Saturday, November 24, 2012

తెలుగు రాని వాడికి ఇంగ్లీషూ రాదు : తొలి చదువులు -20


      24-11-2012

‘‘మా  అబ్బాయి ఇంగ్లీషు మీడియం అండీ, తెలుగు రాదు’’, ‘‘మా వాడికి తెలుగు సరిగా రాదండీ, ఇంగ్లీషే బాగా చదువుతాడు’’, ‘‘మా  పిల్ల ఇంగ్లీషు చదివినంత ధారాళంగా తెలుగును చదవ లేదండి’’- ఇంగ్లీషు బడుల్లో పిల్లల్ని చదివించే ప్రతి తల్లి, తండ్రీ అనే మాటలు ఇవి. బయట కూడా ఇలాంటి మాటలు చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. వీరి మాటల్ని బట్టి ఇంగ్లీషులో చదవటం సులభం, కాగా తెలుగులో చదవటం కష్టం. అన్నీ అనుకూలంగా ఉండి, మాట్లాడటానికి ఇబ్బంది లేని సొంత భాషని చదవటం, రాయటం సరిగా రాక పోతే, దాదాపు అన్ని విషయాలలో ప్రతికూలంగా ఉండే ఇంగ్లీషు ఎలా సులభం అవుతుందీ? అన్నది అంతు పట్టని సంగతి.

ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లలలో భాషా పరిజ్ఞానాన్ని పరీక్షిస్తే దాదాపు ముప్పాతిక మందికి పైగా ఇంగ్లీషులో చదవటం, రాయటం తప్ప అందు లోని తేలిక విషయాలను కూడా అర్థం చేసు కోలేరు. మరో పక్క ఈ పిల్లలు తెలుగుకూ దూరం అవుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థం అయ్యేది ఏమిటంటే, తెలుగు మాట్లాడటమే వచ్చు చదవటం రాయటం సరిగా రాదు. అలాగే ఇంగ్లీషు చదవటము రాయటం వచ్చు. అర్థం చేసు కోవటము సరిగా రాదు. ఒకవేళ ఇంగ్లీషు బాగా వచ్చిన పిల్లలకు తెలుగు కూడా బాగా వచ్చి ఉంటుంది కాబట్టి వారిలో సమస్య లేదు.

చదువులో తెలుగు కష్టం, ఇంగ్లీషు సులభం అనేది బయటకు నిజంలా అనిపించినా, తరిచి చూస్తే అది అపోహే. ఇది కేవలం నిజంలా అనిపించే ఒక భ్రమ. ఈ భ్రమల నుండి బయట పడాలి అంటే కాస్త రెండు భాషల కట్టుబడి, వాటి గుణాల గురించి కాస్త లోతు ల్లోకి వెళ్లి చూడాలి. తెలుగు సరిగా రాక పోవటానికి మొదటి కారణం భాష నేర్చు కొనే తొలి నాళ్లలో ఉండే చిక్కు.
ఆధునిక తెలుగు అక్షరమాలలో ఉన్న పొడి అక్షరాలు మొత్తం 52. ఇందులో అచ్చులు 14. అల్లులు 36. వీటిలో గుణింతాలకు పనికి రాని ఙ, ఞలనూ తీసేస్తే మిగిలినవి 34. ఈ 34 అల్లులకు గుణింతాలు కట్ట ఒచ్చు. అంటే ‘క’ అక్షరం గుణింతం వల్ల క, కా, కి, కీ... లనుండి కౌ వరకు 14 పలుకులను ఇస్తుంది. ఈ లెక్కన ఉన్న 34 హల్లులు, ఒక్కొక్కటి 14 చొప్పున 34X14=476 పలుకులు పుడతాయి. అంటే గుణింతాలవల్ల 476 పలుకులకు నేరుగా అక్షరాలు తయారు అవుతాయి.

గుణింతాల తోనే కాకుండా ఒత్తులతో కూడా మనకు పలుకులు ఏర్పడతాయి. తెలుగులో హల్లులు అన్నింటికీ వాటి వాటి ఒత్తులు ఉన్నాయి. ఏ హల్లుకు ఆ ఒత్తే వచ్చే ద్విత్త అక్షరాలు వేరు ఒత్తులతో పలికే సంయుక్త అక్షరాలను మనం ఉపయోగిస్తాం. ఒక ఒత్తు గుణింతాలవల్ల ఏర్పడిన 476 పలుకులను మళ్ళీ మార్చగలదు. ఈ లెక్కన 476 శబ్దాలను 34 ఒత్తులతో కలిసి 476 X 34=16,184 పలుకులకు అక్షరాలు ఉన్నాయి. ఇవి కాక రెండో ఒత్తుతో కూడా పలుకులు వస్తాయి. ఈ విధంగా 16,184 అక్షరాలకు రెండో ఒత్తుతో ఏర్పడే అక్షరాలు లెక్కేస్తే 16,184 X 34 = 5,50,256 పలుకులకు అక్షరాలు తయారు అవుతాయి. అంతే కాదు, అయిదున్నర లక్షల పలుకులకు పక్కన సున్నా చేరటం వల్ల వాటి ఉచ్చారణలో తేడా వస్తుంది. అలా మరో అయిదున్నర లక్షల పలుకులను రాసేందుకు అవకాశం ఉంది. అంటే అటూ ఇటూగా 11 లక్షల పలుకులకు ఏ మాత్రం తొట్రు పడకుండా నేరుగా అక్షర రూపం ఇవ్వ గలిగిన చేవ ఇప్పటి తెలుగులో ఉంది. అయితే ఇవన్నీ వాడతామా లేదా అన్నది వేరే సంగతి.

