29-9-2012
భాష మనుషుల నడుమ సంగతుల మార్పిడి కోసం వాడే ఓ పనిముట్టు. తనకు తెలిసిన సంగతిని ఇంకొకరికి తెలపాలన్నా, మరొకరి నుండి సంగతులు తెలుసుకోవాలి అన్నా వారిమధ్య సమాచార మార్పిడి జరగాలి. ఇది జరిగేటప్పుడు భాష రెండు పాత్రలను పోషిస్తుంది. ఒకటి ‘చెప్పే’ది (ఎక్స్‌ప్రెస్సివ్) రెండోది ‘తీసుకొనే’ది (రిసెప్టివ్). సమాచార మార్పిడి జరిగేటప్పుడు ఈ రెండు పనులు ఒక దానిని బట్టి రెండోది ఇచ్చి పుచ్చుకుంటూ ఒకే కాలంలో, సులువుగా, ప్రయత్నం లేకుండా జరగాలి. మాటల్లో దిగిన ఇద్దరి మనుషుల భాష ఒకటే అయినప్పుడే భాష ఈ రెండు పాత్రలను పోషిస్తుంది.
అంటే వారి మనసుల్లో భాషకు సంబంధించిన ఒకే ‘‘ప్రోగ్రామింగ్’’ ముందుగానే జరిగి ఉండాలి. పుట్టినప్పటి నుండి బిడ్డలో జరిగే ఈ ప్రోగ్రామింగే భాష నేర్చుకోవటం. ఇందులో తల్లిదండ్రులది, కుటుంబ సభ్యులది కీలక పాత్రే అయినప్పటికీ, మొత్తం భాష ఎదుగుదలలో సింహభాగం పాత్రను పోషించేది సమాజమే. మన సమాజం మనకు తెలుగులో ‘‘ప్రోగ్రామింగ్’’ జరిపితే, తమిళులకు తమిళ భాషలో ‘‘ప్రోగ్రామింగ్’’ జరుగుతుంది. ఎవరికి ఏ భాషలో ‘‘ప్రోగ్రామింగ్’’ జరుగుతుందో దాన్ని మట్టుకే అర్థం చేసు కోగలరు. ఇతర భాషలో మాట్లాడితే అర్థం చేసు కోలేరు. ఒక వేళ ఇతర భాషను అర్థం చేసు కోవాలి అంటే దానికి సంబంధించి ‘‘ప్రోగ్రామింగ్’’ ఆ వ్యక్తుల్లో జరగాలి. అంటే ఆ భాషను అదే పనిగా నేర్చు కోవాలి.
చెప్పటం, దాని మరో రూపం అయిన రాయటం అంటే మనసులో వచ్చే ఆలోచనలను ఇతరులకు తెలియ జేయటం. తను చెప్పదలుచుకున్న భావం మనసులో పుట్టగానే ఆ భావాన్ని బయటకు తెలియచేయటానికి కావల్సిన పదాలను మదిలో వెతుక్కోవాలి. అంటే అలాంటి పదాలు అంతకుముందే మెదడులో నమోదు అయి ఉండాలి. అప్పుడే సంబంధిత పదాలను గుర్తుకు తెచ్చుకుంటూ, వాటికి వ్యాకరణాన్ని జోడిస్తూ మాటలాడుతాం. మాట్లాడేటప్పుడు మనలో ఉండే ఉద్వేగాలకు తగ్గట్టు గొంతులో హెచ్చు తగ్గులతో, ముఖ కవళికల్లో హావభావాలు కలిపి మాట్లాడుతాం. ఇందుకుగాను ముందుగా మన మనసులో పదాల మూట ఉండాలి. పదాలతో కట్టుకున్న సొగసులూ, సొబగులు, అంద చందాలు మనసులో ఉండాలి. అంటే మాట కట్టు, క్రియ మార్పులు, ఉపమానాలు, పోలిక. జాతీయాలు, సామెతలు. ఎత్తిపొడుపులు ఇవి అన్నీ ఉంటేనే ఆ వ్యక్తి మాటల్లో, రాతల్లో అసలుదనం ఉంటుంది. నేర్చుకొనేటప్పుడు భాషా పదాలు, దాని సొగసులు ఎంత స్వచ్ఛంగా నమోదు అయితే ఆ వ్యక్తి మాట్లాడే భాష కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది.
