Saturday, July 21, 2012

గొర్రెదాటు పోకడలు; తొలి చదువులు -2


22-7-2012

గతంలో పిల్లలు పది పాసు అయ్యాక చదువులో వారి సమర్థతను బట్టి ఇంటరులో ఏ గ్రూపు తీసుకోవాలో నిర్ణయం తీసుకునేవారు. పిల్లలకు అప్పటికి 15 ఏళ్ళు నిండి ఉంటాయి. ముందు జీవితాన్ని గమనంలో ఉంచుకొని ఆలోచించగల కనీస మానసిక వికాసం వారికి ఆ వయసులో ఉంటుంది. కాబట్టి ఉన్న సమర్థతకు తమ ఇష్టాన్ని కూడా కలుపుకొని గ్రూపును ఎన్నుకొనేవారు. తల్లిదండ్రులు మహా అంటే అవసరం అయిన సలహాలను, సమాచారాన్ని మట్టుకే అందించేవారు. ఇది పోయిన కాలం.

నేడు మన రాష్ట్రంలో నడుస్తున్నది ఐ.ఐ.టీ., మెడికలు ఫౌండేషను సంస్కృతి. అంటే ఎనిమిదో తరగతి నుంచే ఐఐటిలలో, మెడికలు కాలేజీలలో సీటు కొట్టటమే గురిగా ‘పునాది’ (్ఫండేషన్) కోర్సులను మెదడులోకి చొప్పించే చదువు అన్నమాట. ఈ బాపతు స్కూళ్ళు వచ్చాక భవిష్యత్తులో బిడ్డ చదవాల్సింది ఐ.ఐ.టి లేదా మెడిసిను అనీ 8-దో తరగతిలోనే తల్లిదండ్రులు నిర్ణయించేసేస్తారు. బిడ్డ తన ఇష్టాన్ని తెలుసుకొనే ఈడు రాకుండానే ఏ గ్రూపును చదవాలో ముందుగానే నిర్ణయం జరిగిపోతుంది. ఇక పిల్లవాడి నిర్ణయం మారటానికి లేదు.
ఇపుడు ఆ పోకడ ఇంకా కాస్త ముదిరి కొన్ని విద్యా సంస్థలు 6-రో తరగతిలోనే ఐఐటీ, మెడికలు పునాది కోర్సులు మొదలుపెట్టాయి. ఈ బడులు ‘ఈ-టెక్నో’ స్కూళ్ళు, ‘నానో’ స్కూళ్ళు, ‘ఒలింపియాడులు’, ‘గ్లోబలు’ స్కూళ్ళు లాంటి తేనె పూసిన పేర్లతో బోర్డులు లేపాయి. జనం కూడా వాటి ముందు ‘క్యూ’ కడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ జాడ్యం ఎల్కేజీ, యూకేజీలకు పాకినా అబ్బుర పడాల్సిన పనిలేదు.
ఐఐటి ఫౌండేషను అనేది ఏమిటో, అందులో సాధారణ విద్యకు మించి ఏమి నేర్పిస్తారో చేరే పిల్లలకు కాని, చేర్పించే తల్లిదండ్రులకు కానీ, చివరికి ఆ కోర్సులను అందించే విద్యా సంస్థలకు కూడా తెలియదు. విచారించగా విచారించిగా ఒక్క సంగతి మట్టుకు తెలిసింది. అదేమిటి అంటే ఐ.ఐ.టీలుకు అయితే లెక్కలను, మెడికలుకు అయితే బయాలజీని పదే పదే ప్రాక్టీసు చేయిస్తారట. దిగువ తరగతుల్లోనే ఎగువ తరగతులు సిలబసు నేర్పించేస్తారట. పోనీ ఐఐటి/మెడిసినులో సీటు సంపాదించటమే పిల్లల (నిజానికి తల్లిదండ్రుల) జీవిత గురి అనుకున్నా, ఏటా కొన్ని వందల మందికి మట్టుకే దొరికే అవకాశం ఉన్న ఆ సీట్ల కోసం ఆరో తరగతినుండే కొన్ని లక్షల మందిని బలి చేయడం అవసరమా? ఒకటో తరగతిలో చేరిన వెయ్యి మందిలో ఒకరు అలాంటి స్థాయికి పోయినా మిగతా పిల్లలు ఎక్కడ రాలి పోయారు అన్న సంగతి