Saturday, April 2, 2011

అచ్చ తెలుగు మాటలంటే ఉలుకేలనో?!


గత ౩ నెలలుగా ఆంధ్ర భూమి దిన పత్ర్హిక ప్రతి శనివారం "నుడి" పేరుతో ఒక పేజిని పెట్టింది. చాల విజయవంతం అయింది. ఆ పేజిలో ఇంగ్లీషూ, సంస్కృత పదాలకు బదులు వాడుకలో ఉండి మరుగున పడినవి, ఇతర ప్రాంతాలలో తెలుగు జనం వాడే జాను తెలుగు పదాలను పరిచయం చేస్తున్నారు. లేని పదాలకు ఏదో ఒక తెలుగు మూలం నుండి తెలుగు పదాలను పుట్టిస్తు న్నారు.  మచ్చుకు కొన్ని...

‘వేకి’ :
జ్వరం అనే అర్థంలో ‘వేకి’, అనే తెలుగుదేశీయ పదాన్ని చక్కగా పరిచయం చేశారు. బాగుంది. ఈ ‘వేకి’ పదాన్ని పింగళి కాటూరి కవులు తమ కావ్యాలల్లో వాడారు. ‘విమానం’ అనే పదాన్ని తరచుగా వాడుతుంటాం. ఇది సంస్కృతపదం.
కడలొడ్డు / కడలోర * పొద్దుమాను...:
సముద్ర తీరాన్ని ‘బీచ్’ (Beach) అనడం అలవాటయిపోయింది. సముద్రానికి మంచి తెలుగుమాట ‘కడలి’. తీరాన్ని ఒడ్డు అనడం తెలిసిందే. కనుక ‘బీచ్’ని ‘కడలొడ్డు’ అని హాయిగా అనుకోవచ్చు. తమిళనాడు తూర్పు ప్రాంతాల్లోని తెలుగువారైతే ‘కడలోర’ అంటున్నారు నేటికీ.‘గ్యాస్ లైటర్’ కూడా మన ప్రతి ఇంటిలో అలవాటులోకొచ్చింది. దీన్ని ‘చిచ్చుగోలు’ అని దక్షిణాది తెలుగు వాళ్ళు అంటున్నారు. మనమూ అలవాటు చేసుకోవచ్చు.‘క్లాక్‌టవర్’కు తెలుగుమాట ఏమిటి? ‘గడియార స్తంభం’ అనడం లోగడ బాగానే అలవాటులో కొచ్చింది. అయితే ఈ మాట తెలిసివున్నా అందరితో పాటు ‘క్లాక్ టవర్’ అనడమే ఆధునికతగా భావిస్తున్నారు. దీనికి తెలుగునాటి ‘నాటు’ మాట ‘పొద్దుమాను’ ఇది రాయలసీమలో, సేలం ప్రాంతాల్లో నేటికీ అలవాటులో వున్న మాట. నాటుగా ‘పొద్దుమాను’ అంటే నీటుగా ఉంటుందో, ‘క్లాక్ టవర్’ అంటేనే గోటుగా ఉంటుందో మీ ఇష్టం...

‘అరంగ్రేటం’ :
‘అరంగ్రేటం’ అనే మాట మన పత్రికల్లో, మాటల్లో అనవసరంగా చొచ్చుకుపోయింది. నిజానికి అది తమిళులు వాడే పదం. సంస్కృతం లోని ‘రంగం’ తమిళ వాడకంలో ‘అరంగం’ అయింది. ఫలానా అమ్మాయి ఫలానా నాట్యంతో రంగ ప్రవేశం చేసింది అని చెప్పడానికి - ప్రవేశించడం కోసం వేదిక/ అరుగు ఎక్కింది అని చెప్పడానికి తమకు తెలియకుండానే ‘అరంగేట్రం ’ చేసింది - అని వ్రాసేస్తున్నారు! మన నుడిని, నుడికారాన్ని ఎలా పాడుచేస్తున్నామో తెలిపే ఉదాహరణ ఇది. నాట్యరంగంలోకి అడుగు పెట్టింది అనవచ్చు. ప్రదర్శన ఇచ్చింది అనవచ్చు. వేదిక ఎక్కింది అనవచ్చు! ఇకనైనా మన పాత్రికేయులు ‘అరంగేట్రం’ను వదిలి పెడతారని ఆశిద్దాం.
‘డయాస్’ (Dais), ప్లాట్‌ఫాం (Platform) అనే మాటల్ని కూడా అవసరం లేకపోయినా అతిగా వాడడానికి అలవాటు పడ్డాం. వేదిక, అరుగు సులువైన అలవాటు పడిన మాటలు! అవసరం లేకపోయినా ఆంగ్లపదాల్ని వాడాలా?! ఆలోచించండి.

