Sunday, September 9, 2012

అడ్డ దారిలో బోధన: తొలి చదువులు-9


                                                                            8-9-2012
                   
చాలా మంది తల్లిదండ్రులకు, ఆ మాటకు వస్తే బాగా చదువుకున్నవారిలో కూడా నాటుకు పోయిన ఒక పొరపాటు అనిపింపు ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు మీడియంలో చదివితే పిల్లలు దాన్ని బాగా మాట్లాడ గలరు అని. ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే, చదువు అంటే కేవలం ఇంగ్లీషులో మాట్లాడటమే కాదు. ఎఱుకువ (నాలెడ్జి)ను నేర్చు కోవటం. ఎఱుకువను పొందటానికి ఏ భాష అయినా ఒక్కటే.


కాకుంటే ఏ భాష ద్వారా నేర్చుకుంటున్నారో ఆ భాష మీద పట్టు ఉండాలి. పసి వయసులో అలాంటి పట్టు ఉండేది వారి సొంత భాషలోనే. లేత వయసులో సొంత భాషలో అర్థం అయిన అంతగా ఇతర మరే భాషలోనూ అర్థం కాదు. వచ్చీ రాని భాషలో చెప్పటంవల్ల చెప్పిన సంగతులు మొత్తంగా అర్థం కావు. చదువు అర్థం కాక పోతే పిల్లలు ఎంత మర తనానికి (మెకానికల్) అలవాటు పడతారో ఇంగ్లీషులో నేర్చుకొనే ఎక్కాలను చూస్తే తెల్లం అవుతుంది.
రెండో తరగతి చదివే పిల్లల్ని పిలిచి  'ఫోర్తు టేబులు’ చెప్పమని అడగండి.

                 ఫోర్  వన్ ‘జార్’ ఫోర్           four  ones   jar  four
                 ఫోర్  టూ ‘జార్’ ఎయిట్       four  twos   jar  eight
                 ఫోర్ త్రీ ‘జార్’ ట్వల్వ్            four threes jar  twelve
                 ..........................
                 ..........................
అంటూ చెప్పుకుంటూ పోతారు. మధ్యలో ఆపి ‘జార్’ అంటే ఏమిటి అని అడగండి. నూటికి 99 మంది పిల్లలు చెప్ప లేరు. ఇంతకూ ఈ ‘జార్’ అనేది ఏమిటి అంటే నాలుగో ఎక్కాన్ని ఇంగ్లీషులో 
                      ఫోర్  వన్స్ ఆర్ ఫోర్      four  ones   are  four
                      ఫోర్ టూస్ ఆర్ ఎయిట్  four  twos   are  eight
                      ఫోర్ త్రీస్ ఆర్ ట్వల్వ్’’    four threes  are twelve
అంటూ వల్లించాలి. ఇలా పలికేటప్పుడు (ఫోర్) వన్స్ + ఆర్ కలిపి పలికేటప్పుడు ‘వన్స్ - ఆర్’ల నడుమ సంధి ఏర్పడి ‘వన్సార్’ అయింది, ఆ పదమే రూపాంతరం చెంది ‘వన్జార్’ అయింది. తరువాత ‘వన్’ దాని నుండి విడి పోయి ‘జార్’ మట్టుకు మిగిలి ఉంది. ఇలాగే ‘టూ జార్’ ‘త్రీ జార్’లు. అంటే ‘ఆర్’ కాస్తా ‘జార్’ అయ్యింది. అంటే ఇది ‘ఇంగ్లీషు సంధి’ అన్న మాట. ఈ సంగతి ఎంత మంది టీచర్లకు తెలుసూ? ఇలా పలకటంలో పిల్లల తప్పేమీ లేదు. టీచర్లు ఎలా చెబితే పిల్లలు అలానే బట్టీ పెడుతున్నారు., అంతే. అర్థం తెలియకుండా బట్టీ పెట్టటానికి ఇది ఒక మచ్చు మాత్తరమే.

ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లలకు లెక్కలు నేర్పించే పద్ధతి చూస్తే సరళంగా ఉండే చిన్న చిన్న సంగతులను కూడా ఎంత చిక్కుగా, గందరగోళంగా బోధిస్తారో మనం గమనించవచ్చు. కూడికలు, తీసివేతలు నేర్పించటానికి పిల్లలకు ‘వేళ్ళ’ పద్ధతి అలవాటు చేస్తారు. 3 ప్లస్ 2 ఎంత అని పిల్లల్ని అడిగితే వాళ్ళు వెంటనే ‘‘టేక్ టూ ఫింగర్స్, త్రీ ఆఫ్టర్, ఫోర్.. ఫైవ్...’’ అంటూ ఒక్కొక్క వేలుని ముడుస్తూ ‘ఫైవ్ అంకుల్’’ అంటారు. మనం ‘‘2 ప్లస్ 2’’ ఎంత అని అడిగినా, వాళ్ళు ఆ పద్ధతి ప్రకారమే చెబుతారు తప్ప వెంటనే  'ఫోర్'  అని బదులు చెప్పరు. ఇచ్చిన లెక్క పదికి మించితే కాలి వేళ్ళను కూడా లెక్కేసే పిల్లలు కూడా లేక పోలేదు. ఇదే లెక్కని ‘‘నీ దగ్గర త్రీ చాకోలేట్లు ఉంటే నేను టూ టాక్లేట్లు ఇస్తే, నీ దగ్గర మొత్తం ఎన్ని ఉంటాయి? అని అడిగితే ఠక్కున ‘ఫైవ్’ అంటారు. ఇక్కడ పిల్లలకి అర్థం కావాల్సింది మూడు, రెండు కలిపితే ‘అయిదు’ అవుతుంది అనేది మట్టుకే. మాటల్లో కష్టం కాని కూడిక ‘చదువు ‘మోడ్’లోకి పోగానే వేళ్ళు ముడిచి తెరిచే మూస తీరులో కుదురుకొని కష్టం అయి కూర్చుంటుంది. తప్పుడు పద్ధతిలో నేర్పిన ఫలితం అది.

