27-10-2012
మనసు - అంటే మెదడు పని చేసే విధానమే. చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు, సందర్భం, సంఘటనలకు మనసు స్పందిస్తుంది. అలా స్పందించటం దాని నయిజం. మనసు తత్వం ఎలాంటిది అయినా అది పని చేసే తీరు, తంతు అందరిలో ఒకే రకంగా ఉంటుంది. మనసు చేసే ముఖ్యమయిన పని తనువును పరిసరాలతో సమన్వయ పరచటం. మనసు తరపున ఈ పని చేసి పెట్టేది ‘ఆలోచన’. అంటే ఆలోచన అనేది మనసుకు చెందిన ముఖ్య కార్య నిర్వహణ అధికారి అన్న మాట. మనసుకు నమ్మిన బంటు అయిన కాగ్నిషను ఏ పనిని అయినా
- ‘ప్రేరణ’ (Stimulation)
- ‘అనిపింపు’(Feeling )
- ‘పని’ (Conation)
అనే మూడు అంచె లలో చేస్తుంది. మచ్చుకు ‘‘ఒక వ్యక్తి పామును చూసి భయపడి దూరంగా పరిగెత్తాడు’’ అనుకుందాం. అక్కడ కాగ్నిషను పని చేసే విధానం ‘ప్రేరణ-అనిపింపు-పని’ అనే మూడు అంచెల్లో జరుగుతుంది. పాము అనేది పరిసరాలలో ఉన్న ఒక మేనుక (బౌతిక) రూపం. ఆ మేనుక ‘ప్రేరణ’గా పనిచేసి అది కరిస్తే చని పోతారని అంతకు ముందే మనసులో నాటుకు పోయి ఉన్న నమ్మకాన్ని కదిలించింది. దాంతో భయం అనే ‘అనిపింపు’ (ఫీలింగు) పుట్టి, ప్రమాదం నుండి కాపాడు కోవటానికి దూరంగా పరుగు తీయటము అనే ‘పని’ (కొనేషను) జరిగింది.
పామును చూసిన క్షణం నుండి ఇక్కడ జరిగిన తతంగాన్ని అంతా నడిపింది ఆ వ్యక్తి మనసులో ఉన్న ‘ఆలోచన’. మనసు పనిలో దాదాపు 90 పాళ్ళు ‘ఆలోచన’దే. దీనినే శాస్త్ర పరి భాషలో ‘కాగ్నిషన్’ (cognition) అంటారు. ఇది మనసులో దండలో దారంలా ఉండి బయటకు కనపడదు. మనసు చేసే అన్ని మానసిక కార్య కలాపాలకు ఆలోచనే కేంద్ర బిందువు. ఒక రకంగా చెప్పాలి అంటే మనసుకు మరో రూపం ఆలోచన. ఒక సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా మసలటానికి కారణం వారి ఆలోచనా పునాదులే. వ్యక్తి ప్రవర్తన ఎవరికివారు కట్టుకున్న ఆలోచనా విధానానికి లోబడి ఉంటుంది. అంటే వారి కాగ్నిషన్ని బట్టి ఉంటుంది.
‘ఆలోచనా వ్యవస్థ’ (కాగ్నిటివు సిస్టం) మనిషికి పుట్టుకతో ఉండదు. దాన్ని కట్టుకొనే చేవ మట్టుకే పుట్టుకతో వస్తుంది. పుట్టాక ఏ బిడ్డకు ఆ బిడ్డ దాన్ని తయారు చేసుకోవాలి. పుట్టిన మరుక్షణం నుంచి వచ్చే అనుభవాలను ఉపయోగించు కొని ఆలోచనా వ్యవస్థను కట్టుకోవాలి. ఈ కట్టు బడికి ఇటుకల లాంటివి మాటలు. అంటే కాగ్నిషను రూపు దిద్దు కోవటం అనేది భాష పునాది మీద జరుగు తుంది. భాష ఎదిగే కొద్ది ఆలోచన పరిధి పెరుగు తుంది. వాటి నుండి నమ్మకాలు ఏర్పడతాయి.
