పత్రిక, సాహిత్య రంగాలలో ప్రామాణిక భాష పేరుతో నడిమి కోస్తా జిల్లాల నుడికారాన్ని తమపై రుద్దుతున్నారన్న కోపం తెలంగాణా నుడికారుల్లో ఉంది. అయితే ఆ కోపం ప్రత్యేక రాష్ట్ర అంశం తెరమీదకు వచ్చినప్పుడు నుడికారుల గొంతు పెద్దది కావటం, ప్రత్యేక రాష్ట్రం అడకిక (డిమాండు) తెరమరుగు కాగానే నరుడికారుల గొంతు మూగపోవటం జరుగుతూ వస్తోంది. దీన్ని బట్టి ఏవో కనపడని శక్తులు తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం జనంలో ఉన్న తెలంగాణ నుడికార అభిమానాన్ని వాడుకొని అవసరం తీరగానే దాన్ని అటకమీదకు ఎక్కించే ప్రయత్నాలు ఏమయినా జరుగుతున్నాయా అని అనిపిస్తుంది.
సందర్భం వచ్చినప్పుడు అప్పటికప్పుడు పెల్లుబికే నుడి ఉద్యమాలు నిడివికాల ఉద్యమాలుగా కొనసాగనందువల్ల ఆశించిన మార్పును తేలేక పోతున్నాయి. మాట్లాడే నుడిని రాత నుడిగా, చదువు నుడిగా, పాలనా నుడిగా నిలబెట్టటానికి నిరంతరం సామాజిక, రాజకీయ ఒత్తిడి లేనిదే పాలకవర్గాలు పట్టించుకోవు. మరోవైపు నుడిపట్ల సామాజిక ఉద్యమ ‘కొనసాగింపు’ లేనందువల్లే ఎల్లలు లేని ప్రామాణిక తెలుగును సాగు చేసుకోవడంలో విఫలం అయ్యాము. తెలంగాణా మాండలికంతో పాటు ఇతర తెలుగు నుడికారాల కలగలుపు లేకుండా కేవలం ఒక ప్రాంతపు తెలుగే ప్రామాణికం అయితే అది తెలుగు నుడి విజయం కాజాలదు.
ఉన్న చోటును బట్టి ఏ ప్రాంతపు వారు ఆ నుడికారాన్ని మాట్లాడుతున్నా, నలువైపులా విస్తరించిన తెలుగు వారి నడుమ సమాచారం కోసం, ప్రసార కలుపుల (మాధ్యమాల) కోసం, విరివి (అడ్వాన్సుడు) చదువుల కోసం ఇతర నుడుల నుండి వస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి తెలుగు వారందరికీ ఒక ఉమ్మడి ప్రామాణిక నుడి అవసరం ఎంతయినా ఉంది. ప్రామాణిక నుడి అంటే ‘నడిమి కోస్తా’ మాండలికాన్ని ఆవంతునే అంగీకరించటం కాదు. అన్ని మాండలిక పదాలను కలబోసి పద సంపదను పెంచటంతో పాటు సాంకేతిక సమాచార సాధనాలకు అనుకూలంగా ప్రామాణీకరించటం అని తెల్లము.
ఏ ప్రాంతపు తెలుగు నుడికారానికి (యాసకు) అయినా అసలయిన వారుసులు ఆ ప్రాంతంలో ఉండే దళితులు, వెనుకబడిన వర్గాలు. వారితోపాటు అగ్ర కులాలలో ఉన్న నిరక్షరాస్యులు, పేదలు. వీరు మాండలికాలను బతికించుకొనేవారే గానీ నుడి సాగుకి అవసరం అయిన రాజకీయ అధికారం లేని వారు. మరోవైపు అదే ప్రాంతంలో పై వర్గాలుగా ఉండే ధనికులు, పెద్ద కులాలు, మేధావులు, ఉన్నత ఉద్యోగాలు వెలగబెట్టేవారు మాండలిక నుడికి దూరంగా జరిగి తమదైన కల్పిత నుడిని పాటిస్తుంటారు. ఈ వర్గాలు ఎప్పుడూ మాండలిక నుడికి వారసులుగా ఉండటానికి ఇష్ట పడరు. పైగా అవకాశం వస్తే మాండలికాలనే కాదు మొత్తం తెలుగునే తుంగలో తొక్కటానికి ప్రయత్నం చేస్తారు. వీరు ఏ ప్రాంతపు వారు అయినా ఆ ప్రాంత నుడికారానికి వారసులు కాదు. దురదృష్టం ఏమిటంటే నుడి సాగు ఈ వర్గం పెత్తనం కింద ఉంటుంది. దీనికి కోస్తా, రాయలసీమ, తెలంగాణ అన్న ప్రాంతాలతో సంబంధం లేదు.సనాతనులుగా చెప్పుకొనే వర్గం చచ్చిన సంస్కృతంలోని పదాలను దిగుమతి చేసుకొని తెలుగు నేలలో నాటి తమదైన ఒక ప్రత్యేక నుడిని సాగు చేసుకుంటారు.