మరో మచ్చుక. మానసిక ఎదుగుదల రాకుండా లెక్కలను నేర్పిస్తే ఎంత మరతనానికి అలవాటుపడతారో చూద్దాం. అయదో తరగతి చదివే పిల్లలను పిలిచి 658లో నుంచి 469  ని తీసివేయమని అడగండి. చాలామంది పిల్లలు ‘‘తీసివేత అంటే ఏమిటి అంకుల్’’ అని అడగవచ్చు. దడుచుకో  ఒద్దు. వారికి నిజం గానే తెలియదు. అలా అడిగినప్పుడు ‘సబ్‌స్ట్రాక్షన్’ అని కానీ, ‘మైనస్’ అని కానీ చెప్పక తప్పదు. ఆ లెక్కని ఒప్పుగా చేసినా తప్పుగా చేసినా చేసే తీరు మాత్తరం 100 శాతం మంది పిల్లలు ఇలా చేస్తారు.                        

658 లో ఒకట్ల స్థానంలో ఉన్న 8 లో నుంచి కింద ఉన్న 9 పోదు కాబట్టి పదుల స్థానంలో ఉన్న 5 లో నుంచి ఒకటి అప్పు తెచ్చుకోవాలి. ఒకటి అంటే పది అని అర్థం. ఆ లెక్కన 8కి 10 కిలిపితే 18 అవుతుంది. లెక్క చేసే పిల్లలు ఏం చేస్తారంటే 8 ని కొట్టేసి దాని నెత్తిన 18 ని రాస్తారు. అలాగే 5లో నుండి ఒకటి పోయింది కాబట్టి దాన్ని కూడా కొట్టేసి 5 నెత్తిన 4 వేస్తారు. ఇలా ఎన్ని అంకెల్ని తీసేయాలన్నా కొట్టెయ్యటం దాని నెత్తిన రాసేయటం. ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లల్లో పదో తరగతి దాటాక కూడా ఈ జాడ్యం వదలదు.

ఈ కష్టం అంతా ఎందుకు వచ్చింది అంటే నోటి లెక్కలు చేసే వయసు రాక ముందే లెక్కలు నేర్పటంవల్ల. తగిన వయసు రాకుండా నేర్పేటప్పుడు సులభంగా నేర్పుతున్నాము అనే పేరులో ‘అడ్డదారి’ (షార్ట్‌కట్) తొక్కిస్తారు. ఇలా అంటుకున్న జాడ్యం అంత తొందరగా వదలదు.

పిల్లలకు తగిన వయసు వచ్చాక లెక్కలు చెప్పటం మొదలుపెడితే ఇలాంటి డొంక తిరుగుడు పద్ధతుల్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉండదు. శాస్ర్తియంగా కూడికలు, తీసి వేతలు నేర్పాల్సింది ఏడో ఏట. లెక్కలు చెయ్యటానికి వీలుగా మానసిక పరిణతి ఆ వయసుకు జరిగి ఉంటుంది. బడి మొహం తెలియని వయసున్న ఓ పిల్లాడిని పిలిచి ‘‘ఐదు, ఆరు కలిపితే ఎంత?’’ అని అడగండి. వెంటనే ‘పదకొండు’ అంటాడు. ఏమిటో! చదువుకో కుండా అల్లరి చిల్లరి గా విడిలో తిరిగే పిల్లలు  చేసే వాటి లెక్కలు కుడా  కార్పొరేటు బడి పిల్లలు చేయలేక పోవటం. 

2 comments:

  1. కార్పొరేట్ బడుల్లొ చెప్పే టీచర్స్ 7వ తరగతి వరకు చాలావరకు ఇంటర్మీడియట్ చదివిన స్త్రీ లే అధికంగా కనిపిస్తారు. వాళ్ళకు ఎలా బొధించాలొ తెలియదు ముక్కున వేలేసుకుని పుస్తకాల్లొ వున్నదాన్ని బొర్డ్ మీదకి ఎక్కిస్తరు. పుస్తకాల్లొ వున్నదాన్ని చుడకుండా చెప్పటం కొసం నిరంతరాయంగా వాళ్ళదగ్గర కంటొపాటం చెపిస్తారు. బట్టీయం పద్దతి వల్ల పిల్లలకు కలిగే నష్టం గురించి మనం మాట్లాడితే వింతగా చుస్తారు.వాళ్ళు పిల్లలు కదా బట్టీపద్దతే పిల్లలకు చెప్పాలి పెద్దైన తర్వాత దాన్ని విడిచి పెట్టేస్తారు అని బదులు చెపుతారు.

    ReplyDelete