Saturday, February 9, 2013

ఇంకా బానిస చదువేనా?- తొలి చదువులు-31


9-2-2013
కాలం ఎప్పుడు నిలకడగా ఉండదు. మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజపు పోకడలూ మారుతూ ఉంటాయి. విద్య సమాజంలో భాగంగా, సమాజానికి దన్నుగా, సమాజానికి అద్దం పట్టేదిగా ఉంటే సమాజంలో వచ్చే మార్పు లకు తగ్గట్టు విద్య ఉంటుంది. విద్య, దాని ద్వారా జరిగే పరిశోధనల వల్ల పుట్టుకు వచ్చే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సమాజ మార్పులను, ఉత్పత్తిని వేగిర పరుస్తాయి. అంటే సమాజం- విద్య విడదీయ రానివిగా ఉండేటట్టు ఆయా జాతులు తమవి అయిన విద్యా విధానాన్ని అనుసరిస్తాయి. అలాంటి సమాజంలో మారుతున్న కాలానికి, కొత్తగా వచ్చే భావాలకు తగ్గట్టు విద్యా విధానాలను ఎప్పటికి అప్పుడు మెరుగు పరచు కుంటాయి. అంతే కాకుండా విద్య ద్వారా ఆయా సమాజాల భాష, జీవన విధానం, సాంప్రదాయం, మతం, సాంస్కృతిక వారసత్వాన్ని తరువాత తరాలకు అందజేస్తాయి. అంటే కొత్తగా వచ్చే ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ జాతి ప్రయోజనాలకు వాడు కొనేందుకు మానవ వనరులను తయారు చేసు కోవటం తోపాటు భాష, సాంస్కృతిక వారసత్వ కొన సాగింపు కూడా విద్యలో భాగంగా ఉంటాయి. ఇది తమ కాళ్ళ మీద తాము నిల బడే జాతి, ఆత్మాభిమానం గల జాతి పాటించే పద్ధతులు. భారత ఉప ఖండంలో తప్పించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని జాతులు పాటించే విధానం ఇది.
సమాజం ముందు పోకలో ఇంతటి ప్రాధాన్యత ఉన్న విద్య, దానికి పునాదులు వేసే ప్రాథమిక విద్యను గురించి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసు కుంటాయి. దానికి తగ్గట్టు పిల్లల తొలి చదువులు ఉంటాయి. మరయితే ఇప్పుడు మన పిల్లలు చదివే చదువులు ప్రపంచం అంతటా పాటించే పద్ధతుల్లో సాగుతుందా లేక పెడ దారిన పోతుందా? అని చూడాల్సిన అవసరం ఉంది.


భారత దేశానికి తెల్ల దొరలు రాక మునుపు వరకూ విద్య అనేది సాంప్రదాయ ముసుగులో కొన సాగుతూ వచ్చింది. చదువు అంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలే తప్ప జన జీవితానికి పనికి వచ్చే సంగతులు కానీ, జనాన్ని ముందుకు నడిపే చేవ కానీ అప్పటి విద్యకు లేదు. గట్టిగా చెప్పాలంటే ఉత్పాదనకు విద్యకూ ఏ రకమైన సంబంధం లేకుండా సాగింది. ఉత్పత్తితో ముడి పడని చదువుల్లో ఎదుగు బొదుగు ఉండదు. కాబట్టి కొన్ని వేల ఏళ్ళుగా చదువు అంటే వేదాలు పురాణాలే తప్ప మరొకటి కన పడని పరిస్థితి వచ్చింది. చదువుకున్న వారు ప్రబంధాలు రాసు కుంటూ కూర్చో గలిగారే కానీ సమాజపు ఉత్పత్తిలో చదువును భాగం చేయ లేక పోయారు. మరో వైపు ఉత్పత్తి రంగంలో ప్రధాన భూమికను పోషించే జనానికి చదువులో చోటు లేకుండా పోయింది. అందు వల్ల వ్యవసాయం, చేతి వృత్తుల్లో వచ్చే కొత్త కొత్త నైపుణ్యాలు, ఒరవడులు కుటుంబ పరంగా తరువాత తరానికి అందాల్సిందే కానీ బయట ప్రపంచానికి చాటటానికి వారికి నాలుగు అక్షరం ముక్కలు కరువు అయ్యాయి. కాబట్టే బయటి ప్రపంచానికి భారతదేశం అంటే ముక్కు మూసుకుని తపస్సు చేసే మనులు, వేదాలు, ఉపనిషత్తులే తప్ప ఆవిష్కరణలు లేని భూమిగా పేరు పడింది.
      