మన పిల్లల్లో బడికి పోనంతవకు ఇంటా, బయటా తెలుగు పదాలు నమోదు అవుతూ ఉంటాయి. బడికి వెళ్ళటం మొదలు అయ్యాక తెలుగు పదాలకు బదులు ఇంగ్లీషు పదాలు నమోదు కావటం మొదలవుతుంది. దాంతో నిత్యం మనం వాడే కుక్క, పిల్లి, బొమ్మ, నీళ్లు లాంటి పదాలకు బదులు ‘‘డాగ్, క్యాట్, డాల్, వాటర్’’అని నమోదు కావటం మొదలు అవుతుంది.
లేత వయసులో ఏ పదాలు అయితే నమోదు అవుతాయో వాటి పునాది మీదే ముందు ముందు ఆ వ్యక్తి మాట్లాడే భాష స్వచ్ఛత ఆధార పడి ఉంటుంది. కాబట్టి చిన్నతనంలో ఎక్కువ ఇంగ్లీషు పదాలు నమోదు అయితే ఆ వ్యక్తి మాటల్లో కూడా ఎక్కువ ఇంగ్లీషు పదాలు దొర్లుతూ ఉంటాయి. నిజానికి ఆంగ్లం పరాయి భాష అయినప్పటికీ, బిడ్డకు సంబంధించిన అంత వరకు ఆంగ్ల పదాలు కూడా సొంత భాషా పదాల కిందే లెక్క.
సొంత భాష అంటే ఇంట్లోనూ, బయటా మాట్లాడేభాషే కాబట్టి సమాజంలో ఎంత ఆంగ్లం కలిసి ఉంటుందో బిడ్డలో కూడా అదే స్థాయిలో కలిసి పోయి ఉంటుంది. దానికి తోడు బిడ్డకు నేర్పాల్సిన తెలుగు పదాలను నేర్పకుండా ఇంగ్లీషు పదాలను నేర్పటంతో తెలుగు స్వచ్ఛత దెబ్బ తింటుంది. ఈ విధంగా ఒక తరం గడిచే సరికి తెలుగుదనం తగ్గి అందులో ఆంగ్లదనం పెరుగుతుంది. దీనిలో భాగమే మనం రోజూ తినేటప్పుడు మాట్లాడే ‘‘పళ్లెం,ఉప్పు, నీళ్లు, అన్నం’’ లాంటి పదాలు మన నోళ్ళలో నుండి మాయం అయి ‘‘ప్లేటు, సాల్టు, వాటరు, రైసు’’ అనే పదాలు రావటం. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు వాడే ‘‘అలాగే... సరే.. ఆహా.. అవునా... ఊ..’’లాంటి పదాలకు బదులుగా ‘‘ఓకే..., యస్..’’లతో నిండిపోయాయి.
పిల్లలకు భాష నేర్పేటప్పుడు జరిగే ఈ కలితీ వల్ల వారిలో బలమైన భాష పునాది ఏర్పడదు. చిన్న తనంలో నేర్చుకొనే సొంత భాష, దాని నాణ్యత, దాని సొగసు, మాటతీరు ఎంత బాగా ఉంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వం అంతగా ఎదుగుతుంది. మరో తమాషా ఏమిటంటే ఇలా సొంత భాష పునాది బలంగా ఉన్నప్పుడు పెద్దయ్యాక ఎన్ని భాషలు నేర్చుకున్నా ఆ నేర్చుకున్న భాషల అన్నింటిలోనూ తల్లి నుడిలో ఉన్నంత పట్టు ఒద్దు అన్నా ఒచ్చి తీరుతుంది. ఇంగ్లీషు మీడియంలో చదివిన పిల్లలకు మంచి ఇంగ్లీషు రాక పోవటానికి కారణం ఇదే.