                        *****************************************************************

దీనికి స్పందనగా  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినా వేదుల సత్యనారాయణ అనే ఓ పెద్దాయన ప్రామాణిక తెలుగును వదిలి ఇలాంటి ప్రయత్నాలు చేయటం అభ్యంతరకరం అంటూ తన వ్యాసాన్ని కొనసాగించారు. దానికి జవాబే ఈ వ్యాసం. 

ఆంధ్రభూమి మార్చి 26 నుడి పేజీలో ‘అన్య భాషాపదాలు అవసరమే’ అనే పేరుతో ప.గో జిల్లా నుండి వేదుల సత్యనారాయణ గారి స్పందన చదివాక బదులు రాయాలనిపించింది. ఈ నా విమర్శ లేదా ఆవేదన వ్యక్తిగతంగా సత్యనారాయణగారిపై కాదు. వారు లేదా వారిలా అనిపింపు సుద్దులు చెప్పే ఇంకొందరి ‘భావజాలం’ పై మాత్రమే.

'నుడి' పేజీని పెట్టినప్పటినుంచి అక్కడక్కడా వాడుకలో ఉన్న అచ్చ తెలుగు పదాలను మిగతా తెలుగు జనానికి తెలియపరుస్తున్నారు; అసలంటూ తెలుగులో లేని పదాలకు ఏదో ఒక తెలుగుమూలం నుంచి మరో కొత్త పదాన్ని పరిచయం చేస్తున్నారు. నిజానికి ఇది ఎదురుకోలు (వెల్‌కం) పలకాల్సిన అంశం.

ఈ ప్రయత్నం మొదలైన రెండు మూడు వారాలకే ఆ ప్రయోగంపై చిటపటలు మొదలయ్యాయి. మొన్న ఒక పెద్ద మనిషి లైటరును చిచ్చుగోలు అనేకంటే అగ్గిగోలు అనటం ‘కొంత సముచితం’ అంటూ ఓ సలహా ఇచ్చేశారు. (చిచ్చు అనే తెలుగు పదానికి బదులుగా సంస్కృత పదం అయిన  "అగ్ని' నుండి పుట్టించి తెలుగు చేసిన పదం) ఆ కొనసాగింపు రెండో మెట్టులో వేదుల సత్యనారాయణ గారు ‘అసలు సమంజసం కాదు’ అంటూ రాతల తూటా పేల్చారు. రేపు మరో ఆయన ‘వెధవ గోల! తెలుగు ప్రామాణికాన్ని దెబ్బ తీస్తున్నారు’’ అని ఓ ఫిరంగిని పేల్చినా పేల్చవచ్చు. ఈ రకంగా పండితులు భుజాలు తడుముకోవటం వెనుక బయటకు కనపడని ‘అజెండా’ దాగి ఉందని తెలుగు జనం గమనించాలి. ఈ దాపరికపు అజెండా సంగతి తూటాలు పేల్చేవారికి తెలిసి ఉండవచ్చు. తెలియకపోనూవచ్చు. తెలిసిన వారు సూత్రధారులు అయితే తెలియనివారు అనుచరులు అవుతారు. ఇంతకీ ఈ దాపిరికపు అజండా ఏమిటంటే తెలుగు పై సంస్కృత పెత్తనం.

