7 సెప్టెంబర్ 2012
తొలి చదువులు-13
పిల్లలకు చదువు ఏ భాషలో చెబితే బాగా అర్థం అవుతుందో అనేది (అందరికీ తెలిసిన సంగతినే) నిరూపించటానికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల శాస్ర్తియ పరిశోధనలు జరిగాయి. వాటిల్లో అంతర్జాతీయ ప్రాధాన్యతను పొందిన కొన్ని పరిశోధనలను పరికించి చూద్దాము.
ప్రపంచ బ్యాంకు అధ్యయనం
తొలి చదువును బిడ్డల సొంతభాషలో చెప్పినప్పుడు, అదేపనిగా నేర్పించిన రెండో భాషలో చెప్పినపుడు - దేని ప్రభావం ఎలా ఉంటుంది అన్న సంగతిని ప్రపంచ బ్యాంకు తెలుసుకోవాలి అనుకుంది. దాని కోసం ఓ అంతర్జాతీయ సమీక్షా అధ్యయనాన్ని (Dutcher 1994) నిర్వహించారు. ఈ అధ్యయనాన్ని మూడు వేరు వేరు ప్రత్యేక నేపథ్యాలున్న దేశాలలో జరిపారు. తమ సొంత భాషను విరివిసమాచారం (వైడ్ కమ్యూనికేషన్) కోసం అసలు వాడని (హైతి, నైజీరియా) దేశాలు, పాక్షికంగా వాడే (గాటిమాల లాంటి) దేశాలు, పూర్తిగా వాడే (కెనడా, న్యూజిలాండు, అమెరికా) దేశాలలో విడివిడిగా చేశారు. ఈ అధ్యయన ఫలితాలు ఇలా ఉన్నాయి.
- బోధనా భాష మీద పట్టు ఉన్న విద్యార్థులు చదువులో బాగా రాణిస్తున్నారు.
- బోధనా భాష మీద పట్టు రావటానికి నాలుగు నుంచి ఏడు ఏళ్ళు పడుతుంది.
- మది ఎదుగుదల (కాగ్నీషను), ‘సబ్జక్టు’ల నైపుణ్యాలు విద్యార్థికి పట్టు ఉన్న భాషలోనే ఎక్కువగా ఉన్నాయి.
- తొలినాళ్లలో సొంత భాషలో పొందిన శిక్షణ అంతా ఆ తరువాత నేర్చుకొనే రెండో భాషలోకి మార్పిడి జరుగుతుంది.
- సొంత భాష మీద ఎంత పట్టు ఉంటే అంత బాగా రెండో భాషను నేర్చుకుంటారు.
- నేర్చుకొనే రెండవ భాష స్వచ్ఛత, వేగం ఆ సమాజపు పోకడలు, సంస్కృతి, వసతులు నిర్ణయిస్తాయి.
ఈ ఫలితాలను ఆనింపుగా చేసుకొని విద్యార్థుల్లో దాగి ఉన్న తెలివి చేవను వెలికితీసి ప్రతిభగా మార్చేందుకు ఉన్నదాన్నంతా ఉపయోగం లోకి తెచ్చేందుకు కొన్ని సాధారణ పాటింపులను సూచించారు. (పూర్తి వివరాలకు www.cal.org లో ఛూడవచ్చు)
- పరాయి భాషను బోధనా భాషగా ఎన్నుకోవాలి అంటే, ఆ భాష మీద ప్రావీణ్యం రావాలి. అందుకుగాను ముందు సొంత భాషను బాగా ఎదగనివ్వాలి. కాని - ఇక్కడ మనం అణచివేస్తున్నాం.
- నేర్చుకొనే రెండో భాష ఎదుగుదలలో తల్లిదండ్రులను, సమాజాన్ని భాగస్వాములుగా చేయాలి. - మనకు సొంత భాష విషయంలో ఇది జరుగుతుంది. ఇంగ్లీషుకు ఈ రెండూ లేవు.
- భాషను బోధించే ఉపాధ్యాయులు దీన్ని అత్యంత చాకచక్యంగా నేర్పించే నేర్పును కలిగి ఉండాలి. దాన్ని నిరంతరం మెరుగుపరచుకుంటూ ఉండాలి. - మన టీచర్లు అందరూ దాదాపు ఇంగ్లీషు సరిగా రాని పదో తరగతి / ఇంటరు చదివినవాళ్లు.