ఇంత గందరగోళంగా, గజిబిజిగా, ముళ్ళ కంపలా ఉండే భాష ఇప్పటి తెలుగు. చాలా సరళంగా, సులువుగా విన సొంపుగా ఉండే తెలుగుకు సంస్కృతాన్ని తెచ్చి కలపటటం  వల్ల నేటి తెలుగు ముళ్ళ కంపలా తయారు అయింది. దీని ముద్దు పేరు ‘ఆంధ్ర’భష. అది ఎలాగో చూద్దాం.

అసలు తెలుగు లేదా తేట తెలుగులో ఉండే అచ్చులు 
అ  ఆ
ఇ  ఈ
ఉ  ఊ
ఎ  ఏ
ఒ  ఓ   -   మొత్తం 10 అచ్చులు     

ఋ ౠ, ఐ, ఔ, అః అక్షరాలు తెలుగు కాదు. ఇవి సంస్కృతం నుండి తెచ్చి తెలుగులో పోసినవి. అలాగే తెలుగులో అల్లులు క     గ    o 
చ    జ    o 
ట    డ    ణ
త    ద    న 
ప    బ    మ
య ర ల వ స ళ ఱ-మొత్తం 20. ఖ ఘ ఙ ఛ ఝ ణ థ ధ ఫ భ శ ష తెలుగు అల్లులు కావు ఇవి కూడా సంస్కృతం నుండి తెలుగులో పోసినవే.

తెలుగు తెలుగులాగే ఉండి ఉండే పిల్లలకు తెలుగు నేర్పటం అత్యంత సుళువు. అచ్చులు హల్లులు నేర్పాక ఒక్క గుణింతం నేర్పిస్తే మొత్తం గుణింతాలు వాటంతట అవే వచ్చి 20X10 = 200 పలుకులు ఒక్క వారంలో నేర్పించ ఒచ్చు. తెలుగులో ఉన్న మరో గొప్పదనం తెలుగు పదాలలో ఏ అల్లుకు అదే ఒత్తు వస్తుంది. చాలా అరుదుగా మాత్తరమే ఇతర ఒత్తులు వస్తాయి. ఈ రావటం కూడా సంస్కృత చెలిమి వల్లే. మచ్చుకు ‘వస్తాయి’ అనే పదమే తీసుకుంటే ‘వచ్చుతాయి’ అనే పుట్టక పదం గుది గూర్చిటం వల్ల ఏర్పడింది.

తెలుగు పిల్లలకు తెలుగులో చదువు సుళువు. కానీ ఇప్పుడు మనం తెలుగు పేరుతో చెప్పే చదువు అంతా ఆంధ్ర భాషలో ఉంటుంది. ఇప్పుడు మనం తెలుగు పేరుతో చదువుతున్న ఈ చిక్కు ఆంధ్రాన్ని నేర్పించాలి అంటే టీచర్లకు చాలా ఓపిక, సమయము కావాలి.

పాతిక ఏళ్ళకు మునుపు బడిలో తొలి మూడు ఏళ్ళలో కేవలము భాషను, అంకెలను, ఎక్కాలను మాత్తరమే నేర్పించే వారు కాబట్టి ఆ రెండు ఏళ్ళలో ఆంధ్రము అయినా బాగానే నేర్చు కోగలిగే వారు. ఇప్పుడు పిల్లలకు చదివే భాష, చదివే అంశాలు, చెప్పే తీరు అన్నీ మారి పోయాక చిక్కు ‘ఆంధ్రం’ నేర్పటం తొలుత కొంత కష్టంగానే తోస్తుంది. చదవటం రాయటం నేర్చుకునే అప్పుడే మాటకు తగిన అక్షరాలను ఎన్నుకోవటంలో, అంటే అచ్చులు, హల్లులు, గుణింతాలు, ఒత్తులతో ఏర్పడే ద్విత్త అక్షరాలు, సంయుక్త అక్షరాలు నేర్చు కోవటానికి చాలా రోజులు పడుతుంది. అయినప్పటికీ ఉన్న తెలుగునే నేర్పితే ఆ తరువాత అంతా చదువు సుళువే. తెలుగును ఒక సారి పూర్తిగా నేర్చుకొన్నాక ఇక చదవటానికి, రాయటానికి జీవితాంతం కుస్తీ పడాల్సిన అవసరం ఉండదు

.
తెలుగు సరిగా రాక పోవటానికి రెండో కారణం దాన్ని సరిగా నేర్పక పోవటం. యూకేజీ నుండే మూడు భాషలు, సైన్సు, సోషలు, లెక్కలు మొదలు పెట్టటమువల్ల పిల్లలకు తెలుగు తప్ప మిగతా సబ్జక్టులు అన్నీ ముఖ్యం అయినవిగా బడి నిర్వాహకులు భావించటంతో తెలుగు నేర్పే సమయంలో కోత పడుతుంది. ఆ నేర్పేది కూడా మొక్కు బడిగా మారటం వల్ల బిడ్డలకు తెలుగు సరిగా రావటం లేదు.