ఒక సామాజిక కిటుకు ఏమిటంటే ఏ అంశంలో అయినా ఆధిపత్య ధోరణిని చూపేవారు రెండు రూపాలలో దాన్ని చూపుతారు. అన్నీ అనుకూలంగా ఉండి, తమ ఆటలు ‘సాగి’నప్పుడు నేరుగానే బల ప్రదర్శనకు దిగుతారు. వీలు కానప్పుడు అదే దబాయింపును వేషం మార్చి మెతక రూపంలో ‘మాటు అజెండా’గా అమలుపరుస్తారు. తెలుగు నుడిపై సంస్కృత దబాయింపు లేదా ఆధిపత్య ధోరణి వందల ఏళ్ళుగా తొలి రూపంలోనూ, ఇప్పుడు రెండో రూపంలో కొనసాగుతోంది. విడమరచి చూస్తే దీన్ని అమలు పరిచే శక్తులు రెండు గుంపులు (గ్రూపులు)గా కనిపిస్తారు. తొలి గుంపు మూల సూత్ర రూపకర్తలు. తమ ఆధిపత్యానికి అడ్డు రానంతవరకూ వీరే నేరుగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. ఇందుకు తొలి మొక్క నాటినవాడు ఆది ‘అనువాదకుడు’ నన్నయ్య. (సొంత  కవిత లేదా కావ్యం రాసిన వారు కవి. ఆయన దేన్నీ సొంతగా రాయలేదు. చేసిందల్లా అనువాదం మాత్రమే)  ఆ రోజుల్లో అడ్డు చెప్పేవారు లేరు కాబట్టి సంస్కృత పదాలకు డు.ము.వు.లు చేర్చి ఇదంతా తెలుగే! అంటే అడిగిన వారు లేరు కాబట్టి చెలామణి అయింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అప్పటిలా పప్పులు ఇప్పుడు ఉడకవు. కాబట్టి నేరుగా చేసే నుడి దబాయింపు రూపం మార్చక తప్పని పరిస్థితి.

నేడు నన్నయ్య లేకపోవచ్చు. కానీ వారి భావజాలాన్ని భుజాలపై ఎత్తుకున్న గుంపు ఉంది. నుడి దబాయింపును నేరుగా జనంలోకి తెస్తే జనం ఆమోదించే పరిస్థితి లేదు. కాబట్టి అనుకున్న అజెండాకు ప్రజామోద అతుకులు తొడిగి ఏదో ఒక రూపంలో అమలు పర్చడానికి ఈ వ్యక్తులు ఎప్పుడూ పావులు కదుపుతూ ఉంటారు. ఇది ఆధిపత్య ధోరణిని చూపే రెండో రూపం. అంటే సంస్కృతాన్ని తెలుగులో చొప్పించి దాన్ని తెలుగుగా నమ్మింపచేసే రూపం. మచ్చుకు కొన్ని సంగతులు చూస్తే ఈ కిటుకు తెల్లం అవుతుంది.

తెలుగుకు, సంస్కృతానికి ఏ విధమైన పుట్టుక సారూప్యత లేదు. చుట్టరికం లేదు. కనీసం పొరుగుదనం కూడా లేదు. అయినా ప్రత్యేక అజెండా పెట్టుకొని సూత్రధారులు సంస్కృతాన్ని తెలుగులోకి దింపేశారు. సంస్కృత కావ్యాలు, సంస్కృత ప్రబంధాలు, సంస్కృత ఇతిహాసాలు, సంస్కృత దేవుళ్ళు, సంస్కృత పేర్లు ఇలా ఒకటేమిటి? తెలుగు జనానికి పుడితే సంస్కృతం, చస్తే సంస్కృతం, పిండం పెడితే సంస్కృతం. వందలాది ఏళ్ళుగా ఎదురులేకుండా నేరుగా సాగిన ఈ ఆధిపత్య ధోరణి కొనసాగిన ఫలితంగా చదువులో, సాహిత్యంలో, సమాచార సాధనాలలో అసలు తెలుగు అడుగంటి పోయింది. జనం నోళ్ళల్లో ఉన్నా అవి మొరటు పదాలుగా (పురుష అంటే గౌరవం, పోతు అంటే మొరటు), బూతుపదాలుగా (స్తనం అంటే సాహిత్యం, రొమ్ము అంటే బూతు), తిట్టు మాటలుగా (శవం అంటే గౌరవం, పీనుగ అంటే తిట్టు) మారాయి. ఆడ-మగల కలయికను సంస్కృతంలో రాస్తే భక్తి పూర్వక అష్టపదులు. తెలుగులో రాస్తే బూతు కబ్బాలు. ఇలా తెలుగును తెలుగువారి చేతనే అనిపించి తమ అజెండాను విజయవంతంగా అమలుపరిచారు. మాటలే కాదు. 29 అక్షరాలుగా ఉన్న తెలుగులోకి సంస్కృత అక్షరాలను ఇనుముబ్బడిగా దిగుమతి చేసి మొత్తం తెలుగు అక్షరాలు 56 అని చదువు చెబుతుంటే ఇవన్నీ ప్రామాణికం అనుకుంటున్నాం.