వేలాది ఏళ్ళుగా చదువు కేవలం కొన్ని కులాల, వర్గాల గుత్త ఆధిపత్యం కింద ఉండే పరిస్థితుల్లో తెల్ల దొరలు భారత ఉప ఖండంలోకి రంగ ప్రవేశం చేశారు. వారి చొరబాటు ముఖ్య ఉద్దేశం దోపిడి. ఇక్కడ సంపద అయితే ఉంది కానీ ఈ సంపదను తరలించ టానికి, దాన్ని పర్య వేక్షణ చేయటానికీ, లెక్కలు రాయ టానికి కావాల్సిన మానవ వనరులు ఇక్కడ లేవు. ఏ ఉద్దేశ్యంతో అయితే వలస దారులు పాలక పగ్గాలను చే పట్టారో, ఆ పని జరగ టానికి కావాల్సిన మానవ వనరులు ఇక్కడ లేవు. కాబట్టి కావాల్సిన మానవ వనరులను కూడా వారు తమ దేశం నుంచి తెచ్చు కోవాల్సి వచ్చేది. ఇది చాలా ఖర్చు, ప్రయాస లతో కూడిన పని. కాబట్టి ఈ నేలను దోచు కోవటానికి కావాల్సిన మానవ నరులను కూడా ఇక్కడే తయారు చేసు కోవాలి అనే ప్రతిపాదన వలస పాలకుల ముందుకు వచ్చింది.

తమకు అవసరం అయిన కూలి పనుల కోసం ఒక కొత్త తరాన్ని భారత గడ్డలో తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి తగ్గట్టు భారత విద్యా విధానంలో మార్పులు తీసుకు రావటానికి ఆనాటి వలస ప్రభుత్వం సంకల్పించింది. భారతదేశంలో ఏ రకమైన విద్యా విధానంలో ప్రవేశ పెట్టాలో అప్పటి బ్రిటీషు పార్లమెంటేరియను అయిన లార్డు మెకాలేను ఇండియాకు పిలిపించి ప్రతిపాదనలను కోరింది. దేశాన్ని నాలుగేళ్ళ పాటు గమనించి ఆయన తన ప్రతిపాదనలను బ్రిటీషు పార్లమెంటు ముందుంచే సమయంలో ఆయన చేసిన ఉపన్యాసం మన పరిస్థితికి అద్దం పడుతుంది.

‘‘నేను భారతదేశం నలువైపులా తిరిగి గమనించింది ఏమిటీ అంటే నా యాత్రలో నేను ఎక్కడా ఒక దొంగను కానీ, అడుక్కునే వాడిని కానీ చూడలేదు. భారతదేశంలో కావాల్సినంత సంపద ఉంది. వారసత్వ నైతికత, సాంస్కృతిక సంపదను పుణికిపుచ్చుకున్న చేవ అక్కడి ప్రజల సొత్తు. అది ఇలాగే ఉంటే భారత దేశాన్ని మనం లోబరచుకునే అవకాశం ఎప్పటికీ ఉండదు. భారతీయులు పాటించే ఈ వారసత్వ సంస్కృతి నడ్డి విరగ్గొడితే కాని మనం ఈ దేశంలో మకాం పెట్ట లేము అనేది నా తలపోత.
ఇక్కడి ప్రజల్లో పాతుకు పోయి ఉన్న సంప్రదాయ పద్ధతులను, విద్యా విధానాన్ని సమూలంగా పెకిలించి మనకు దాసోహంగా పడి ఉండే తరాన్ని తయారు చేయాలి. మన పద్ధతులను అక్కడి జనం బుర్ర ల్లోకి నాటాల్సి ఉంటుంది. మనం నాటే విదేశీయ మైన ఇంగ్లీషు సంస్కృతి, ఇంగ్లీషు భాష తమ సంస్కృతి, భాషల కంటే గొప్పవి అని భావించే బానిస తరాన్ని మనం తయారు చేసినట్టు అయితే వారే ఆ సమాజపు సాంస్కృతిక ఉనికిని, అస్థిత్వాన్ని పోగొట్ట టానికి పనికి వస్తారు. ఈ ఉద్దేశానికి తగ్గట్టు భారత దేశంలో మనం విద్యా విధానాన్ని అమలు పరచాల్సి ఉంటుంది’’.


మెకాలే బ్రిటీషు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికకు తగ్గట్టు భారత దేశంలో విద్యా విధానం అమలు అయింది. బయటకు అది బ్రిటీషు ప్రభుత్వానికి గుమాస్తాలను తయారు చేయటమే కానీ మాటు అజెండా మానసికబానిసలను తయారు చేయటమే. మెకాలే మూసలో తయారు అయిన విద్యా విధానాన్ని బ్రిటీషు ప్రభుత్వం స్వాతంత్య్రం ఇచ్చే నాటి వరకు అంటే నూరేళ్ళ పాటు అమలు పరిచింది.