పైగా అదే తెలుగుగా చలమణి చేయాలని కంకణం కట్టుకొని ఎక్కడ సందు దొరికితే అక్కడ తెలుగును తొలిచేస్తుంటారు. మాండలికాలను అణగదొక్కటంలో ఈ వర్గానిదై పై చేయి. మరో వైపు ఆధునికులుగా వేషాలు వేసుకున్నవారు ఆంగ్లాన్ని నెత్తిన పెట్టుకొని తెలుగు ఉనికికే సవాళ్ళు విసురుతున్నారు. ప్రాంతాలకు అతీతంగా నేడు తెలుగు ముందున్న పరిస్థితి ఇది. ఇప్పుడు తెలంగాణా వేర్పాటు కోరుతూ జరుగుతున్న ఉద్యమంలో మరోసారి తెలంగాణా యాస గౌరవం ముందుకు వచ్చింది. నుడికారులు, రచయితలు, కవులు, కళాకారులు, గాయకులు ఇందులో పాలు పంచుకుంటున్నారు. రాజకీయ శక్తులు వీరి నుండి ఆశించేది తెలంగాణా తెలుగు నుడికారంపై (నడుమ) కోస్తా తెలుగు పెత్తనాన్ని వ్యతిరేకించటం. తెలంగాణా యాసను జనానికి గుర్తు చేస్తూ రాజకీయ ఉద్యమానికి భావోద్వేగపు మద్దత్తును కూడగట్టడం. గత అనుభవాలను గమనంలో ఉంచుకొని చూస్తే నుడి ఉద్యమకారుల నుండి రాజకీయ శక్తులు ఆశించేది ఇదే.
ఇక్కడే నుడి ఉద్యమకారులు జాగర్తగా ఉండాలి. ఏ రాజకీయ ఉద్యమం కోసం నుడి గౌరవం పేరుతో జనాన్ని కూడగడుతున్నారో ఆ గౌరవం దక్కేదాకా రాష్ట్రం విడిపోయినా, పోకపోయినా ఉద్యమం కొనసాగాలి.
రేపు తెలంగాణా ఏర్పడితే అధికారాన్ని సొంతం చేసుకొనేది నుడిని తుంగలో తొక్కే శక్తులే. సీసా కొత్తదే కావచ్చు కానీ సారాంశం పాతదే అయితే నుడి పేరుతో జరిగే ఉద్యమం మరోసారి అభాసుపాలు అవుతుంది. అలా జరక్కుండా ఉండాలంటే కొత్త రాష్ట్రం ఏర్పడితే ‘‘తెలుగు పట్ల మీ రాజకీయ విధానం ఏమిటని’’ ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచాలి.
ఏ ఆశింపును కోరి ఉద్యమానికి దన్నుగా నిలిచారో ఆ పని జరగనప్పుడు అదే నుడి గౌరవ ఉద్యమాన్ని మారిన అధికార శక్తులపైకి ఎక్కు పెట్టాలి. ఒకవేళ కొత్త రాష్ట్రం ఏర్పడక పోతే ‘‘ఉమ్మడి అధికార’’ శక్తులపై ఆపకుండా పోరాడాలి. తెలంగాణా యాస ఆత్మగౌరవ ఉద్యమం కేవలం రాజకీయ హద్దు గీతల గీసేంత వరకే పరిమితమైతే అది పూర్తి గెలుపు కాదు. అది మాత్రమే జరిగితే ప్రాంతీయ అడ్డుగోడలు కట్టుకోవడంలో విజయం సాధించినా తెలుగు జాతిగా ఓడిపోక తప్పదు. ప్రపంచంలో రాజకీయ హద్దు గీతలు ఉంటాయే కానీ నుడికి ఎల్లలు ఉండవు. ఉండే ప్రదేశం, పలికే తీరులు వేరయినా నేలమీద ఎక్కడ ఉన్నా తెలుగు తెలుగే. ఒక యాసకు ఎక్కువ మరోయాస తక్కువ అనే ధోరణులు ఎవరు చూపినా అది మొత్తం తెలుగు జాతికి ఓటమి అవుతుంది. ఆయా ప్రాంతాల తెలుగు యాసలు ఆత్మగౌరవ ప్రతీకలుగా మారటం అనేది ఎక్కడ జరిగినా అది తెలుగు గెలుపే. అలాంటి నుడి ఉద్యమాలకు ఎదురుకోలు (స్వాగతం) పలకాలి.