Saturday, August 4, 2012

'బట్టి' విక్ర 'మార్కులు'; తొలి చదువులు -4


04-08-2012

చదువు అర్థం కానప్పుడు బట్టీ సాధనం అవుతుంది. ఇంగ్లీషు మీడియం బడుల్లో భాష మీద పట్టు రాకమునుపే ఆ భాషలో చదువు చెప్పటం వల్ల అర్థం కాదు. అర్థంకాని చదువుతో మార్కులు తెచ్చుకోవాలి అంటే పిల్లలకు బట్టీనే దారి. అర్థం చేసుకుని చదివితే అరగంటలో అయ్యే పాఠానికి బట్టీ పెట్టటం కోసం కొన్ని గంటలు కుస్తీ పడాలి. పైగా బట్టీ పెట్టింది ఎక్కువ కాలం గుర్తుండదు కనుక మళ్ళీ మళ్ళీ దాన్ని తిరగతోడుతూ ఉండాలి ఇందువల్ల చదువుకోసం మామూలుగా వెచ్చించాల్సిన సమయం కంటే అదనపు సమయం కావాలి. దీనితో బుద్ధి వికాసానికి, వ్యక్తిత్వ ఎదుగుదలకు ఉపయోగపడే చదువేతర కార్యక్రమాలకు కోత పడుతుంది. ఇందువల్ల పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోయే నైపుణ్యాలు ఈ తరం పిల్లల్లో పెంపొందటం లేదు. 

కొంతమందిలో పెంపొందినా బడితో సంబంధం లేకుండా వారి తల్లిదండ్రులు తీసుకున్న అదనపు జాగ్రత్తలవల్ల అయి ఉంటుంది. మార్కులతో సంబంధం లేని ఇలాంటి నైపుణ్యాలను నేర్పే తీరికా, అవసరమూ ప్రస్తుత బడులకు లేదు. మార్కులు వస్తున్నాయా లేదా అన్నదే వారికి గీటురాయి. దీంతో బిడ్డలు ఎదిగాక, జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఎదుర్కొనే చేవలేనివారుగా, సామాజిక చైతన్యం లేని చచ్చు తరంగా తయారు  అవుతున్నారు. అందుకనే పాతికేళ్ళకు మునుపు కనీ వినీ ఎరగని ‘‘చదువు ఒత్తిడి’’ అనే గుదిబండ ఇపుడు పిల్లల మెడలో వేలాడుతోంది. 21-టో నూరేడు తొలి అంకం నుంచి పిల్లల్లో మానసిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయని సర్వేలు తెలుపుతున్నాయి. ఇందుకు కారణం చదువూ, దానికి సంబంధించిన ఒత్తిడి. ‘‘విద్యా విధానంలో, బోధనా పద్ధతి, బోధనా భాషలో వచ్చిన మార్పులు పిల్లల్లో ఎక్కువ ఒత్తిడికి కారణం’’ అని శాస్ర్తియ పరికింతలు తెలుపుతున్నాయి.

అసలే మనం ఒత్తిడి యుగంలో ఉన్నాం. అంటే సమాజం మొత్తంమీద ఒత్తిడి ఉంటుంది. సమాజం మీద పడే ఒత్తిడి పిల్లల మీదకు కూడా జారుతుంది. దీనికితోడు గోరుచుట్టు మీద రోకటి పోటులా చదువు ఒత్తిడి అదనంగా వచ్చి చేరటంవల్ల దాని ప్రభావం వారిలో రెట్టింపు అవుతుంది. ఒత్తిడి ఎదుర్కొనే మెళకువలు కానీ, దాని నుండి బయటపడే ఉపశమన పద్ధతులు కాని పసిబిడ్డల్లో అపుడే ఏర్పడి ఉండవు. కాబట్టి వాళ్ళకు వాళ్ళుగా ఒత్తిడి నుండి బయటపడలేరు. ఒత్తిడి ప్రభావం పిల్లల మీద రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పిల్లలు తాము ఒత్తిడికి గురవుతున్నాము అన్న సంగతిని గుర్తించలేరు, కానీ దానివల్ల కలిగే భయం, ఆందోళనల్ని అనుభవిస్తూ ఉంటారు. అయినా దాన్ని బయటికి చెప్పలేరు. రెండోది, పిల్లలు ఎంత తెలివిగలవాళ్ళు అయినప్పటికీ, ఒత్తిడిలో ఉంటే అది నేర్చుకొనేదారికి అడ్డుగా నిలుస్తుంది. అందువల్ల చదువు మందగిస్తుంది. దీనివల్ల తెలివి ఉన్నా పిల్లల్లో చదువు అంటే ఆసక్తి కోల్పోయి, మరతనం (మెకానికల్) చోటుచేసుకుంటుంది. ఫలితంగా బిడ్డలో దాగి వున్న ప్రతిభ విరబూయటం మందగిస్తుంది. కొందరు అయితే చదువు పట్ల వ్యతిరేకత ఏర్పరుచుకొని పక్కదారులు పట్టే అవకాశం ఉంది. అందుకే పిల్లల్ని ఒత్తిడికి దూరంగా ఉంచాలి. ఒత్తిడిలేని చదువుని మనం బిడ్డలకు అందించాలి. కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏమిటి? తగిన వయస్సు రాకముందే, భాష రాక మునుపే పరాయి భాషలో చదువును నాటడానికి ప్రయత్నించటంవల్ల అసలు ఎదుగుదలే మందగిస్తోంది. 

సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని బోధనా పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీనివల్ల పిల్లలకు పాఠాలు సులభంగా అర్థం అవుతాయి. గతంలో ఎగువ తరగతుల్లో కానీ అర్థం అయ్యే పాఠాలను నేడు దిగువ తరగతి పిల్లలు సయితం బాగా అర్థం చేసుకోగలిగిన పరిస్థితి ఉంది. పరమాణు నిర్మాణం, జెనెటిక్సు లాంటి అతి కష్టమయిన అంశాలను కూడా 5దో తరగతి పిల్లలకు అలవోకగా అర్థం అయ్యేలా చెప్పే బోధనా ఉపకరణలు ఇపుడు వాడుతున్నాము. అలాంటప్పుడు చదువు చాలా సుళువు కావాలి, విద్యా ప్రమాణాలు పెరగాలి, నాణ్యత పెరగాలి. ఆ మేరకు చదువు కోసం కేటాయించాల్సిన సమయం తగ్గాలి, బట్టీ విధానానికి ముగింపు పలకాలి. కానీ నిజానికి జరుగుతున్నది ఏమిటి? చదువు గంటలు పెరిగాయి. ఎందుకు పెరిగాయి? బట్టీ ఎందుకు పెట్టాలి? చదువు అర్థం కాక! ఎందుకు అర్థంకావటంలేదూ? ఇంగ్లీషు సరిగా రాక! ఇంగ్లీషు మీడియంలో చదివినా ఇంగ్లీషు ఎందుకు రావటం లేదూ? సొంత భాష ఎదగకముందే, రాని భాషలో మొదలుపెట్టటంవల్ల. ఒక మొక్క ఎదిగేటపుడు దాని పక్క మరో మొక్క ఉంటే కావాల్సిన మొక్క సరిగా ఎదగదు. కాబట్టే రైతు ‘కలుపు’తీస్తాడు. లేత వయసులో ఎదగాల్సిన భాషను వదిలి కలుపు భాష పెరగటానికి ఎరువులు వేస్తున్నాము. ఇందువల్ల ఏ భాషా సరిగా ఎదగదు. భాష మీద పట్టు లేకపోతే చదువు మీద పట్టురాదు. చదువుమీద పట్టు వచ్చినట్టు అనిపించాలి అంటే ఉన్న ఒకే ఒక అడ్డదారి బట్టీ. బట్టీకోసం ఎక్కువ కష్టపడాలి. బట్టీకోసం ఎక్కువ సమయం కావాలి. 
కాబట్టే పిల్లలు ‘బట్టి’కొట్టి ‘మార్కులు’ తెచ్చే బట్టివిక్రమార్కుల అవతారం ఎత్తుతున్నారు. అర్థం కాని చదువు శవాన్ని పదే పదే మెదడులోకి దించటానికి ప్రయత్నించటం. దిగిన వెంటనే అది మెదడులోనుండి మాయం కావటం. ఏడాది పొడుగునా పిల్లలకు ఈ జంజాటానికే సమయంచాలటం లేదు. ఇక మనిషిగా ఎదగటానికి సమయం ఎక్కడ?

1 comment:

  1. చక్కటి పోస్ట్.
    ఎంతోమంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఈ ఇంగ్లీష్ మీడియం చదువులతో కుస్తీ పట్టలేక నలిగిపోతున్నారు. నేను కూడా ఒకప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియంతో ఎన్నో కష్టాలు అనుభవించాను. మన దురదృష్టం వల్ల ఈ రోజుల్లో ఇంగ్లీష్ అవసరం కాబట్టి , కొద్దిగా నేర్చుకున్నాను.

    మాతృభాషలో చదుకోవటం వల్ల చాలా శ్రమ తగ్గుతుంది. మేధాశక్తి పెరుగుతుంది. ఇతరభాషలలో చదవటం వల్ల మెదడు ఎక్కువగా అలసిపోయి మేధోశక్తి మొద్దుబారిపోతుంది. మన దురదృష్టం వల్ల ఎవరూ ఈ విషయాలను పట్టించుకోవటం లేదు.

    ఎన్నో దేశాల్లో పిల్లలు తమ మాతృభాషలోనే చదువుకుంటూ అభివృద్ధిని సాధిస్తుంటే , ..... పరాయి భాషలకు ఎగబడటం, పరాయిభాషలో చదువుకుంటేనే బ్రతకగలం అనుకోవటం ఇక్కడి వాళ్ళ దౌర్భాగ్యం.

    ReplyDelete