స్వాతంత్య్రం వచ్చాక దాన్ని మార్చి మనది అయిన విద్యా విధానాన్ని కట్టు కున్నామా? అంటే అలాంటిది ఏమీ లేదు. కారణం ఏమిటి అంటే ఈ నూరేళ్ళలో మెకాలే ఆశించిన విధంగా ఇక్కడ బానిస జాతి కావాల్సిన దాని కంటే మెండుగా తయారు అయింది.


తెల్ల దొరలు చెప్పిన చదువులో నుంచి పుట్టుకు వచ్చిన భారత మేధావి వర్గం అంతా దాదాపు ఇదే. తనువులు భారతీయమే కానీ మనసులు ఇంగ్లీషు సంస్కృతికీ, ఇంగ్లీషు భాషకూ దాసోహులు. పాలనలో ప్రధాన భూమికను పోషించే బ్యూరోక్రట్లు, ఉన్నత చదువులు చదివిన రాజకీయ నాయకులు, విశ్వ విద్యాలయాలలో పని చేసే కులపతులు, ఆచార్యులు ఇందులో ముందు వరుసలో ఉన్న వారు. వీరు పాటించే ఈ మానసిక దాసోహానికి అప్పటి పేరు ఆధునికతఆ ఆధునికతకు నేటి కొన సాగింపు పేర్లే మార్కెట్టు, ఉద్యోగాలు, ప్రపంచీకరణ, గ్లోబలయిజేషను, విదేశీ ఉద్యోగాలు.
ఈ మొత్తం పరిణామాన్ని పరికించి చూస్తే సాంప్రదాయ పద్ధతిలో చదువు సాగినంత కాలం అది సమాజానికి పనికి ఉపయోగ పడనిదిగా ఉండటమే కాక ఆ ఉన్న చదువు కూడా కొద్ది మంది గుత్త ఆధిపత్యం  ఉండింది. దీనిని సంస్కరించి కొత్తగా వస్తున్న ఆధునిక పోకడలను మేళవించి మెరిగించిన విద్యను జనానికి అందుబాటులో తెచ్చి ఉండాలి. అలా తెచ్చి ఉన్నట్టు అయితే అలాంటి విద్య ద్వారా భాషా సంస్కృతులను, వారసత్వాన్ని కొనసాగించు కుంటూనే ఆధునికత వైపు ప్రయాణించే అవకాశం ఉండేది. బ్రిటీషు వలసకు ముందు జనానికి అందుబాటులో లేని, ఉత్పత్తిలో పాలు పంచు కోని సాంప్రదాయ విద్య నుండి నేరుగా బానిస విద్యా విధానం లోకి మరలాము. ఎంతగా మారాము అంటే తెలుగు చదివితే అవమాన పడేంతగా. 

మహుశా మెకాలే కూడా భారత జాతి నుంచి ప్రత్యేకించి తెలుగు జాతి నుంచి ఇంత బానినసత్వాన్ని ఆశించి ఉండడు.


8 comments:

  1. వేద విద్య మరియు ఈ అసాంస్కృతిక విద్య చెడ్డవా లేదా ఈ విద్య చెడ్డదా?

    ReplyDelete
    Replies
    1. చెడ్డవా మంచివా అన్నది కాదు.ఉన్న పరిస్థితి అది.

      Delete
    2. వేదవిద్యలు పనికిరానివైతే జర్మనీ, అమెరికాల లో వేదిక్ స్టడీస్ గురించి రిసెర్చి సెంటర్లు ఎందుకు వెలసినట్లు? బ్రిటిష్ దేశం లో ఇప్పుడు గత మూడేళ్ళు గా ప్రాథమిక స్థాయిలో సంస్కృతం ఎందుకు నేర్పుతున్నట్లు?

      Delete
    3. నేటి చదువులు చూడండి డిగ్రీ / ఇంజనీరింగ్ ఏది చదివినా పనితనం లేదు. కేవలం క్లర్కు/మార్కెటింగ్ .. లాంటి ఉద్యోగాల కోసమే పనికొచ్చేవి గా ఉన్నాయి. అదే కుర్రాళ్ళు మెకానిక్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, ప్లంబర్, డ్రైవర్,.. లాంటి పనులు (చదువు కేవలము అక్షర జ్ఞానానికి పరిమితమైనా సరే) ఒక సంవత్సరం నేర్చుకున్నా ప్రయోజకులు అవుతున్నారు. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అయితే మిగతా అవసరాల మాటేమిటి? ఇంకా బాగా ప్రజ్ఞావంతులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళిపోతే సైంటిస్ట్, ఉపాధ్యాయ బాధ్యతలకు ఎవరు వస్తారు?

