Saturday, September 15, 2012

‘బట్టీ ’ విక్ర 'మార్కులు’ -తొలి చదువులు-10


15-9-2012

నేర్చుకోవాల్సిన సంగతులు అర్థం కాక పోయినా, గజిబిజిగా ఉన్నా సరిగా గుర్తు ఉండవు. అవసరాల రీత్యా అలాంటి వాటిని గుర్తు పెట్టుకోవాల్సి ఒస్తే  వాటిని పదే పదే వల్లె వేసి మనసులో నాటుకుంటాం. ఆ పద్ధతినే మనం ‘కంఠస్థం’ చెయ్యటం లేదా ‘బట్టీ’ పట్టడం అంటాం. సంగతి ఎంత కఠినంగా ఉంటే బట్టీ పట్టడం అంత కష్టంగా ఉంటుంది. దానికి పట్టే సమయం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. మచ్చుకు అర్థం తెలియని సంస్కృత శ్లోకాలు బట్టీ పట్టటానికి చాలా శ్రమ పడాలి. అదే వేమన పద్యాలకు అంత కష్టం పడాల్సిన అక్కర లేదు. కారణం అది వాడుక భాషలో ఉండి అర్థం కావటం. 

భాష మీద పట్టు లేకుండా చదివితే అర్థం కాదు. అర్థం కానప్పుడు దాన్ని గుర్తు పెట్టు కోవాలి అంటే ఉన్న ఒకే ఒక దారి దాన్ని కంఠస్థం చేయటం. ప్రాథమిక చదువును ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లలకు భాష మీద అప్పుడే పట్టు ఉండదు. కాబట్టి వారిది బట్టీ దారే. ఈ మీడియంలో చదివే పిల్లలను బాగా గమనిస్తే వారు మూడు రకాలుగా బట్టీ పట్టటానికి అలవాటు పడుతారు. 

వీరిలో మొదటి రకం- పిల్లలు, చదివింది అర్థం కానప్పుడు మార్కుల్లో వెనుక పడి పో కూడదు అని వారంతట వారే బట్టీ పద్ధతికి మల్లుకుంటారు. భాష మీద పట్టు లేనందువల్ల టీచరు చెప్పేదీ, పుస్తకాలలో చదివేది సరిగా అర్థం కాక, అంతో ఇంతో అర్థం అయినా చెప్పటానికి లేదా రాయటానికి భాష చాలనందు వల్ల ఎందుకు వచ్చిన గొడవలే అని బట్టీకి మల్లుకుంటారు. 

రెండో రకం - టీచర్లే బట్టీ పద్ధతికి అలవాటు చేయటం. అర్థం కాని చదువులతో పిల్లలకు మార్కులు రావు. మార్కులు తెప్పించాలి అంటే ఉన్న ఒకే ఒక దారి బట్టీ. బట్టీ పట్టించటానికి వీలుగా అచ్చు పుస్తకాన్ని వదిలి ‘ప్రశ్నలు - జవాబులు’లతో కూడిన ‘స్టడీ మెటీరియల్’ అనే కొత్త పద్ధతిని కనిపెట్టారు. వీటిని బట్టీ పట్టటం పిల్లలకు చాలా సులువు. ఉన్న పుస్తకాలకు తోడు ఆరు సబ్జక్టులకు ఆరు అదనపు స్టడీ మెటీరియళ్లు వచ్చి చేరటంతో ఇప్పుడు పిల్లలకు మోత బరువు పెరిగింది. 

ఇక మూడో రకం- బాగా తెలివి ఉన్న పిల్లలు ఇంగ్లీషు చదవటం, రాయటం, మాట్లడటం, అర్థం చేసుకోవటం బాగా వచ్చినప్పటికీ సొంతంగా రాసిన దాని కంటె మూస జవాబులకే ఎక్కువ మార్కులు వేస్తారు కాబట్టి సొంతంగా రాసి మార్కులు తగ్గించు కోవటం ఎందుకులే అని వారు కూడా బట్టీకే మల్లుకుంటారు. ఈ పద్ధతికి కేజి క్లాసులో విత్తనం పడి, తరగతులు పెరిగే కొద్దీ మాను అవుతూ ప్రతిదీ బట్టీ పెట్టే స్థాయికి అలవాటు పడతారు. 

అర్థం చేసుకొంటూ చదివితే అర గంటలో అయి పోయే పాఠాన్ని మూస సమాధానాల కోసం రోజులు తరబడి బట్టీ పద్ధతిని పాటించటం వల్ల అందుకు ఎక్కువ సమయం పడుతుంది. పయిగా  బట్టీ పద్ధతిలో చదివింది సరిగా గుర్తు ఉండదు కాబట్టి మరిన్నిసార్లు చదవాల్సి వస్తుంది. చదువు కోసం కేటాయించాల్సిన సమయం విపరీతంగా పెరిగి పోవటంతో పిల్లలకు ఆటలకు, సామాజిక కార్యక్రమాలకు కేటాయించాల్సిన వేళల్లో కోత పడుతుంది. దీని వల్ల పిల్లలకు సమాజీకరణ, మానవ సంబంధాలు, సర్దుబాటుతత్వం లాంటి సున్నితమైన జీవిత మెలకువలు (సాఫ్టు స్కిల్సు) నేర్చుకొనే అవకాశం లేకుండా పోయింది. ఇది ఇంతటితో ఆగితే నయం. చదువులో పోటీ ఉందనే నెపంతో ఇంకా బాగా బట్టీ పట్టించ టానికి పగలు సమయం చాలక నిద్ర వేళల్లో కూడా కోత పెట్టటం జరుగుతుంది. ఎగువ తరగతులు, ఇంటరు చదివే పిల్లలు ఎంత సేపు నిద్ర పోతారో ఒక సారి ఆ పిల్లలను అడిగి చూడండి. 

నేర్చుకొనే చదువును పరికించి (అబ్జర్వేషను), విడమరిచి (అనాలసిస్) అర్థం చేసుకొని చదివిన వారికి, భాష మీద పట్టు లేకుండా కేవలం బట్టీ పట్టి చదివిన వారికి ఉండే తేడాలు  ఇలా  ఉంటాయ.

                విడమరుపు చదువు                                     బట్టీ చదువు

  • భాష రావాలి                                                అక్షరాలు ఒస్తే చాలు భాషతో పని లేదు 
  • అర్థం అవుతుంది                                         కావచ్చు కాక పోవచ్చు
  • బాగా గుర్తుంటుంది                                      పరీక్షల వరకే గుర్తుంటుంది
  • వయసుకు లోబడి ఉంటుంది                        వయసుతో పని లేదు
  • భాష మీద పట్టు ఉండాలి                              భాషతో పని లేదు
  • మొత్తం మెదడుకు పని                                కేవలం జ్ఞాపకపు చేవకే పని
  • మార్కులు రా ఒచ్చూ రాక పో ఒచ్చు             మార్కులు ఒచ్చి తీరుతాయి
  • నిజమయిన ప్రతిభ                                      కేవలం కనిపించే ప్రతిభ
  • మంచి టీచరు అవసరం                                మంచి స్టడీ మెటీరియలు అవసరం
  • చదువుమీద ఆసక్తి ఉంటుంది                       మరతనం (మెకానికల్)గా ఉంటుంది
  • ఒత్తిడి ఉండదు                                            ఒత్తిడికి గురవుతారు
  • నిజమయిన ఎదుగుదల-                             ఒక దగ్గర ఆగి పోతారు

No comments:

Post a Comment