియ పద్ధతిని సమర్థించడానికి ఇంత బలమయిన వాదనలు ముందుకు రావటానికి కారణం ఏమిటి? ఈ ఆలోచనలు బుర్రలో దూరటానికి కారణం ఏమిటి? అన్న సంగతిని చూడాల్సి ఉంటుంది.

పయి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం అయితే ఒకటే. అది ఏమిటి అంటే వాదనలు ప్రతి వాదనలు జరిగేటప్పుడు సంగతిని సరిగా బుర్రకు ఎక్కించు కోకుండా, అర్థం చేసుకోకుండా అర తలకాయతో మాట్లాడటమే. వీరిలో సామాన్య మానవుడి నుండి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకూ అనేక మంది ఉన్నారు.

‘‘ప్రాథమిక విద్య తెలుగులో ఉండాలి’’ అని ఎవరు అయినా అంటే, ఆ మాటలను వీళ్ళ అర బుర్రల్లోకి ఎలా దూరుతాయి అంటే, 

·                     ఇంగ్లీషును వ్యతిరేకిస్తున్నట్టు 
·                     ఇంగ్లీషును పూర్తిగా ఒద్దు అంటున్నట్టు 
·                     తెలుగులో చదివితే, తెలుగు తప్ప ఇంగ్లీషు రాదు అన్నట్టు 
·                     ఇంగ్లీషు రాకపోతే పని దొరకనట్టూ 
·                     ఉపాధి కోర్సులు అంటే కేవలం మెడికలు, ఇంజనీరింగు, సాఫ్టువేరు, మేనేజిమెంటు కోర్సులే అయినట్టు 
·                     ప్రతి బిడ్డా విదేశాలకు పోతున్నట్టూ 
·                     బిడ్డలకు సొంత నాడులో, సొంత దేశంలో ఉపాధి దొరకనట్టు 
·                     విదేశాలకు వెళ్ళటమే చదువు పరమార్థం అన్నట్టు.

ఇలా రక రకాలుగా, తప్పుగా అర్థం చేసుకుంటారు. వారికి అర్థం అయిన అర తలకాయతో, అనాలోచితంగా వాదనలు మొదలు పెడతారు. దీనితో చర్చ ప్రాథమిక విద్య మీద కాకుండా సాంకేతిక విద్య మీదకు, వృత్తి విద్య మీదకు, ఉపాధి అవకాశాలు మీదకు, విదేశీ ఉద్యోగాల మీదకు మళ్ళుతుంది. దీనితో చర్చ పక్కదారి మళ్ళి, గందరగోళంగా మారుతుంది. అందువల్ల అసలు సంగతి మరుగున పడి, వాదన నెగ్గటం అన్నది సంగతి సారాంశం మీద కాకుండా వ్యక్తుల వాదనా పటిమ మీద, మొండి వాదన మీద అరుపుల మీద ఆధారపడి ఉంటుంది. టీవీలల్లో నిర్వహించే చర్చా వేదికల్లో, పత్రికల్లో వచ్చే వ్యాసాలలో ఈ బాపతు వాదనలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ప్రాథమిక విద్య అంటే ఉన్నత విద్య కాదనీ కాలేజీ విద్యలు కాదనీ, సాంకేతిక విద్య, యూనివర్సిటీ చదువులూ, వృత్తి విద్యలు అసలే కాదని ఈ అర తలకాయ మేథావులకు చర్చ జరుగుతున్నంత సేపు మళ్లీ మళ్లీ గుర్తు చేసి మాట్లాడాల్సిన అక్కర ఉంది. దీనికి చాలా ఓర్పు, నేర్పు అవసరం. ఎంత ప్రయత్నించి చర్చను గాడిలో పెట్టాలని చూసినా ఆ అర తల కాయలు తిరిగి మళ్లీ అదే దరువు ఎత్తుకుంటూ వుంటారు. కారణం మరేమీ లేదు వారి దగ్గర శాస్ర్తియం అయిన వాదనా వస్తువు లేక పోవటమే. ఇలాంటి వారితో వాదించినా, చర్చలు జరిపినా సమయం వృధా అవుతుందే తప్ప చీమ తలకాయ అంత ఉపయోగం కూడా ఉండక పోవచ్చు.

ఎగువ చదువులు, విరివి చదువులు (అడ్వాన్సుడు స్టడీసు) అన్నీ ఇంగ్లీషులో చదువు కోవచ్చు. ఇంగ్లీషు కాక పోతే ఫ్రెంచిలో చదువు కోవచ్చు. అదీ కాక పోతే మరో భాష. కాదన్నది ఎవరూ? అసలు చదవాలి అంటే ముందుగా ఆ భాష నేర్చు కోవాలి కదా!

ఇంగ్లీషును బోధనా భాషగా ఎంచు కోవాలి అంటే ముందుగా దాన్ని నేర్చు కోవాలి. తొలి చదువుల్లో బిడ్డ సొంత భాషను ఎదగనిచ్చి, కొంత కాలానికి ఇంగ్లీషును పరిచయం చేసి, దాన్ని బాగా నేర్పించాలి. తరువాత అవసరం అయిన వారికి దాన్ని బోధనా భాషగా ఎంచుకొనే అవకాశం ఇవ్వవచ్చు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. పాల బుగ్గల పసి మొగ్గలకు అసలు భాషే రాక పోతే అందులో బోధన ఏమిటి? అనే సంగతి ఈ మట్టి బుర్రల్లోకి ఎక్కించ టానికి ఏదయినా మర ఉంటే బాగుణ్ణు.

1 comment:

  1. చక్కటి విషయాలను తెలియజేసారు.

    ReplyDelete