తల్లిదండ్రులు కూడా తెలుగు రాక పోయినా పట్టించుకోరు. పైగా ‘‘మా వాడికి తెలుగు సరిగా రాదు’’, ‘‘మా వాడికి ఇంగ్లీషే సులభం’’ అనటం చాలా మంది తల్లిదండ్రులకు ఫ్యాషనుగా మారింది. ఇది కూడా పాఠశాల యాజమాన్యాలకు కలిసి వచ్చే అంశం. ఏ అవకాశాలు లేని ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు కష్టం కాని తెలుగు ఇంగ్లీషు మీడియం పిల్లలకు గుది బండగా మారటం వెనుక ఇంత పెద్ద తతంగం ఉంది.

Sunday, November 18, 2012

మీ బిడ్డల్లో ఎమోషనల్ ఇంటిలిజేన్స్ గుర్తించండి - తొలి చదువులు-19

                                                                       17-11-2012

మహాకవి కాళిదాసు, ఆర్యభట్ట, చరకుడు, కౌటిల్యుడు, అన్నమాచార్యులు, రవివర్మ- ఇలాంటి పేర్లు విన్నప్పుడు వారు ఏయే రంగాలలో అద్భుత ప్రతిభా పాటవాలు ఉన్న వారో చరిత్రతో కాస్త పరిచయం ఉన్న అందరికి తెలుసు. ఇక సమకాలిక విషయానికి వస్తే ఇంద్రగంటి శేషేంద్ర శర్మ, ఇళయరాజ, ఎమ్.ఎఫ్. హుస్సేన్, సచిన్ టెండూల్కర్, కమలహాసన్.. వీరంతా ఆయా రంగాలలో అత్యంత ప్రాచుర్యం సంపాదించుకున్న వారు. వీరి జీవిత చరిత్రల్లోకి కాస్త లోతుగా తొంగి చూస్తే వారు ప్రాముఖ్యత పొందిన రంగాన్ని తప్పిస్తే మిగతా విషయాలలో మామూలు మనుషులు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వీళ్లు పెద్ద తెలివి గలవాళ్ళు  కాదు. అక్కడక్కడ కొన్ని మినహాయింపులు ఉంటే ఉండొచ్చు కానీ, అన్ని అంశాల మీద కొంత అవగాహనతో సివిల్సు, గ్రూపు పరీక్షలు రాసే వారి కంటే వీరి తెలివి తక్కువగా ఉండ వచ్చు. అయితే ఏమి? ఆయా రంగాలలో వారు పెద్ద ఎత్తుకు ఎగబాక గలిగారు. జీవితానికి ఒక గుర్తింపును పొంద గిలిగారు. ఒక రంగంలో ఉండే అనేక మందిలో కేవలం కొద్దిమంది మాత్రమే ఇలాంటి ప్రతిభను చూపటం ఎలా వీలు పడుతుంది అనేదాన్ని చూడాల్సి ఉంటుంది.

 ప్రకృతి అనేక వింతలు చేస్తుంది. అలాంటి వింతల్లో ఒకటి మానవుడి పుట్టుక. ఈ నేలమీద పుట్టే ప్రతి బిడ్డ మెదడు అందరికీ ఉన్నట్టే తెలివి చేవతో పుట్టటం మామూలే అయినా అందులో తనది అయిన ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అంటే కొన్ని ప్రత్యేక ప్రతిభలను ఇముడ్చుకొనే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ లక్షణం ఏ బిడ్డది ఆ బిడ్డకే సొంతం. ఇది బిడ్డ సాధార తెలివితో సంబంధం లేకుండా ఉండవచ్చు లేదా తెలివితో ముడిపడి ఉండవచ్చు. తెలివి తక్కువగా ఉండే బిడ్డల్లో సయితం అబ్బురపరచే ఏదో ఒక ప్రతిభ ఉండేందుకు అవకాశం ఉంది. దీనే్న ‘ఎమోషనల్ ఇంటిలిజెన్స్’ లేదా ఈ.క్యూ అంటారు. తెలుగులో ‘బతకనేర్చిన తెలివి’ అనే ఒక జాతీయం ఉంది. సరిగా అదే ఈ ఎమోషనల్ ఇంటిలిజన్సు. మెదడు చేవలో ఇదో ప్రత్యేక విడిత చేవ. పిల్లల మెదడు లో లోపల నిద్ర స్థితిలో ఉంటుంది. ఈ విడిత చేవ బయటకు రావటానికి అవకాశం ఏర్పడినప్పుడు పురి విప్పటం మొదలు అవుతుంది. సాన పెట్టే కొద్ది అబ్బుర పరచే ప్రతిభ బయటకు రావటానికి అవకాశం ఉంటుంది.