గురించి మనకు కన పడదా? కనపడ్డా మనం పట్టించుకోమా? ఆ కొద్ది మందికి తప్పిస్తే మిగిలిన వారికి అది ఎండమావే కదా! ఎండమావి నీరు కోసం పిల్లల్ని అంతగా ఇక్కట్లకు గురి చేయాలా? సీటు రాని పిల్లలు ఆ తరువాత ఎందుకు పనికి వస్తారూ? అనే విషయాల మీద బిడ్డల్ని చదివించే తల్లిదండ్రులకు సవాలక్ష సందేహాలు కలుగుతున్నాయి. ఈ సంగతులను శాస్ర్తియంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు సమాజంలో వేళ్ళూనుకొని ఉన్న ఓ పెద్ద భ్రమ ఏమిటంటే, ప్రయివేటు బడుల్లో, అందులోనూ ఇంగ్లీషు మీడియంలో చదివితే పిల్లలకు చదువు బాగా వస్తుందని, ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రయివేటు బడుల్లో విద్యా ప్రమాణాలు పిసరంత ఎక్కువే అనిపించినా వాటికి ఉన్న మవులిక  సదుపాయాలు, బోధనా సౌకర్యాలు, సిబ్బంది, వీటికోసం వెచ్చిస్తున్న డబ్బును పరిగణనలోకి తీసుకుంటే అవి సాధించే ఫలితాలు ఆవగింజలో అరవయ్యోవంతే.
దేశంలో ప్రాథమిక విద్య స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోను కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద సర్వే చేయిస్తుంది. ఆ సర్వే పేరు ‘ఆసర్’ ((ASER - Annual Status of Education Report)) ఈ సర్వేలోనే ప్రభుత్వ విద్యా విధానం లోటు పాట్ల తోపాటు ప్రయివేటు బడుల మేడిపండు పొట్టను విచ్చింది. తమ బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాయి అనుకుంటూ, వేలకు వేలు ఫీజులు కట్టి తమ పిల్లలను చదివిస్తున్న ప్రయివేటు బడుల్లో (మీడియం ఇంగ్లీషు అని చెప్పాల్సిన పనిలేదు) ప్రమాణాలు ఇలా ఉన్నాయి.
ప్రయివేటు బడుల్లో ప్రాథమిక విద్యను చదివే పిల్లల్లో నూటికి 34 మంది పిల్లలు చిన్న పేరాని చదవలేరు, అలాగే 60 మంది పిల్లలు సరళంగా ఉండే కథను చదవలేక పోతున్నారు. ఇక లెక్కల సంగతి చూస్తే తీసివేత చేయలేని పిల్లలు నూటికి 42కాగా, భాగాహారం చేయలేని వారు 71గా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం అయ్యేది ఏమిటంటే, ప్రాథమిక విద్య పూర్తయ్యే నాటికి దాదాపు సగం మందికి పూర్తిగా చదవటము రాయటము కూడా రావటం లేదు.

1 comment:

  1. * చక్కటి విషయాలను రాసారు.
    * ఈ రోజుల్లో చదువు చాలా వరకు వ్యాపారం అయిపోయిందండి.
    * మాతృభాషలో చదువు ఎంతో ముఖ్యం. అయితే , ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు.
    * మన దేశంలో చాలామంది పిల్లలు సగంలోనే చదువు మానెయ్యటానికి గల ముఖ్య కారణాలలో ఒకటి ఇంగ్లీష్ మీడియం చదువులు.

    ReplyDelete