ఇక జనం సంగతికి వస్తే భాష ఆధిపత్యపు రెండో ధోరణివల్ల తాము నేర్చుకున్నది ప్రామాణికం అనుకొనే వారు (నిజానికి ఫాల్టీ లెర్నింగు) సమాజంలో ఎక్కువ. వీరు దాపరికపు అజెండాలో పాత్రధారులు కాకపోయినా ప్రామాణికం, సాంప్రదాయం అంటూ గుడ్డిగా చాటు అజెండాను నిరంతరం కాపు కాస్తుంటారు. ప్రామాణికాన్ని ఎవరైనా సవాలు చేస్తే తొలి గుంపుకంటే ఈ మలి గుంపు స్పందన చాలా ఉధృతంగా, వేగంగా ఉంటుంది. తొలి గుంపు గమ్మున ఉన్నా రెండో గుంపు నిప్పులు చెరుగుతారు. వీరి స్పందన వెనుక దురుద్దేశం ఉందని చెప్పలేము. తాము నేర్చుకున్న ప్రామాణికానికి భంగం వాటిల్లింది కాబట్టి ఇలా స్పందిస్తారు.
వాస్తవాలు తెలిస్తే సర్దుకుంటారు. వేదులగారు ఏ గుంపో ఆయనే తేల్చుకోవాలి. ఇప్పటి వరకూ స్పష్టత లేకపోతే ఇప్పుడయినా తేల్చుకోవాలి.

తెర వెనుక ఉన్న ఈ సంగతులను మనసులో ఉంచుకొని శ్రీ సత్యన్నారాయణ లాంటి వారి స్పందనల్ని పరిశీలించాలి. ఇలాంటి స్పందనలకు కారణం అక్కడ ఇచ్చేది సంస్కృత పదాలకు ‘అచ్చ’ తెలుగు పదాలు కావటమే. అంటే ఇంతవరకూ ఎవరూ ప్రశ్నించకుండా సులువుగా అమలవుతున్న అజెండాకు సవాలు ఎదురవటంతో పుట్టిన ఉలికిపాట్లు అవి. బహుశా లైటరును చిచ్చుగోలు అని కాక ‘జ్వలితం’ అని పిలుచుకుందాం! అని రాసి ఉంటే ఏ స్పందనా రాకపోయి ఉండవచ్చు. అలా అజెండా సక్రమంగా అమలవుతున్నందుకు సూత్రధారులు, ప్రామాణిక తెలుగుకు తేడాగా లేదు కాబట్టి సామాన్యుడు - మాట్లాడక పోవును.
ఈ నడుమ నుడి ఉద్యమాల పుణ్యమా అని పత్రికా యాజమాన్యాలు తెలుగును ప్రోత్సహించాలనే మంచి నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ అవకాశాన్ని కూడా సంస్కృత బతికింపు అజెండాకు మళ్ళించిన శక్తుల జోలికి పోయి ‘‘ఇది సమంజసం కాదు’’ అన్న వారు లేరు.
తెలుగు నేలలో ‘చాలా ఎక్కువ పంపకం ఉన్న కబురు కాగితం’లో(ఇది ఏ పత్రికో మీకు తెల్లమయ్యి ఉంటుంది)  తిష్ట వేసుకొని కూర్చొని కబురు కాగితాలకు తెలుగు పదాల పేరుతో నానా కారు కూతలు కల్పించి జనం మీదకు వదులుతుంటే ‘‘అరే ఇది తెలుగు కాదు’’ అని అన్నవారు లేరు. కలం పట్టి ఉత్తరం రాసిన వారు లేరు. ‘సెంచరీ’కి - శతకం, ‘ఇన్‌సైడ్ పిక్చరు’కు - అంతర్ చిత్రం, బర్డ్స్ వ్యూకు - విహంగ వీక్షణం. సాండ్ స్కల్‌ప్చర్‌కు - సైకత శిల్పం అని రాస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండే పండితులు తెలుగు బిడ్డలెవరయినా వాటిని నూటకం, లోపలి బొమ్మ, పిట్టచూపు, ఇసుక బొమ్మ అని రాస్తే ‘అసమంజసం’ అని ఉడికిపోతూ, నరాల శక్తినంతా కూడదీసుకొని పత్రికలకు ఎక్కుతారా? అదేదో పైప్రయోగాలు చేసిన వారికి రాయవచ్చుగా.
సమ్మతించని పండితులకు ఒకటే విన్నపం. అచ్చ తెలుగుకు ఊపిరి పోయటానికి ప్రయత్నించే వారికి ఎదురుకోలు పలకకపోయినా ఫరవాలేదు కానీ దాపరికపు అజెండాతోనో, ప్రామాణిక నుడి పేరుతోనో ఆ ప్రయత్నాలను అడ్డుకోకుండా నెమ్మదిస్తే మంచిది.