      Delete
  2. గుడ్! చాలా బాగా రాసినారు.చాలా మంది ఇలాంటి వి చదువరు.చదివినా కూడా వారికి ఇవి నచ్చనంతటి మౌఢ్యం లో ఉన్నారు.దేనిని పూర్తిగా ధ్వంసం చేయనీదే మరొక కొత్త దాన్ని దేన్నీ నిర్మించ లేము.

    ReplyDelete
  3. మెకాలే ౧౮౩౫ డాక్యుమెంట్ లో మెకాలే బ్రిటిష్ పార్లమెంట్ లో చెప్పిన ప్రకారం భారత్ లో సంస్కృత మీడియం గురుకులాల్లో ౧౮ పద్దెనిమిది రకాల సబ్జెక్టులు చదివించేవారు. దీనిలో వేదగణితం, ఖగోళ శాస్త్రం, లోహశాస్త్రం (మెటలర్జీ), ఆయుర్వేద వైద్యం... చెప్పులు కుట్టేవారు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు కూడా మెకాలే బ్రిటన్ పార్లమెంటు లో ౧౮౩౫ లో చెప్పినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. భారత జాతికి,.. నేటి చదువుల వ్యవస్థకు.... మెకాలే పద్ధతి ని రూపుమాపి భారత్ కు అవసరమైన పాత కొత్తల మేలు కలయిక తో నూతన విద్యావిధానం రూపొందాలి. విద్యావిధానానికి దిశా నిర్దేశం చేసే ఈ ఉపన్యాసం వినండి. http://www.youtube.com/watch?v=BR-lLpzi7JE స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారి ఈ ఉపన్యాసం నేటి చదువుల గురించి ఆలోచించే ప్రతిఒక్కరు శ్రద్ధగా వినాల్సిందే. (యు-ట్యూబ్ వీడియో..)

    ReplyDelete
  4. మెకాలే ౧౮౩౫ డాక్యుమెంట్ లో మెకాలే బ్రిటిష్ పార్లమెంట్ లో చెప్పిన ప్రకారం భారత్ లో సంస్కృత మీడియం గురుకులాల్లో ౧౮ పద్దెనిమిది రకాల సబ్జెక్టులు చదివించేవారు. దీనిలో వేదగణితం, ఖగోళ శాస్త్రం, లోహశాస్త్రం (మెటలర్జీ), ఆయుర్వేద వైద్యం... చెప్పులు కుట్టేవారు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు కూడా మెకాలే బ్రిటన్ పార్లమెంటు లో ౧౮౩౫ లో చెప్పినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. భారత జాతికి,.. నేటి చదువుల వ్యవస్థకు.... మెకాలే పద్ధతి ని రూపుమాపి భారత్ కు అవసరమైన పాత కొత్తల మేలు కలయిక తో నూతన విద్యావిధానం రూపొందాలి. విద్యావిధానానికి దిశా నిర్దేశం చేసే ఈ ఉపన్యాసం వినండి. http://www.youtube.com/watch?v=BR-lLpzi7JE స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారి ఈ ఉపన్యాసం నేటి చదువుల గురించి ఆలోచించే ప్రతిఒక్కరు శ్రద్ధగా వినాల్సిందే. (యు-ట్యూబ్ వీడియో..)

    ReplyDelete
  5. భారత్ లో మెకాలే విద్యకు పూర్వం .. పద్దెనిమిది రకాల శాస్త్రాలు అందులో వేదగణితం, ఖగోళశాస్త్రం(అస్ట్రో ఫిజిక్స్), ఆయుర్వేద వైద్యశాస్త్రం., లోహశాస్త్రం .,. ఇలా ఉండేవి... కానీ కేవల౦ వేదం ఉపనిషత్తులు మాత్రమే కాదు. http://www.youtube.com/watch?v=BR-lLpzi7JE ఈ వీడియో చూడండి మీకున్న కాస్త అనుమానం పటాపంచలై పోతుంది. భారత్ లో చెప్పులు కుట్టేవారు ప్లాస్టిక్ సర్జరే చేసేవారు అని స్వయంగా మెకాలే ౧౮౩౫ కి బ్రిటిష్ పార్లమెంట్ లో చెప్పినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. మెకాలే విద్య తో ఆంగ్లేయులు పనిగట్టుకొని మన దేశ విద్యలను నాశనం చేశారు.

    ReplyDelete