Tuesday, September 25, 2012

సమాజానికి అద్దంపట్టే పిల్లల భాష - తొలి చదువులు - 11

23-09-2012


మానవుడి భాష ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? అనే అడకలకు పూర్తి జవాబులు ఇంత వరకూ తెలియదు. ఈ నేల మీద మానవుడికి మాత్రమే మాట్లాడే నుడి ఉంది. భాష ఏది అయినా అది రూపు దిద్దుకొనే విధానం, ఎదిగే పద్ధతి విశ్వ వ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుంది. ఒక నుడిని నేర్చుకొన్నాక దాని ద్వారా ఎన్ని నుడులు అయినా నేర్చు కోవచ్చు. నేర్చు కొనే భాషతో వ్యక్తికీ, జాతికి కొన్ని అవసరాలు ఉంటాయి. భాష ఆ అవసరాలను తీర్చడానికి ఉపయోగ పడాలి. ఆంథ్రోపాలజిస్టులూ, మానసిక నిపుణులు, భాషా శాస్తవ్రేత్తలు గుర్తించిన అవసరాలు ఇవి. .
  •  భాష మనిషి సంఘ జీవితానికి ఓ పని ముట్టులా ఉపయోగ పడాలి. 
  • ఇతరులను అదుపు చేయటానికి పనికి రావాలి. 
  • తనను తాను ఇతరులతో కలుపు కోను ఉపయోగ పడాలి. 
  • తన గురించి తాను తెలుసు కోను భాష కావాలి. 
  • ఇతరులనుండి సంగతులు తెలుసు కోటానికి.  
  • ఊహలకు, నమ్మకాలకు భాష కావాలి. 
  • తన ఆలోచనలను, ఊహలను ఇతరులకు తెలియ చేయటానికి భాష ఉపయోగ పడాలి.
వీటిలో ఏ ఒక్క అవసరం తీరక పోయినా ఆ భాష, ఆ వ్యక్తికి పూర్తిగా ఉపయోగ పడినట్టు కాదు. ఈ పనులను, అక్కరలను పూర్తిగా, సుళువుగా ప్రయత్నం లేకుండానే అలవోకగా ఉపయోగ పడేదే సొంత భాష. అదనపు భాషగా దేన్ని నేర్చుకున్నా, పైన చెప్పిన అవసరా లలో కొన్నింటినే నెర వేర్చ గలదు. నేర్చుకున్న అదనపు భాష తన అవసరాలు అన్నింటిని తీరుస్తుందని ఎవరైనా అనుకుంటే అది కేవలం వీలుకాని అనిపింపు మట్టుకే.

మానవుడికి ఏ భాషా పుట్టుకతో రాదు. దాన్ని నేర్చు కొనే చేవ మట్టుకే వారసత్వంగా వస్తుంది. చేవ వచ్చినా బిడ్డకు భాష నేర్పేది సమాజమే. బిడ్డలు ఎదిగే కొద్దీ భాషను విన టానికి అలవాటు పడటం, అర్థం చేసు కోవటం, ఆ తరువాత మాట్లాడ టానికి ప్రయత్నించటం అనే వరుస పద్ధతిలో నేర్చుకుంటారు. భాష లేక పోతే మనం ఏదీ నేర్చు కోలేము. భాష లేక పోతే మనకూ జంతువు లకూ తేడా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఎదుగుదల భాష తోనే మొదలు అవుతుంది, భాష ద్వారా జరుగు తుంది. భాష నేర్చు కోవటానికి పరిసరాల ప్రేరణ కావాలి. ఇక్కడ పరిసరాలు అంటే సమాజం, అందులో వుండే వ్యక్తులు, వారు మాట్లాడే భాష.