Wednesday, March 23, 2011

మాడలికాలు ఎదగనిదే తెలుగు ఎదగదు

తెలంగాణా ఏర్పాటు, సమైఖ్య ఆంద్ర లతో ముడి పెట్టకుండా పదారణాల తెలుగు వారిగా మాండలికాలపై కాళోజి అనిపింపులను చదవండి. పాడి నుడి(standard Language) పేరుతో ఇతర మాండలికాలను ఎదగానీయక పొతే తెలుగు ఎలా ఎదుగుతుంది? 

































Wednesday, February 9, 2011

తెలుగు అచ్చరాలలో సగం మనవి కావు



మన తెలుగు అచ్చరాలలో సగం మనవి కావు! అవును ఇది నిప్పులాంటి నిజం. తెలుగు 'అక్షరాలు' 54 అని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో నేర్పించారు. మనకే కాదు మన తల్లి తండ్రులకు, తాతలకు, ముత్తాతలకు, వారి ముత్తాలకు తరతరాలుగా అలాగే నేర్పించారు. నేర్పించే అయ్యోర్లకు కూడా తెలియకుండానే అలా అని మనకు నేర్పించారు. మన నుడి గురించి మనకు తెలియనంతగా, తెలుసుకోలేని అంత చాక చక్యంగా కుట్ర చేసి 29 అచ్చరాలుగా ఉన్న కమ్మనయిన తెలుగు పలుకులకు 26 సంస్కురతపు "అక్షరాలు" కలిపి మొత్తం 56 'అక్షరాలు'గా చేసి దానికి 'ఆంధ్రము' అని పేరు పెట్టినారు. దాని వల్ల తేనెలు ఊరే తెలుగు తనం పోయి తాటి బెల్లం కలిపి చేసిన వగరులా తెలుగు తయారు అయ్యింది. 
తెలుగు గురించి తెలుగు వారికి తెలియకుడా "దాపిరికం (secrete) గా పరాయి నుడి నుంచి అచ్చరాల చొరబాటు ఎలా  జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరు జరిపారు? నుడి చొరబాటు వల్ల తెలుగు జాతి ఏమి పోగొట్టుకుంది? మన నుడి, మన పలుకు, మన నుడి ఆచారాలు ఏమయాయి?  ఎక్కడ పాతి పెట్టారు? అనేవి తెల్లం కావాలంటే మనం చిన్నపుడు నేర్చుకున్న తప్పుడు తెలుగు ''వర్ణమాల"తో మొదలు పెట్టాలి. తెలుగు పేరుతో ఇప్పుడు అమలులో ఉండే "అక్షర మాల" పట్టిక ఇది;

అచ్చులు (16 ): 
అ  ఆ     ఇ  ఈ      ఉ  ఊ     ఋ       ఎ  ఏ  ఐ      ఒ   ఓ        అం    అః
హల్లులు ( 36 ) :  
క     ఖ     గ     ఘ      
చ     ఛ     జ     ఝ     
ట     ఠ     డ     ఢ      ణ
త     థ     డ     ధ      
ప     ఫ     బ     భ       
య    ర     ల    వ      శ       ష      స      హ     ళ     క్ష     ఱ  

16  అచ్చులు, 36 హల్లులు కలిపి మొత్తం 52 అక్షరాలు తెలుగు "వర్ణ మాల"గా  మనం నేర్చుకుంటున్నాము. నిజానికి ఇది అసలయిన తెలుగు పలుకుకుల పట్టీ కాదు. ఇందులో తెలుగు "పలుకులు" + సంసుక్రుతపు "అక్షరాలు" కలిసి ఉన్నాయి. గమనించండి.

