28-7-2012
ఏ సమాజం అయినా భావితరాలకు బోధించే విద్యలో జాతి అవసరాలతోపాటు దాని సామాజిక, సాంస్కృతిక వారసత్వం కొనసాగే విధంగా జాగర్త తీసుకుంటుంది. అలా చేస్తేనే ఆ జాతి తన ఉనికిని చాటుకోగలదు. అలాంటి బాధ్యతను ఆయా ప్రభుత్వాలు తీసుకుంటాయి. విద్యా రంగంలో ప్రభుత్వం తన బాధ్యత నుండి పక్కకు తప్పుకొని అదుపును పోగొట్టుకుంటుందో అప్పటినుంచి ఆ జాతి సామాజిక, సాంస్కృతిక వారసత్వానికి పతనం మొదలు అయినట్టే. విద్యా విధానంలో ప్రయివేటు వాటా పెరిగే కొద్ద్దీ దాని మీద నియంత్రణ లేకుండా పోతే వ్యాపార ధోరణులు ముందుకు వస్తాయి. వ్యాపారంగా మారిన విద్యలో ‘లాభం’ ముందు సామాజిక ప్రయోజనం ఎవరికీ పట్టదు.
‘ఈ-కాలం’లో కార్పోరేటు రంగానికి మెతక కూలీలు కావాలి. అందులోనూ ఇంగ్లీషు పనితనం ఉన్న కూలీలు కావాలి. దొరకాలే కానీ నేరుగా కాలేజీలనుండే ఏరుకు పోయి, వేలకువేలు జీతాలు ఇస్తున్న పరిస్థితి. మన బిడ్డ వాటిని అందిపుచ్చుకోవాలి. అంతేనా... పట్టా (పొట్ట కాదు) చేత పట్టుకొని వలస పోతే కూడా కావాల్సినంత డబ్బు. వీటి అన్నింటికి ఇపుడు ఇంగ్లీషు కావాలి. అంటే ఇంగ్లీషును కొనే ‘ఇంగ్లీశుదారీ’ వర్గం ఒకటి వెలిసింది. వీరికి ఇంగ్లీషు సరుకు కావాలి. గతంలో అయితే అక్కడక్కడా ఈ సరుకును అమ్మే చిన్న చిన్న అంగళ్ళు (బడులు) ఉండేవి. ఇప్పుడు డిమాండు పెరిగింది. వ్యాపారం ఊపు అందుకుంది. అమ్మే అంగళ్ళకు మంచి డిమాండు ఉంది.
విద్య వ్యాపారం అయినప్పుడు మార్కెట్టులో ‘బోధనా’ వస్తువును అమ్ము కునేందుకు పోటీ ఉంటుంది. వ్యాపార పోటీలో నెగ్గ టానికి ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్నింటిని విద్యా వ్యాపారులు ఉపయోగిస్తారు . ‘వినియోగదారులు’ అయిన విద్యార్థి తల్లిదండ్రుల్ని ఆకర్షించటానికి టక్కు టమారాలతో ప్రచారం మొదలవుతుంది. అందులో మొదటిది పిల్లల శక్తి, సామర్థ్యాలతో సంబంధం లేకుండా ఎక్కువ మార్కుల్ని తెప్పించటం, తద్వారా మీ పిల్లలు తెలివిగలవారు అని తల్లిదండ్రుల్ని నమ్మించటం. రెండోది పిల్లల తెలివితో, మానసిక వికాసంతో సంబంధం లేకుండా బోధించటం జరుగుతుంది. అందుకు తగ్గట్టు బోధనా పద్ధతుల్లో, చదివించే తీరులో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ తీరులోనూ అశాస్ర్తియ పద్ధతులు చోటుచేసుకున్నాయి. బుద్ధి మాంద్యం ఉన్న పిల్లలకు కూడా నూటికి 90 మార్కులు ‘తెప్పించి’ తల్లిదండ్రుల్ని మురిపించగల చాకచక్యం ఇప్పటి ప్రయివేటు బడుల దగ్గర ఉంది.
గ్రామ ప్రాంత పిల్లలూ, పట్టణాలలో పేద పిల్లలు ఎక్కువ భాగం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా పట్టణాలు, నగరాలలో అధిక భాగం తమ పిల్లల్ని ప్రయివేటు బడులకు పంపుతున్నారు. రానురాను ఈ పరిస్థితి కూడా మారుతూ ఉంది. గ్రామాలలో ఉండే ఉన్నత కుటుంబాలవారు తమ పిల్లల్ని పట్టణాలో ఉంచి ప్రయివేటు పాఠశాలల్లో చదివించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరో పక్క పట్టణాలు, నగరాలలో పేద ప్రజలు సయితం కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఏ మాత్రం కాస్త బాగున్నా తమ పిల్లల్ని ప్రయివేటు పాఠశాల్లో చేర్పించేందుకు వెనుకాడటంలేదు. ప్రయివేటు విద్యాలయాల వైపు ప్రజలు మొగ్గు చూపటానికి కారణాలను ఆరాతీస్తే, ఈ కారణాలు కనపడుతాయి.
- విద్యార్థిపట్ల చూపే వ్యక్తిగత శ్రద్ధ
- వారి బోధనా పద్ధతి
- సెలవుల్లో టీచర్లని ఇంటింటికి తిప్పి పిల్లల్ని చేర్పించటం
- చేర్పించిన వారికి కమీషన్లు ఇవ్వటం
- మార్కులు, ర్యాంకులకు సంబంధించిన ప్రచార ఆర్భాటం
- బోధనా మీడియం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యామోహం
- ఉన్నంతలో మవులిక సదుపాయాల కల్పన
- విద్య లాభసాటి వ్యాపారంగా మారటంతో ఎక్కువ ప్రోత్సాహం
- ప్రభుత్వ బడుల అలసత్వం, కొడిగట్టు తున్న వాటి నాణ్యత
ప్రైవేటు బడుల్లో వౌలిక సదుపాయాలు, బోధనా వసతులు మెరుగ్గా ఉన్నాయి అనేది కాదనలేని నిజం. దానికి తగ్గట్టు విద్యా ప్రమాణాలుకూడా పెరిగినట్లు బయటకు ‘అనిపిస్తున్నాయి’ కానీ మొత్తంగా పట్టి చూస్తే అది ఉత్త డొల్లే అనేది ‘ఆసర్’ నివేదిక చెప్పకనే చెప్పింది.
మన చెడు రాత ఏమిటి అంటే పయిన చెప్పిన తీరులో పిల్లల్ని మలిచి, అదే ప్రతిభ అనీ, అలా చదువు చెబితేనే తెలివిగలవారిని తయారుచెయ్యొచ్చని ఒక ‘నమూనా’ (Model) తయారయి ఉంది. అంతటా అవే సరి అయిన పద్ధతులుగా చలామణి అవుతున్నాయి. ఈ ధోరణులు ఎంతవరకు పోయాయి అంటే వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం కూడా ప్రయివేటు పాఠశాలలు ప్రదర్శించే టక్కు టమారాలకు తోడు గోకర్ణ, గజకర్ణ విద్యల్ని కలిపి ప్రదర్శించేందుకు సిద్ధపడుతున్నది. ఈ మొత్తం పరిణామాలు జాతి, భాషా, సంస్కృతుల మనుగడకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి.