Saturday, June 30, 2012

పరాయి మాటలు తెలుగు నుడికారంలోవే పలకాలి


పరాయి భాషా పదాలను తెలుగు వారు సరిగా పలక లేక పోతున్నారు కాబట్టి వాటిని పలకటానికి కొన్ని కొత్త అక్షరాలను తెలుగువారు కలిపించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని ఈ మధ్య కాలంలో ఒక కొత్త వాదనలు  బయలు దేరాయి. ఆంధ్రభూమి దినపత్రికలో ప్రతి శనివారం వచ్చే 'నుడి' శీర్షికలో ఆ మద్యన శ్రీ పెరంబుదూరు నారాయణరావు గారు రాసిన ‘మార్పులు చేర్పులు అవసరమే’ అనే వ్యాసము, అదే రోజు నుడిలో డా. బి.కె.ఎస్. ఆర్.ప్రసాద్‌గారు రాసిన ‘కొన్నయినా చేర్చాలి కొత్తవి’ అన్న వ్యాసము, చదివిన తరువాత రెండు వ్యాసాలకూ బదులు రాయాల్సిన అవసరము ఉంది అనిపించింది. ముందుగా వారు రాసిన వ్యాసాలను పొట్టిగా ఇచ్చి తరువాత వాటికి బదులు 

                                                        మార్పులు చేర్పులు అవసరమే
                                                           శ్రీ పెరంబుదూరు నారాయణ రావు                                                            

తెలుగు అక్షరమాల బహు దొడ్డది. 56 అక్షరాలు ఏ భాషకి ఉన్నాయి? మనం ఆధునీకరణ పేర్న ఋ, ఋ౎, ఁ (అర సున్న) తగ్గిస్తే బాగుంటుందనుకుంటున్నాం, చ, జలు కూడా పోయాయి, ‘ఋ’తో వచ్చే పదాల్ని ‘రు’తో సరిపెట్టుకోవడం తప్పు. ఉర్దూ పదాలు కొన్ని తెలుగులో వ్రాసుకోడం కష్టం, మనం 56 అక్షరాలు కలిగియున్నాPhool, Fool పదాల్ని అంతరం చూపుతూ వ్రాయలేం. రెండింటికీ ‘్ఫల్’ అనే రాస్తాము. అదే హిందీలో ప’ క్రింద చుక్క బెట్టి సర్దుకున్నారు. ఐతే హిందీవాళ్ళే కొందరు PHOOLను FOOLగా ఉచ్చరిస్తున్నారు. హిందీ టీచర్లు కొందరి కారణంగా హిందీ విద్యార్థులు అలాగే ఉచ్చరిస్తున్నారు. ‘వారికి తుమ్ అప్నే మాఁ బాప్‌కే ఫూల్ (Phool), ఫూల్((Fool) అని చెప్పాల్సొస్తుంది. ‘ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్’- ఉచ్చారణ తికమకబెడుతుంది. ఖ, గ, ఫల క్రింద హిందీలో ఐతే ఆయా అక్షరాల క్రింద చుక్కబెడితే ఉచ్చారణ చక్కబడుతుంది. తెలుగుకి ఆ వెసులుబాటు లేదు. ‘క’ క్రింద చుక్కతో ‘ఖాన్’ పదాన్ని సరిగ్గా ఉచ్చరించవచ్చు, అలాగే గ, పలని సైతం. అంటే వీటితో ఇంకో మూడు అక్షరాలని కలుపుకోవచ్చును.