నిర్వచనం ప్రకారం ‘ఎమోషనల్ ఇంటిలిజెన్స్’ అంటే వ్యక్తిలో ‘‘ఉన్న విడిత చేవను గుర్తించటం, అనుభూతి చెందటం, వెలికి తీయటం, నేర్చుకోవటం, అర్థం చేసుకోవటం, గుర్తుంచుకోవటం, విరివి పరచటం, వివరించటం, ఆ మొత్తం చర్యలను అమలు పరచు కొనే చేవ’’ ఈ నిర్వచనాన్ని జనాల భాషలో చెప్పుకోవాలి అంటే పుట్టే ప్రతి బిడ్డ తనది అయిన ఒక ప్రత్యేక అంశంలో రాణించటానికి తగిన సామర్థ్యంతో పుడుతారు. 

మచ్చుకు ఓ ఇద్దరు కవులను పరిశీలిస్తే, ఒక కవి మెదడులో ‘కవిత్వ’ కళను ఇముడ్చుకోగలిగిన విడిత చేవ ఎక్కువగా ఉన్నప్పుడు, అతడు తన కవిత్వంలో అద్భుతాలు చూపగలడు. అది లేని మరో కవి సాధన చేయటం ద్వారా కవిత్వం రాయ గలిగినా మొదటి కవి రాసిన కవిత్వంలో ఉన్న పట్టు రెండో కవి రాసిన కవిత్వంలో ఉండదు. అలాగే నటనలో ఉద్వేగ సామర్థ్యం ఎక్కువగా ఉన్న సావిత్రికీ, ఆ సామర్థ్యం ఏ మాత్రం లేకుండా, కేవలం అందంగా ఉందన్న ఒకే ఒక కారణంతో సినిమా అవకాశం పొందిన మరో కథానాయకికి నటనలో తేడా ఉంటుంది. చిన్నబిడ్డలు తమలో ఉన్న ఆయా  ప్రత్యేక అంతర్గత సామర్థ్యాలు వెలికి తెచ్చుకోవాలి అంటే అందుకు పరిసరాల ప్రేరణ అవసరం. అంటే లోపల ఉన్న ఉద్వేగాన్ని పొడిచి పురి విప్పజేసే బయటి పరిస్థితులు కావాలి. అందుకే చదువు తోపాటు చదువేతర కార్యక్రమాలు విద్యలో భాగంగా ఉండటం తప్పనిసరి. 

గమనించాలే కానీ ప్రతి బిడ్డలో ఏదో ఒక సామర్థ్యం దాగి ఉంటుంది. ఇవ్వన్నీ బిడ్డ బిడ్డకూ వేరుగా ఉంటాయి. వారిలో ఆయా సున్నిత అంశాలను గుర్తించి పదును పెట్టటం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చు. మచ్చుకు ఒక బిడ్డ మెదడు సంగీతాన్ని ఇముడ్చుకో గలిగిన సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని గుర్తించి, ప్రోత్సహిస్తే అత్యంత మంచి సంగీత కళాకారుడిగా వెలుగుతాడు. అలాంటి సున్నితత్వం ఉన్న పిల్లవాడిని గుర్తించక పోతే, ప్రపంచం ఒక కళాకారుణ్ణి కోల్పోతుంది.

పిల్లల్లో దాగి ఉన్న అంతర్గత సామర్థ్యాన్ని వెలికి తీయక పోతే అది వృధాగా పోతుంది. వారిలో ఉన్న కల్పానిక శక్తి గురించి సరి అయిన దారిలో పెట్ట కుంటే ఒక్కోసారి అది పక్క దారి పట్టేందుకు అవకాశం ఉంటుంది. మచ్చుకు కల్పానిక శక్తి బాగా ఉన్న వ్యక్తి పోలీసు అధికారి అయితే అది సమాజానికి మేలు. అలా కాకుండా అదే వ్యక్తి పక్కదారి పట్టి నేరస్థుడుగా మారితే అది సమాజానికి నష్టం. అతను చేసే ప్రతి నేరం లోనూ సామర్థ్యం ఉంటుంది.. ఎక్కడో, ఎప్పుడో, ఏ బిడ్డల్లోనో, ఏదో ఒక అద్భుత ప్రతిభ విరబూస్తే ‘‘అబ్బో!’’ అనుకోవటం తప్ప మన పిల్లల్లో ఉన్న వనరులను మనం గుర్తించటం లేదు. పిల్లల్లో దాగి ఉన్న మాటు సామర్థ్యాన్ని పసితనంలో గుర్తించి విరబూసేటట్టు చేయక పోతే అది వ్యక్తికీ, సమాజానికీ నష్టం.

Saturday, November 10, 2012

తెలివి ఉన్నవారంతా ప్రతిభావంతులు కాలేరు -తొలి చదువులు-18


                                                                           10-11-12

తెలివి, ప్రతిభ, మేథాతనం అనేవి చాలా సందర్భాలలో ఒకే అర్థం కింద వాడుతూ ఉంటాం కానీ ఇవి అన్నీ ఒకటి కాదు. బిడ్డకు పుట్టుకతో తెలివి ‘సామర్థ్యం’ మట్టుకే వస్తుంది. దీన్ని మెరుగు పరచుకొని ఉపయోగం లోకి తీసుకు ఒస్తే అది ప్రతిభగా, మేథాతనంగా మారుతుంది. తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన ‘తెలివి సామర్థ్యం’ పూర్తిగా వినియోగం లోకి తెచ్చేది బిడ్డ పెరుగుతున్న పరిసరాలు.