అచ్చులు (16 ): 

అ  ఆ     ఇ  ఈ      ఉ  ఊ     ఋ       ఎ  ఏ        ఒ   ఓ        అం    అః
హల్లులు ( 36 ) :  
క     ఖ     గ     ఘ      
చ     ఛ     జ     ఝ     
ట     ఠ     డ     ఢ      ణ
త     థ     డ     ధ      
ప     ఫ     బ     భ       
య    ర     ల    వ      శ       ష      స           ళ     క్ష     ఱ  
ఎరుపు రంగులో ఉన్నా"అక్షరాలు అంటే అచ్చులలో ఐ, ఔ , ఋ,  కః మన తెలుగు పలుకులు కావు. అలాగే  హల్లులలో క చ ట త ప లు, గ జ డ ద బ లు  న మ లు మాత్రమే తెలుగు పలుకులు. మిగిలిన ఖ ఛ  ఠ థ ఫ లు ఘ ఝ ఢ ధ భ లు    ణ లు, శ ష హ క్ష అనే "అక్షరాలు" తెలుగు పలుకులు కావు. తెలుగులో కలితీ అయిన "అక్షరాలు
మరయితే అసలు తెలుగు పలుకులు ఏమిటి అని తరచి చూస్తే, తేట తెలుగు పలుకుల పట్టిక ఇది:  .

అచ్చులు (10) :
అ    ఆ     
ఇ    ఈ  
ఉ    ఊ     
ఎ     ఏ      
ఒ     ఓ
అల్లులు (19) :    
             
     జ       
ట             
త     ద       
ప            
య    ర     ల    వ      స       ళ       ఱ
తెలుగు పలుకులలో కేవలం 10 అచ్చులు, 19 అల్లులు మాత్రమే ఉంటాయి. అసలు తెలుగు పలుకులు చాల తేలికాగా ఉంటాయి. అలవోకుగా పలకటానికి అనుకూలంగా ఉంటాయి. వీటిలో ఒత్తుతనం, అదిమి పలికే అవసరం ఉండదు. అందుకే తెలుగు నుడి మాటాడుతూ ఉంటే తేలికగా, కమ్మగా ఉంటుంది. సెల యేటి గల గలలా వినసొంపుగా ఉంటుంది. కాబట్టే తేట తెలుగు తేనే తెలుగు అయ్యింది. అలాంటి తెలుగు పలుకులలో సంసుక్రుతపు  "అక్షరాలు" చేరటం వల్ల తెలుగు తన సొబగులు పోగొట్టుకొని 'ఘోష'లా తయారు అయింది. దీని వల్ల తెలుగు నుడి ఏమి పోగొట్టుకున్నది  అన్నది చూస్తే,
  • తన అసలు తనాన్ని పోగొట్టుకుంది.
  • నిండా కలితీ నుడిగా తాయారు అయినది
  • లేతదనము పోగొట్టుకొని కరుకుగా తయారు అయినది.
  • పాడి (Standard) నుడిగా ఎదగ లేక పోయింది.
  • తక్కువ పలుకులు (29) ఉండటం అనేది 'లెక్కిణి' (computer) నుడిగా వాడటానికి చాల అనుకూలం అయినది. ఒక అంచనాను బట్టి ఇంగిలీసు తదితర పడమటి (అయిరోపా) నుడుల తరువాత  తూరుపున 'లెక్కిణి'నికి అనువయిన నుడిగా ఉండేది. "భారత దేశం"లో లెక్కిణికి కుదరగలిగే ఒకే ఒక్క నుడిగా ఎదిగేది. ఇప్పుడు ఆ చోటులో తమిళ  నుడి ఉంది.
  •  29 తేట తెలుగు "పలుకుల"కు 23 పరాయి నుడి అక్షరాలు కలిపి 54 "అక్షరాల"ను చేయటం వల్ల చిక్కు నుడిగా మారినది.  
తెలుగు నుడి పాలలో మురికి నీళ్ళు కలిపి కలితీ చేయాలిసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు చేసారు? ఎప్పుడు చేసారు? దానివల్ల మనం ఏమి పోగుట్టుకున్నాం? అనే సంగతులను తెలుగు వారు అందరు తెలుసుకోవాలి. రాబోయే తపాలలలో వాటి గురించి చూద్దాం.   

Thursday, January 13, 2011

తెలంగాణా నుడికారుల కోపం తెలుగు గెలుపు కావాలి!