మన తెలుగు ఉచ్చారణ- ప్రత్యేకంగా యితర భాషా పదాలని వాళ్ళు ఉచ్చరించినట్లే మనకూ ఆ ఉచ్చారణ అవసరం. ఇంగ్లీషులో చదువుకుని తెలుగులో ఉచ్చరించడం కూడదు. ‘రాజపుత్రుడు’ పదం మన తెలుగులోనూ ఉంది. అది ఇంగ్లీషులో చదువుకుని ‘రాజ్‌పుట్’ అని వ్రాసుకుంటున్నాం మనం. ‘ఝలక్’ అనే పదాన్ని ‘జలక్’ అని ఎందుకు రాసుకుంటున్నామో? మనం రాసుకునే ‘ఎడ్యుకేషన్’, ‘స్టాట్యూ’, ‘లెంగ్త్’ పదాల్ని చూస్తే-ఇంగ్లీషు డిక్షనరీలలో ఉచ్చారణ గురించి చెబుతూ వారు చశ్రీలా పలకాలన్నారు అంటే సరియైన ఉచ్చారణ ‘ఎజ్యుకేషన్’, ‘స్టాచ్యు’ అని మరి మనం..? ‘లెంగ్త్’లో ‘గ’ సైలెంట్ అని చెబుతూ ‘లెంత్’ అనమంటున్నారు- మరి మనమేమో ‘లెంగ్త్’ అంటున్నాం. ఇతర భాషీయులు ‘గర్ల్’ అన్న పదాన్ని మనం ‘గరల్’ అంటున్నాం-అదేదో ‘గరళం’ అన్నట్లు.


                                                         కొన్నయనా చేర్చాలి కొత్తవి 

                                                               డా. బి.కె.ఎస్.ఆర్.ప్రసాద్

పర భాషా పదాలు (ముఖ్యంగా ఆంగ్ల) పదములు సరిగ్గా పలకాలంటే మరికొన్ని అక్షరములు చేర్చుకుంటే బాగుంటుందని అనిపిస్తోంది.
1. -Pen అనే పదాన్ని వ్రాయటానికి ప్రస్తుతం ఉన్న (మన) ‘ఎ’ కారము సరి అవదు- పెనుగాలి అనే పదంలో ‘పె’కూ, పెన్‌లోని ‘పె’కూ తేడా ఉన్నది. దీనికి వేరే అక్షరం ఉంటే బాగుంటుంది.
2. Man అనే పదాన్ని వ్రాయటానికి మన ‘ఏ’ కారము సరి అవదు- మేను అనే తెలుగు పదంలోని ‘మే’కూ, మేన్‌లోని ‘మే’కూ తేడా ఉన్నది. దీనికి వేరే అక్షరం ఉంటే చాలా ఆంగ్ల పదాలు సరిగా వ్రాయగలుగుతాం. ఉదాహరణకు bankను బాంక్ అనీ, బేంక్ అనీ, బ్యాంక్ అనీ కాకుండా సరైన రీతిలో వ్రాయగలుగుతాం.
3. Polish అనే పదం వ్రాయటానికి మన ‘ఓ’ కారం సరి అవదు. పోలికలోని పో’కూ, పోలిష్‌లోని ‘పో’కూ తేడా ఉన్నది. దీనికి వేరే అక్షరం చేర్చుకుంటే బాగుంటుంది.
4. Fan అనే పదంలోనిది మన ‘్ఫ’కారం కాదు. దీనికి వేరే అక్షరం (లేదా) మన ‘్ఫ’ కారమునకు ఏదైనా గుర్తు చేర్చితే బాగుంటుంది. ‘ఫేన్’ శబ్దాన్ని సరిగ్గా వ్రాసిన ‘ఫ’లితం ఉంటుంది.
5. KH లేదా పలికే ‘ఖ’ కాఠమునకూ, ‘ఖగోళం’లోని ‘ఖ’ కారమునకూతేడా ఉన్నది. ‘ఖాన్’ పదం సరిగా వ్రాయటానికి వేరే ‘ఖ’ కారం కావాలి.
6. Will అనే పదంలోని ‘వ’కారమూ, విల్లు అనే తెలుగు పదంలోని ‘వ’ కారమూ ఒకటి కావు. ‘లు’ శబ్దంకొరకు వేరే అక్షరం ఏర్పరిస్తే బాగుంటుంది.
7. ZIPలోని ‘జ’కారం పలకటానికి వనకు ‘జ’ ఎల్లాగా ఉన్నది. దీనిని వాడకంలోనికి తెస్తే బాగుంటుంది.
ఇదేవిధంగా మనకు ఉన్న ‘చ’కారం కూడా లిపిలో వాడుతూ ఉంటే ఆయా పదముల ఉచ్చారణ వేరే అని స్పష్టంగా తెలుస్తుంది. పలుకు బాగుంటుంది. ఇదివరలో పూర్ణానుస్వారము ఎక్కడ ఏ శబ్దమో స్పష్టంగా వ్రాసేవారు (ఉదాహరణకు ‘చంద్రుడు’ అని కాకుండా ‘చన్ద్రుడు’ అనే వ్రాసేవారు) ప్రస్తుతం ఆ పద్ధతి లేదు. వ్రాయటంలో చూపకపోయినా, వ్రాత నేర్పునపుడు ఆయా శబ్దములను స్పష్టంగా ఇలా పలకాలి. అక్కడ ఆ ధ్వని ఉంటుంది అని తెలియచెప్పితే బాగుంటుంది.
అక్షరములను జారవిడచుకోవద్దు. కొత్త అక్షరములను చేర్చుకొని ఉచ్చారణను మరింత స్పష్టంగా లిపిలో సూచించే ప్రయత్నం చేద్దాము. తెలుగు లిపి, ఉచ్చారణలను వెలిగిద్దాము.

                                                                     పయి వ్యాసాలకు బదులు 
                                                   పరాయి మాటలు తెలుగు నుడికారంలోవే పలకాలి 
                                                                    డాక్టర్ పమిడి శ్రీనివాస తేజ 



మానవ నాగరికత తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకూ నుడుల చరితను పరికించి చూసినట్టయితే కొన్ని వింత గమనింపులు, సంగతులు తెలుస్తాయి.
  • ఓటమిపాలయిన జాతి తమను జయించి, పాలించే వారి నుడిని నేర్చుకుంటుంది; అంటే ఆధిపత్యం చేసేవారి నుడిని దాని కింద నలిగేవారు లేదా బానిసలు నేర్చుకుంటారు. మచ్చుకు - బ్రిటీషు వారు పరిపాలించిన దేశాలలో ఇంగ్లీషు, ఫ్రెంచి వారు పాలించిన దేశాలలో ఫ్రెంచి పెరుగుదల.
  • గెలిచి, పాలించే వారి నుడిలోని మాటలు ఓడిపోయిన వారి నుడిలోకి విపరీతంగా దిగుమతి అవుతాయి. మచ్చుకు తెలంగాణ తెలుగులో ఉర్దు, సర్కారు ప్రాంతపు తెలుగులో ఇంగ్లీషు, పుదుచ్చేరి తమిళములో ఫ్రెంచి పదాలు.
  • ఓడిపోయిన వారి నుడి ఎంత గొప్పది అయినా దాన్ని జయించిన వారు నేర్చుకోరు. ఓడిపోయిన వారి నుడిలో ఎంత మంచి మాట ఉన్నా అది గెలిచిన వారి నుడిలోకి లోనికి ఎక్కదు; ఎక్కినట్టు కనిపించినా అది చాలా అరుదు.
  • ఒక జాతి మతాన్ని, సంస్కృతిని, పరిపాలనా పద్ధతులను మరొక జాతి అరువు తెచ్చుకొన్నట్టు అయితే వాటితోపాటు వారి వేష భాషలు రెండో జాతిలోకి దిగుమతి అవుతాయి. మచ్చుకు ఉత్తర భారత పురాణాలు, ఇతిహాసాలు దక్షిణ భారత భాషల్లోకి వచ్చి దూరినందువల్ల దాని భాష అయిన సంస్కృతము, వారి దేవుళ్ళు, పేర్లు, ఆచారాలు ఇక్కడ పీట వేసుకొన్నాయి. దీనివల్ల ఇక్కడి నుడి దెబ్బతినింది. స్థానిక సంస్కృతి గల్లంతయిపోయింది.
చాలా కాలం బానిసత్వములో బతికిన జాతిలో రానురాను బానిస మనస్తత్వము అలవడుతుంది. కారణము ఏమిటంటే అధికారం చెలాయించే వారు ఏలుబడిలో, వ్యవహారికంలో, చదువులో వారి భాషని చొప్పిస్తారు. పెత్తనపు నుడిని గొప్పదిగా నూరి పోస్తూ, స్థానిక నుడిని తక్కువదిగా మోటుదిగా ఆ జనం చేతే అనిపింపచేస్తారు. తరాలు గడిచే కొద్దీ పాలితులకు పాలనా భాషపట్ల మమకారము పెరిగి తమ సొంత నుడిపట్ల చిన్నచూపు కలుగుతుంది.
రానురాను తన నుడి స్వరూపం ఏమిటో, తన నుడి అసలుతనం ఏమిటో ఆ జాతికి తెలియదు. కాబట్టి తన నుడిపట్ల అభిమానము, ఉద్వేగము ఉన్నా నేర్చుకున్న తప్పుడు చదువుల నేపథ్యంలో మమకారం పెంచుకున్న పరాయి నుడిలో ఉన్న గొప్పదనము (ఏమిటో అది?) అచ్చదనము కోసము అర్రులు చాస్తారు. సొంత నుడిని పరాయి నుడితో పోల్చి చూడటము, తూకం వేయటము చేసి ఆ నుడిలో ఉన్నవి ఈ నుడిలోకి తేవటానికి, లేదా తన నుడిని సంస్కరించి పరాయి నుడి మాదిరి చేస్తే బాగుంటుందని తలపోస్తుంటారు. కాస్త సూటిగా చెప్పుకోవాలంటే తన సొంత నుడిని బానిస మనస్తత్వం కోణంలో చూడటం మొదలవుతుంది. డా. బి.కె.ఎస్.ఆర్.ప్రసాదు, శ్రీ పెరంబుదూరు నారాయణరావుగార్ల అభిప్రాయాలను పయి కోణం నుంచి పరికించి చూడాలి. అందుకు కొన్ని భాషా సూత్రాలను, భాష తీరు తెన్నులను, తెలుగు అసలు కట్టుబడి గురించి కొంత చూడాలి.
మానవ పరిణామంలో తొలుత మాటలకే పరిమితం అయి ఉన్న నుడి రాత రూపం సంతరించుకొనే క్రమంలో అక్షరాలు రూపు దిద్దుకున్నాయి. తమ నుడిలో ఉండే మాట తీరుకు తగ్గట్టు అక్షరాలు కుదుర్చుకున్నారు. తొలినాళ్ళలో రాత భాషలో కొంత గందరగోళం ఉన్నా ఆ తరువాత కాలంలో రాతలు ప్రామాణికతని సంతరించుకున్నాయి.
అన్ని నుడిల్లాగే తెలుగు కూడా అలాగే రాత రూపం సంతరించుకుంది. ఉన్న మొత్తం తెలుగు మాటలు రాత రూపంలో పెట్టటానికి 32 అక్షరాలను తెలుగు భాష ఏర్పాటు చేసుకుంది. అవి: 10  అచ్చులు, 20 హల్లులు. వీటికి సున్న, అరసున్నలను కూడా కలుపుకుంటే మొత్తం తెలుగు అక్షరాలు 32. అది తేట తెలుగు, తేనెలూరు, కలితీ లేని పదారణాల తెలుగు.
నిజానికి ఈనాటికీ ఇవే తెలుగు అక్షరాలు. తెలుగు మాటలన్నీ ఈ అక్షరాల్లో ఉంటాయి. ఈ అక్షరాలతో రాయలేని తెలుగుమాట అంటూ ఉండదు. ‘ఆదికవి’ అని పొగడబడే నన్నయ్యకు ముందువరకూ తెలుగు అసలుదనం అది. తెలుగుల చెడు రాతా అని, నన్నయ్య మహాశయుడు భారతాన్ని తెలుగులోకి అనువదించే పనికి పూనుకున్నాడు. పని అయితే మొదలు పెట్టాడు కానీ తెలుగు అనువాదం అయితే రాలేదు. అక్కడక్కడా నాలుగు తెలుగు మాటలు వాడి మొత్తం మీద భారతాన్ని సంస్కృతంలో నుండి తిరిగి సంస్కృతంలోకే తిరిగి రాసి ఇది తెలుగు అన్నాడు. కాకుంటే రాత మట్టుకు తెలుగు. నన్నయ్య చేపట్టిన ఆ చేత తెలుగు అసలుదనాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. సంస్కృత రాతలో ఉన్న భారతాన్ని ఇలాగే ఎత్తి తెలుగు రాతలో రాయటానికి అక్షరాలు చాలకపోవటంతో ఏకంగా 25 సంస్కృత పలుకులకు తెలుగులో అక్షరాలను రూపొందించాడు. దీనితో తెలుగు అక్షరాల సంఖ్య పెరిగింది. తెచ్చిన అక్షరాల అక్కర సంస్కృత మాటలను పలకటానికి, భాషా చొరబాటుకు ఉపయోగపడింది. అది తెలుగు పీక నొక్కటానికి ఉపయోగపడింది దీనివల్ల సొంత సంస్కృతి పోయి పరాయి సంస్కృతి చొరబాటుకు అవకాశం ఏర్పడింది.
ప్రపంచంలో ఏ నుడిలో అయినా వారి సొంత పలుకులు రాయటానికి అక్షరాలు ఉంటాయి తప్ప పరాయి పలుకులను రాయటానికి అక్షరాలను కలిపించుకోరు. ఒకవేళ అలాంటి మార్పులు ఏమయినా జరిగి ఉంటే అది ప్రామాణికత సాధించుకోక ముందు జరుగుతుందే కాని తరువాత జరగదు. పరాయి పలుకులను పలకాలన్నా, రాయాలన్నా తమ నుడి నియమాల ప్రకారం రాసుకుంటారే తప్ప ఉన్నది ఉన్నట్టు పలకరు, రాయరు. అలా చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే అది వారి సహజ నుడిగా, జీవనుడి ఉంటుంది. దీనికి తేడాగా పరాయి నుడి వారు తమతమ సొంత నుడిని పలికినట్టు మనమూ పలకాలని ప్రయత్నిస్తే అది అనుకరణ అవుతుంది. లేదా పరోక్ష బానిసత్వం అవుతుంది.
