Saturday, August 18, 2012

క్లాసులో ‘శిక్ష’ణ; తొలి చదువులు -6

                                                                           18-08-2012

పిల్లలు బడికి పోక ముందు ఇచ్చే శిక్షణను ‘నర్సరీ’లేదా ‘ముందు బడి’ (ప్రీ స్కూలు) విద్య అంటారు. చదువుకు ముందు పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల కోసం కలిపించే సామాజిక ఉమ్మడి కార్యక్రమాలు. చంటి పిల్లలు పాఠశాల బోధన కంటే తోటి పిల్లలతో ఆడుకోవటం, అనుకరించటం, మాట్లాడుకోవటం, బొమ్మలు గీసుకోవటం, ఆట వస్తువుల్ని తయారుచేయటం ద్వారా ఎక్కువ వికాసాన్ని పొందుతారు. ఈ కార్యక్రమాలకు ఒక పద్ధతి ప్రకారం చేయించే చోటునే ‘కిండరు గార్డెను’ అంటారు. వీటిని మనం ఎల్కేజీ, యూకేజీలని, రెండింటిని కలిపి కేజి క్లాసులని అంటాం.


మునుపటి రోజుల్లో అయితే మన సమాజానికి ముందుబడి శిక్షణ అవసరం ఉండేది కాదు. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకే ఇంట్లో చాలా మంది పిల్లలు ఉండేవారు. అలాంటి కుటుంబాలతో ఉండే లోగిళ్ళలో బోలెడు మంది పిల్లలు ఉంటారు. కాబట్టి ఏ వయసు పిల్లలు ఆ వయసు వారితో గుంపుగా ఆడుకోవటానికి వెసులుబాటు ఉండేది. భాష ఎదుగుదలకు, సామాజిక కట్టుబాట్లు నేర్చుకోవటానికి (మచ్చుకు ఆట నియమాలు) మానవ సంబంధాలు రూపు దిద్దుకో టానికి ఈ  గుంపు ప్రవర్తనే మూలం.


ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల తావులో చిన్న కుటుంబాలు వచ్చాయి. ఒక కుటుంబంలో ఒకరు ఇద్దరు పిల్లలకు పరిమితం కావటం, తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్థులు కావటం, పిల్లల్ని చూసుకోవటానికి పెద్ద దిక్కు లేక పోవటం, ఇరుగూ పొరుగు కుటుంబాలతో పెద్దగా సంబంధాలు లేక పోవటం లాంటి కారణాలవల్ల పిల్లలు ఆడుకో టానికి, ఇతరులతో కలిసి మెలగ టానికి అవకాశాలు తగ్గి పోయాయి. కాబట్టి ఇప్పుటి పిల్లలకు ఆ లోటు తీర్చటానికి ‘ముందు బడి’ విద్య అక్కర ఉంది.

పిల్లలను బడిలో వేయటానికి ముందు ఇచ్చే ఈ శిక్షణను సరి అయిన రీతిలో, సరి అయిన విధంగా ఇస్తే బిడ్డల ఎదుగుదలకు బాగా ఉపయోగ పడుతుంది. ఇద్దరూ ఉద్యోగం చేసే తల్లిదండ్రులుకు నర్సరీ విద్య కొంత ఊరటను ఇస్తుంది. అంతే కాకుండా పిల్లలు తరువాత బడికి పోవటానికి, చదువును మొదలు పెట్టటానికి ముందు బడి శిక్షణ బాగా ఉపయోగ పడుతుంది.
శాస్ర్తియంగా నడిచే నర్సరీలలో పిల్లలకు ఏమి నేర్పాలి. ఎలా నేర్పాలి, ఎందుకు నేర్పాలి అనే గీటులు, గోటులు ఆయా సమాజాల ప్రభుత్వాలు నిర్దేశిస్తాయి. ఏవో కొన్ని చిన్న తేడాలు తప్ప దాదాపు అన్ని దేశాలలో ముందు బడి శిక్షణలో పిల్లలకు ఇతరులతో మెలిగే విధానాన్ని, స్థానిక సమాజ నియమాలను, నీతిని తెలియ చెప్పటం. వారిలో వున్న తెలివి తేటలను, ఆలోచనా (సృజనాత్మకత) శక్తిని పెంచే కార్యక్రమాలు సిలబసుగా ఉంటుంది.

మన దేశానికి కూడా అలాంటి విధానమే ఒకటి ఉన్నది. పిల్లలకు నర్సరీ విద్యలో ఏయే అంశాలలో శిక్షణ ఇవ్వాలో చెప్పండని ప్రభుత్వం కొన్ని కమిటీలను వేసింది. వాళ్ళు దేశ దేశాలు తిరిగి, అవన్నీ పట్టుకు వచ్చి, వాటి అన్నింటిని కలిపి పెద్ద పుస్తకం తయారు చేసి ‘అలా, ఈ సంగతులు నేర్పండి’ అని చెప్పారు. అనేక అంశాలతో ప్రపంచంలోనే అతి పెద్ద ‘రాత రాజ్యాంగం’ మనకు ఉన్నట్టే, ప్రపంచంలో ఎవరికి లేనన్ని ముందుబడి ఉద్దేశాలను ప్రభుత్వం తయారు చేసింది. అంటే లిఖిత రాజ్యాంగం లాగా చంటి బిడ్డ కోసం లిఖిత ముందుబడి లక్ష్యాలు అన్నమాట. మన రాజ్యాంగం లాగే ఇవీ కూడా అమలుకు నోచుకోవు. రాజ్యాంగాన్ని అప్పుడప్పుడు కోర్టులు అయినా కనీసం గుర్తు చేస్తుంటాయి. వీటిని పట్టించుకొనేది ఎవరు?