బిడ్డకు మంచి సామర్థ్యం ఉన్నా అది ఉపయోగం లోకి రావటానికి కావలసిన ప్రేరణ, పరిసరాలు, వాతావరణం కావాలి. బిడ్డ తనలో ఉన్న చేవ దన్నుగా అందుబాటులో ఉన్న పరిసరాలను ఉపయోగించుకొని కష్ట పడితే, తెలివి ఉపయోగం లోకి వచ్చి ప్రతిభగా మారుతుంది. లేకుంటే ఆ చేవ అలాగే ముడి సరుకు లాగా ఉండి పోతుంది. ఇందులో ఉన్న అందం ఏమిటంటే ఎప్పుడు పరిసరాలు అనుకూలించినా తెలివి సామర్థ్యము ప్రతిభగా మారటానికి తయారుగా ఉంటుంది. అవకాశం ఇచ్చి చూస్తే ముడి సరుకుగా ఉన్నవారి చేవ ప్రతిభగా వికసించ ఒచ్చు. ఇందుకు మచ్చు ఏమిటంటే చిన్నతనంలో చదువుకు దూరం అయిన వారు ఆ తరువాత అనుకూల వాతావరణము ఏర్పడి చదువు మొదలుపెట్టినా ఉతికి ఆరేయటాన్ని మనం తరచూ గమనిస్తుంటాము.

తెలివి చేవ దున్నుగా ఉండే ప్రతిభ అనేక రూపాలలో ఉంటుంది. ప్రతిభను కొలవటానికి ఇదమిద్ధం అయిన కొలమానాలు ఏమీ లేకపోవచ్చు కానీ తెలివి చేవను కొలవ ఒచ్చు. ఆ కొలమానాన్ని ఐక్యూ (ఇంటిలిజెన్సు కోషంటు) అంటాం. ఐక్యూ అనేది మెదడు మేనుక పని చేయటంలో చూపే చేవ. దాన్ని ఉపయోగించి చదివితే పరీక్షల్లో వచ్చే మార్కులు సూచాయగా ప్రతిభను సూచిస్తాయి. అయితే మార్కులే తెలివికి కచ్చితమయిన కొలత కాదు. తెలివి ఎక్కువగా ఉండి సరి అయిన  శిక్షణ లేక పోయినా, ప్రతికూల పరిస్థితుల్లో పరీక్షలు రాసినా మార్కులు రావు. మార్కులు రాని వారందరిని తెలివి తక్కువ వారని అనలేము. అలాగే పుస్తకాన్ని బట్టీ పెట్టి మార్కులు పొందినా, అడ్డదారుల్లో మార్కులను సంపాదించినా బయటకు అది ప్రతిభగా కనపడ ఒచ్చు కానీ వారికి నిజంగా అంత తెలివి చేవ ఉంది అనలేము. ఒక డాక్టరుకు, కాంపౌండరుకు ఒకే తెలివి సామర్థ్యము ఉంటే డాక్టరు అయిన వ్యక్తికి పరిసరాలు, వసతులను అనుకూలంగా మార్చుకొని చదివినందువల్ల డాక్టరు అవుతాడు. అంటే తన తెలివికి పదును పెట్టి నిపుణుడుగా గుర్తింపు పొందుతాడు. అదే కాంపౌండరుకు డాక్టరుతో సమాన చేవ ఉన్నప్పటికీ ఏ కారణం వల్ల దాన్ని వాడక పోయినా సమాజంలో తక్కువ స్థాయిలో నిలిచి పోతాడు.

ఒక పక్క తెలివి బాగా ఎక్కువగా ఉన్న పిల్లలను, మరో పక్క ఎదుగుదలలో లోపం ఉన్న పిల్లలను మినహాయిస్తే ఒక తరగతిలో ఉన్న పిల్లల సామర్థ్యం కాస్త అటూ ఇటుగా ఒకే స్థాయిలో ఉంటుంది. తరగతిలో వాళ్ళకు ఇచ్చే శిక్షణ కూడా ఒకే స్థాయిలో ఉంటుంది. కానీ పరీక్షలు, మార్కుల దగ్గరకు వచ్చే సరికి పిల్లల్లో తేడా కనిపిస్తుంది. ఎందుకంటే తెలివి పుట్టుకతో వచ్చినప్పటికీ దానికి పదునుపెట్టే కారకాలు బిడ్డకు బిడ్డకు మారుతూ ఉంటాయి. కుటుంబ ఆర్థిక, సాంస్కృతిక స్థితులు, తల్లిదండ్రుల విద్యార్హతలు, పిల్లల పట్ల వాళ్లు చూపించే ఆసక్తి ఇవ్వన్నీ కూడా పిల్లల నైపుణ్యం పెరగటం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే బిడ్డ పరిసరాలకు గురయ్యే విధానాన్ని బట్టి, వారి నుండి పొందే ప్రేరణలను బట్టి ఈ తేడాలు ఏర్పడతాయి.

