30-12-2012
అశాస్ర్తియం అయినది అని తెలిసినా, ఫలితాలు రావని తెలిసినా అంతో ఇంతో ఆలోచనాపరులు కూడా ఇంగ్లీషు మీడియం వారగా మొగ్గు చూపటానికి కూడా కారణాలు చూడాల్సి ఉంటుంది. తెలుగులో చదువు చెప్పే బడులు దాదాపు ప్రభుత్వానివి లేదా ‘ఎయిడెడ్’ రంగంలోనివి. అలాంటి బడుల్లో తెలుగులో చదివే పిల్లల సాధక బాధలు, వారి విద్యా ప్రమాణాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాల్సిన అవసరం ఉంది. దీనికి మనం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. స్వయంగా ప్రభుత్వం చేయించిన సర్వేలు, వారు అధికారికంగా మద్రవేసి వదిలిన లెక్కలను పరికించి చూస్తే సరిపోతుంది.
వౌలిక సదుపాయాలకు సంబంధించిన అంత వరకు ప్రభుత్వపు బడులు లేని గ్రామాలు వేల సంఖ్యలో ఉన్నాయి. బడి ఉన్నా సరి అయిన తరగతి గదులు ఉండవు, చాలా బడుల్లో ఒక గది లోనే రెండు మూడు తరగతుల పిల్లలను కూర్చోబెట్టి చదువు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నల్ల బల్లలు, చాకుపీసులు, డస్టర్లు ఉండవు. 19 శాతం బడుల్లో అయిదు తరగతులకు కలిపి ఒకే ఒక అయ్యవారు ఉన్నారు. మంచినీరు, మరుగుడ్లు, కరెంటు సౌకర్యాల సంగతి గురించి చెప్పాల్సిన పనే లేదు.
ఇక ప్రభుత్వం బడుల్లో ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిన వివరణ ఇది.
‘‘జాతీయ స్థాయిలో జరిగిన సర్వే ఫలితాలను బట్టి చూస్తే మన రాష్ట్రంలో ఐదో తరగతి పూర్తి అయిన పిల్లల్లో కనీసం చదవటం, రాయటం, కూడికలు, తీసి వేతలు, గుణింతాలు, భాగాహారం వంటి నాలుగు రకాల ప్రక్రియలు చేయగలిగిన వారి సంఖ్య కేవలం నూటికి 40 మంది మాత్రమే. అంటే మిగిలిన 60 మంది పిల్లల పరిస్థితి ఏమిటి? ఈ పిల్లలు ఎగువ తరగతుల్లో చేరితే నేర్చుకునేది ఏమిటి? వీరు అంతా చదువులో వెనుకపడితే ఎగువ చదువుల కోసం బడుల్లో కొనసాగుతారా? ఒక వేళ కొన సాగినా చదువు మొత్తంలో ఇమడగలరా? వీరిలో మనం ఆశించిన సామర్థ్యాలను చూడలేమా? దీనికి బాధ్యులు ఎవరు?
ఈ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాల్సి ఉంది. జాతీయ స్థాయి సర్వే ఫలితాలలోని వాస్తవికత గురించి, మన పాఠశాల ల్లోని పిల్లల విద్యా నాణ్యతను పరిశీలించడానికి ఒక ఉపాధ్యాయ బృందం ఈ మధ్య కాలం లోనే కొన్ని పాఠశాలలకు వెళ్ళింది. పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల పిల్లలను, వారి పేర్లను, వారి తల్లిదండ్రుల పేర్లను, ఉపాధ్యాయుల పేర్లను, వారికి ఇష్టమైన వాటి పేర్లను రాయ మన్నారు. అలాగే తమకు ఇష్టమయిన దాని గురించి కొన్ని వాక్యాలు రాయమన్నారు. గణితంలో సంఖ్యల గురించి, చతుర్విధ ప్రక్రియల గురించి, ఏదైనా ఒక ప్రక్రియకు చెందిన రాత లెక్క ఇచ్చి, సాధించమని కోరారు. దీని ఫలితాలు, అనుభవాలు చాలా ఘోరంగా ఉన్నాయి.
50 శాతం విద్యార్థులు ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలను అర్థం చేసు కోలేక పోతున్నారు. 3వ తరగతిలో 75 శాతం విద్యార్థులు సరళ పదాలను కూడా చదవలేక పోతున్నారు. 90 శాతం విద్యార్థులు సరళ పదాలను సైతం రాయలేకపోతున్నారు. 4వ తరగతిలో 65 శాతం విద్యార్థులు సరళ పదాలను చదవలేకపోతున్నారు. 80 శాతం విద్యార్థులు సరళ పదాలను రాయలేక పోతున్నారు. 5వ తరగతిలో 53 శాతం విద్యార్థులకు సంఖ్యాభావనలపై అవగాహన లేదు. 25 శాతం విద్యార్థులకు కూడికల పట్ల అవగాహన లేదు. 85 శాతం మంది విద్యార్థులు రాత లెక్కలు చదివి అర్థం చేసుకొని చెయ్యలేక పోతున్నారు’’. ఇది చదివాక బాధ్యతగల తెలుగు వాడికి ఎవరికి అయినా నోట మాట వస్తుందా?
అర్థం కానిదీ, అబ్బురపరచే సంగతి ఏమిటి అంటే, ప్రభుత్వ బడుల్లో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ నూటికి నూరుపాళ్ళు బోధనలో శిక్షణ ఇవ్వటానికి తగిట (క్వాలిఫైడ్) పొందిన వారు. దిగువ తరగతులకు డి.ఎడ్, ఎగువ తరగతులకు బి.ఎడ్ చదివినవారు. వీరు స్థాయిని బట్టి బేసిక్ చదువుకు అదనంగా పిల్లలకు చదువు చెప్పటానికి కావలసిన నేర్పులను, మెళకువలను చదివినవారు. పిల్లల సైకాలజి, బోధనా పద్ధతులు, దానిలోని మెళకువలు ఒంట పట్టించుకున్నవారు. అందులో పరీక్షలు రాసి డిగ్రీలు పొందినవారు. అంతేనా అవికాక తిరిగి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించటానికి మళ్లీ పరీక్షలు రాసిన వారు. మరి ఇంతటి తగిట ఉన్న ప్రభుత్వ అయ్యవార్లు చెప్పే చదువు ఎందుకు ఇంత నాసీ రకంగా తయారు అయిందీ?
మరోప్రక్క ప్రయివేటు బడుల్లో చదువు చెప్పే టీచర్లు నూటికి 90 నుండి 95 మంది ఏ తగిట (క్వాలిఫికేషన్) లేనివారు. ప్రాథమిక విద్యకు సంబంధించి ప్రయివేటు బడుల్లో చదువు చెప్పేవారి చదువు తగిట పదో తరగతి. మహా అంటే ఇంటరు. కాస్త పెద్ద నగరాలలో అయితే డిగ్రి. అంతే. ఇంకా తమాషా ఏమిటి అంటే ప్రయివేటు ఇంగ్లీషు మీడియం బడుల్లో ప్రాథమిక స్థాయిలో చదువు చెప్పే టీచర్లకు ఇంగ్లీషుపట్ల అవగాహన లేదు. వీరిలో కనీసం పట్టుమని పది శాతం మంది ఇంగ్లీషు న్యూస్ పేపరులో ఒక వార్త చదివి అర్థం చేసుకోలేనివారు.
చేసేది వైద్యమే అయినా తగిట ఉన్న డాక్టరు చేసే వైద్యానికి, కాంపౌండరు చేసే వైద్యానికి స్పష్టంగా తేడా ఉంటుంది. ఇద్దరూ కట్టేది ఇళ్ళే అయినా ఇంజనీరు ప్లానుతో కట్టిన ఇంటికీ, తాపీమేస్ర్తి ఆలోచనతో కట్టిన ఇంటికి తేడా ఉంటుంది. డాక్టర్లు, ఇంజనీర్లు ఆయా రంగాలలో ప్రత్యేక శిక్షణ పొందీ, నైపుణ్యం సాధించి, ఆయా వృత్తుల్లో పని చేయటానికి తగిట సంపాదించిన వాళ్ళు. అందువల్ల వాళ్ళు చేసే పనుల్లో నాణ్యత అత్యంత ఎక్కువగా ఉంటుంది, ఉండాలి, ఉండి తీరాలి. కాని విద్యా బోధనకు వచ్చేసరికి దానికి విరుద్ధంగా ఉంటుంది. నూటికి నూరు పాళ్ళు తగిట పొందిన టీచర్లు ఉన్న ప్రభుత్వ, ఎయిడెడు బడుల్లో విద్యా ప్రమాణాలు అత్యంత దారుణంగా కొడిగట్టి ఉంటున్నాయి. ఏ తగిటా లేని వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు బోధించే ప్రైవేటు బడుల్లో మట్టుకు ప్రమాణాలు ఎక్కువ ఉన్నట్టు కనబడుతున్నాయి. మనం ఎలా అర్థం చేసు కోవాలి? ఎవరిని నిందించాలి??