నిజమా కాదా అన్న దానితో సంబంధం లేకుండా నమ్మకాలు ఏర్పడటము, మంచి చెడులతో సంబంధం లేకుండా అభిప్రాయాలు రూపొందించు కోవటం, నైతికమా అనైతికమా అనే దానితో సంబంధం లేకుండా విలువలు పాటించటము అనేవి ఆలోచనా వ్యవస్థ కట్టుబడి మీదే ఆధారపడి ఉంటుంది. బిడ్డలు పెరుగుతున్న సామాజిక పరిసరాలనుండి, మేనుక ప్రేరణల నుండి పొందే సమాచారంతో తమది అయిన ఒక కాగ్నిషన్ని కట్టు కుంటారు. కుటుంబ ఆచారాలు, సమాజపు కట్టుబాట్లు, మనం అందించే శిక్షణ మొదలయినవి అన్నీ పిల్లల కాగ్నిషను రూపు దిద్దు కోవటంలో పాలు పంచుకుంటాయి. కాగ్నిషను దన్నుగా పిల్లవాడి ప్రవర్తన ఉంటుంది. బిడ్డల్లో పుట్టుకతో లేని ఆలోచన వ్యవస్థ పురుడు పోసు కోవాలంటే దానికి ముందు బయిటి సమాచారాన్ని మెదడుకు చేర వేసే ఇంద్రియాలు అయిన చూపు, వినికిడి బాగా పని చేస్తూ ఉండి ఉండాలి. చూపు, వినికిడి లోపంతో పుట్టిన పిల్లలకు తీవ్రతను బట్టి వారి ‘కాగ్నిషను’లో కూడా లోటు ఉంటుంది.
మానవులు ఉపయోగించే భాష ఏది అయినా ఉపయోగించేటప్పుడు అది రెండు పనులు చేస్తుంది. ఒకటి ‘మాట భాష’ (కమ్యూనికేషన్)గా, రెండోది ‘ఆలోచనా భాష’ (కాగ్నిటివ్)గా. మాట భాష అంటే జీవితంలో రోజు వారీ అవసరాల కోసం మాట్లాడుకొనే భాష. మాట్లాడేటప్పుడు వాడే పదాలు, వాటి అర్థాలు, ఉచ్చారణ, ధ్వని స్థాయి, వ్యాకరణం మొదలైనవి అన్నీ ఇందులో భాగం. పిల్లల్లో మొట్ట మొదటిగా ఏర్పడేది ఈ భాషే.
ఆలోచనా భాష అంటే నమ్మకాలు ఏర్పరచు కోవటానికి, మంచీ చెడు ఆలోచించటానికి, విజ్ఞానాన్ని నేర్చు కోవటానికి, విద్యా బోధనకు, సాహిత్య ప్రక్రియలకు ఉపయోగ పడే భాష. ఇది పుట్టుకతో రాదు. ‘మాట భాష’ భాష పెంపు చెందే కొద్దీ, దానిలోని మాటలను, భావాలను తీసుకొని ఆలోచనా భాష కట్టుబడి జరుగుతూ ఉంటుంది. ఏ కట్టడానికి అయినా పునాదులు ముఖ్యం. బిడ్డ ఏ లోపం లేకుండా, పుట్టి, ఎదుగుదల సరిగా ఉన్నట్టు అయితే ఆలోచన వ్యవస్థకు రహదారి భాష. పిల్లల్లో ఇది భాష తోనే మొదలు అయి, భాష ద్వారా జరుగుతూ, భాష తోపాటే పెరుగుతూ 18 ఏళ్ళకు ముగుస్తుంది. ఆ లెక్కన లేత వయసులో భాష పునాదులు ఎంత గట్టిగా ఉంటే ఆ మేరకు ఆలోచన కట్టుబడి కూడా అంతే గట్టిగా ఉంటుంది. ఒకసారి ఆలోచన నిర్మాణాన్ని బలంగా కట్టాక వ్యక్తి అవసరాలకు అనుగుణంగా దాన్ని ఎప్పుడు అయినా మార్చుకోవచ్చు.
సమకాలిక ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లను, సమాజ పోకడల్ని గీటు రాయిగా తీసు కున్నప్పుడు బలమయిన కాగ్నిషను ఏర్పరచుకున్న వ్యక్తులు వారి వారి ఆలోచనా విధానంలో స్థిరంగా ఉంటారు. అలా కానప్పుడు చిన్న చిన్న వత్తుడులకు కూడా తట్టు కోలేరు. ఇలాంటి వారు ఒత్తిడికి గురి అయినప్పుడు డొల్లలాగా ఉన్న వారి ఆలోచనా వ్యవస్థ సుళువుగా చెదిరి పోతుంది. దానితో వ్యక్తి మానసిక రుగ్మతలకు లోను అవుతాడు.
లేత వయసులో సొంత భాష ఎదగకుండా చేయటం అంటే వారి ఆలోచనా భాషను ఎదగనీయకుండా ఆపటం అవుతుంది. పటిష్టంగా ఉండాల్సిన ఆలోచనా భాష బోలుగా ఉండటం వల్ల దానిమీద ఆధారపడి కట్టుకొనే కాగ్నిషను కూడా పునాదులు లేని మేడగానే ఉంటుంది. సొంత భాష అదిమి దాని చోటులోనే నేర్చుకొనే మాట భాష ఎప్పటికీ మాట భాషే. అది వ్యక్తి కట్టుబడిలో ఏ మాత్రం పాలు పంచు కోలేదు. అదే సొంత భాష బాగా ఎదిగాక నేర్చుకొనే ఏ ఇతర భాష అయినా ఆ వ్యక్తిత్వానికి అలంకారంగా మారగలదు