ఉన్న తెలివిని ప్రతిభగా మారటం రెండు రకాలుగా ఉంటుంది. ప్రతి విషయం మీద కొంత ‘విడిత’ (స్పెసిఫిక్) జ్ఞానాన్ని కలిగి ఉండటం. దీన్ని డ అందాం. రెండోది కొద్ది కొద్దిగా ఉండే ఇలాంటి విడిత జ్ఞానాలు అనేకం కలిసి ‘సాధారణ’(జనరల్) జ్ఞానంగా ఉండటం. దీన్ని G అనుకుందాం. ఈ లెక్కన విడిత జ్ఞానాల కూడిక G=S1+S2+S3+S4... మొత్తానినే  సాధారణ జ్ఞానం లేదా తెలివిగా వ్యవహరిస్తాం.

ఒక వ్యక్తి సమాజంలో మనుగడ సాగించాలి అంటే, ఆ సమాజంలో తను నెట్టుకు రావటానికి కావలసిన కనీస ‘సాధారణ జ్ఞానం’ పొందాలి. అంటే ఆ వ్యక్తి తన జీవనానికి కనీసంగా అయినా జ్ఞానాన్ని పొందాలి. అప్పుడే తన రోజు వారి వ్యవహారాలను సరిగ్గా చక్కపెట్టుకోగలడు. మచ్చుకు చదువు (S1), మానవ సంబంధాలు (S2), సమస్య పరిష్కార శక్తి (S3), కళలు (S4), సాహిత్యం (S5), ఉద్వేగాల అదుపు (S6), గణితం (S7)... ఇలా అనేక రకాల ప్రత్యేక జ్ఞానాన్ని లేదా నైపుణ్యాలను ఎంతో కొంత సంపాదించినప్పుడే, ఆ మొత్తం కలిపి సాధారణ తెలివి అవుతుంది. దీనితోపాటు బతుకు తెరువు కోసం ఏ ఒక రంగంలో మరింత విడిత జ్ఞానం పొంది ఉండాలి. ఇది సాధారణంగా పనికి సంబంధించిన నిపుణత అయి ఉంటుంది.

మన విద్యా విధానంలో ప్రధాన లోపం ఏమిటి అంటే, బిడ్డల్ని ప్రాథమిక తరగతుల నుండే మును ముందు చేయ బోయే వృత్తిని గురిగా పెట్టుకుని చదివించటం. జనంలో ఉన్న ఈ పోకడలను డబ్బు చేసు కోవటానికి పుట్టిన కార్పో‘రేటు’ బడుల్లోకి బిడ్డల్ని పంపుతున్నాం. ఇక్కడ పిల్లలకు అర్థం అవుతుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా పుస్తకాలలో ఉన్నదాన్ని ఏదో ఒక రూపంలో బుర్ర ల్లోకి దూర్చి తిరిగి దాన్ని మార్కుల రూపంలో బయటకు లాగటమే అక్కడ చేసే పని. అందుకు ఎన్ని అడ్డ దారులు ఉన్నాయో అన్నీ వారు తొక్కుతారు. మన చేత తొక్కిస్తారు. పిల్లలు ఏమయి పోతారో అన్న ధ్యాస వారికి ఉండదు. ఉన్న ఒకే ఒక ధ్యేయం ఫీజు కట్టే పిల్లల్ని వదులు కోకుండా ఏదో రూపంలో మార్కులు చూపించటమే. నిజానికి ఎక్కువ మంది అవగాహన లేని తల్లిదండ్రులకు కావల్సింది కూడా అదే!

ఇక్కడ గమనిచాల్సింది ఏమిటంటే పిల్లలు సాధారణ జ్ఞానం పెంపొందటంలో బడి ఒక చిన్న భాగమే కానీ మొత్తం అదే కాదు. పిల్లలు పొందే జ్ఞానంలో అత్యధిక భాగం సమాజంతో మమేకం కావటం ద్వారా పొందుతారు. అంటే తోటి పిల్లలతో ఆడు కోవటం, వ్యక్తులతో మసలటం, ఇతరుల్ని గమనించటం, వారిని అనుకరించటం వల్ల ఎక్కువ సంగతులు నేర్చుకుంటారు. మన చెడురాత కొద్ది ఇప్పటి పిల్లలకు అలాంటి అవకాశాలు కురచబడి పోతున్నాయి. అందుకు ప్రధాన కారణం చదువు కోసం కేటాయిం చిన సమయం విపరీతంగా పెరగటం. పిల్లలు చదువు కోసం కేటాయించాల్సిన సమయం ఎప్పుడయితే పెరిగిందో, తోటి పిల్లలతో ఆడు కోవటానికీ, ఇతరులతో మెలగ టానికి కేటాయించాల్సిన సమయంలో కోతపడుతుంది. దీనితో సమాజం నుండి నేర్చుకోవాల్సిన సామాజిక సూత్రాలను కనీసంగా కూడా నేర్చుకోలేరు. పిల్లలు బుర్రనంతా క్లాసు పుస్తకాలతో నింపే చదువులతో చదువేతర సామర్థ్యాలకు సానపెట్టే పని తగ్గుతుంది. దాంతో ఆ సామర్థ్యాలు పెంపు చెందక వృధాపోతాయి. అద్భుతాలు సృష్టించటానికి బిడ్డ మెదడులో ప్రకృతి గూర్చి ఉంచిన మేథో సామర్థ్యాలను గుర్తించకపోవటంవల్ల, గుర్తించినా చదువు పేరుతో వీటిని పట్టించుకోకపోవటంవల్ల ఆ సామర్థ్యాలు అలాగే కాలం కడుపులో కలిసిపోతాయి.