బిడ్డ భాష నేర్చుకొనే తంతు పురిటి లోనే మొదలు అవుతుంది. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు నులి వెచ్చగా, చీకటిగా, కుదుపు లేకుండా హాయిగా ఉంటాడు. తల్లికి నొప్పులు వచ్చి కాన్పు జరగగానే బయట వాతావరణపు ఒత్తిడి, చలి, బిడ్డ ఒంటికి తగులుతాయి. ఒత్తిడి, చలి, బిడ్డ ఒంటికి కొత్త అనిపింపులు. అలాగే వెలుతురు కళ్ళకు కొత్త అనిపింపు. పుట్టిన వెనువెంటనే ఈ అనిపింపులు తొలిసారిగా పిల్లవాడి మెదడులో రికార్డు అవుతాయి. అయితే ఈ కొత్త అనిపింపు లకు ఉన్నట్టు ఉండి గురి కావటంవల్ల వెలుతురు తగలగానే కళ్లు మూస్తాడు. కాని చలి నుండి తనను తాను కాపాడుకోలేడు. కాబట్టి ‘నన్ను కాపాడండో!’ అని తన అక్కరను ఏడుపు ద్వారా తెలియజేస్తాడు. ఇది బిడ్డ ఉపయోగించే తొలి భాష. మరో రెండు నెలలకు ఎదుటివారిని చూసి హాయిగా నవ్వు తాడు. ఆ విధంగా ఏడవటం, నవ్వటం అనేవి భాషకు సంబంధించిన తొలి రూపాలు. ప్రపంచంలో ఉన్న బిడ్డలంతా ఒకే రకంగా ఏడుస్తారు, నవ్వుతారు. తెలుగు నవ్వు, ఇంగ్లీషు ఏడుపు అంటూ ఏమీ ఉండవు. ఇది విశ్వభాష. వయసు పెరిగేకొద్దీ వారి వారి చోటు భాషలకు అలవాటుపడతారు.

అప్పుడే పుట్టిన బిడ్డ మెదడు ఖాళీ సీడీలాంటిది. చూసిన పరిసరాలను, విన్న సవ్వడులను నమోదు చేసుకోగల చేవను కలిగి ఉంటుంది. బిడ్డ సమాజంలో పెరుగుతాడు కాబట్టి పుట్టిన నాటి నుండి మేనుక (ఫిజికల్), సామాజిక పరిసరాలనుండి వచ్చే ప్రేరణలు మెదడులో నమోదు అవుతూ వుంటాయి. పరిసరాలు, సమాజం నుండి వచ్చే ప్రేరణలను మనసుకు చేర వేసేది చూపు, వినికిడి, వాసన, తాకిడి, రుచి. వీటి ద్వారా మెదడులో రికార్డు అవుతాయి. ఆదిలో బిడ్డ చూపు, వినికిడికి మట్టుకే స్పందిస్తాడు. రాను రాను సామాజిక ప్రేరణలకు స్పందించటం మొదలు అవుతుంది. ముందుగా నమోదు అయ్యే మేనుకలకు సామాజిక అర్థాలు, అనిపింపులు జతకావటంతో భాష పెరగటం మొదలవుతుంది.

పైన చెప్పిన అయిదు మేనుక ప్రేరణలలో వినికిడి తప్ప మిగిలిన నాలుగు మేనుకలు అంటే చూపు, వాసన, తాకిడి, రుచి ద్వారా మెదడుకు చేరే సమాచారం ప్రపంచంలో ఏ బిడ్డకు అయినా ఒకేలా ఉంటాయి తప్ప వీటికి జాతి, తావు అనే తేడాలు ఉండవు. మచ్చుకు నింగిలో ఉన్న చందమామ మన పిల్లవాడికి అయినా, అమెరికా పిల్లవాడికి అయినా ఒకేలా కనిపిస్తుంది. అలాగే మల్లెల వాసన, చీమ కుట్టిన నొప్పి, పాల రుచి అందరు బిడ్డలకి ఒకలాగే మెదడులో నమోదు అవుతాయి. అయితే వినటం ద్వారా నేర్చుకొనే భాష దగ్గరకు వచ్చేసరికి తేడా వస్తుంది. మనం పలుకే మాట సవ్వడి మేనుక  (ఫిజికల్) ప్రేరణే అయినప్పటికీ పలికే విధానం, ఆ పలుకుకు అర్థం ఆయా తావులను బట్టి తేడాగా ఉంటుంది. ఏ సమాజంలో ఉంటే ఆ భాషను నేర్చుకొని తీరాల్సిందే. ఒక రకంగా చెప్పాలి అంటే సమాజంలో ఉన్న వ్యక్తులు ఉమ్మడిగా ఉపయోగించే నోటి సవ్వడులే బిడ్డలో భాషగా రూపు దిద్దుకుంటాయి 

No comments:

Post a Comment