పత్రిక, సాహిత్య రంగాలలో ప్రామాణిక భాష పేరుతో నడిమి కోస్తా జిల్లాల నుడికారాన్ని తమపై రుద్దుతున్నారన్న కోపం తెలంగాణా నుడికారుల్లో ఉంది. అయితే ఆ కోపం ప్రత్యేక రాష్ట్ర అంశం తెరమీదకు వచ్చినప్పుడు నుడికారుల గొంతు పెద్దది కావటం, ప్రత్యేక రాష్ట్రం అడకిక (డిమాండు) తెరమరుగు కాగానే నరుడికారుల గొంతు మూగపోవటం జరుగుతూ వస్తోంది. దీన్ని బట్టి ఏవో కనపడని శక్తులు తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం జనంలో ఉన్న తెలంగాణ నుడికార అభిమానాన్ని వాడుకొని అవసరం తీరగానే దాన్ని అటకమీదకు ఎక్కించే ప్రయత్నాలు ఏమయినా జరుగుతున్నాయా అని అనిపిస్తుంది.
సందర్భం వచ్చినప్పుడు అప్పటికప్పుడు పెల్లుబికే నుడి ఉద్యమాలు నిడివికాల ఉద్యమాలుగా కొనసాగనందువల్ల ఆశించిన మార్పును తేలేక పోతున్నాయి. మాట్లాడే నుడిని రాత నుడిగా, చదువు నుడిగా, పాలనా నుడిగా నిలబెట్టటానికి నిరంతరం సామాజిక, రాజకీయ ఒత్తిడి లేనిదే పాలకవర్గాలు పట్టించుకోవు. మరోవైపు నుడిపట్ల సామాజిక ఉద్యమ ‘కొనసాగింపు’ లేనందువల్లే ఎల్లలు లేని ప్రామాణిక తెలుగును సాగు చేసుకోవడంలో విఫలం అయ్యాము. తెలంగాణా మాండలికంతో పాటు ఇతర తెలుగు నుడికారాల కలగలుపు లేకుండా కేవలం ఒక ప్రాంతపు తెలుగే ప్రామాణికం అయితే అది తెలుగు నుడి విజయం కాజాలదు.
ఉన్న చోటును బట్టి ఏ ప్రాంతపు వారు ఆ నుడికారాన్ని మాట్లాడుతున్నా, నలువైపులా విస్తరించిన తెలుగు వారి నడుమ సమాచారం కోసం, ప్రసార కలుపుల (మాధ్యమాల) కోసం, విరివి (అడ్వాన్సుడు) చదువుల కోసం ఇతర నుడుల నుండి వస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి తెలుగు వారందరికీ ఒక ఉమ్మడి ప్రామాణిక నుడి అవసరం ఎంతయినా ఉంది. ప్రామాణిక నుడి అంటే ‘నడిమి కోస్తా’ మాండలికాన్ని ఆవంతునే అంగీకరించటం కాదు. అన్ని మాండలిక పదాలను కలబోసి పద సంపదను పెంచటంతో పాటు సాంకేతిక సమాచార సాధనాలకు అనుకూలంగా ప్రామాణీకరించటం అని తెల్లము.
ఏ ప్రాంతపు తెలుగు నుడికారానికి (యాసకు) అయినా అసలయిన వారుసులు ఆ ప్రాంతంలో ఉండే దళితులు, వెనుకబడిన వర్గాలు. వారితోపాటు అగ్ర కులాలలో ఉన్న నిరక్షరాస్యులు, పేదలు. వీరు మాండలికాలను బతికించుకొనేవారే గానీ నుడి సాగుకి అవసరం అయిన రాజకీయ అధికారం లేని వారు. మరోవైపు అదే ప్రాంతంలో పై వర్గాలుగా ఉండే ధనికులు, పెద్ద కులాలు, మేధావులు, ఉన్నత ఉద్యోగాలు వెలగబెట్టేవారు మాండలిక నుడికి దూరంగా జరిగి తమదైన కల్పిత నుడిని పాటిస్తుంటారు. ఈ వర్గాలు ఎప్పుడూ మాండలిక నుడికి వారసులుగా ఉండటానికి ఇష్ట పడరు. పైగా అవకాశం వస్తే మాండలికాలనే కాదు మొత్తం తెలుగునే తుంగలో తొక్కటానికి ప్రయత్నం చేస్తారు. వీరు ఏ ప్రాంతపు వారు అయినా ఆ ప్రాంత నుడికారానికి వారసులు కాదు. దురదృష్టం ఏమిటంటే నుడి సాగు ఈ వర్గం పెత్తనం కింద ఉంటుంది. దీనికి కోస్తా, రాయలసీమ, తెలంగాణ అన్న ప్రాంతాలతో సంబంధం లేదు.సనాతనులుగా చెప్పుకొనే వర్గం చచ్చిన సంస్కృతంలోని పదాలను దిగుమతి చేసుకొని తెలుగు నేలలో నాటి తమదైన ఒక ప్రత్యేక నుడిని సాగు చేసుకుంటారు.