పిల్లలకు గుణింతాలు నేర్పేటప్పుడు ‘క’కు సున్నా పెడితే ‘కమ్’, గ కు సున్నా పెడితే ‘గమ్’అని నేర్పిస్తారు. అదే కనుక నిజమే అయితే ‘కంద’ అనే రాతను పలకాలంటే ‘కమ్‌ద’అని, గంటను ‘గమ్‌ట’అని పలకాలి. కానీ ఏ తెలుగుబిడ్డా అలా చదవడు. వాటిని ‘కఙద’, గఙట’ నే చదువుతాడు. చదువు మొదలుపెట్టక ముందు తెలియకుండానే అలా పలకటం వచ్చేస్తుంది. కారణం ఏమిటంటే సున్నా పలుకును నిర్ణయించేది సున్న ముందు అక్షరం కాదు. దాని తరువాత వచ్చే అక్షరం. అంటే కందలో సున్నా పలుకును నిర్ణయించేది ముందు ఉన్న ‘క’కాదు, దాని తరువాత వచ్చే ‘ద’. హల్లుల ముందు సున్న వచ్చినప్పుడు దాని తరువాత వచ్చే హల్లు ఏ గుంపులో ఉందో ఆ గుంపు నిర్ణయిస్తుంది. అంటే హల్లుల్లో గుంపుగుంపుకి సున్న పలుకు తీరు మారుతుంది. ఎలా మారుతుంది అంటే ఆ హల్లు గుంపు చివరిలో ఏ అక్షరం ఉంటుందో దాని సవ్వడిని సున్న పలుకుతుంది. ఎలా అంటే క గ ల ముందు సున్న వస్తే ‘ఙ’ సవ్వడి (చంక, బుంగ) లాగా పలుకుతుంది. చ జ ముందు ‘ఞ’ సవ్వడిని (కంచము, గుంజ), ట డ ముందు ‘ణ’ సవ్వడిని (గంట, ఎండ) పలుకుతుంది. అలాగే త ద ముందు ‘న’ సవ్వడి (గంత, కంద) ప బ ముందు మ (గంప, అంబ) సవ్వడులను తాకుతూ పలుకుతుంది. యరలవ.. గుంపు అక్షరాల ముందు అస్సలు సున్న రాదు. వచ్చినట్టు ఉండే సంసారము మాంసము లాంటివి తెలుగు పదాలు కావు. ఇది చదువుతో సంబంధం లేకుండా ప్రతి తెలుగుబిడ్డ మాట్లాడే తీరు. అంటే సహజమయిన పలుకు తీరు. ఎవరూ నేర్పకుండా తెలుగుబిడ్డ నాలుక అలవోకగా పలికే తీరు. ఏది ఎలా పలకాలో తెలుగు బిడ్డకు తెలుసు.
తాటాకు అనే రాతని తెలుగు బిడ్డ చదవాల్సి వచ్చినప్పుడు ‘టా’ని ఆ.. సవ్వడి వచ్చే విధంగా కాకుండా యా-ఏ లకు నడుమగా ఒంచి పలుకుతాడు. ‘జడ’, జల్లెడ, జంటలలో జ ని ఎన్ని రకాలుగా పలకాలో అన్ని రకాలుగా ఒంచి పలుకుతారు. వీటిని ఎవరూ నేర్పించాల్సిన పనిలేదు. కాబట్టే రాత దగ్గరకు వచ్చేసరికి వాటికి అక్షరాలు కల్పించాలి అనే వాదన పస లేనిది. పయిగా పరాయి పలుకులకు తెలుగు అక్షరాలు తయారుచేయాలనటం పూర్తి బానిసత్వం వయిపు తెలుగును మలచటమే. పరాయి భాషా పదాలను అలాగే పలకటానికి వీలుగా కొత్త అక్షరాలు కల్పించుకుందాం అనే వారికి నాదో చిన్న అడక? హిందీ వాళ్ళకు ఎ, ఒ సవ్వడులు లేవు. తెనాలి అని రాయమంటే లేదా పలకమంటే తేనాలి అని రాసే హిందీ వారికి ‘ఎ’ని తయారుచేసుకోండి అంటే మనల్ని పిచ్చివాళ్ళను చూసినట్టు చూడరా?. అలాగే ఇంగ్లీషు ప్రపంచంలో ఉండే అన్నీ పలుకులను పలకలేకపోతుంది. ఆ, ఈ, ఊ, ఏ, ఓ, త,ద  లాంటి  లాంటి పలుకులకు అక్షరాలు లేవు . వాటిని తయారుచేసుకొని ఇంగ్లీషును ఉద్దరించుకొనే ఆలోచన ఇంగ్లీషువారికి ఎందుకు రాలేదూ? పోనీ మనమయినా ఇచ్చే సాహసం చెయ్యొచ్చా? చేస్తే ఫలితం ఎలా ఉంటుందో  ఉఉహించ గలరా?