బ్రిటన్ ప్రభుత్వం అధ్యయనం:
బ్రిటను ప్రభుత్వం 2,200 మైనారిటీ తెగలకు చెందిన విద్యార్థులకు పాక్షికంగా వారి సొంత భాషలో చదువు చెప్పటం మొదలు పెట్టింది. సాధారణ విద్య తోపాటు మిగతా సమయంలో ఎవరి సొంత భాషలో వాళ్ళకు అదే సిలబసును తిరిగి బోధిస్తారు. వీటివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఈ నిర్ణయం తీసుకోవటానికి బ్రిటీషు ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఇవి.విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సంకల్పం పెరిగాయి. అలాగే సామాజిక నైపుణ్యాలు పెరిగాయి.ఇలా చేశాక వారు గతంలో కంటే ఎక్కువ ప్రతిభను కనపరిచారు. జార్జి మాసన్ అధ్యయనం: జార్జి మాసన్ యూనివర్సిటీకి చెందిన ‘వర్జీనియా పి.కొల్లియర్’ తదితరులు వలస పిల్లలకు ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం మీద ఒక పరిశోధన చేశారు.
అమెరికాలో బోధనా భాష ఇంగ్లీషు. ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారి పిల్లలు కూడా ఇంగ్లీషు మీడియంలో చదవాలి. అమెరికా బడుల్లోకి రావడానికి మునుపు సొంత దేశంలో రెండు మూడేళ్ళు తమ భాషలో చదివిన పిల్లలు 5 నుండి 7 సంవత్సరాలలో అమెరికా పిల్లలతో దీటుగా ఇంగ్లీషు మీద పట్టు సంపాదించగా, తమ సొంత భాషలో చదవని వారికి ఇంగ్లీషు మీద పట్టు రావడానికి 7 నుండి 11 లేదా ఇంకా ఎక్కువ కాలం పట్టింది. ప్రఖ్యాత భాషా శాస్తవ్రేత్త ‘కుమ్మిన్స్’ అంతకు ముందే (1981) పరిశోధన చేసి ఇదే విషయాలను తేల్చాడు. కొల్లియర్ తదితరులు చేసిన ప్రయోగాలలో కూడా కుమ్మిన్స్ ఫలితాలను పోలి ఉన్నాయి. ఈ పరిశోధన మొత్తం సారం ఏమిటంటే, ఎవరికి అయితే సొంత భాషలో బాగా పట్టు ఉంటుందో ఆ పిల్లలు చాలా వేగంగా ఏ భాషను అయినా తొందరగా నేర్చుకుంటారు అనేది.
ఇదే యూనివర్సిటీ ఆధ్వర్యంలో మరో పెద్ద పరిశోధన జరిగింది. ఇందులో 15 రాష్ట్రాలలో 23 పాఠశాలల్లో 11 ఏళ్ళపాటు సొంత భాషలో ప్రాథమిక విద్య మీద పరిశోధన నిర్వహించారు. ఇందులో ఆంగ్లంలో బోధించిన పాఠాలను తిరిగి వాళ్ల తల్లి భాషలో కూడా బోధించారు. తర్వాత ఫలితాలను విడమరచి చూస్తే పాక్షికంగా అయినా సరే తల్లి భాషలో బోధన జరిపిన పిల్లలు ఎక్కువ ప్రతిభను కనపరచడం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.
మీరు ఒక పరాయి భాష గురించే మాట్లాడుతున్నారు.. కాని ఇప్పుడు ఒకటవ తరగతి నుండే ఇంగ్లీష్ తో బాటుగా హిందీ కూడా రుద్దే ప్రయత్నం మొదలయింది.. ఇదెంత వరకు సమర్ధనీయమో నాకు తెలియడం లేదు... పైగా హిందీనీ ఇంగ్లీష్ ద్వారా నేర్పిస్తున్నారు. కొన్ని ఇంగ్లిష్ పదాలకి మాతృ భాషలో అర్ధమే తెలియనప్పుడు దాన్ని హిందీలో ఏమంటారో తెలుసుకోవలసిన అగత్యం ఉందా? మేధావులు దీన్నిగురించి ఆలోచించాలి.
ReplyDeleteశాస్త్రీయంగా అయితే 5-దో తరగతి వరకు తల్లి భాషలో తప్ప మరే ఇతర భాషలోనూ చదువు చెప్పకూదదు. అది హిందీనా, ఇంగ్లిషా అని కాదు.తమాషా ఏమిటంటె హిందీని జాతీయ భాష అని మనం నెత్తిన పెట్టుకుంటున్నాము కానీ అది జాతీయ భాష కాదు. అన్ని జాతీయ భాషల్లో ఒకటి మత్తరమే. త్రిభాష సూత్రం ప్రకారం ఉత్తరది వారు అంతా ఏదో ఒక దక్షణాది భాషను చదవాలి. ఇది ఎక్కదయినా జరుగుతుందా?
ReplyDelete