నిర్వహణ తీరును బట్టి, నిర్వహించే యాజమాన్యాన్ని బట్టి వీటిని నర్సరీ స్కూళ్ళు, కిండరు గార్డెను, మాంటిసోరి, శిశు మందిరాలు, బాల మందిరాలు లాంటి పేర్లతో ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే ‘పిండిబడి’ కేంద్రాల (అంగనువాడీలు) కూడా ఇవే. ఇక్కడకు వచ్చిన పిల్లలకు తినటానికి మొక్క జొన్న పిండి పెడతారు కాబట్టి జనం వీటిని అలా పిలుచుకుంటారు. ఏ పేరుతో పిలిచినా ఇవి అన్నీ ముందు బడులే. వీటి గురి ఒకటే. బిడ్డని ఇంటిలో నుండి ఉమ్మడి కార్యక్రమం వైపు మళ్లించటం.
ముందు చెప్పినట్లు నర్సరీ చదువు చెప్పే బడి కాదు. ఇక్కడ చెప్పాల్సింది చదువు కాదు. నమూనా తరగతి పద్ధతిని ఇక్కడ పాటించ కూడదు. మూస పోసినట్టు ఉండే సిలబసు అంటూ ఏమీ ఉండదు. ఇది చదవటం, రాయటం, లెక్కలు నేర్పించే కార్యక్రమం కాదు. పరీక్షలు పెట్టటం, మార్కులు ఇచ్చే కార్యక్రమం కాదు. యాంత్రికంగా చెప్పినదల్లా విని బట్టీ పెట్టి నేర్చుకొనే విధానం అంత కంటే కాదు. విధేయతనూ, కఠోర క్రమ శిక్షణనూ ఆశించే విధానంగా ఉండదు.

మొత్తం కార్యక్రమాలన్నీ విద్యార్థి కేంద్రంగా ఉండేటట్లు ముందు బడి పని చేయాలి. పిల్లల వికాసానికి తోడ్పడేటట్లుగా కార్యక్రమాలుం ఉండాలి. సొంత భాష ఎదగనీయటం, సామాజిక నియమాలు తెలియ జేయటం, ఉమ్మడి పనులను అలవాటు చేయటం, వయసుకు లోబడి సమస్యలకు పరిష్కారాలను కనుగొనటాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ విద్యలో అరవటము, తిట్టటము, కొట్టటం లాంటి నేరుగా మందలించే పద్ధతులకు బదులు పరోక్ష నియంత్రణ ఉంటుంది.

కిండరు గార్డెనులో టీచర్లు పిల్లల పనులను పర్యవేక్షించాలే తప్ప తరగతిలో చెప్పినట్టు బోధన ఉండకూడదు. ఈ రెండేళ్ళలో పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే ఆటలు ఆడించడం, ఇతరులతో మెలగాల్సిన పద్ధతుల్ని నేర్పించటం, క్రమశిక్షణను, సహ జీవనాన్ని అలవాటు చేయటం లాంటి విషయాలలో శిక్షణ ఇవ్వాలి. ఈ శిక్షణ కూడా కథలూ, ఆటలూ, లయబద్ధంగా ఉండే పాటలు, బొమ్మలు ద్వారా, కార్యక్రమాల (యాక్టివిటీ) ద్వారా నేర్పించాలి.

భాషకు సంబంధించిన అంత వరకు కిండరు గార్డెను పూర్తయ్యే లోపల స్వంత భాషను ధారాళంగా మాట్లాడ గలగటం (రాయటం, చదవటం కాదు), పదాలను సరిగ్గా తప్పులు లేకుండా పలక గలగాలి. వారు ఉపయోగించే ప్రతి మాటకు అర్థం తెలియాలి. ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయాలు తెలియాలి.

తమాషా ఏమిటంటే మన దేశంలో తప్ప పాశ్చాత్య దేశాలలో కానీ, అభివృద్ధి చెందిన ఇతర దేశాలలో కాని ఈ రోజుకీ కేజి పిల్లలకు చదవటం, రాయటం నేర్పించరు. కానీ మన పరిస్థితి ఏమిటీ? పైన చెప్పినట్టు మనం ఏ కాన్వెంటు బడిలో  అయినా చూడగలమా? కేజీ క్లాసుల్లో కేజీల కొద్ది పుస్తకాలు ఏమిటీ? పరీక్షల పేరుతో శిక్షలు ఏమిటి? ఎల్కేజీలోనే మొత్తం ఇంగ్లీషు, లెక్కలూ, సైన్సు, సోషలు నేర్పించాలని తొందర. అంతటితో ఆగకుండా ఇంటి దగ్గర కూడా ఆడు కోనివ్వకుండా మళ్ళీ హోం వర్కులు. అదేమంటే ఉత్తమ శిక్షణ అలాగే ఉంటుందని వివరణ. భలే దేశం! భలే చదువులు కదూ?

No comments:

Post a Comment