పైగా అదే తెలుగుగా చలమణి చేయాలని కంకణం కట్టుకొని ఎక్కడ సందు దొరికితే అక్కడ తెలుగును తొలిచేస్తుంటారు. మాండలికాలను అణగదొక్కటంలో ఈ వర్గానిదై పై చేయి. మరో వైపు ఆధునికులుగా వేషాలు వేసుకున్నవారు ఆంగ్లాన్ని నెత్తిన పెట్టుకొని తెలుగు ఉనికికే సవాళ్ళు విసురుతున్నారు. ప్రాంతాలకు అతీతంగా నేడు తెలుగు ముందున్న పరిస్థితి ఇది. ఇప్పుడు తెలంగాణా వేర్పాటు కోరుతూ జరుగుతున్న ఉద్యమంలో మరోసారి తెలంగాణా యాస గౌరవం ముందుకు వచ్చింది. నుడికారులు, రచయితలు, కవులు, కళాకారులు, గాయకులు ఇందులో పాలు పంచుకుంటున్నారు. రాజకీయ శక్తులు వీరి నుండి ఆశించేది తెలంగాణా తెలుగు నుడికారంపై (నడుమ) కోస్తా తెలుగు పెత్తనాన్ని వ్యతిరేకించటం. తెలంగాణా యాసను జనానికి గుర్తు చేస్తూ రాజకీయ ఉద్యమానికి భావోద్వేగపు మద్దత్తును కూడగట్టడం. గత అనుభవాలను గమనంలో ఉంచుకొని చూస్తే నుడి ఉద్యమకారుల నుండి రాజకీయ శక్తులు ఆశించేది ఇదే.

ఇక్కడే నుడి ఉద్యమకారులు జాగర్తగా ఉండాలి. ఏ రాజకీయ ఉద్యమం కోసం నుడి గౌరవం పేరుతో జనాన్ని కూడగడుతున్నారో ఆ గౌరవం దక్కేదాకా రాష్ట్రం విడిపోయినా, పోకపోయినా ఉద్యమం కొనసాగాలి.
రేపు తెలంగాణా ఏర్పడితే అధికారాన్ని సొంతం చేసుకొనేది నుడిని తుంగలో తొక్కే శక్తులే. సీసా కొత్తదే కావచ్చు కానీ సారాంశం పాతదే అయితే నుడి పేరుతో జరిగే ఉద్యమం మరోసారి అభాసుపాలు అవుతుంది. అలా జరక్కుండా ఉండాలంటే కొత్త రాష్ట్రం ఏర్పడితే ‘‘తెలుగు పట్ల మీ రాజకీయ విధానం ఏమిటని’’ ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచాలి.
ఏ ఆశింపును కోరి ఉద్యమానికి దన్నుగా నిలిచారో ఆ పని జరగనప్పుడు అదే నుడి గౌరవ ఉద్యమాన్ని మారిన అధికార శక్తులపైకి ఎక్కు పెట్టాలి. ఒకవేళ కొత్త రాష్ట్రం ఏర్పడక పోతే ‘‘ఉమ్మడి అధికార’’ శక్తులపై ఆపకుండా పోరాడాలి. తెలంగాణా యాస ఆత్మగౌరవ ఉద్యమం కేవలం రాజకీయ హద్దు గీతల గీసేంత వరకే పరిమితమైతే అది పూర్తి గెలుపు కాదు. అది మాత్రమే జరిగితే ప్రాంతీయ అడ్డుగోడలు కట్టుకోవడంలో విజయం సాధించినా తెలుగు జాతిగా ఓడిపోక తప్పదు. ప్రపంచంలో రాజకీయ హద్దు గీతలు ఉంటాయే కానీ నుడికి ఎల్లలు ఉండవు. ఉండే ప్రదేశం, పలికే తీరులు వేరయినా నేలమీద ఎక్కడ ఉన్నా తెలుగు తెలుగే. ఒక యాసకు ఎక్కువ మరోయాస తక్కువ అనే ధోరణులు ఎవరు చూపినా అది మొత్తం తెలుగు జాతికి ఓటమి అవుతుంది. ఆయా ప్రాంతాల తెలుగు యాసలు ఆత్మగౌరవ ప్రతీకలుగా మారటం అనేది ఎక్కడ జరిగినా అది తెలుగు గెలుపే. అలాంటి నుడి ఉద్యమాలకు ఎదురుకోలు (స్వాగతం) పలకాలి.