Saturday, November 3, 2012

మెదడు-మనసు-ఆలోచ: తొలి చదువులు-17


03-11-212

మెదడు పని చేసే తీరునే మనసు అంటాము. మెదడుకు మేనుక (ఫిజికల్) రూపం ఉంటుంది కానీ మనసుకు ఉండదు. మెదడు - మనసుల పనిని కంప్యూటరు తో పోల్చ ఒచ్చు. మనకు కంప్యూటరు మేనుక అయిన ‘హార్డు వేరు’ కనిపిస్తుందే తప్ప అందులో పని చేసే ‘సాప్టువేరు’ కనిపించదు. కంప్యూటర్ల మేనుక రూపాలు అన్నీ ఒకటిగానే ఉంటాయి. వాటిలాగే మెదడు మేనుక రూపాలు కూడా చూసేందుకు ఒకటి గానే ఉంటాయి. కంప్యూటరు పని చేసే వేగం, దాని నిలువ శక్తి ప్రతీ కంప్యూటరుకు తేడాగా ఉంటుంది. మెదడు సామర్థ్యము, దాని పని వేగం ప్రతీ మెదడుకు వేరుగా ఉంటాయి. ఇవి తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వస్తాయి.

కంప్యూటరులో కంప్యూటరులో వివిధ ప్రోగ్రాములను కలిపి సమన్వయంగా పని చేయించడానికి ఒక ‘సాప్టువేరు’ కావాలి. దీనినే ‘ఆపరేటింగ్ సిస్టం’ లేదా ‘ఒ.ఎస్’ అంటాము. అంటే విండోను, లినెన్సు, జావా, ఆండ్రాయిడు లాంటివి. కంప్యూటరు పని సామర్థ్యం ఈ ‘ఆపరేటింగ్ సిస్టం’ బలంమీదనే ఆధారపడి ఉంటుంది. ఆపరేటింగు సిస్టం బాగా ఉంటేనే అందులో మనకు అవసరం అయిన అదనపు ప్రోగ్రాముని నింపి వాడుకోగలము. కంప్యూటరు సమర్థవంతంగా పని చేయాలంటే నిర్మాణాత్మకంగా హార్డువేరు అంతా ఏ లోపం లేకుండా ఉండాలి. అప్పుడు దాన్లో నింపే ‘ఆపరేటేంగు సిస్టం’ ప్రకారం కంప్యూటరు పని చేస్తుంది. మనిషి మెదడును పని చేయించే ఆపరేటింగు సిస్టంను కాగ్నిషను అంటారని ఇంతకు ముందు చెప్పు కున్నాము. కంప్యూటర్లలో అయితే ఒ.ఎస్‌ని మనం తయారు చేసి ఎక్కిస్తాము. మనిషి మెదడులో అలా ఎక్కించ లేము. ఎవరి ఆపరేటింగు సిస్టం (కాగ్నిషను)ని వారే తయారు చేసు కోవాలి. అందుకు కావల్సిన దినుసులను సమాజం అందిస్తుంది. అది కూడా భాష ద్వారా అందిస్తుంది. పుట్టుకతో వచ్చే మెదడు సామర్థ్యాన్ని ఉపయోగించుకొని మనం ఏర్పాటు చేసుకొనే కాగ్నిషనుని బట్టి మన మానసిక కార్య కలాపాలు, వాటి చురుకుదనం ఆధార పడి ఉంటుంది.

కాగ్నిషను రూపు దిద్దుకోవటంలో ముందుగా బిడ్డ మెదడు సామర్థ్యానికి భాష జత కావాలి. దానిద్వారా కాగ్నిషను ఎదుగుతుంది. బిడ్డ పెరిగే పరిసరాలు, సామాజిక, ఆర్థిక భౌగోళిక పరిస్థితులు మలుపులు తిప్పుతాయి. అందుకే ఏ ఇద్దరికి ఒకే రకమయిన ఆలోచనా తీరు ఉండదు. చివరకు కవలలుగా పుట్టి ఒకే పరిసరాలలో, ఒకే పరిస్థితుల్లో పెంచిన పిల్లలకు కూడా వారి ఆలోచనా తీరులు వేరు వేరుగా ఉంటాయి. వ్యక్తి కాగ్నిషను అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దానంతట అదే మార్పు (అప్‌డేట్) చెందుతుంది. మనం కావాలని ప్రయత్నించి కూడా మార్పు చేసుకోవచ్చు.

మనిషిలో కాగ్నిటిపు వ్యవస్థ ఏ విధంగా ఏర్పడుతుంది? అనే అంశంమీద ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది లోతుగా పరిశోధనలు చేశారు. వారిలో స్విడ్జర్లాండుకు చెందిన శాస్తవ్రేత్త ‘జీన్’ పియూజె (1896-1980) పరిశోధన చాలా ముఖ్యం అయినది. ఆయన పిల్లల మీద చేసిన పరిశోధనలను ‘జెనిటిక్ ఎపిస్టెమాలజీ’ అనే పేరుతో ప్రపంచానికి తెలియజేశారు. అంటే జీవ పరిణామంలో వేల ఏళ్ళుగా పోగు పడుతూ వారసత్వంగా పొందిన ‘ఆలోచన’ గుణ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా కాగ్నిషనుని కట్టు కుంటారో చెప్పటం అన్న మాట.

బిడ్డలో ఆలోచనా ఎదుగుదల ఒక పద్ధతి ప్రకారం, అంచెలు అంచెలుగా దశల వారీగా జరుగుతుంది. పూర్తి స్థాయి ఆలోచనా వ్యవస్థ తయారు కావాలి అంటే దానికి ముందున్న ప్రతీ దశలోనూ సంపూర్ణత సాధించాలి. ఏ దశలో అయినా ఎదుగుదల కుంటుపడింది అంటే తరువాత దశ మొదలు కావడానికి సరైన పునాది ఉండదు. అందువల్ల మొత్తం ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది. అందులో కీలక దశలు మొదటి పదేళ్ళలో ఉంటుంది. అంటే ప్రాథమిక విద్య పూర్తయ్యే వయస్సు. ఈ పదేళ్ళలో ఏర్పడే కాగ్నిషనే మును ముందు మనిషి ఆలోచనా విధానానికి ప్రవర్తనకూ పునాదిగా ఉంటుంది.

తొలి దశ బిడ్డ పుట్టినప్పటినుంచి రెండేళ్ళ వరకు ఉంటుంది. ఈ దశలో చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ అవయవాలు బాగా పరిణతి పూర్తి అందుబాటులోకి వస్తాయి. మరోపక్క ఒంటి కండరాలు మెదడు అదుపులోకి వస్తాయి. అలాగే ఒంటికీ పంచేంద్రియాలకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది. దీన్ని ‘సెన్సరీ - మోటారు’ దశ అంటారు. బిడ్డ మునుముందు జరపబోయే కార్యకలాపాలకు శరీరం, నాడీ వ్యవస్థ తయారుఅయి ఉండటం అన్న మాట.

రెండో దశలో భాష ఏర్పడటానికి కావాల్సిన వేదిక జోరుగా తయారు అవుతూ ఉంటుంది. రోజూ చూస్తున్న వస్తువులకు, వ్యక్తులకు పేర్లు జోడిస్తూ ఉంటారు. చదువుకి సంబంధించిన అంతవరకు ఇది ఎల్కేజి నుండి రెండవ తరగతి వరకూ ఉండే దశ. ఈ దశలో భాషా పరమయిన పెంపు బాగా ఊపు అందుకుంటుంది. అంటే భాష ఏర్పడటంలో ఇది అత్యంత కీలక దశ అన్నమాట. ఈ దశలో కొత్త భాషను నేర్పించటానికి ప్రయత్నిస్తే అది బిడ్డలో గందరగోళానికి దారితీస్తుంది. అలాంటిది కొత్త భాషలో వేరుగా మొత్తం బోధనే మొదలు పెడితే ఎంత గందరగోళానికి దారితీస్తుందో? ఈ పసి పిల్లలకు ఎంత చిత్ర హింసగా ఉంటుందో పెద్ద వారు అయిన మనం వారి రూపం లోకి మారి అనుభవిస్తే కాని తెలియదు. మూడో దశ 7 నుండి 11 ఏళ్ళ వరకు కొన సాగుతుంది. ఇది పిల్లలు నిలకడ అయిన ఆలోచనలను అలవాటు చేసుకొనే దశ. ప్రతి విషయాన్ని వాస్తవ దృష్టితో చూటానికి అలవాటు పడే దశ. ఒక విషయాన్ని అనేక కోణాల నుండి పరిశీలించటం ఈ దశలోనే వస్తుంది. అంటే పిల్లలు ఇతరుల దృష్టితో కూడా ఆలోచించ గలరు. ఈ దశను ‘ఆపరేషనల్ థింకింగ్’ దశ అంటారు. ఆలోచనల్లో ఒక క్రమ పద్ధతి ఉంటుంది. దేనినీ గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించే తత్వం అలవాటు అవుతుంది.

తొలి దశను వదిలితే తక్కిన రెండు, మూడు దశలు ప్రాథమిక విద్యను నేర్పించే పరిధిలోనివి. అంతే కాకుండా జీవితానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలు పెంపొందే దశలు కూడా. మును ముందు బిడ్డ జరపబోయే ఆలోచనలు ఈ పునాదుల మీదే ఆధార పడి ఉంటాయి.

ఈ పునాదుల కట్టుబడిలో బిడ్డకు సమాజానికి మధ్య వారధిగా ఉండేదే భాష, భాషా వారధి ద్వారానే ఆలోచనా వ్యవస్థ పెంపు చెందుతుంది. భాష ఎల్కేజి మీడియపు బడిలో దొరికినట్టు ‘రెడీమేడు’గా దొరకదు. ఒక పదముతో మొదలు పెట్టి చేవ ఉన్న మేరకు అనంతంగా ఎవరికివారు సాగు చేసు కోవాలి. అంటే తొలుత నేర్చు కోవాలి. తరువాత వాడుకోవాలి.